హిట్లర్ నరమేధం నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? 84 ఏళ్ల తర్వాత వీడిన ఫోటో మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో లాన్స్‌డేల్, జేన్ డాన్స్
- హోదా, బీబీసీ న్యూస్
నాజీ జర్మనీ నుంచి ప్రాణాలు అరిచేత పెట్టుకొని వచ్చిన ముగ్గురు యూదు బాలికల ఫోటో చాలా మ్యూజియంలు, ప్రదర్శనలు, పుస్తకాల్లో కనిపిస్తుంటుంది. ఆ ఫోటోను లండన్‌లోని లివర్‌పూల్ స్టేషన్‌లో తీశారు. అయితే, 80 ఏళ్లపాటు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు అనేది మర్మంగా ఉండిపోయింది.
ఆ ఫోటో ఎలా తీసారో ‘ఇంగ్’కు గుర్తులేదు. దశాబ్దాలపాటు అసలు ఇలాంటి ఫోటో ఒకటి ఉందని కూడా ఆమెకు తెలియదు.
ఐదేళ్ల వయసున్నప్పుడు తన అక్క పదేళ్ల రూత్‌తో కలిసి జర్మనీలోని బ్రెస్లాలో తన ఇంటి నుంచి ఆమెను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంగ్ పోలండ్‌లోని వ్రాక్లాలో జీవిస్తున్నారు.
ఇంగ్ తల్లితోపాటు చెల్లి కూడా ఆనాడు ఇంట్లోనే ఉండిపోయారు. అయితే, ఆక్విట్జ్‌లో వారిద్దరూ హత్యకు గురయ్యారు.
1939లో నాజీ జర్మనీ నుంచి చిన్నారులను భారీ మొత్తంలో తరలించిన కిండర్‌ట్రాన్స్‌పోర్ట్‌తోపాటు యూదుల ఉచకోతకు ప్రతీకగా తమ ఫోటోను ఉపయోగిస్తున్నారని ఇంగ్, రూత్‌లకు దశాబ్దాల వరకూ తెలియలేదు. 2015లో రూత్ మరణించారు.

ఫొటో సోర్స్, ADAMECZ FAMILY
చరిత్రకారుడు మార్టిన్ గిల్‌బెర్ట్ పుస్తకం ‘నెవర్ ఎగైన్’లో ఒకసారి అనుకోకుండా ఆ ఫోటోను ఇంగ్ చూశారు.
‘‘దాన్ని చూడగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.’’ అని ఇంగ్ చెప్పారు. ఆమె పూర్తిపేరు ఇంగ్ ఆడమెజ్.
‘‘ఫోటో కింద ‘ముగ్గురు అమ్మాయిలు’ అని ఆయన రాశారు.’ దీంతో ఆయనకు నేను లేఖ రాశాను. మేం బతికే ఉన్నామని చెప్పాను. ఆ ఫోటో చూసిన కొంతమంది నేను కాస్త నటి షిర్లీ టెంపుల్‌లా ఉన్నానని అన్నారు. అయితే, నేను ఎందుకు ఫోటోలో నవ్వుతూ కనిపించానో నాకు తెలియదు.’’ అని ఆమె అన్నారు.
‘‘రూత్ వైపు చూడండి, తనలో బాధ కనిపిస్తోంది. ఆ ఫోటోలో బొమ్మ పట్టుకొని కనిపిస్తున్న మూడో అమ్మాయి ఎవరో మాకు అప్పట్లో తెలియదు.’’అని ఇంగ్ చెప్పారు.
బొమ్మను పట్టుకున్న ఆ అమ్మాయి పేరు హన్నా కోన్. అప్పుడు తనకు పదేళ్లు. తన కవల సోదరుడు హాన్స్‌తో కలిసి ఇంగ్, రూత్‌లు వచ్చిన రైలులోనే జర్మనీలోని హాల్ నుంచి ఆమె వచ్చింది.
ఇంగ్, రూత్‌లలానే అసలు ఈ ఫోటో ఒకటి తీసినట్లు హన్నాకు కూడా తెలియదు. అయితే, ఆమెకు ఆ ప్రయాణం, బొమ్మ మాత్రం గుర్తున్నాయి.

2018లో హన్నా మరణించారు. అయితే, అప్పట్లో ఏం జరిగిందో, తనకు ఏం గుర్తుందో అన్నీ లండన్ యూనివర్సిటీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
‘‘హాలండ్ మీదుగా వెళ్లడం నాకు గుర్తుంది. అక్కడుండే కొందరు మహిళలు మాకు రొట్టెలు, నిమ్మరసం ఇచ్చారు.’’అని ఆమె తెలిపారు.
‘‘అదే రైలులో మేం హార్విక్ నుంచి లివర్‌పూల్ స్ట్రీట్ స్టేషన్‌కు వెళ్లాం. ఆ రైలులో సీట్లు చాలా మెత్తగా ఉన్నాయి. అవి చెక్కతో చేసినవి కాదు. దీంతో పొరపాటున మమ్మల్ని ఫస్ట్ క్లాసులో ఎక్కించారా? అని ఆందోళన పడ్డాను.’’అని ఆమె చెప్పారు.
‘‘మరోవైపు లండన్‌కు కాకుండా లివర్‌పూల్‌కు వెళ్తున్నాం, అక్కడి నుంచి లండన్‌కు ఎలా వెళ్లాలో అని కూడా ఆందోళన పడ్డాను.’’ అని ఆమె తెలిపారు.
‘‘మొత్తానికి మేం గ్రేట్ బిగ్ హాల్‌కు చేరుకున్నాం. ఎవ్లిన్‌గా పిలిచే నా బొమ్మను గట్టిగా పట్టుకోవడం ఇప్పటికీ నాకు గుర్తుంది.’’అని ఆమె అన్నారు.

కిండర్‌ట్రాన్స్‌పోర్ట్‌కు 50వ వార్షికోత్సవంనాడు లండన్‌లో కామ్డెన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన ఒక ప్రదర్శనలో హన్నా ఫోటోను తొలిసారి ఆమె సోదరుడు చూశారు. అప్పుడే అలాంటి ఫోటో ఒకటుందని హన్నాకు తెలిసింది.
ఆ ఫోటోలో కనిపించిన మిగతా ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసుకోవాలని మా అమ్మ చాలా ప్రయత్నించారని ఆమె కవల కుమార్తెలు డెబ్బీ, హెలెన్ సింగర్‌లు చెప్పారు. ‘‘మేం ఆ ఫోటోను చూసినప్పుడు, దానిలో బొమ్మ పట్టుకుని మా అమ్మ కనిపించింది. వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరని అమ్మ ప్రశ్నించారు.’’ అని డెబ్బీ చెప్పారు.
మొత్తానికి జనవరిలో ఆ ఫోటోకు 80 ఏళ్లు పూర్తయినప్పుడు, బీబీసీ ఆడియో సిరీస్ కార్యక్రమం ద్వారా హన్నా కుమార్తెలు రూత్‌ను కలిశారు.
‘ద గర్ల్స్: ఎ హోలోకాస్ట్ సేఫ్ హౌస్’ సిరీస్‌లో భాగంగా ఇంగ్, రూత్ గడిపిన నార్త్-ఈస్ట్ హోటల్ గురించి కథనాలు ప్రచురించారు.

ఫొటో సోర్స్, SINGER FAMILY
‘‘అది హోలోకాస్ట్ మెమోరియల్ డే.. నా స్నేహితుల్లో ఒకరు బీబీసీ వెబ్‌సైట్‌లోని ఆ కథనం లింక్‌ను పంపించారు.’’ అని హెలెన్ చెప్పారు. ‘‘అసలు నాకు ఎందుకు ఆమె ఆ లింక్ పంపించారో అని మొదట అనుకున్నాను. కొంచెం లోపలకు వెళ్లేసరికి మా అమ్మ ఫోటో కనిపించింది. దాని కింద మిగతా ఇద్దరి అమ్మాయిల పేర్లు రూత్, ఇంగ్ అని రాసివున్నాయి.’’ అని హెలెన్ చెప్పారు.
‘‘మేం చాలా సంబరపడ్డాం. వెంటనే డెబ్బీకి మెసేజ్ చేశాను. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలిసిందని చెప్పాను.’’ అని ఆమె వివరించారు.
ఏప్రిల్‌లో మొత్తంగా ఇంగ్‌ను హన్నా కుమార్తెలు లండన్‌లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో కలిశారు. గత 20 ఏళ్లుగా అక్కడ ఆ ముగ్గురు అమ్మాయిల ఫోటోను ప్రదర్శనకు ఉంచారు. ఆ ఫోటో తీసిన తర్వాత ఏం జరిగింది? లాంటి విషయాలను వీరు మాట్లాడుకున్నారు.
‘‘మా అమ్మ బతికుంటే నిజంగా మమ్మల్ని చూసి గర్వపడేవారు. ఆ ఫోటోలోని ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసుకోవాలని ఆమె చాలా ప్రయత్నించారు.’’ అని డెబ్బీ చెప్పారు.

ఫొటో సోర్స్, STEVENSON FAMILY
ఫోటో తీసింది ఎవరు?
గెట్టి ఇమేజెస్‌లోని హాల్టన్ ఆర్కైవ్స్ ప్రకారం ఆ ఫోటో తీసిన వ్యక్తిపేరు స్టీఫెన్సన్. టాపికల్ ప్రెస్ ఏజెన్సీ కోసం ఆయన పనిచేసేవారు. అప్పట్లో ఆ సంస్థకు వెయ్యి మందికిపైగా ఫోటోగ్రాఫర్లు ఉండేవారు. వీరు తీసే ఫోటోలు ప్రతికలకు వెళ్లేవి.
‘‘లివర్‌పూల్ స్ట్రీట్ స్టేషన్‌లో ఎదురుచూస్తున్న ముగ్గురు చిన్నారులు.’’అనే పేరుతో స్టీఫెన్సన్ ఆ ఫోటో తీసినట్లు ఆ ఆర్కైవ్స్‌లో ఉంది.
మొదట్లో ఆయనెవరో మాకు కచ్చితంగా తెలియలేదు. ‘డియర్ ఓల్డ్ గ్లాస్గో టూన్’ పాటతో పేరు సంపాదించిన జాన్ ఎఫ్ స్టీవెన్సన్ అయ్యుండొచ్చని మేం భావించాం.

ఫొటో సోర్స్, STEVENSON FAMILY
స్కాటిష్ పబ్లిక్ రికార్డ్స్ ఆఫీస్ సాయంతో అతడి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లోని చిరునామాను పట్టుకొని అతడి కుటుంబాన్ని గుర్తించగలిగాం.
ఆయన మనవడు, జర్నలిస్టు గార్డన్ స్టీవెన్సన్ ఈ కథ నుంచి చాలా స్ఫూర్తి పొందారు. 1930ల్లో తన తాతయ్య ఫ్రీల్యాన్స్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసేవారని ఆయన ధ్రువీకరించారు.
‘‘ఆయన జీవితాంతం ఫోటోలు తీశారని మాకు తెలుసు. ఆయన తీసిన ఫోటోలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ ఫోటోలే ఆయన జీవితంలో ప్రధాన పాత్ర పోషించాయి’’అని గార్డన్ చెప్పారు.
‘‘అయితే, ఆయన జీవితం చివరినాళ్లలో తీసిన ఫోటోల కథలు మాత్రమే తెలుసు. 1930లనాటి ఫోటోల గురించి మాకు పెద్దగా తెలియదు. దీన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.’’ అని ఆయన చెప్పారు.
ఆ ఫోటో తీసిన మరుసటి రోజు ‘ద న్యూస్ క్రానికల్’ దీన్ని ప్రచురించారు. ఆ తర్వత తరచుగా పత్రికలు, ప్రదర్శనల్లో ఈ ఫోటోను ఉపయోగించేవారు.

డెబ్బీ, హెలెన్‌లు వచ్చి వెళ్లిన తర్వాత గెట్టీ ఆర్కైవ్స్‌లో ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లను కూడా ఫోటో క్యాప్షన్‌లో రాశారు.
‘‘నాకైతే కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అది మా అమ్మ పేరు. ఆమె ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఫోటో కింద రాశారు. అందులో ఇంగ్, రూత్‌ల పేర్లు కూడా ఉన్నాయి.’’ అని డెబ్బీ చెప్పారు.
‘‘వారు ఎవరో ముగ్గురు చిన్న పిల్లలు కాదు. వారి వెనుక చాలా కథలు ఉన్నాయి. వారు చాలా ముఖ్యమైనవారు.’’ అని హెలెన్ అన్నారు.
‘‘వారి పేర్లు అక్కడ కచ్చితంగా రాయాలి. మా అమ్మ బతికుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది.’’ అని ఆమె చెప్పారు.
89 ఏళ్ల ఇంగ్ ఇప్పుడు సౌత్ లండన్‌లో జీవిస్తున్నారు. మొత్తానికి ఆ ఫోటోలో బొమ్మ పట్టుకున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు 80 ఏళ్లపాటు ఆమె ఎదురుచూడాల్సి వచ్చింది.
తన వెంటే వచ్చిన ఆ ఫోటో గురించి ఇప్పుడు ఆమెకు చాలా విషయాలు తెలుసు.
‘‘ఈ ఫోటో చాలా దూరం ప్రయణించింది. చాలా మందిని ఆకర్షించింది కూడా..’’ అని ఆమె అన్నారు.
అదనపు రిపోర్టింగ్: డంకన్ లెదర్డేల్
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














