అమృత్‌సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?

అమృత్‌సర్

ఫొటో సోర్స్, f9photos/Getty Images

    • రచయిత, సృష్టి చౌధరీ, రాఫేల్ రీచెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమృత్‌సర్ పేరు చెప్పగానే మొదట అందరికీ స్వర్ణ దేవాలయమే గుర్తుకు వస్తుంది. ఇదొక్కటే కాదు, అమృత్‌సర్‌ అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది.

ఈ నగరానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పసందైన వంటకాలకు పేరు పొందింది. అలాగే సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం గోల్డెన్ టెంపుల్ (స్వర్ణ దేవాలయం) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవన్నీ ఉన్నప్పటికీ, ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలిపే మరో అంశం ఇక్కడ ఉంది.

అదేంటంటే దాతృత్వం. దేవాలయాల నుంచి వీధుల్లోని ప్రజల వరకు ప్రతిచోటా దాతృత్వం కనిపిస్తుంది.

అమృత్‌సర్‌ను 16వ శతాబ్దంలో సిక్కు గురువు స్థాపించారు. సిక్కు మతం ఉద్భవించిన పంజాబ్‌ రాష్ట్రంలో అమృత్‌సర్ ఉంది. ఈ నగర జనాభా 20 లక్షలు.

సిక్కు మతం ‘సేవ’కు ప్రసిద్ధి పొందింది. బదులు ఏమీ ఆశించకుండా సిక్కులు స్వచ్ఛందంగా ఇతరుల కోసం సేవ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు గురుద్వారాల్లో సేవ చేస్తారు. చాలా చిన్న చిన్న పనుల్ని వారు స్వచ్ఛందంగా భుజాలకెత్తుకుంటారు.

అమృత్‌సర్

ఫొటో సోర్స్, Raphael Reichel

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా ఉండే సిక్కులు గురుద్వారాల్లో సేవ చేస్తారు. దేవాలయంలోని కొలనును స్వచ్ఛందంగా శుభ్రం చేస్తారు

నేలను శుభ్రం చేయడం, భోజనాలు వడ్డించడం, గుడిలో క్రమశిక్షణను పాటించేలా చూడటం వంటి పనులను వారు స్వచ్ఛందంగా చేస్తారు.

మరికొందరు వ్యక్తిగతంగా ఇతరులకు దానధర్మాలు చేయడం వంటి కార్యక్రమాలను చేస్తుంటారు.

2021 ఏప్రిల్‌లో దేశాన్ని కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టినప్పుడు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి సిక్కులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య సామగ్రిని రోగులకు అందించే సవాలును స్వీకరించారు.

‘‘సేవ అంటే నిస్వార్థంగా చేసేది. సిక్కు మతంలో సేవ అనేది కేవలం ఒక ప్రభోదం కాదు, రోజూవారీ ఆచరణ’’ అని జస్రీన్ మయాల్ ఖన్నా తన పుస్తకం ‘‘సేవ: సిక్ విస్డమ్ ఫర్ లివింగ్ వెల్ బై డూయింగ్ గుడ్’’లో రాశారు.

‘‘సేవకు మరో పేరు ప్రేమ’’ అని 23 ఏళ్ల అభినందన్ చౌధరీ అన్నారు. 8 ఏళ్ల వయస్సు నుంచే తన కుటుంబంతో కలిసి అభినందన్ సేవ చేస్తున్నారు.

‘‘ప్రతీ ఒక్కరూ చాలా వివేకంతో, నిస్వార్థంగా ఉండాలి. ఎడమ చేత్తో చేసే సేవ గురించి కుడి చేతికి కూడా తెలియకూడదు అనే ఒక సూక్తి ఉంది’’ అని అభినందన్ అన్నారు.

అమృత్‌సర్

ఫొటో సోర్స్, Raphael Reichel

ఫొటో క్యాప్షన్, స్వర్ణ దేవాలయంలోని సామూహిక వంటశాలలో రోజుకు లక్ష మందికి వండుతారు.

వ్యక్తి కేంద్రంగా, పెట్టుబడిదారీ వ్యవస్థగా మారుతున్న ప్రపంచంలో ఇది ఒక తాజా జీవన విధానం.

సిక్కుమతంలోని దాతృత్వ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు.

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఇంగ్లండ్‌లోని ఒక గురుద్వారాకు చెందిన సిక్కు వాలంటీర్లు రోజుకు వేల మందికి సరిపోయే భోజనాన్ని ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బందికి అందించారు.

అమెరికాలోని నగరాల్లో నివసించే సిక్కులు, వేల మంది కోసం ఉచిత భోజనాలు వండిపెట్టారు.

తుపాను బాధిత కెనడా కావొచ్చు లేదా సైక్లోన్‌తో దెబ్బతిన్న న్యూజీలాండ్ కావొచ్చు. ఇలా సంక్షోభం బారిన పడిన, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి అవసరమైన సహాయం చేసేందుకు సిక్కులు తమ పూర్తి శక్తిని సమీకరించారు.

అమృత్‌సర్‌లో ఈ సేవ మరో స్థాయికి చేరింది. అమృత్‌సర్‌లో ఏ వ్యక్తి కూడా ఆకలితో పడుకోవాల్సిన అవసరం లేదని భారత్ అంతటా తెలుసు. ఎందుకంటే, స్వర్ణ దేవాలయంలో ఎల్లప్పుడూ వేడి వేడి భోజనం సిద్ధంగా ఉంటుంది. ఎవరైనా అక్కడ భోజనం చేయొచ్చు.

స్వర్ణ దేవాలయంలోని వంటగది ప్రపంచంలోనే అతిపెద్దది. అక్కడ రోజుకు లక్ష మందికి భోజనాన్ని వండి వార్చుతుంటారు. వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ అందరికీ భోజనాన్ని అందుబాటులో ఉంచుతారు. ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ అవసరమైనంత ఆహారాన్ని అందిస్తారు. ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని ‘లంగర్’గా పిలుస్తారు.

అమృత్‌సర్

ఫొటో సోర్స్, Raphael Reichel

ఫొటో క్యాప్షన్, పదహారో శతాబ్దంలో సిక్కు గురువు అమృత్‌సర్‌ను స్థాపించారు

న్యూయార్క్‌కు చెందిన మిషెలిన్-స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో భారత్‌లో లక్షల మందికి భోజనాలు పంపిణీ చేశారు.

‘‘నేను అమృత్‌సర్‌లో పుట్టి పెరిగాను. మాకు అక్కడ భారీ కమ్యూనిటీ కిచెన్ ఉంటుంది. అక్కడ అందరికీ ఆహారం దొరుకుతుంది. సిటీ మొత్తం అక్కడ తినొచ్చు’’ అని వికాస్ ఖన్నా చెప్పారు.

అన్ని గురుద్వారాల తరహాలోనే స్వర్ణ దేవాలయంలో కూడా వాలంటీర్లు క్రమశిక్షణతో నడుచుకుంటారు. ఈ వాలంటీర్లు రుచికరమైన భోజనాన్ని అక్కడికి వచ్చిన అందరికీ అందిస్తారు.

పప్పు, చపాతీ, శెనగల కూర, పెరుగుతో కూడిన ఆహారాన్ని స్టీల్ ప్లేట్లలో రోజంతా అందరికీ వడ్డిస్తారు.

భారీ హాళ్లలో ప్రజలంతా నేలపై కూర్చొని లంగర్‌లో భోజనం చేస్తారు. ఇక్కడ పురుషులు, మహిళలు, ముసలి, యువత, ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ అలాగే కూర్చొని తింటారు.

కొంత మంది మరింత ఆహారం కావాలని అడుగుతారు. మరికొందరు ప్లేటులో పెట్టిందంతా తిని త్వరగా లేచి వెళ్లిపోతారు.

తర్వాత వాలంటీర్లు ప్రతీ 15 నిమిషాలకు ఒకసారి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి తదుపరి రౌండ్ భోజనాల కోసం సిద్ధం చేస్తారు. తినడం, వడ్డించడం అనేది అక్కడ అంతులేని ప్రక్రియ.

అమృత్‌సర్

ఫొటో సోర్స్, Alison Wright/Getty Images

దేవాలయం నుంచి వీధుల్లోని ప్రజల వరకు అమృత్‌సర్‌లో అందరూ స్నేహంగా, దాతృత్వం, సహాయకారులుగా కనిపిస్తారు.

మేం అమృత్‌సర్‌కు వెళ్లినప్పుడు మమ్మల్ని అక్కడివారు చిరునవ్వుతో పలకరించారు. మనం కాస్త గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తే చాలు, ఏదైనా సహాయం కావాలా అంటూ వారు ముందుకొస్తారు.

రాత్రి పూట వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఆ దారి గుండా వెళ్లే వారంతా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మీ బ్యాగుల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెబుతూ వెళ్లారు.

‘కేసర్ ద దాబా’ అనే ప్రముఖ దుకాణం వద్దకు మేం చేరుకునేటప్పటికి అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. మాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వడం కోసం అక్కడ టేబుల్‌లో కూర్చున్న వారంతా ఇరుక్కొని కూర్చున్నారు. తినేటప్పుడు ఒకరి మోచేతులు మరొకరికి తగిలేంత దగ్గరగా వారు సర్దుకున్నారు.

ఎక్కడ చూసినా మమ్మల్ని స్వాగతిస్తున్నట్లుగానే అనిపించింది. అపరిచితుల మొహంపై చిరునవ్వు, స్నేహపూర్వక చూపు కనిపిస్తే చాలు అక్కడివారు టీ తాగడానికి ఆహ్వానిస్తారు. వారి జీవితాల గురించి ముచ్చటిస్తారు.

‘‘అమృత్‌సర్‌లో పెరిగినప్పుడు, ఒక పెద్ద సమాజంలో జీవిస్తున్నామనే భావన ఉండేది’’ అని అక్కడే పుట్టిపెరిగిన రహత్ శర్మ చెప్పారు.

‘‘నేను స్వర్ణ దేవాలయంలో దాగుడు మూతలు ఆడుకుంటూ పెరిగాను. అక్కడ మేమందరం సేవలో పాల్గొన్నాం. అక్కడ ప్రధాన మతస్థులైన హిందువులు, ముస్లింలు కలసిమెలిసి ఉంటారు. రాజకీయంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకరికోసం ఒకరు ఆలోచిస్తారు’’ అని రహత్ వివరించారు.

అమృత్‌సర్‌ వీధుల్లో లభించే కుల్చా (రోటీ), చోలే (శెనగల కూర), సంప్రదాయక మట్టి పాత్రల్లో ఇచ్చే ఫిర్నీ (రైస్ పుడ్డింగ్), బటర్‌మిల్క్ వంటి ఆహార పదార్థాలను చూసి దేశవ్యాప్తంగా భోజనప్రియులు అసూయపడుతుంటారు.

సందడిగా ఉండే బజార్లతో నిండి ఉండే ఇరుకైన వీధులు, కూడళ్లు కాలక్రమంలో కనిపించకుండా పోయినట్లు అనిపిస్తుంది.

అమృత్‌సర్

పంజాబ్‌లో రెండో అతిపెద్ద నగరమైన అమృత్‌సర్, బ్రిటిష్ వలస పాలనలో తరచుగా నిరసనలు, సమావేశాలకు కేంద్రంగా ఉండేది.

ఇలాంటి ఒక కార్యక్రమమే 1919లో క్రూరమైన ఘటనగా మారింది.

శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై కాల్పులు జరపాలని ఒక బ్రిటిష్ జనరల్ ఆదేశాలు ఇవ్వడంతో అది కాస్తా ఊచకోతగా మారింది. ఈ ఘటననే జలియన్ వాలాబాగ్ మారణకాండగా పిలుస్తారు. ఈ ఊచకోతలో దాదాపు 1,500 మంది చనిపోయారు.

ఇదే కాకుండా, బ్రిటిషర్లు 1947లో భారత్‌ను వదిలిపెట్టినప్పుడు చెలరేగిన హింస కారణంగా కూడా ఈ నగరమే భారీగా ప్రభావితం అయింది. ఎందుకంటే కొత్తగా గీసిన సరిహద్దుకు పక్కనే అమృత్‌సర్ ఉండటమే దీనికి కారణం. ఈ చరిత్ర కారణంగానే దేశ తొలి, ఏకైక ‘‘పార్టీషన్ మ్యూజియం’’ను 2017లో అమృత్‌సర్‌లో ఏర్పాటు చేశారు.

1984లో అమృత్‌సర్ మరోసారి విషాద ఘటనలకు వేదికగా మారింది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు వేర్పాటువాదులను ఏరేయడానికి సైనిక బలగాలు గోల్డెన్ టెంపుల్‌పై దాడి చేశాయి.

‘ఆపరేషన్ బ్లూ స్టార్’ తర్వాత ఇందిర హత్యకు దారితీసింది.

స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య జరిగిన కొన్ని నెలల తర్వాత ఇందిరను ఆమె భద్రతా సిబ్బందిలోని ఇద్దరు సిక్కులు హత్య చేశారు.

ఆ తర్వాతి రోజుల్లో ఇది దేశం అంతటా వేల మంది అమాయక సిక్కుల ఊచకోతకు దారితీసింది.

ఇందిరాగాంధీ అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఘటనల తాలూకూ జ్ఞాపకాలను భద్రపరచడం సిక్కులకు చాలా ముఖ్యం. వారి సాంస్కృతిక జ్ఞాపకాల్లోనూ సిక్కు అమరవీరుల కథలు అధిక భాగంగా ఉంటాయి. ప్రార్థనల్లో కూడా వీటిని చదువుతారు.

‘‘అయితే, ఈ కథలు ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి ఉద్దేశించినవి కావు. దీనికి విరుద్ధంగా, రక్షకులుగా వ్యవహరించే మా వారసత్వం గురించి ఇవి చెబుతాయి’’ అని ఖన్నా రాసుకొచ్చారు.

ఎన్నో సామూహిక బాధలను చవిచూసిన సిక్కు కమ్యూనిటీ ఇప్పటికీ అందరినీ దరిచేర్చుకుంటూ, సేవలు చేస్తుండటం అభినందనీయం.

ఈ లక్షణాలు సిక్కుల్లో అంతర్భాగంగా ఉంటాయని ఖన్నా అంటారు.

‘‘సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్, సేవను సిక్కుల పాటగా మార్చారు. తమ గురువుల బోధనలు, పనుల ద్వారా స్ఫూర్తి పొందుతూ సిక్కులు తమ జీవితంలో నిస్వార్థాన్ని భాగంగా చేసుకుంటారు’’ అని ఖన్నా అన్నారు.

విశ్వాసాలు, మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ దరిచేర్చుకునే, స్వాగతించే సిక్కుల లక్షణాలు వారి దాతృత్వానికి నిదర్శనాలు.

అమృత్‌సర్‌లో దయ, ప్రేమ, దాతృత్వం అనేవి ఎప్పటికీ నిలిచిపోతాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)