యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో వివిధ మతాలు, విశ్వాసాలను బట్టి పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత అనే అంశాల్లో వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి.
అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్-యూసీసీ) కోసం డిమాండ్ వినిపిస్తూనే ఉంది.
ఈ కోడ్ కింద ఒకే చట్టం ఉంటుంది. ఈ చట్టం అనేది మతం, లింగం, లైంగిక అంశాలను పట్టించుకోదు. అందర్నీ ఒకే రీతిలో చూస్తుంది.
పౌరులకు ఇలాంటి చట్టాలను అందించేందుకు దేశం ప్రయత్నించాలని రాజ్యాంగం కూడా చెబుతోంది.
అయితే, దేశంలోని హిందూ, ముస్లిం కమ్యూనిటీలు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టు మాటల్లో చెప్పాలంటే ఇది ఒక 'డెడ్ లెటర్'.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఆలోచనను వెనక్కి తీసుకుంటోంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ జరుగుతోంది.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణం, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడం, యూసీసీ అమలు వంటివి బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో ఉన్నాయి.
అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతుండగా, కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కూడా తొలగించడంతో ఇప్పుడు చర్చంతా యూసీసీపైనే జరుగుతోంది.
‘‘ముస్లిం పర్సనల్ లా’’ను వెనుకబడిన చట్టంగా పేర్కొంటూ రైట్ వింగ్ హిందూ సంస్థలు, ఉమ్మడి పౌర స్మృతి చట్టం కోసం డిమాండ్ చేస్తున్నాయి.
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ట్రిపుల్ తలాక్ చట్టబద్ధమైనది. దీని ప్రకారం ముస్లింలు తక్షణమే విడాకులు తీసుకోవచ్చు. అయితే, మోదీ ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా ప్రకటించింది.
‘‘ఉమ్మడి పౌర స్మృతిని భారత్ అంగీకరించనంత వరకు లింగ సమానత్వం రాబోదు’’ అని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది.
కానీ, దీనికి సంబంధించిన వాస్తవం చాలా సంక్లిష్టమైనదని రాజకీయ విశ్లేషకులు ఆసిమ్ అలీ అన్నారు.
ఇంకో మాటలో చెప్పాలంటే, యూసీసీని తీసుకురావాలనే ఆలోచన దేశంలోని హిందువులు ఊహించని పరిణామాలు ఎదుర్కొనేలా చేస్తుందని ఆయన అన్నారు.
ముస్లింలతో పాటు హిందువుల సామాజిక జీవితాన్ని కూడా యూసీసీ ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
భారత్‌లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడం ఎందుకు కష్టం?
భారత్ వంటి వైవిధ్యమైన దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ఏకీకృతం చేయడం చాలా కష్టం.
ఉదాహరణకు, హిందువులు తమ వ్యక్తిగత చట్టాలను అనుసరిస్తారు. అలాగే, వారు వివిధ రాష్ట్రాల్లోని వివిధ వర్గాలకు చెందిన ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తారు.
మరోవైపు, ముస్లింలు పాటించే ‘‘ముస్లిం పర్సనల్ లా’’ కూడా ముస్లింలందరికీ ఒకేలా ఉండదు. ఉదాహరణకు, కొంతమంది బోహ్రా ముస్లింలు వారసత్వ విషయాలలో హిందూ చట్ట సూత్రాలను అనుసరిస్తారు.
ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి.
ఈశాన్య భారత్‌లో క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాలు తమ సొంత చట్టాలను కలిగి ఉంటాయి. అక్కడి వారు తమ మతం ప్రకారం కాకుండా ఆచారాల ప్రకారం నడుచుకుంటారు.
గోవాలో 1867 నాటి ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. అక్కడి అన్ని కమ్యూనిటీలకు ఇది వర్తిస్తుంది. కానీ, కేథలిక్ క్రిస్టియన్లతో పాటు ఇతర కమ్యూనిటీలకు వేరే నియమాలు అమల్లో ఉన్నాయి. ఎలాగంటే, గోవాలో మాత్రమే హిందువులు రెండు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.
భారత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశం.
దేశంలో 1970 నుంచి రాష్ట్రాలు తమ సొంత చట్టాలను తయారు చేసుకుంటున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత 2005లో ఒక సవరణను చేశారు. దీని ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న ‘‘సెంట్రల్ హిందూ పర్సనల్ లా’’ ప్రకారం పూర్వీకుల ఆస్తిలో కుమారులతో సమానంగా కుమార్తెలకు కూడా హక్కులు కల్పించారు. దీన్ని అమలు చేయడానికి కనీసం అయిదు రాష్ట్రాలు ఇప్పటికే తమ చట్టాలను సవరించాయి.
పర్సనల్ లా అనేది వేర్వేరు విషయాల్లో వేర్వేరుగా ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల దత్తత అంశంలో ఎలా ఉంటుందంటే...
ఇప్పుడు పిల్లల్ని దత్తత తీసుకునే విషయాన్ని పరిశీలిద్దాం.
హిందూ సంప్రదాయం ప్రకారం, సెక్యులర్, రిలీజియస్ ఉద్దేశాల కోసం ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. ఎందుకంటే, మగపిల్లాడిని ఆస్తికి వారసుడిగా భావిస్తారు. కుటుంబీకుల అంతిమ సంస్కారాలను పురుషులు మాత్రమే చేస్తారు.
మరోవైపు, ఇస్లామిక్ చట్టంలో దత్తతకు గుర్తింపు లేదు. కానీ, భారత్‌లోని ‘‘జువైనల్ జస్టిస్ లా’’ ప్రకారం మతంతో సంబంధం లేకుండా భారత పౌరులందరూ పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు.
దీనితో పాటు, ఉమ్మడి పౌర స్మృతి చట్టం కూడా ఉంటే దత్తత కోసం నియమాలు రూపొందించేటప్పుడు ఎలాంటి తటస్థ నియమాలను పాటిస్తారని నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
బెంగళూరులోని ఒక స్వతంత్ర న్యాయ విధాన సలహా బృందం ‘‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’’కి చెందిన అలోక్ ప్రసన్న కుమార్ ఇలా అన్నారు. "మీరు ఏ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తారు? హిందూ, ముస్లిం లేదా క్రిస్టియన్?" అని అడిగారు.
‘‘యూసీసీ కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుది. పెళ్లి, విడాకులకు ఎలాంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు? దత్తత ప్రక్రియ, పరిణామాలు ఎలా ఉంటాయి? విడాకుల విషయంలో ఆస్తి నిర్వహణ, మెయింటనెన్స్ ఏ ప్రాతిపాదికగా ఇస్తారు? ఆస్తి వారసత్వ నియమాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి’’ అని ఆయన అన్నారు.
యూసీసీ విషయంలో సుప్రీం కోర్టు కూడా సందిగ్ధంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
చట్టపరమైన మార్పులపై ప్రభుత్వానికి సలహా ఇచ్చే ‘లా కమిషన్’ 2018లో ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడుతూ ‘‘దాని అవసరం లేదు, అది కోరదగిన చట్టం కూడా కాదు’’ అని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
యూసీసీ లేకుండా కూడా లింగ వివక్షను అంతం చేయలేమా?
వ్యక్తిగత చట్టాల్లోని లింగ వివక్షను తొలగించేందుకు ఒక కొత్త చట్టాన్ని తేవాలని డిమాండ్ చేయడానికి బదులుగా, ఉన్న చట్టాల్లోనే మార్పులు చేయడం సులువని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల పర్సనల్ చట్టాల్లో అత్యుత్తమ పద్ధతులను అనుసరిస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు.
ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుందనే కారణంతోనే చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బహుశా యూసీసీని ఆమోదించడం లేదని అలీ అభిప్రాయపడ్డారు.
మరో షాకింగ్ విషయం ఏంటంటే, చాలా రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ చాలా కాలంగా ఈ చట్టాన్ని తీసుకురాలేకపోయింది.
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదే ఉన్నందున ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన సమయం వచ్చిందని ఆ పార్టీ నమ్ముతోందా?
"యూసీసీపై ఇప్పుడు చాలా గందరగోళం ఉంది. దీనిపై రాజకీయ రగడ ఇంకా మొదలు కాలేదు. ఈ ప్రతిపాదిత చట్టానికి సంబంధించిన ముసాయిదాను ముందుగా అందరికీ చూపించాలి’’ అని ప్రసన్న కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














