యూనిఫామ్ సివిల్ కోడ్: విపక్షాల ఐక్యతను మోదీ ఈ వ్యూహంతో దెబ్బతీస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, FB/NarendraModi

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యూనిఫామ్ సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి- యూసీసీ) అంశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెద్ద చర్చకు నాంది పలికారు.

ఈ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కొన్ని రాజకీయ పార్టీలు యూసీసీకి మద్దతుగా రాగా, మరికొన్ని దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

యూసీసీ ముసాయిదా వచ్చిన తర్వాత దీనిపై తమ వైఖరిని నిర్ణయిస్తామని కూడా కొన్ని పార్టీలు చెప్పాయి.

యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దేశంలోని పౌరులందరికీ పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అనేక విషయాలకు ఒకే చట్టాన్ని వర్తింపచేయడం.

విపక్షాలు

ఫొటో సోర్స్, ANI

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలు కలిసికట్టుగా వ్యూహరచన చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో మోదీ యూసీసీ అంశాన్ని ముందుకు తెచ్చారు.

విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే బీజేపీ వచ్చే ఎన్నికల తదుపరి అజెండాగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని ఎత్తుకుందని నిపుణులు భావిస్తున్నారు.

యూసీసీ విషయంలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్న విపక్ష పార్టీలన్నీ దాదాపు 10 నెలల తర్వాత జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఏకతాటిపైకి వస్తాయా? లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

విపక్షాలు

ఫొటో సోర్స్, Getty Images

యూసీసీపై విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు

యూసీసీ ఫార్మాట్‌ను బట్టి తమ మద్దతును నిర్ణయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. తమ పార్టీ దీనికి మద్దతుగా ఉందని, అయితే ముసాయిదా కోసం ఎదురుచూస్తున్నామని ఆప్ నేత సందీప్ పాఠక్ అన్నారు.

దేశంలో యూసీసీ ఉండాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం కూడా చెబుతోందని ఆయన తమ వాదనను బలపరిచారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ముసాయిదా రాక కోసం ఎదురుచూస్తోంది.

వీటితో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు కూడా యూసీసీపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.

గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ నాయకుడు కేసీ త్యాగి మాట్లాడుతూ, యూసీసీ అనేది ఒక సున్నితమైన అంశమన్నారు. దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

యూసీసీని హిందూ ముస్లింల సమస్యగా చేయొద్దని, ఇది ఆదివాసీల ఆచారాలకు కూడా సంబంధించిన వ్యవహారమని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అభిప్రాయపడ్డారు.

యూసీసీ ముసాయిదా వచ్చిన తర్వాత దీనిపై పార్టీ తన వైఖరిని నిర్ణయిస్తుందని శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) కూడా చెప్పింది.

డీఎంకే దీన్ని వ్యతిరేకించగా, ఎన్సీపీ తటస్థ వైఖరి తీసుకుంది.

ఈ విపక్ష పార్టీలన్నీ జూన్ 23న పట్నాలో సమావేశమయ్యాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతను ప్రదర్శించేందుకు జరిగిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి.

దిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చర్చ నడుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో యూసీసీ అంశం, విపక్షాల ఐక్యతను చిక్కుల్లో పడేస్తుందా?

కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రమోద్ తివారీ

కాంగ్రెస్ ఏమంటోంది?

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ నాయకత్వంలో శనివారం జరిగిన కీలక సమావేశంలో పార్టీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేష్‌, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం పార్టీ కమ్యూనికేషన్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ‘‘ముసాయిదా వచ్చి దానిపై చర్చ జరిగితే అందులో పాల్గొని ప్రతిపాదిత ముసాయిదాపై సమీక్షిస్తాం’’ అన్నారు.

ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి యూసీసీ అనేది బీజేపీ పన్నిన ఎత్తుగడ మాత్రమే అని బీబీసీతో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

యూసీసీపై కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘ఒకవేళ యూసీసీ ప్రతిపాదన 140 కోట్ల మంది భారతీయుల్లో ఏ వర్గం, ధర్మం, మతానికి చెందిన ప్రజల ఆచార వ్యవహారాలకైనా అడ్డుపడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా వ్యతిరేకిస్తుంది’’ అన్నారు.

విపక్షాల ఐక్యతకు యూసీసీ ఒక పెద్ద సమస్యగా మారుతుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఇలా అన్నారు.

"విపక్ష పార్టీల్లో ప్రతీ పార్టీకి తమవైన సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఈ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు, దీనిపై ఏం చేయాలో అందరం కలిసి నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, ANI

ఆ అంశాలపై చర్చిస్తాం: తృణమూల్

విపక్షాల ఐక్యతపై ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు తృణమూల్ కాంగ్రెస్ జవాబు ఇచ్చింది.

ప్రజాస్వామ్యం, నిరుద్యోగం వంటి అంశాలపై పోరాడుతున్న విపక్ష పార్టీలన్నీ ఒకదానికొకటి ఫొటోకాపీలుగా ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్ ట్విటర్‌లో రాశారు.

విపక్ష పార్టీలన్నింటికీ 100 శాతం సమ్మతం కుదిరిన అంశాలపై త్వరలో జరిగే రెండో విపక్ష పార్టీల సమావేశంలో చర్చిస్తామని, కొన్ని అంశాల్లో అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన ట్వీట్‌లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

శివసేన

ఫొటో సోర్స్, ANI

శివసేన వైఖరి ఏంటి?

శివసేన పార్టీ ఎప్పుడూ యూసీసీని సమర్థిస్తూనే ఉంది.

శివసేన పార్టీ ఏక్‌నాథ్ శిందే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలుగా చీలిపోయింది.

ఏక్‌నాథ్ శిందే వర్గానికి చెందిన ఎంపీ రాహుల్ శేవ్లే మాట్లాడుతూ, యూసీసీ అనేది బాలా సాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. యూసీసీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.

‘‘ఒకవేళ ఇది మతంతో సంబంధం లేకుండా న్యాయం, సమానత్వం గురించి మాట్లాడితే, దానికి మేం మద్దతు ఇస్తాం. అలా కాకుండా ఇది బీజేపీ భావజాలానికి రాజకీయ రూపంగా మారితే సమాజంలో చీలికలను పెంచుతుంది. అలాంటి పరిస్థితుల్లో దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకా ముసాయిదా రాలేదు కాబట్టి, అది వచ్చేంతవరకు దీనిపై ఏం చర్చించలేం’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిపక్ష పార్టీలకు యూసీసీ పెద్ద సమస్య కాదా?

యూసీసీపై భిన్నాభిప్రాయాలను కలిగి ఉండొచ్చని శివసేన, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా అనేక పార్టీలు నమ్ముతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత దేశంలోని పెద్ద సమస్యలకు సంబంధించినది.

రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ దీని గురించి మాట్లాడుతూ, యూసీసీపై విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అయితే ప్రతిపక్షాల ఐక్యత మాత్రం అలాగే ఉంటుందని అన్నారు.

‘‘యూసీసీకి మద్దతు ఇస్తామని ఆమ్ ఆద్మీ అప్పుడే చెప్పడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉంది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బిల్లుపై మీరు మాకు మద్దతు ఇవ్వకపోతే, యూసీసీ విషయంలో మేం మీకు మద్దతు ఇవ్వబోమని ఆప్ చెప్పాలనుకుంటోంది. ఇక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయానికల్లా యూసీసీని అమలు చేయడం కష్టమే. కానీ, తాము యూసీసీని తెచ్చేందుకు పట్టుబడుతున్నప్పటికీ, ప్రతిపక్షాలు అలా జరగనివ్వట్లేదనే భావనను ప్రజల్లో కలిగించాలనేది బీజేపీ ఎత్తుగడ’’ అని ఆయన వివరించారు.

అలా అయితే, యూసీసీపై తమ సొంత అభిప్రాయాన్ని వినిపించి విపక్ష పార్టీలన్నీ బీజేపీ విసిరిన పాచికలో చిక్కుకున్నాయని అనుకోవచ్చా?

ఎన్సీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అనేవి కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పడ్డ పార్టీలు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంటే ఇవి బలమైన స్థితిలో ఉన్నాయి.

చాలా సందర్భాల్లో ఎన్సీపీ, తృణమూల్ లాంటి విపక్షాలు కలిసి సాగుతున్నాయి.

అయితే, ప్రతిపక్షాల ఐక్యత అనేది ఒక రకమైన భ్రమ అని రషీద్ కిద్వాయ్ అన్నారు.

‘‘ఆర్థిక అంశాలపై, సామాజిక అంశాలపై విపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావడం దాదాపుగా అసంభవం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఎలా నిలువరించాలన్నదే ఈ పార్టీలన్నింటి లక్ష్యం. ఒకే వేదికపైకి విపక్షాలన్నీ కలిసి రావడం పెద్ద విషయం కాదు. కానీ, ఒకే కూటమిగా ఇవన్నీ కలసి పని చేయడం చాలా పెద్ద పని. అలాగైతే, వచ్చే లోక్‌సభ ఎన్నికలు విపక్షాల ఐక్యతకు పెద్ద పరీక్షగా నిలవనున్నాయి’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)