మెస్సాలినా: శృంగారంలో వేశ్యలతో పోటీపడి అపఖ్యాతి పాలైన రోమ్ సామ్రాజ్ఞి

ఫొటో సోర్స్, Getty Images
పురాతన రోమన్ సామ్రాజ్యంలో రాజకీయ కుట్రలు, పన్నాగాలతో కూడిన క్రూరమైన డ్రామాలకు కొదవ లేదు.
విష రాజకీయాలు, అనుమానాస్పద మరణాలు, పన్నాగాలు, ఎత్తుగడలతో కూడిన ఈ రోమన్ ప్రపంచంలో సామ్రాజ్ఞి వలేరియా మెస్సాలినా కథ మరో ఎత్తు.
అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆమె చేసిన కుట్రలు, కుతంత్రాలు మాత్రమే కాదు, అన్నింటికంటే మించి ఆమె లైంగిక వాంఛల గురించి ఎక్కువగా చెప్పుకుంటారు.
దీనికి ఆధారం ‘లైంగికంగా తృప్తి చెందని జంతువులు మానవులు మాత్రమే’ అంటూ ప్లినీ ది ఎల్డర్ (77 ఏడీ) తన ‘‘నేచురల్ హిస్టరీ ఎన్‌సైక్లోపీడియా’’లో రాసిన వాక్యాలు.
మెస్సాలినాను ఇందుకు ఉదాహరణగా చూపారు. ఈ రోమన్ రచయిత ప్రకారం, 24 గంటల్లో ఎక్కువ మంది పురుషులతో ఎవరు సంభోగంలో పాల్గొనగలరో చూద్దాం అంటూ మెస్సాలినా వేశ్యలతో పోటీ పడేవారు.
రాత్రి, పగలు నిరంతర సంభోగంలో 25వ గంటలోకి కూడా వెళ్లి మహారాణి అక్కడి వేశ్యలను అధిగమించారు.
ఇలాంటి కథలన్నీ మెస్సాలినాకు చెడ్డ పేరు రావడానికి కారణమయ్యాయి. కానీ, ఆమె నిజంగా ఎలాంటి మహిళ అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఇలాంటి కథలన్నీ గజిబిజి చేస్తాయి.
అయితే దీన్ని ‘‘మెస్సాలినా: ఎ స్టోరీ ఆఫ్ ఎంపైర్, స్లాండర్ అండ్ అడల్టరీ పుస్తక రచయిత హానర్ కార్గిల్ మార్టిన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఊహించని అధికారం
రోమన్ సామ్రాజ్యాన్ని ఉత్తర ఆఫ్రికా వరకు విస్తరించిన చక్రవర్తి క్లాడియస్ మూడో భార్య మెస్సాలినా. ఆమె ఎప్పుడు జన్మించారో కచ్చితంగా తెలియదు. కానీ, క్లాడియస్‌ను పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయస్సు 15-18 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అయితే, అప్పటికే క్లాడియస్ 50 ఏళ్లకి చేరువలో ఉన్నారు.
మెస్సాలినా ఆ కాలంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, సంపన్నమైన ఉన్నత కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఆమె భర్త రాజ కుటుంబంలో భాగంగా ఉన్నప్పటికీ ఆమె సామ్రాజ్ఞి అవుతుందని సూచించే సంకేతాలు ఏమీ లేవు.
క్లాడియస్ అనారోగ్యంతో ఉండేవారు. కుంటివాడు, నత్తిగా మాట్లాడేవాడు, అంత ఆకర్షణీయంగా ఉండకపోయేవాడు. వికార ప్రవర్తన దీనికి అదనం. అతని వైఖరితో ఆయన కుటుంబం ఇబ్బంది పడేది.
చాలా కాలం పాటు ఆయన చరిత్ర పుస్తకాలు రాస్తూ కాలం గడిపారు. ఆ పని మీదే ఆయన ఆసక్తి చూపేవారు. ఆయన మేనల్లుడు, చక్రవర్తి కాలిగులా అతన్ని కాన్సుల్, సెనెటర్‌గా నియమించేవరకు క్లాడియస్ అధికారానికి దూరంగా ఉన్నారు.
జనవరి 24, ఏడీ 41న కాలిగులా హత్య తర్వాత ఆయనకు ఊహించని విధంగా అధికారం చేతికి వచ్చింది.
మరుసటి రోజే ప్రిటోరియన్ గార్డ్ దళాలు ఆయనను చక్రవర్తిని చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాల్లో మార్పు
ఆ సమయంలో, రోమ్ ఇంకా కొత్త ప్రభుత్వానికి అలవాటు పడుతూ ఉంది.
జూలియో-క్లాడియన్ రాజవంశానికి చెందిన నాలుగవ చక్రవర్తి క్లాడియస్. రోమన్ సామ్రాజ్యానికి ఆయనే మొదటి చక్రవర్తి.
ఈ దశకు ముందు రోమ్ ఒక గణతంత్ర దేశంగా ఉండేది. ఎన్నికైన న్యాయాధికారులు, సెనెటర్లు దాన్ని పాలించేవారు.
కానీ జూలియస్ సీజర్, పాంపే ది గ్రేట్‌ల మధ్య అర్ధ శతాబ్దపు అంతర్యుద్ధం తర్వాత, నిరంకుశ శక్తికి బదులుగా శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని అందించడానికి ఆగస్టస్ వచ్చారు.
ఇక్కడే రాజకీయాల్లో మార్పు వచ్చింది. అసెంబ్లీలు, పబ్లిక్ ఫోరమ్‌లలో నెరపాల్సిన రాజకీయాలు రాజమహల్ లోని కోర్టులకు చేరాయి.
అప్పటి నుంచి రాజకీయాల్లో వచ్చిన మార్పు గమనించదగినది. ఒక వ్యక్తికి గుర్తింపు సెనేట్‌లో ఆయనకున్న పదవి వల్ల కాకుండా చక్రవర్తితో ఆయనకున్న సామీప్యత వల్ల రావడం మొదలైంది.
కాలిగులా హయాంలో మెస్సాలినా దీన్నే నేర్చుకున్నారు. చక్రవర్తికి సన్నిహితంగా ఉంటే ఏ రోమన్‌కైనా అధికారం, అవకాశం లభిస్తుందని ఆమె గుర్తించారు. ఇది వారి జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతుందని కూడా గమనించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేర్చుకున్న పాఠాలు
రోమన్ రాజ్యంలో రాజకీయాలు క్రూరంగా ఉన్నాయి.
"క్లాడియో, మెస్సాలినాలకు తమకు ఎదురయ్యే ప్రమాదాల గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే, వారు తమ పూర్వీకులకు ప్యాలెస్‌లో ఏం జరిగిందో వారు చూశారు.
కాలిగులాను చాలా క్రూరంగా చంపారు. ఆయనను చంపేసి, శరీరపు మాంసం ముక్కలను తిన్నారనే పుకార్లు కూడా వచ్చాయి.
కాలిగులాతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా చంపారు. భవిష్యత్‌లో వారి నుంచి ముప్పు పొంచి ఉండవచ్చనే ఉద్దేశంతో వారిని కూడా చంపారు’’ అని బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రాతో కార్గిల్ మార్టిన్ చెప్పారు.
ఇదంతా జరిగినప్పుడు మెలిస్సానా 8 నెలల గర్భవతి. ఆమె కడుపులో వారసుడు బ్రిటానికస్ పెరుగుతున్నారు.
"అందుకే మెస్సాలినా, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాన్ని కాపాడుకోవడం కోసం చేయాల్సిదంతా చేయడం మొదలుపెట్టారు. ఆమె పాలన కాలం అంతటా ఆమె అలాగే కొనసాగారు’’ అని మార్టిన్ తెలిపారు.
మధ్యధరా ప్రాంతంలో ఆమె దాదాపు ఒక దశాబ్దం పాటు అత్యంత శక్తివంతమైన మహిళ.
తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా ఆమె సిద్ధంగా ఉండేవారు.
తన రాజకీయ శత్రువులను తొలగించుకునేందుకు చేసిన రాజకీయ కుట్రల్లో కూడా ఆమె భాగమయ్యారు
ఏడీ 48 వరకు ఆమె తన పనుల్లో విజయవంతమయ్యారు. తర్వాత నాటకీయ రీతిలో ఆమె హత్యకు గురయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
జ్ఞాపకాల చెరిపివేత
ఆమె మరణానంతరం ఆమె గుర్తులను చెరిపేసే పని మొదలైంది. ఆమెను గుర్తుకు తెచ్చే ప్రతీ జ్ఞాపకాన్ని చెరిపేశారు. ఆమె విగ్రహాలను ధ్వంసం చేశారు. శాసనాల నుంచి ఆమె పేరును కూడా తొలగించారు.
తరువాతి దశాబ్దాలలో, అధికారిక చరిత్రలో ఆ గ్యాప్ పుకార్లతో నిండిపోయింది. ఆ పుకార్లన్నీ కలిసి ఆమెకు విపరీత లైంగికాసక్తి అనే ఇమేజ్‌ను కట్టబెట్టాయి.
నల్లటి జట్టు, చక్కటి హిప్స్, నవ్వుతో ఏ మగాడినైనా ప్రేమలో పడేసే అందమైన మహిళగా ఆమె గురించి వర్ణించారు. అనేక రచనలకు ఆమె కథానాయిక అయ్యారు. డెసిమో జునియో జువెనల్ అనే కవి తన రచనల్లో ఆమెను ‘‘సామ్రాజ్య వేశ్య’’ అని అభివర్ణించారు.
‘‘తన భర్త నిద్రపోయిన వెంటనే ఆమె వ్యభిచార గృహాలకు వెళ్లేవారు. ఎవరూ గుర్తు పట్టకుండా విగ్గును ధరించి బయటకు వెళ్లేవారు. వేశ్యాగృహాల్లో క్లయింట్‌లతో ఆమె నగ్నంగా పడుకునేవారు’’ అని ఆమె గురించి పుస్తకాల్లో వివరంగా రాశారు.
శతాబ్దాలుగా, ఆమెకు ఉన్న లైంగిక ఆసక్తి సినిమాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంది.
పురాతన రోమ్ చరిత్రకారుల చేతుల్లో వక్రీకరణకు గురైన మహిళ ఒక్క మెస్సాలినా మాత్రమే కాదు. కానీ, మెస్సాలినా తరహాలో ఇతరులు ఇంత కీర్తిని గడించలేదని చరిత్రకారులు అంటారు. ఆమె చాలా అసాధారణ మహిళ అని వారు పుస్తకాల్లో పేర్కొన్నారు.
‘‘శృంగార కోణంలో ఆమె అతి చెడ్డ మహిళగా మారింది. కానీ, ఇక్కడొక విషయాన్ని గుర్తించడం ముఖ్యం. రోమ్‌లోని శక్తిమంతమైన మహిళలపై అపవాదు వేయాలంటే శృంగారం ఒక్కటే మార్గం కాదు. ఇతర మార్గాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు, మెస్సాలినా వారసురాలు అగ్రిప్పినాను కూడా చాలా ప్రమాదకరమైన, చెడ్డ మహిళగా చిత్రీకరించారు. కానీ, మెస్సాలినాకు పూర్తిగా భిన్న మార్గంలో ఆమెను చెడుగా చిత్రీకరించారు.’’

ఫొటో సోర్స్, Getty Images
విచిత్రమైన ముగింపు
కానీ, మెస్సాలినా గురించి చెప్పినవన్నీ అబద్ధం కాదు.
రోమన్ చరిత్రకారులు మెస్సాలినాను అనియంత్రిత శృంగారానికి మారుపేరుగా చిత్రీకరించారు. ఇదంతా అబద్ధం అని చెప్పడానికి కూడా లేదు.
జువెనల్ వర్ణించినటువంటి విపరీతమైన పుకార్లతో పాటు, మరింత ఆమోదకరమైన ఇతర కారణాలు కూడా దీన్ని సూచిస్తున్నాయని కార్గిల్-మార్టిన్ చెప్పారు.
రోమ్‌లోని అత్యంత అందమైన అరిస్టోక్రాట్‌గా గుర్తింపు ఉన్న గైయస్ సిలియస్‌తో పాటు, ఆ కాలంలోని అతిపెద్ద రంగస్థల నటుడు మెస్టర్‌తో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కార్గిల్ మార్టిన్ నిర్ధారించారు.
48వ సంవత్సరం చివరిలో ఒక నాటకీయ ఘటన జరిగింది. అది మెస్సాలినా చావుతో ముగుస్తుంది.
" తీరప్రాంత నగరమైన ఓస్టియాకు క్లాడియస్ వెళ్లారు. ఆ సమయంలో మెస్సాలినా, గైయస్ సిలియస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. క్లాడియస్ లేని సమయంలో పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆపై తిరుగుబాటు చేసి రోమ్ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు" అని అనేక నివేదికల్లో రాశారు.
ఈ ఆశ్చర్యకరమైన ఎపిసోడ్‌ను టాసిటస్ వంటి అనేక మంది రోమన్ చరిత్రకారులు వివరించారు.

ఒక రోజున, సాక్షుల సమక్షంలో వివాహం కోసం వారిద్దరూ కలుస్తారు. వారిద్దరూ అతిథులతో భోజనం చేసి వివాహ తంతును ముగిస్తారు. తర్వాత రాత్రి కలిసి గడుపుతారు.
" నేను ఇందులో ఎలాంటి కల్పిత కథను జోడించలేదు. నా పూర్వీకుల నుంచి రాతపూర్వంగా, మౌఖికంగా విన్న వాటినే నేను రికార్డు చేశాను’’ అని నివేదికల్లో ఉంది.
ఊహించినట్లుగానే, రోమ్‌కు తిరిగి వచ్చిన క్లాడియస్‌కి ఈ విషయం తెలుస్తుంది.
మెస్సాలినా మాజీ మిత్రుడు, చక్రవర్తి సలహాదారు నార్సిసో ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తీసుకుంటారు.
కొన్ని గంటల వ్యవధిలో సిలియస్, మెస్టర్‌లతో పాటు మెస్సాలినా ప్రేమికులు అయిన మరో 8 మందిని అరెస్ట్ చేసి విచారించి ఉరి తీశారు.
మెస్సాలినా తన భర్తతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు నార్సిసో ఆమెను అడ్డుకున్నారు.
తన భార్య విచారణను మరుసటి రోజు జరపాలని క్లాడియస్ ఆదేశించారు. మళ్లీ ఆమెతో ప్రేమలో పడి ఆమెను క్షమించేస్తాడనే భయంతో సీజర్ ఆమెను చంపడానికి మనుషులను పంపాడు.
రోమ్‌లోని తన తోటల్లో రెఫ్యూజీగా ఉన్న మెస్సాలినా తాను బయటపడే మార్గం లేదని గుర్తించారు. తనను చంపడానికి వచ్చిన వారిని చూసి తొలుత ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ, అక్కడికి వెళ్లిన వారిలో ఒకరు కత్తితో ఆమె ఛాతీపై వేటు వేయడంతో ఆమె మరణించారు.
మెస్సాలినా హత్యకు గురైన వార్త క్లాడియస్‌కి తెలిసింది. అయితే, ఆయన ఆ హత్య గురించి ఎలాంటి వివరణ కోరలేదు. వార్త విన్న తర్వాత ఆయన మరో గ్లాసు వైన్ కావాలని అడిగారు.
ఇవి కూడా చదవండి:
- బాపట్ల టెన్త్ విద్యార్థి మర్డర్ కేసు: ట్యూషన్‌కు వెళ్లి సజీవ దహనమయ్యాడు, ఈ హత్యకు అసలు కారణాలు ఏంటి?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














