మోర్బీ బ్రిడ్జి: 150 ఏళ్ల ఈ వంతెన చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, Gujarat Tourism
గుజరాత్‌లోని మోర్బీ వద్ద మచ్చు నది మీద ఉన్న తీగల వంతెన ఆదివారం సాయంత్రం తెగి పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 135 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
సుమారు 150 ఏళ్ల నాటి ఈ వంతెన మోర్బీ రాజుల పాలనకు ప్రతీకగా ఉంటూ వస్తోంది. మోర్బీ రాజు సర్ వాఘ్‌జీ ఠాకుర్ ఈ వంతెనను నిర్మించారు. నాడు దీని నిర్మాణంలో యూరోపియన్ టెక్నాలజీ వాడారు.

ఫొటో సోర్స్, BBC/GujaratTourism
1879లో ప్రారంభం
ఆ వంతెనను 1879 ఫిబ్రవరి 20న నాటి బాంబే గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించారు.
- వంతెన నిర్మాణంలో వాడిన మెటీరియల్ అంతా ఇంగ్లండ్ నుంచి తెప్పించారు.
- నాడు వంతెన నిర్మాణానికి రూ.3.5 లక్షలు ఖర్చు అయింది.
- మోర్బీ పట్టణం ప్రారంభంలో ఈ తీగల వంతెన ఉంటుంది. దాన్నొక సాంకేతికత అద్భుతంగా నాడు పిలుచుకునే వారు.
1.25 మీటర్ల వెడల్పు 233 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దరబార్‌గఢ్ ప్యాలెస్ నుంచి రాజనివాసం నజర్‌బాగ్ వరకు ఉంటుంది.

ఫొటో సోర్స్, Sam Panthaky
2001లో వచ్చిన భూకంపం వల్ల ఆ వంతెన బాగా దెబ్బతింది.
బ్రిటిష్ పాలన కాలంలో యూరోపియన్ నిర్మాణ శైలిని చూసి మోర్బీ రాజు వాఘ్‌జీ ముగ్ధుడయ్యాడు. మోర్బీ పట్టణం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. పట్టణంలో యూరోపియన్ శైలి కట్టడాలు చాలానే కనిపిస్తాయి.
మోర్బీని వాఘ్‌జీ ఠాకుర్ 1922 వరకు పాలించారు. పట్టణంలోని ప్రధానమైన 'గ్రీన్ చౌక్'కు వెళ్లాలంటే మూడు ద్వారాలను ఏర్పాటు చేశారు. రాజ్‌పుత్, ఇటలీ నిర్మాణ శైలుల కలయిక ఆ ద్వారాల్లో కనిపిస్తుంది.
మోర్బీ రాజుల 'ప్రగతిశీల, శాస్త్రీయ ద్పకృథానికి' ఆ వంతెన నిదర్శనమని జిల్లా వెబ్‌సైట్ చెబుతోంది.

ఫొటో సోర్స్, BBC/GujaratTourism
నిర్వహణ ఎవరిది?
ప్రస్తుతం తీగల వంతెన నిర్వహణ మోర్బీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్ట్ చేసింది. ఇటీవల మోర్బీ మున్సిపాలిటీ వంతెన నిర్వహణను ఒరేవా గ్రూప్‌కు అప్పగించింది. 15 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.
'చాలా మంది వంతెన మధ్యలో నిలబడి దాన్ని ఊపేందుకు ప్రయత్నించారు. వంతెన పడిపోవడానికి అది కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలింది' అని ఒరేవా గ్రూప్ ప్రతినిధి తెలిపినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వెల్లడించింది.
ఆ వంతెన మరమ్మతులు చేసిన ఒరేవా గ్రూప్, అక్టోబరు 26 నుంచి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. వంతెన తెరుస్తున్న విషయం తమకు చెప్పలేదని మోర్బీ మున్సిపాలిటీ చెబుతోంది.
‘‘కానీ మాకు సమాచారం ఇవ్వకుండానే వారు దాన్ని సందర్శకుల కోసం తెరిచారు. అందువల్ల దాని భద్రతను మేం పరిశీలించ లేక పోయాం’' అని మోర్బీ మున్సిపాలిటీ ముఖ్యఅధికారి సందీప్ సింగ్ ఝాలా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో అన్నారు.
వాచీల నుంచి ఇ-బైక్స్ వరకు ఒరేవా గ్రూప్ తయారు చేస్తోంది. ఆ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఒరేవా గ్రూప్ ప్రపంచంలోనే అతి పెద్ద గోడ గడియారాల తయారీ సంస్థ.
ఇవి కూడా చదవండి:
- జగన్‌పై దాడి కేసు విచారణ ఏమైంది.. ఆ రోజు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది
- సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- కడుపులోనే ఆల్కహాల్ తయారు చేసే వింత సమస్య, కొందరు తాగకుండానే తూగుతారు..దీనికి కారణం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












