ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘నేను బెంగళూరులోని శివాజీనగర నుంచి జయనగరకు వెళ్తున్నాను. బస్సులో వెళ్తే 20 రూపాయలే. కానీ, చాలా ముఖ్యమైన పనిపై వెళ్తున్నాను. తొందరగా వెళ్లేందుకు క్యాబ్ తీసుకోవాలని భావించాను. బస్సు చార్జీకి 15 రెట్లు ఎక్కువగా క్యాబ్‌లో రూ.360 చూపించింది. అయినా, త్వరగా వెళ్లాల్సి రావడంతో ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధపడ్డాను. కానీ, ఎన్నిసార్లు బుక్ చేసినా పదేపదే క్యాబ్స్ క్యాన్సిల్ చేశారు. చాలా సమయం వృథా అయింది. చివరకు ఆర్‌టీసీ బస్సులోనే అక్కడకు చేరుకున్నాను’’ అని శ్రీనివాస్ అలవిల్లి చెప్పారు.
చివరి నిమిషంలో డ్రైవర్లు క్యాబ్‌లను క్యాన్సిల్ చేయడంతో ఇలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలా మందే ఉంటారు.
తాజాగా హైదరాబాద్‌లోనూ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో రైడ్‌లను డ్రైవర్లు తీసుకోవడం లేదు. చార్జీలను పెంచాలనే డిమాండ్‌తో ఐదు రోజుల నుంచీ వారు నిరసన తెలుపుతున్నారు.
ఇంతకీ క్యాబ్‌లను డ్రైవర్లు రైడ్స్‌ను ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? ఇలా చేసినప్పుడు ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే’’
బుక్ అయిన రైడ్‌ను క్యాన్సిల్ చేసేలా వినియోగదారులపై ఒత్తిడి చేయడం అనేది ‘అన్‌ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్’, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని నిరుడు మే నెలలో సెంట్రల్ కన్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లైన ఓలా, ఉబర్‌లకు సీసీపీఏ నోటీసులు జారీచేసింది.
‘‘మేం ఓలా, ఉబర్.. రెండు సంస్థలకూ నోటీసులు జారీచేశాం. ఈ సంస్థలపై నిరుడు చాలా ఫిర్యాదులు వచ్చాయి. అందుకే వీటిపై స్పందించాలని నోటీసులు ఇచ్చాం’’ అని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు.
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) డేటా ప్రకారం, 1 ఏప్రిల్, 2021 నుంచి 1 మే, 2022 మధ్య ఓలాపై 2,482, ఉబర్‌పై 770 ఫిర్యాదులు వచ్చాయి.
భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సేవలను మెరుగుపరచాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ క్యాబ్ అగ్రిగేటర్లను హెచ్చరించింది. దీనిపై ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో లాంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇటీవల సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సిలేషన్ పాలసీతోపాటు బుకింగ్ తర్వాత క్యాబ్‌లు క్యాన్సిల్ చేసేలా డ్రైవర్లు ఒత్తిడి చేయడం, కస్టమర్ సర్వీసు విభాగాలు సరిగా స్పందించకపోవడం, క్యాష్‌లో మాత్రమే డబ్బులు చెల్లించాలని డ్రైవర్లు డిమాండ్ చేయడం, చార్జీపై అదనంగా డబ్బులు అడగడం తదితర సమస్యలపై కస్టమర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.
వీటిలో క్యాబ్‌లు క్యాన్సిల్ చేసేలా డ్రైవర్లు ఒత్తిడి చేయడం అనే సమస్య ప్రధాన మైనది. ఎందుకంటే వినియోగదారులే క్యాబ్‌లు క్యాన్సిల్ చేస్తే వారు దీనిపై రుసుము (క్యాన్సిలేషన్ లెవీ) కూడా చెల్లించాల్సి ఉంటుంది.
వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు లేదా వారు వెళ్లాలని అనుకునే గమ్యస్థానం తమకు నచ్చనప్పుడు లేదా ఆ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండేటప్పుడు తరచూ క్యాన్సిల్ చేయాలని కస్టమర్లకు డ్రైవర్లు సూచిస్తుంటారు. అగ్రిగేటర్లు చర్యలు తీసుకుంటాయనే భయంతో వారు మాత్రం చాలావరకు రైడ్‌లను క్యాన్సల్ చేయరు. దీనికి బదులుగా మీరే క్యాన్సిల్ చేయాలని కస్టమర్లపై ఒత్తిడి చేస్తారు. ఒక్కోసారి పికప్‌కు చాలా ఆలస్యంగా వస్తుంటారు.
‘‘ఈ క్యాన్సిలేషన్ లెవీ అనేది రైడ్ బుక్ చేస్తున్నప్పుడు యాప్‌లలో ప్రధానంగా కనిపించడం లేదు. డ్రైవర్లు రాకుండా ఇబ్బంది పెడుతూ, రైడ్ క్యాన్సిల్ చేయాలని ఒత్తిడి చేసినప్పుడు కూడా ఈ చార్జీలను వినియోగదారులే భరించాల్సి వస్తుంది’’ అని సీసీపీఏ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సిలేషన్ లేకుండా ‘‘ప్రైమ్ ప్లస్’’
క్యాన్సిలేషన్‌తోపాటు ఇతర సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ‘‘ప్రైమ్ ప్లస్’’ పేరుతో కొత్త సేవలను తీసుకువస్తున్నట్లు ఓలా కో-ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ మే 28న వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ సేవలను ప్రస్తుతం బెంగళూరులో టెస్ట్ చేస్తున్నారు. ‘‘బెస్ట్ డ్రైవర్లతోపాటు, ఎలాంటి క్యాన్సిలేషన్లు లేకుండా ఈ సర్వీసులను తీసుకొస్తున్నాం’’ అని భవీశ్ చెప్పారు.
ఆయన షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో బెంగళూరులోని గ్రీన్ సిటీ సూపర్ మార్కెట్, హెచ్ఏఎల్ మెయిన్ రోడ్‌ల మధ్య చార్జీ రూ.455గా కనిపిస్తోంది.
అయితే, సాధారణ ఓలా క్యాబ్‌లో మినీ సర్వీసు తీసుకున్నప్పుడు ఇది రూ.535గా చూపిస్తోంది. ఓలా క్యాబ్‌లలో మినీకి కాస్త ధర వసూలు చేస్తారు.
అయితే, ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్నందుకే తక్కువ ధర చూపిస్తున్నారని, సేవలను ప్రారంభించినప్పుడు ప్రైమ్ కంటే ఇది ఎక్కువే ఉండొచ్చని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, NURPHOTO
మరోవైపు ఉబర్ కూడా రైడ్‌ను తీసుకునే ముందే కస్టమర్ ఏ రూపంలో డబ్బులు చెల్లిస్తారో డ్రైవర్‌కు తెలిసేలా కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నట్లు తమ బ్లాగ్ పోస్టులో తెలిపింది. ప్రస్తుతం 20కిపైగా నగరాల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా నగరాల్లోనూ త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉబర్ పేర్కొంది.
‘‘కావాలంటే క్యాష్‌లో చెల్లించే కస్టమర్లనే డ్రైవర్లు ముందుగానే ఎంచుకొనే అవకాశం ఉంటుంది. దీంతో క్యాన్సిలేషన్లు తగ్గుతాయి’’ అని పేర్కొంది.
డిజిటల్ పేమెంట్ చేసే కష్టమర్ల విషయంలోనూ వేగంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉబర్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీశ్ భూషణ్ ఆ పోస్టులో వివరించారు.
మరోవైపు కస్టమర్లు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారో ముందుగానే డ్రైవర్లకు తెలిసేలా ఉబర్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొస్తుంది. దీని ఆధారంగా డ్రైవర్లు అక్కడికి వెళ్లాలో వద్దో ముందే నిర్ణయించుకోవచ్చు. దీంతో క్యాన్సిలేషన్లు తగ్గే అవకాశం ఉంటుంది.
రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
డ్రైవర్లే రైడ్‌లను క్యాన్సిల్ చేసినా లేదా పికప్‌కు రాకపోయినా మనం ఏం చేయొచ్చనే విషయంపై హైదరాబాద్ ఇన్‌స్పెక్టర్ అడ్మిన్ కేపీవీ రాజు మాట్లాడారు.
‘‘ఇక్కడ మనం క్యాబ్ క్యాన్సిల్ చేయకూడదు. డ్రైవర్లు క్యాబ్ పిక్ చేసుకోవడానికి రాకపోయినా లేదా వారే రైడ్ క్యాన్సిల్ చేసినా.. యాప్‌లో ఆ క్యాబ్ నంబరు కనపడేలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అనంతరం డేట్, టైమ్, లొకేషన్ తదితర వివరాలతో సిటీ ట్రాఫిక్ పోలీసులకు ట్విటర్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఆ క్యాబ్ క్యాన్సిలేషన్ స్క్రీన్ షాట్‌ను కూడా ట్రాఫిక్ పోలీసులకు ఇవ్వాలి’’ అని ఆయన చెప్పారు.
‘‘మోటార్ వెహికల్స్ యాక్ట్-1988లోని సెక్షన్ 178 ప్రకారం, ప్రభుత్వ బస్సులు ఇలా రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే రూ.500 జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు క్యాబ్స్ అయితే, ఇది రూ.200. ఆ క్యాబ్ యజమాని నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు’’ అని ఆయన తెలిపారు.
‘‘ఇక్కడ సమస్య కాస్త సంక్లిష్టమైనది. ఒక క్యాబ్ డ్రైవర్‌కు సాయంత్రంలోగా అగ్రిగేటర్ నుంచి ఆ రోజు రైడ్‌ల డబ్బులు జమ కాకపోతే అతడికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందుకే అతడికి డబ్బులు ఆ రోజు చివరిలోగా వచ్చేలా అగ్రిగేటర్లు చర్యలు తీసుకోవాలి. ఫలితంగా డిజిటల్ పేమెంట్ చేస్తామని కస్టమర్లు చెప్పినప్పుడు రైడ్‌లు క్యాన్సిల్ చేసే సమస్య తప్పుతుంది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చే గువేరా జయంతి: భారత్ సందర్శించిన తర్వాత ఆయన తన నివేదికలో ఏం రాశారు?
- అమృత్సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?
- చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?
- సౌదీతో చైనా ఒప్పందాలు చేసుకుంటే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది?
- మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















