చాందిని: ''పెళ్లికాగానే గొడవపడేదాన్ని, అతన్ని వదిలేసి మరో పెళ్లి చేసుకునేదాన్ని''

ఫొటో సోర్స్, Bhargav Parikh
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ కోసం
ఇటీవల 'దొంగ పెళ్లికూతురు' ముఠాను అరెస్టు చేసినట్టు గుజరాత్‌లోని మెహ్సానా పోలీసులు చెప్పారు.''పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలకు ఈ ముఠా గాలం వేస్తుంది. యువకుడికి ఒక అమ్మాయితో పెళ్లిచేస్తుంది. తర్వాత ఆ వ్యక్తి దగ్గరనుంచి డబ్బులు తీసుకుని వధువుని అక్కడినుంచి తప్పిస్తుంది'' అనే ఆరోపణలున్నాయి.
నవంబర్ 20, 2025న ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు ' దొంగ పెళ్లికూతురు'గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయితో పాటు అనేక మంది నిందితులను అరెస్టు చేశారు.
ఈ ముఠాలోని యువతి కేవలం 24 ఏళ్ల వయసుకే 18 పెళ్లిళ్లు చేసుకుని, పెళ్లి కొడుకులను మోసం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ మొత్తం విషయం ఎలా వెలుగులోకి వచ్చింది, నిందితులందరనీ పోలీసులు ఎలా అరెస్టు చేశారు?
ఇంకా ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.


ఫొటో సోర్స్, Bhargav Parikh
31 ఏళ్ల ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్ ఎలా మోసపోయారంటే...
అహ్మదాబాద్‌లోని అసర్వా ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన 24 ఏళ్ల చాందినీ రాథోడ్ పెద్దగా చదువుకోలేదు. అయితే, ఆమె తన తల్లి చెప్పినట్టు విని 'దోపిడీ వధువు'గా మారి తక్కువ కాలంలోనే లక్షల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజలను సులభంగా మోసం చేయగలరన్న ఆరోపణలున్న చాందినీ ఆమె తల్లి సవితా రాథోడ్ పోలీసులకు చిక్కేవారు కాదు. కానీ బహుచరాజీలోని ఆదివాడ గ్రామానికి చెందిన 31ఏళ్ల ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్ సచిన్ పటేల్ తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించడంతో చాందినీ, సవితా రాథోడ్, చాందినీ మేనమామగా చెప్పుకున్న రాజు ఠక్కర్, అత్త రష్మికా పంచల్‌ను పోలీసులు పట్టుకున్నారు.
తన బంధువు ద్వారా 'జై మాది మ్యారేజ్ బ్యూరో'లో పనిచేస్తున్న రష్మికాపంచల్‌ను కలిశానని నవంబరు 15న బహుచరాజీ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో సచిన్ పటేల్ చెప్పారు.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం సచిన్‌కు వివాహం జరిపిస్తానని రష్మిక పంచల్ హామీ ఇచ్చారు. ఐదు లక్షల రూపాయలు తీసుకుని చాందినీతో పెళ్లిజరిపించారు. తర్వాత చాందినీ రెండుసార్లు సచిన్ ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి బంగారం, వెండి ఆభరణాలను తీసుకొని తన తండ్రి రాజస్థాన్‌లో అనారోగ్యంతో ఉన్నారని చెప్పి వెళ్లిన చాందినీ మళ్లీ సచిన్ ఇంటికి రాలేదు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
సచిన్ పటేల్, చాందినీని ఎలా కలిశారు?
ఆదివాడలోని పటేల్ గ్రామంలో నివసిస్తున్న సచిన్ పటేల్ ఛత్రాల్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆయనతో బీబీసీ మాట్లాడింది. చాందినీని తాను ఎలా కలిశానో సచిన్ పటేల్ బీబీసీతో చెప్పారు. ఏడాదిన్నర క్రితం రష్మికాపంచల్‌ను కలిశానని, పెళ్లికుమార్తెను వెతికిపెడతానని తనకు ఆమె హామీ ఇచ్చారని సచిన్ తెలిపారు.
"మేం అహ్మదాబాద్‌కు వెళ్లాం. అక్కడ రష్మికాపంచల్ చూపించిన అమ్మాయి నాకు నచ్చింది. ఆమె పేరు చాందినీ. అందరం కూర్చుని మాట్లాడుకోవడానికి మరుసటి రోజు, అహ్మదాబాద్‌లోని నరోడా వెళ్లాం. చాందినీ తల్లి సవితాబెన్, మామ రాజు ఠక్కర్, రష్మికా పంచల్ అక్కడకు వచ్చారు. చాందినీ తండ్రి అక్కడ లేరు" అని సచిన్ చెప్పారు.
చాందినీతో పెళ్లి కోసం 5 లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని సచిన్ వారికి చెప్పారు.
మరుసటి రోజు చాందినీ, ఆమె తల్లి, మామయ్య పటేల్‌వాసు సచిన్ ఇంటికి వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో చాందినీ కుటుంబ సభ్యులు 50వేలరూపాయల డబ్బు, అమ్మాయి కోసం కొన్న12,500 రూపాయల విలువైన ఫోన్ తీసుకెళ్లారు. అయితే వారు సిమ్ కార్డు తీసుకోలేదు.
తరువాత దుస్తుల కోసం ఆన్‌లైన్‌లో మొదట 39వేలు, తర్వాత 11వేల రూపాయలు తీసుకున్నారు.
"చాందినీ తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, వెంటనే పెళ్లి చేసుకోవాలని వారు మమ్మల్ని ఒత్తిడి చేశారు. పెళ్లి కోసం అహ్మదాబాద్‌లోని న్యూ వదాజ్‌కు మమ్మల్ని పిలిపించారు. అక్కడ మా పెళ్లి జరిపించి, 3లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నారు. ఆ తర్వాత, కోర్టులో నోటరీతో స్టాంప్ పేపర్‌పై వివాహ పత్రాలను సిద్ధం చేయించుకున్నారు" అని సచిన్ చెప్పారు.
అయితే, పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత, చాందినీ తండ్రి అనారోగ్యంతో ఉన్నారంటూ మామ రాజు ఠక్కర్ వచ్చి చాందినీని తీసుకెళ్లారని సచిన్ చెప్పారు. ఆ తర్వాత, చాందినీ ఒక్కసారి మాత్రమే తన ఇంటికి వచ్చారని, అప్పుడు మరిన్ని నగలు తీసుకెళ్లారని సచిన్ తెలిపారు.
"తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఆ రోజు వెళ్లిపోయిన చాందినీ, తరువాత నా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారు. తర్వాత నేను ఆమె మామకు విషయం చెప్పాను. చాందినీకి నేనంటే ఇష్టం లేదని, విడాకులు ఇవ్వాలని ఆయన కోరారు. విడాకులు తీసుకోవడానికి నేను అహ్మదాబాద్ వెళ్లా. అక్కడ అతను నాతో దురుసుగా ప్రవర్తించి 50 వేల రూపాయలు లాక్కున్నారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే నాపై తప్పుడు అత్యాచారం కేసు పెడతానని బెదిరించారు" అని సచిన్ వివరించారు.
" చాందినీ నాకంటే ముందు వేరే వ్యక్తులను పెళ్లిచేసుకుని ఇలాగే డబ్బు తీసుకున్నట్టు కొంతకాలం తర్వాత నాకు తెలిసింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదు తర్వాత, చాందినీ చేతిలో మోసపోయిన మరో ఆరుగురు వ్యక్తులు కూడా పోలీసులను ఆశ్రయించారు" అని సచిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
ఇతర బాధితులేమంటున్నారు?
అహ్మదాబాద్‌లోని వస్త్రాల్‌కు చెందిన ముఖేశ్ పటేల్ గతంలో 3లక్షల రూపాయలిచ్చి చాందినీని పెళ్లిచేసుకున్నారు. మెహ్సానాలో పోలీసులు చాందినీని అరెస్టు చేసిన తర్వాత ముఖేశ్ పటేల్ బీబీసీతో మాట్లాడారు.
"రాజు, రష్మిక రెండు మ్యారేజ్ బ్యూరోలు నడుపుతున్నారు. మాకు వయసు తేడా ఉన్నప్పటికీ చాందినీ నన్ను పెళ్లి చేసుకోవడంలో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని వారిద్దరూ నాకు చెప్పారు. నేను మూడు లక్షలిచ్చి పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత చాందినీ మా తాతతో గొడవపడి వెళ్లిపోయారు" అని ముఖేశ్ తెలిపారు.
"ఆ తర్వాత మా తాతయ్య, నాన్న చనిపోయిన తర్వాత కూడా చాందినీ మా ఇంటికి రాలేదు. నేను ఆమె మామ రాజు ఠక్కర్‌కు ఫోన్ చేశాను. విడాకుల కోసం 75,000 రూపాయలు ఇవ్వమని ఆయన అడిగారు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత నన్ను అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించారు. దీంతో నేను భయపడి ఫిర్యాదు చేయలేదు. కానీ చాందినీ, ఆమె మామను పోలీసులు పట్టుకున్నారని తెలిసిన తర్వాత ఫిర్యాదు చేయడానికి వచ్చాను" అని ముఖేశ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
చాందినీని పోలీసులు ఎలా పట్టుకున్నారు?
"మాకు ఫిర్యాదు అందడంతో మేమీ ఫోన్ నంబర్‌ను పరిశీలించాం. రాజు ఠక్కర్, రష్మిక ఫోన్ ఆన్‌లో ఉందని గుర్తించాం. టెక్నికల్‌గా నిఘా పెడితే చాందినీ ఫోన్ నంబర్ నరోదలో ఉన్నట్టు చూపిస్తోంది. వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారందరినీ పట్టుకున్నాం. సచిన్ పటేల్‌ను మాత్రమే కాకుండా మొత్తం 18 మందిని చాందినీ ఇలా వివాహం చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. వారి ఫోటోలు, స్టాంప్ పేపర్‌పై నోటరీ చేసిన పెళ్లి పత్రాలు గుర్తించాం'' అని మెహ్సానా ఎస్పీ హిమాన్షు సోలంకి బీబీసీతో చెప్పారు.
"పెళ్లి ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ కూడా నకిలీవి. ఇలా వారు 52 లక్షలు దోచుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. వారిని ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకున్నాం. గుజరాత్‌లోని చాలా జిల్లాల్లో వారు నకిలీ పెళ్లిళ్లు చేసుకున్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, మోర్బి, గిర్ సోమనాథ్, ఖేడా, సబర్కాంతతో సహా అనేక ప్రదేశాలలో మోసాలు చేశారు. ఈ ముఠాలో మరో అమ్మాయి ఉందని తేలింది. ఆమె కోసం మేము వెతుకుతున్నాం. ఈ వ్యక్తులు ఇంకా ఎంత మందిని మోసం చేసారు, నకిలీ ఆధార్ కార్డు, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్‌ను ఎక్కడి నుంచి పొందారు వంటివాటి గురించి మరిన్ని వివరాలు రిమాండ్ తర్వాత బయటకు వస్తాయి" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
‘గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసేదాన్ని’
"ఒకరితో పరిచయం అయిన తర్వాత వారిని పెళ్లిచేసుకునేదాన్ని. తర్వాత వారితో గొడవపడి, వాళ్ల ఇంట్లో నుంచి వచ్చేసేదాన్ని. తర్వాత మరో పెళ్లి చేసుకునేదాన్ని. ఇది నేరమో కాదో నాకు తెలియదు. కానీ నేను ఇలాగే చేసేదాన్ని" అని బహుచరాజీ పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితురాలు చాందినీ బీబీసీతో చెప్పారు.
మెహ్సానా పోలీసులకు అందిన ఆధారాల ప్రకారం, చాందినీ దాదాపు రెండు సంవత్సరాలలో 18 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














