హిట్లర్‌ నియంతృత్వ ప్రవర్తనకు కారణమేంటి, 80 ఏళ్లనాటి రక్తపుమరక ఏం చెప్పింది?

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిఫానీ వెర్తైమెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అడాల్ఫ్ హిట్లర్‌ రక్తంపై చేసిన డీఎన్ఏ విశ్లేషణ నియంత పూర్వీకుల గురించి, ఆయనకు ఉండి ఉండవచ్చన్న కొన్ని ఆరోగ్య పరిస్థితుల గురించి అసాధారణ విషయాలను బయటపెట్టింది.

అంతర్జాతీయ నిపుణులు అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన ఈ శాస్త్రీయ పరీక్ష హిట్లర్ పూర్వీకులు యూదులనే పుకారు తప్పని నిరూపించింది. లైంగిక అవయవాల అభివృద్ధిపై ప్రభావం చూపే జన్యుపరమైన అపసవ్యత ఆయనకు ఉన్నట్టు తేల్చింది. ఓ వస్త్రంపై ఉన్న పాత రక్తపు మరకపై ఈ పరీక్ష నిర్వహించారు.

నాజీ నియంతకు పురుషాంగం చిన్నగా ఉందా, వృషణం ఒకటే ఉందా వంటి క్లిక్‌బైట్స్‌పైనే మీడియా దృష్టిపెట్టిందిగానీ, ఆయన డీఎన్ఏ విశ్లేషణలో చాలా విషయాలు బయటపబడ్డాయి. ఆయనకు ఆటిజం, స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్ వంటివి ఉండడానికి అత్యంత ఎక్కువ అవకాశం ఉన్నట్టు తేలింది. మొత్తం జనాభాలో ఒక శాతం మందికి మాత్రమే ఇటువంటి స్థితి ఉంటుంది.

అంటే ఆయనకు ఈ నాడీసంబంధిత అనారోగ్య పరిస్థితులు ఉన్నట్టా? అంటే కాదంటారు నిపుణులు. ఇది వైద్య నిర్థరణ కాదని వారు చెబుతున్నారు.

అయితే ఈ రకమైన పరిశోధనలతో మానసిక అనారోగ్యాలపై అపోహలు, అపకీర్తి పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇంత సున్నితమైన పరిశోధన చేయడం నైతికంగా సరైనదా కాదా అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది.

‘‘దీని గురించి నేను చాలా ఆలోచించా’’ అని చెప్పారు ప్రొఫెసర్ టూరీ కింగ్. చానల్ 4 ‘హిట్లర్స్ డీఎన్ఏ: బ్లూప్రింట్ ఆఫ్ ఎ డిక్టేటర్‌’’ పేరుతో శనివారం ప్రసారం చేసిన డాక్యుమెంటరీ మొదట్లోనే ఆమె ఈ మాటలు చెప్పారు.

చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కోసం మొదటిసారి తనను సంప్రదించినప్పుడే అడాల్ఫ్ హిట్లర్‌లాంటి వ్యక్తి డీఎన్‌ఏపై నిర్వహించే అధ్యయనం ఎలాంటి ప్రభావాలు చూపగలదనేదానిపై తనకు అవగాహన ఉందనిఈ జన్యు విజ్ఞాన నిపుణురాలు బీబీసీతో చెప్పారు. ''విషయాలను సంచలనం చేయడం నాకిష్టంలేదు''అని ఆమె అన్నారు.

కానీ ఎప్పుడో ఒకరు ఎవరో ఒకరు దీన్ని చేస్తారు కాబట్టి తన పర్యవేక్షణలో అయితే శాస్త్రీయ ప్రమాణాలు, నైతిక నియమాలతో పరిశోధన జరిగేలా జాగ్రత్త వహించవచ్చని భావించానన్నారు

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Gettysburg Museum of History

ఫొటో క్యాప్షన్, హిట్లర్ బంకర్‌లో ఉన్న సోఫా నుంచి వస్త్రాన్ని సేకరించారు.

80 ఏళ్ల నాటి రక్తపు మరక

సున్నితమైన, హై ప్రొఫైల్ ప్రాజెక్టులకు పనిచేయడం ప్రొఫెసర్ కింగ్‌కు కొత్త కాదు. 2012లో లీసెస్టర్‌లో కార్ పార్కింగ్ కింద గుర్తించిన మానవ అవశేషాలు రిచర్డ్ III వనే జన్యు పరిశోధనకు ఆమె నేతృత్వం వహించారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో మిత్రరాజ్య దళాలు బెర్లిన్‌ను చుట్టుముట్టినప్పుడు అండర్‌గ్రౌండ్ బంకర్‌లో ఉన్న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. హిట్లర్ రక్తం ఉన్న వస్త్రం బంకర్‌లోని సోఫా నుంచి కత్తిరించింది. ఇది 80ఏళ్ల క్రితం నాటిది.

అమెరికా ఆర్మీకి చెందిన కల్నర్ రోజ్‌వెల్ పి రొజెన్‌గ్రెన్ ఆ బంకర్‌ను తనిఖీ చేసినప్పుడు ప్రత్యేక యుద్ధానికి సంబంధించిన ట్రోఫీని తనకు అందించేదిగా భావించి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చారు. ఆ వస్త్రం ఇప్పుడు ఫ్రేమ్ కట్టి ఉంది. అమెరికాలోని గెట్సీబర్గ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

అది హిట్లర్ రక్తమే అని శాస్త్రవేత్తలు నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే దశాబ్దం క్రితం హిట్లర్ బంధువు ఒకరి నుంచి సేకరించిన డీఎన్ఏ శాంపిల్‌తో వై క్రోమోజోమ్‌ను కచ్చితంగా సరిపోల్చగలిగారు.

ప్రస్తుతం నిపుణుల పరిశీలనలో ఉన్న ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

హిట్లర్ డీఎన్ఏను గుర్తించడం ఇదే మొదటిసారి. నాలుగేళ్లపాటు డీఎన్ఏ విశ్లేషణ సాగింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నియంత జన్యు నిర్మాణం ఎలా ఉందో శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. అత్యంత కచ్చితంగా తేలిన విషయమేంటంటే హిట్లర్ పూర్వీకులు యూదులని 1920లనుంచి ప్రచారంలో ఉన్న పుకారు తప్పని నిపుణులు చెబుతున్నారు.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Tom Barnes/Channel 4

ఫొటో క్యాప్షన్, జన్యుశాస్త్ర నిపుణురాలు ప్రొఫెసర్ టూరి కింగ్, చరిత్రకారులు డాక్టర్ అలెక్స్ కే

హిట్లర్ రాజకీయాలకే పూర్తిగా ఎందుకు అంకితమయ్యారంటే...

కాల్‌మన్ సిండ్రోమ్‌గా పిలిచే జన్యుపరమైన రుగ్మత ఆయనకు ఉన్నట్టు గుర్తించారు. ఇది లైంగిక అవయవాల అభివృద్ధి, యవ్వనంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషాంగం చిన్నగా ఉండడం, వృషణాల సమస్యవంటివాటికి దారితీస్తుంది. బ్రిటిష్ యుద్ధకాలం నాటి పాటల్లో హిట్లర్‌పై ఉన్న పుకార్లలో ఇది కూడా ఒకటి.

కాల్‌మాన్ సిండ్రోమ్ లైంగిక ఆసక్తిపై కూడా ప్రభావం చూపుతుందని, ఇది చాలా ఆసక్తికరమైన విషయమని చరిత్రకారులు, పాట్స్‌డామ్ యూనివర్శిటీ లెక్చరర్, డాక్యుమెంటరీని చిత్రీకరించిన డాక్టర్ అలెక్స్ కే చెప్పారు.

''ఆయన వ్యక్తిగత జీవితం గురించి అది మనకు చాలా విషయాలు చెబుతుంది. ఆయనకు వ్యక్తిగత జీవితం లేదన్న విషయాన్ని కచ్చితంగా తెలియచేస్తుంది'' అని ఆయన వివరించారు.

హిట్లర్ పూర్తిగా రాజకీయాలకే ఎందుకు అంకితమయ్యారనేదానిపై ఎప్పటినుంచో చరిత్రకారుల్లో చర్చ ఉంది. ఆయనకు వ్యక్తిగత జీవితం అన్నది లేకపోవడమే దీనికి కారణమన్న వివరణ ఈ పరిశోధనతో దొరికినట్టయింది.

ఇలాంటి విషయాలు బయటపడడం అత్యంత ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉందని నిపుణులు అంటున్నారు. చరిత్ర, జన్యుశాస్త్రాల కలయికగా దీన్ని ప్రొఫెసర్ కింగ్ అభివర్ణించారు.

అత్యంత క్లిష్టమైన, వివాదాస్పదమైన విషయం ఏంటంటే హిట్లర్‌కు మానసిక ఆరోగ్య సమస్యలు లేదా నాడీసంబంధిత సమస్యలు ఉండొచ్చని ఈ ఫలితాలు సూచించడం.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బేబీ అడాల్ఫ్ హిట్లర్

డీఎన్ఏ విశ్లేషణతో వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చా?

హిట్లర్ జన్యువును పరిశీలించి పోలిజెనిక్ స్కోర్లుతో పోల్చిచూసినప్పుడు హిట్లర్‌కు ఆటిజం, ఏడీహెచ్‌డీ, స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

ఇక్కడే సైన్స్ అనేక సంక్లిష్టతలను ఎదుర్కొంటుంది.

ఒక వ్యక్తి డీఎన్ఏని విశ్లేషించి, వారికి వ్యాధి వచ్చే అవకాశం ఎంత ఉందో అంచనావేయడాన్ని పోలిజెనిక్ స్కోరింగ్ అంటారు. గుండె సంబంధిత రోగాలు, కొన్ని రకాల క్యాన్సర్లు ఓ వ్యక్తికి సోకే అవకాశం ఎంత ఉందో గుర్తించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వారి డీఎన్ఏను పెద్ద సంఖ్యలో శాంపిళ్లతో పోలుస్తారు కాబట్టి, వ్యక్తుల విషయానికొచ్చేసరికి ఆ ఫలితాలు అంత కచ్చితత్వంతో ఉండవు.

డాక్యుమెంటరీ మొత్తాన్ని పరిశీలించిన నిపుణులు చెప్పేదేంటంటే డీఎన్ఏ విశ్లేషణతో రోగాలను గుర్తించలేం. అయితే వాటిని అంచనావేయడానికి మాత్రం అవకాశముంటుంది. అంటే దానర్థం హిట్లర్‌కు అవన్నీ ఏమీ లేవని కాదు. ఈ డాక్యుమెంటరీని బీబీసీ పరిశీలించింది.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Stephanie Bonnas

ఫొటో క్యాప్షన్, పరిశోధనా ఫలితాలు తనకు సంతోషాన్ని, ఆందోళనను కలిగించాయని ప్రొఫెసర్ వెబర్ చెప్పారు.

‘ఇలాంటి పరిశోధనలు ప్రమాదకరమైనవి’

అయితే ఈ ఫలితాలను బాగా సరళీకరించారని కొందరు జన్యుశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

''ఊహల పరంగా వారు చాలా దూరం వెళ్లిపోయారు'' అని కింగ్స్ కాలేజ్ లండన్‌లో ఫోరెన్సిక్స్ జెనెటిక్స్ ప్రొఫెసర్ డినైస్ సిండర్‌కోంబ్ కోర్ట్ భావిస్తున్నారు.

''వ్యక్తిత్వం లేదా ప్రవర్తన పరంగా చెప్పాలంటే ఇవన్నీ ఉపయోగంలేనివన్నది నా భావన'' అని ప్రొఫెసర్ కోర్ట్ బీబీసీతో అన్నారు. హిట్లర్ రక్తం నమూనాలను 2018లో ఆమె పరీక్షించారు. డీఎన్ఏ ఆధారంగా ఓ వ్యక్తి ప్రవర్తనను నిర్ణయించలేమని ఆమె అన్నారు.

ఈ ఫలితాల ఆధారంగా ఒకరికి ఆ పరిస్థితి ఉందా లేదా అనేదానిపై ఎలాంటి అంచనాలు రూపొందించాలని తాననుకోవడం లేదని, ఎందుకంటే అవి అసంపూర్ణంగా ఉన్నాయని ఆమె చెప్పారు.

''మీ డీఎన్ఏలో ఏదో ఉందంటే...మీరు ఆ లక్షణాన్ని చూపుతారని అర్ధం కాదు'' అని అందరికీ అర్ధమయ్యేరీతిలో మరో జెనటిక్ శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా రామన్ అన్నారు.

కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఆటిజం రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సైమన్ బరోన్-కోహెన్ చిత్రీకరించిన డాక్యుమెంటరీలో ఇది కనిపిస్తుంది. ''జీవశాస్త్రం వైపు నుంచి ప్రవర్తనను విశ్లేషించాలనుకోవడం సరైనది కాదు'' అని ఆయన్నారు.

''ఇలాంటి జన్యుపరమైన ఫలితాలను పరిశీలించడంలో ఓ ప్రమాదం ఉంది. ''తమ మానసిక పరిస్థితులను హిట్లర్‌తో పోలుస్తున్నారని ఎవరైనా ఆలోచించి బాధపడొచ్చు''

ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలున్నప్పటికీ ''ఇలాంటివి జన్యుశాస్త్రానికి ప్రమాదం'' అని ఆయన చెప్పరు.

యూకే జాతీయ ఆటిస్టిక్ సొసైటీ దీనిపై వెంటనే స్పందించింది. ఈ పరిశోధనలో చెబుతున్న విషషయాలను చీప్ స్టంట్‌గా అభివర్ణించింది.

''సైన్స్ విషయంలో ఈ నిర్లక్ష్యం కంటే కూడా ఆటిజం ఉన్నవారి భావాలను ఇంత దారుణంగా అవమానించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది'' అని రీసెర్చ్ అసిస్టెంట్ డైరెక్టర్ టిమ్ నికోల్స్ తీవ్ర పదజాలంతో ఖండిస్తూ ప్రకటన చేశారు.

ఆటిజం ఉన్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి చేయకూడదని అభ్యంతరం వ్యక్తంచేశారు.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, బంకర్‌లో కుర్చీ చేతి భాగంపై రక్తపు మరకలు కనిపించాయి.

బ్లూప్రింట్ ఆఫ్ డిక్టేటర్‌ పేరుపై అభ్యంతరాలు

పరిశోధనా ఫలితాలపై వెల్లడైన ఈ ఆందోళనలను, అభ్యంతరాలను డాక్యుమెంటరీని నిర్మించిన బ్లింక్ ఫిల్మ్స్, చానల్ 4 దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది.

''ఒకరు ఎలా ప్రవర్తిస్తారనేది అనేక విషయాలపై ఆధారపడిఉంటుంది. జన్యువులపై మాత్రమే కాదు. వారి చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు, చిన్నతనంలో ఎదురయిన అనుభవాలు, వారు ఎలా పెరిగి పెద్దయ్యారు, చదువుకోవడానికి వారికున్న అవకాశాలు, వనరులు, వారి సాంస్కృతిక నేపథ్యం వంటివన్నీ వ్యక్తి ప్రవర్తనను నిర్దేశిస్తాయి'' అని నిపుణులు ప్రొఫెసర్ బారన్-కోహెన్ ఓ ప్రకటనలో తెలిపారు.

'' సినిమాల్లో హిట్లర్‌కు సంబంధించిన జన్యుపరమైన విషయాల గురించి చూపించినదానిపై ఈ డాక్యుమెంటరీ స్పష్టతనిచ్చింది. అయితే ఆయన శరీరం తీరు, లక్షణాలను బట్టే అలా ప్రవర్తించారని సినిమాల్లో ఎప్పుడూ చెప్పలేదు'' అని ఆయనన్నారు.

డాక్యుమెంటరీ పేరుపై కూడా ఆశ్చర్యం వ్యక్తమమయింది. మరీ ముఖ్యంగా రెండో భాగం ‘బ్లూప్రింట్ ఆఫ్ డిక్టేటర్‌’ పేరుపై.

తాను అలాంటి పేరు ఎంచుకునేదాన్ని కాదని ప్రొఫెసర్ కింగ్ అన్నారు. ''నియంత జన్యువు'' అంటూ ఏదీ ఉండదని తాము పదే పదే చెప్పామని, అయినా ఈ టైటిల్ తనకు ఆశ్చర్యం కలిగించిందని కార్యక్రమంలో కనిపించిన చరిత్రకారుడు ప్రొఫెసర్ థామస్ బీబీసీతో చెప్పారు.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, General Photographic Agency/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, 1933లో హిట్లర్

‘నైతికత గురించి మాట్లాడొచ్చా’

డీఎన్ఏ విశ్లేషణ ఉత్సాహవంతంగానూ, ఆందోళనకరంగానూ అనిపించిందని ప్రొఫెసర్ థామస్ వెబర్ బీబీసీతో చెప్పారు. బీబీసీతో మాట్లాడే సమయానికి ఆయన డాక్యుమెంటరీ చూడలేదు.

''ఆసక్తి ఎందుకంటే హిట్లర్ గురించి నేననుకున్న చాలా విషయాలు నిర్థరణ అయ్యాయి. కానీ జన్యుశాస్త్రం ఫలితాలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలి. హిట్లర్ చెడ్డవాడు. అందుకు కారణమైన చెడ్డజన్యువు ఏదైనా ఉందా అని ఆధారాలు లేని దారుల్లో వెతికే ప్రమాదం ఉందని’’ ఆయన భయపడ్డారు.

అలాగే కార్యక్రమంలో ప్రస్తావించిన రుగ్మతలతో ముఖ్యంగా ఆటిజంవంటివాటితో బాధపడేవారు ఈ పరిశోధనా ఫలితాలను ఎలా చూస్తారన్నదానిపైనా ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

సంక్లిష్టమైన సైన్స్ గురించి సరైన కార్యక్రమం ద్వారా చెప్పాలని ప్రయత్నించడం అనేక సవాళ్లు, ప్రతిబంధకాలతో కూడుకున్నదని చెప్పారు.

''ఇది టీవీ. సరళీకరించి చెప్పడం చాలా అరుదుగా ఉంటుంది''అని ప్రొఫెసర్ కింగ్ అన్నారు.

మీడియా వాస్తవికతలతో తన బాధ్యతలను సమతుల్యం చేసుకోవడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉంది.

''వారు మరో మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని బాగా సంచలనాత్మకంగా మార్చొచ్చు. కానీ వారు అలా చేయలేదు. వాటి మధ్య ఉన్న చిన్నస్థాయి బేధాన్ని పట్టుకోవడానికి వారు ప్రయత్నించారు. వారిని మేం పరిమితుల్లో ఉంచాం'' అని ఆమె అన్నారు.

డీఎన్ఏని ''బ్లూప్రింట్ ఆఫ్ లైఫ్''గా భావిస్తారని చెబుతూ డాక్యుమెంటరీ పేరును చానల్ 4 సమర్థించుకుంది. ఎక్కువమంది ప్రేక్షకులు చూసే కార్యక్రమాలను రూపొందించడం చానల్ విధి. సంక్లిష్టమైన శాస్త్రీయ ఆలోచనలను, చారిత్రక పరిశోధనను ప్రేక్షకులందరికీ తెలియజేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

ప్రాజెక్టు నైతికతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.

హిట్లర్ లేదా ఆయన వారసుడి అనుమతి తీసుకోకుండా ఆయన డీఎన్ఏని పరిశీలించారా?

చరిత్రలో అత్యంత దారుణమైన అణిచివేతల్లో ఒకదానికి ఆయన బాధ్యులన్నవిషయంలో అది ఎలాంటి మార్పు తేగలదు? ఆయన వ్యక్తిగత గోప్యత హక్కుకు అది ఆటంకం కలిగిస్తుందా? వంటి ప్రశ్నలు వచ్చాయి.

కానీ ఈ ప్రశ్నలపై ప్రొఫెసర్ కింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

''ఆయన హిట్లర్. డీఎన్ఏ పరిశోధన నిర్వహించలేని మాయోపేత పాత్రకాదు''అని ప్రొఫెసర్ కింగ్ వాదించారు.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎవా బ్రౌన్‌తో హిట్లర్

‘అందరికీ తెలిసిన విషయమే’

చరిత్రకారులు సుభద్రాదాస్ ఈ వాదనతో ఏకీభవించారు. ''శాస్త్రవేత్తలు చేసేది ఇదే. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన వందలమంది డీఎన్ఏలను పరిశీలించడం సైన్స్, పురావస్తుశాస్త్రంలో సాధారణ విషయం. సమస్య వాటిని ఎలా అర్ధం చేసుకుంటామన్నదే'' అని సుభద్రాదాస్ అన్నారు.

నిజాలు ఉన్నంతవరకు, ప్రతీది రెండుసార్లు పరిశీలించామన్న నమ్మకం ఉన్నంత వరకు ఇందులోని నైతిక కోణం గురించి ఆందోళన చెందడం లేదని చరిత్రకారుడు డాక్టర్ కే చెప్పారు.

''80ఏళ్ల క్రితం హిట్లర్ చనిపోయారు. ఆయనకు వారసులు లేరు. పిల్లలు లేరు. ఆయన చెప్పనలవికాని బాధలకు గురిచేసిన వ్యక్తి. ఆయన డీఎన్ఏ విశ్లేషణకు సంబంధించిన నైతికతతో పోలిస్తే, ఆయన చేసిన తప్పులు పెద్దవి'' అని డాక్టర్ కే అభిప్రాయపడ్డారు.

ఆశ్చర్యకరంగా యూరప్‌లోని చాలా పరిశోధనశాలలు ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి తిరస్కరించాయి. అమెరికాలో ఈ టెస్ట్ నిర్వహించారు.

ప్రామాణిక నైతిక సమీక్ష విధానంలో ఈ పరీక్ష జరిగిందని డాక్యుమెంటరీ మేకర్లు చెప్పారు. రెండు దేశాల్లో సమీక్షలు నిర్వహించామని తెలిపారు.

ఈ పరిశోధన నిర్వహించి ఉండాల్సిందేనా? అన్న ప్రశ్నను బీబీసీ వేసినప్పుడు జన్యుశాస్త్రవేత్తలు, చరిత్రకారులకు ఎవరిని అడిగామనేదానిపై వారి సమాధానం ఆధారపడి ఉంది.

డాక్యుమెంటరీలో భాగమైనవారు సహజంగానే అవును అని సమాధానమిచ్చారు. హిట్లర్ గురించి మరింత సమగ్రమైన అవగాహన కలగడానికి ఇది ఉపయోగపడిందని వారు అన్నారు. హిట్లర్ ఇప్పటికీ అందరినీ ఏకకాలంలో ఆకర్షించే, భయపెట్టే వ్యక్తి కూడా అని అభిప్రాయపడ్డారు.

''అతివాదం తర్వాత పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి చేయదగిందంతా మేం చేశాం''అని ప్రొఫెసర్ వెబర్ అన్నారు.

''నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇవన్నీ అందరికీ ఇప్పటికే తెలిసిన విషయాలు. మనం ప్రజల మనసుల్లో ఇప్పటికిప్పుడు కలిగించిన భావన కాదు. హిట్లర్‌కు కొన్ని రుగ్మతులన్నాయన్నవిషయంపై దశాబ్దాలుగా ప్రజలు పుకార్లరూపంలో మాట్లాడుకుంటూనే ఉన్నారు'' అని డాక్టర్ కే చెప్పారు.

అయితే చరిత్రకారులంతా దీన్ని అంగీకరించరు.

 హిట్లర్, డీఎన్ఏ విశ్లేషణ, నాజీలు, సైన్స్, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్యుమెంటరీని మీడియా సరిగ్గా రిపోర్ట్ చేయాలని చరిత్రకారులు అంటున్నారు.

''ఏ కారణాలతో హిట్లర్ ప్రవర్తన అలా ఉందని విశ్లేషించడానికి ఇది అంత నమ్మదగ్గ మార్గం కాదు'' అని అట్రెక్ట్ యూనివర్సిటీలో అంతర్జాతీయ చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐవా ఉకుసిక్ చెప్పారు.

సామూహిక హింసకు ప్రేరేపించే పరిస్థితులపై డాక్టర్ వుకుసిక్ అధ్యయనం చేశారు. ప్రజలకు వాటిపై ఎందుకు ఆసక్తి ఉంటుందో తాను అర్ధం చేసుకోగలనని, కానీ మనకు కావాల్సిన సమాధానాలు డీఎన్ఏ టెస్టు ద్వారా లభించవని బీబీసీతో చెప్పారు.

పరిశోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, చరిత్ర నిజమైన పాఠాలను అది మరుగున పడేసే ప్రమాదముందని అమెస్టార్‌డామ్‌లోని ఎన్ఐవోడీ ఇన్‌స్టిట్యూట్‌లో చరిత్రకారిణి అన్నె వాన్ మౌరిక్ అన్నారు.

‘‘ఆ పాఠం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సాధారణ జనం భయంకరమైన హింసకు పాల్పడవచ్చు. దాన్ని అంగీకరించవచ్చు. హింసకు ప్రేరేపించవచ్చు'' అని.

హిట్లర్ సూక్ష్మపురుషాంగంపై దృష్టిపెట్టడం అనేది మనకు ఏమీ నేర్పించదు.

అధ్యయనం పూర్తయింది. సమగ్ర పరిశీలనలో ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పరిశోధనా ఫలితాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని ప్రొఫెసర్ వెబర్ చెప్పారు. అయితే ఏదో ఒక విధంగా అది సాయపడుతుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు.

''పరిశోధన ఫలితాల విషయంలో అదే గొప్ప సంగతి. అది ఐదు, 150, లేదా 500ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఉపయోగపడొచ్చు. ఇది భవిష్యత్ తరాల కోసం. తెలివిగల వ్యక్తులు భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకుంటారని నాకు నమ్మకముంది'' అని ఆయనన్నారు.

అయితే ఈ ఫలితాలను ఎలా ఉపయోగించుకుంటారనేదానిపై మనందరి బాధ్యత ఉంది.

''ప్రతిఒక్కరూ సైన్స్‌ చెప్పేదాన్ని అనుసరించాలి. మనకేం తెలుసు, మనమేం చేయకూదనేదానిపై స్పష్టత ఉండాలి'' అని డాక్టర్ కే చెప్పారు.

మీడియా ఎలా రిపోర్ట్ చేస్తుందనేది కూడా ఇందులో భాగమే.

'' ఈ డాక్యుమెంటరీని చూస్తున్న వారెవరికైనా దాని గురించి సరిగ్గా రాయాల్సిన బాధ్యత ఉంది. ఎవరినైనా కించపరిచేలా ఉండకుండా జాగ్రత్తపడాలి''

''ఇలాంటి డాక్యుమెంటరీ సమాజం, చరిత్రతో అనుసంధానమై ఉంటుంది'' అని విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)