ఊబర్ 'ఈట్స్‌'.. జొమాటోకు విక్రయం

ఊబర్ ఈట్స్

ఫొటో సోర్స్, Getty Images

ఊబర్ భారతదేశంలోని తన ఫుడ్ డెలివరీ సర్వీస్ 'ఊబర్ ఈట్స్'ను స్థానిక ప్రత్యర్థి సంస్థ జొమాటోకు విక్రయించినట్లు ఆ రెండు సంస్థలూ ప్రకటించాయి.

భారతీయ స్టార్టప్ సంస్థ అయిన జొమాటోలో ఊబర్‌కు 9.99 శాతం వాటా లభిస్తుంది. తద్వారా ఈ రంగంలో ఊబర్ ఉనికి కొనసాగుతుంది.

భారతదేశంలో ఊబర్ ఈట్స్ వినియోగదారులందరినీ ఇప్పుడు జొమాటోకు బదలాయిస్తారు. అయితే.. ఈ విక్రయం వల్ల ఊబర్ ఈట్స్‌లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

Presentational grey line
News image
Presentational grey line

ఈ ఒప్పందంతో వేగంగా విస్తరిస్తున్న, తీవ్ర పోటీ ఉన్న ఫుడ్ డెలివరీ రంగంలో.. జొమాటోకి తన ప్రత్యర్థి స్విగ్గీ మీద పైచేయి లభించే అవకాశం ఉంది.

జొమాటో భారతదేశంలో 500కు పైగా నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. ఊబర్ ఈట్స్ కొనుగోలుతో తన ఉనికి మరింత పటిష్టమవుతుందని జొమాటో భావిస్తోంది.

''భారతదేశ వ్యాప్తంగా అగ్రస్థాయి వ్యాపారాన్ని సృష్టించినందుకు, రెస్టారెంట్లను గుర్తించటంలో ముందంజలో ఉన్నందుకు మేం గర్విస్తున్నాం. ఈ రంగంలో మా స్థానాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది'' అని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపీందర్ గోయల్ పేర్కొన్నారు.

ఊబర్ ఈట్స్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో ఫుడ్ డెలివరీ రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తామనే హామీతో ఊబర్ ఈట్స్ 2017లో మొదలైంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ.. అప్పటి నుంచీ తన వినియోగదారుల పునాదిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే జొమాటో, స్విగ్గీల నుంచి బలమైన పొటీ ఎదుర్కొంది.

భారత మార్కెట్ మీద స్విగ్గీ, జొమాటోలకు మెరుగైన పట్టు ఉందని కేర్ రేటింగ్స్ సంస్థ విశ్లేషకురాలు దర్శిని కాన్సారా చెప్పారు.

''ఊబర్ ఈట్స్‌కు 'ప్రపంచ అనుభవం' ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందిన మార్కెట్ కన్నా భారత మార్కెట్ ధరలు, వ్యూహాలు వంటి అంశాల్లో.. చాలా భిన్నమైనది. ఇక కస్టమర్లు ఫొటోలు పోస్ట్ చేయటానికి, ఆహార పదార్థాల మీద తమ సమీక్షలు రాయటానికి వీలుకల్పించే ఇంటరాక్టివ్ యాప్‌లు.. రెస్టారెంట్లతో ఒప్పందాలు చేసుకోవటం వంటి ఇతర అంశాలు జొమాటో, స్విగ్గీలకు పై చేయి లభించటానికి తోడ్పడ్డాయి'' అని ఆమె విశ్లేషించారు.

భారతదేశం తమ ప్రాధాన్యతగా కొనసాగుతుందని ఊబర్ చెప్పింది.

''ఊబర్‌కు భారతదేశం ఒక విశిష్టమైన ముఖ్యమైన మార్కెట్‌గానే ఉంటుంది. పెరుగుతున్న స్థానిక ప్రయాణ వ్యాపారంలో మేం పెట్టుబడులు పెట్టటం కొనసాగిస్తాం'' అని ఊబర్ సీఈఓ డారా ఖోస్రోషాహి పేర్కొన్నారు.

ఈ ఒప్పందం వల్ల జొమాటో, స్విగ్గీల మధ్య పోటీ మరింత పెరుగుతుందని పరిశీలకులు చెప్తున్నారు.

line
జొమాటో

ఫొటో సోర్స్, Getty Images

భారత ఫుడ్ డెలివరీ మార్కెట్ కోసం పోరాటం

సురంజన తివారి, బీబీసీ న్యూస్, ముంబై

భారతదేశంలో రోజువారీ జీవనంలో ఫుడ్ డెలివరీ సర్వీసులు అంతర్భాగంగా మారాయి. కొర్పొరేట్ ప్రొఫెషనల్స్ ప్రతి రోజూ తాము పనిచేసే చోటుకు మధ్యాహ్న భోజనం డెలివరీ చేయటానికి ఫుడ్ డెలివరీ సంస్థల మీద ఆధారపడుతున్నారు. ఫలితంగా రెస్టారెంట్లు, కిచెన్‌లు తమ వినియోగదారుల విస్తృతిని గణనీయంగా పెంచుకోగలిగాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమకు ఇష్టమైన ఆహారం ప్రతి రోజూ తమ ఇంటికే తెప్పించుకోవటానికి అలవాటుపడ్డారు.

భారీ జనాభా ఉన్న దేశంలో ఇప్పటికే పటిష్టంగా ఉన్న కాబ్ అగ్రిగేటర్ సర్వీసు గల ఊబర్.. ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో ప్రవేశించటం పెద్ద కష్టమైన పని కాదు.

కానీ.. గత మే నెలలో పబ్లక్ ఇష్యూకు వెళ్లినప్పటి నుంచీ ఈ మాతృ సంస్థ మీద నష్టాల్లో ఉన్న వ్యాపారాలను తగ్గించుకోవాల్సిన ఒత్తిడి పెరిగింది. ఊబర్ ఈట్స్ నష్టాల్లో ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో రష్యా, చైనా, ఆగ్నేయాసియాల్లో పలు వ్యాపారాల నుంచి వైదొలగిన ఊబర్ తాజాగా భారతదేశంలో ఫుడ్ డెలివరీ రంగం నుంచి తప్పుకుంది.

మరైతే భారత మార్కెట్‌లో ఇంత పోటీ ఎందుకుంది?

భారతదేశంలో ఇప్పటికే వందలాది నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న జొమాటో, స్విగ్గీ వంటి దేశీయ యాప్‌లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. వాటికి విస్తారంగా రెస్టారెంట్లు భాగస్వాములుగా ఉండటంతో బలమైన వినియోగదారుల పునాదిని నిర్మించుకున్నాయి. అయితే.. ఈ సంస్థలకు భారతీయులు ఎక్కువగా ఆకర్షితమవటానికి వాస్తవమైన కారణం.. అవి అందించే భారీ రాయితీలు. భారత వినియోగదారులకు ఇది తప్పనిసరి. జొమాటో తన ఆఫర్ల విషయంలో చాలా వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతానికైతే.. అది ఈ స్టార్టప్‌కు కొంత పైచేయి అందించినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌ కోసం పోరాటం.. ప్రధానంగా రెండు సంస్థలు - అలీబాబా మద్దతున్న జొమాటో - మరో చైనీస్ దిగ్గజం టెన్సెంట్ మద్దతున్న స్వీగ్గీల మధ్యే ఉంటుందని చెప్పొచ్చు.

అలాగని ఊబర్ పూర్తిగా కోల్పోలేదు. జొమాటోలో తన వాటా ఉంచుకోవటం ద్వారా - నష్టపోతున్న ప్రత్యర్థిగా కాకుండా.. మద్దతుదారుగా ఉండటం ద్వారా - ఈ భారతీయ సంస్థ అందుకుంటున్న విజయాన్ని ఊబర్ కూడా ఆస్వాదిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)