ఆటో-బ్రూవరీ సిండ్రోమ్: కడుపులోనే ఆల్కహాల్ తయారు చేసే వింత సమస్య, కొందరు తాగకుండానే తూగుతారు..దీనికి కారణం ఏంటి?

ఫొటో సోర్స్, Edwin Remsberg/Alamy
- రచయిత, రాబర్టా అంఘెలియను
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆటోబ్రూవరీ సిండ్రోమ్.. ఈ వింత వ్యాధి కొంతమంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఈ కండిషన్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకుండానే మత్తులో తూగుతారు. శాస్త్రవేత్తలు దీనికి కారణమేమిటో కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిక్ కార్సన్‌కు వారంలో రెండు, మూడు సార్లు ఇలా జరుగుతుంది.. మాటల తడబడతాయి. కాళ్ల మీద సరిగ్గా నిబడలేకపోతారు. ఏవేవో మాట్లాడుతుంటారు. చివరికి, గాఢ నిద్రలోకి జారుకుంటారు. తాగినవాళ్ల లక్షణాలన్నీ కనిపిస్తాయి. అయితే, కార్సన్ ఒక్క చుక్క కూడా మద్యం తీసుకోకపోయినా ఇవన్నీ జరుగుతాయి.
మత్తు ఎక్కడంతో పాటు, కడుపు నొప్పి, కడుపుబ్బరం, అలసట కూడా ఉంటాయి. దాంతో కార్సన్ తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. స్పృహ కోల్పోతుంటారు.
కార్సన్‌కు 20 ఏళ్ల క్రితం మొదటిసారి ఈ లక్షణాలు కనిపించాయి. ఆయనకు మతిస్థిమితంగా లేదని కుటుంబ సభ్యులు గమనించారు.
"అంతకుముందు ఆయన తాగి మత్తులో తూగడం ఎప్పుడూ చూడలేదు" అని కార్సన్ భార్య కరేన్ చెప్పారు.
"ఏం జరుగుతోందో నాకేం అర్థం కాలేదు. ఒక ఆరేడు గంటల తరువాత తెలివొస్తుంది. మామూలుగా లేస్తాను. అసలేమీ జరగనట్టే ఉంటుంది. అరుదుగా హ్యాంగ్ఓవర్‌లా అనిపిస్తుంటుంది." అన్నారు కార్సన్. మర్నాటికి ఆయనకు ఇవన్నీ లీలగా గుర్తుంటాయి.
64 ఏళ్ల కార్సన్ బ్రిటన్‌లోని సఫోక్‌లో నివసిస్తారు. ఈ మత్తులో తూగడం, ఇతర లక్షణాలు తిన్న తరువాత కనిపిస్తున్నాయని క్రమంగా కార్సన్, ఆయన భార్య గమనించారు. ముఖ్యంగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండే బంగాళదుంపల వంటివి తింటే ఈ లక్షణాలు బయటపడుతున్నాయని కనిపెట్టారు.
చాలామంది డాక్టర్లను, న్యూట్రిషనిస్టులను కలిసిన తరువాత కార్సన్‌ను అరుదైన ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ ఉన్నట్టు తేలింది.

ఫొటో సోర్స్, Nick and Karen Carson
ఏమిటీ ఆటో-బ్రూవరీ సిండ్రోమ్?
ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ఏబీఎస్).. దీన్నే గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ (జీఎఫ్ఎస్) అని కూడా అంటారు. ఇదొక వింతైన వ్యాధి. రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను పెంచుతుంది. ఒక చుక్క కూడా తాగకపోయినా, మద్యం తీసుకున్న లక్షణాలన్నీ కనిపిస్తాయి. బ్రీతింగ్ టెస్టులో ఫెయిల్ అవుతారు. తాగకపోయినా చట్టపరంగా దోషులయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో చెడ్డపేరు రావచ్చు.
ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కచ్చితంగా తెలియకపోవడం వలన దీనిపై వివాదాలు కూడా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చట్టం నుంచి తప్పించుకోవడానికి కూడా దీన్ని వాడుతున్నారు.
"ఇది నిజమైన ఆరోగ్య సమస్య అని, అంతర్గంగా ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) వలన రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని ఇప్పుడు టాక్సికాలజిస్టులు అంగీకరిస్తారని భావిస్తున్నాను" అని ఫిలడెల్ఫియాలోని సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బారీ లోగాన్ అన్నారు.
"సాధారణంగా మనందరికీ కడుపులో కొద్ది మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. అయితే, అది కొలవలేనంత తక్కువ స్థాయిలో ఉంటుంది" అని ఆయన వివరించారు.
సాధారణంగా కడుపులో ఉత్పత్తి అయ్యే ఏ ఫెర్మెంటేషన్ అయినా రక్తంలోకి చేరక ముందే కడుపులోంచి శుభ్రపడుతుంది. దీని ఫస్ట్-పాస్ మెటబాలిజం అంటారు.
"ఎవరికైనా ఏబీఎస్ కండిషన్ ఉంటే ఫస్ట్-పాస్ శుభ్రపరచలేనంత స్థాయిలో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతోందని అర్థం" అని లోగాన్ వివరించారు.
కడుపులో సూక్ష్మజీవుల అసమతుల్యత వలన ఈ కండిషన్ వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని రకాల సూక్ష్మజీవులు మోతాదు కన్నా ఎక్కువగా పెరిగిపోయి, పిండిపదార్థాలను ఆల్కహాల్‌గా మారుస్తాయని అంటున్నారు.
దీనికో మరో వెర్షన్ యూరినరీ ఏబీఎస్ లేదా బ్లాడర్ ఫెర్మెంటేషన్ సిండ్రోం అనే కండిషన్ కూడా ఇటీవల బయటపడింది. మూత్రంలో సూక్ష్మజీవుల అసమతుల్యం వలన ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న రోగులలో ఈ కండిషన్ ఎక్కువగా కనిపించింది.

ఫొటో సోర్స్, Steve Gschmeissner/Science Photo Library/Getty Ima
ఏబీఎస్‌కు దారి తీసే సూక్ష్మజీవుల అసమతుల్యానికి కారణమేంటి?
ఇతరత్రా ఏ ఆరోగ్య సమస్యలూ లేని వ్యక్తులకు ఏబీఎస్ వస్తున్నప్పటికీ, డయాబెటిస్, ఊబకాయం సంబంధిత కాలేయ వ్యాధి, క్రోన్స్ వ్యాధులు ఉన్నవారికి, పేగు ఆపరేషన్లు జరిగినవారికి, చిన్న పేగులో బాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉన్నవారికి ఏబీఎస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఈ సిండ్రోమ్ తొలి కేసులు 1950లలో జపాన్‌లో కనిపించాయి. ప్రత్యేకంగా జపనీస్ జనాభాకు ఈ కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని పరిశోధకులు సూచించారు. కొంతమందిలో కాలేయంలో ఇథనాల్‌ను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది ఒక నిర్దిష్టమైన జన్యు వైవిధ్యం ఉన్నవారిలో ఉండే కండిషన్. జపనీస్‌లో ఈ జన్యు వైవిధ్యం ఉందని కొందరు పరిశోధకులు సూచించారు.
అయితే, 1984లో వచ్చిన రెండు ఏబీఎస్ కేసులను పరిశీలిస్తే, రోగుల జీర్ణవ్యవస్థలో ఉండే ఈస్ట్ ఇందుకు కారణమని తేలింది.
అప్పట్లో హక్కైడో యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఇలాంటి ఒక కేసును గుర్తించారు. ఏ ఆరోగ్య సమస్యలు లేని 24 ఏళ్ల మహిళకు అయిదు నెలల వ్యవధిలో ఏబీఎస్ లక్షణాలు పెరగడం కనిపించిందని, పరీక్షలు చేస్తే ఆమె శ్వాసలో, రక్తంలో అధిక ఇథనాల్ స్థాయిలు కనిపించాయని తెలిపారు. ఆమె జీర్ణాశయంలో క్యాండిడా అల్బికాన్స్ ఈస్ట్ సంఖ్య పెరిగిందని టెస్టుల్లో తేలింది.
ఈ ఈస్ట్ సాధారణంగా మనుషి కడుపులో వృద్ది చెందేదే. కానీ ఆమెలో ఈ ఈస్ట్ పెరుగుదల అసాధరణంగా కనిపించింది.
మరొక మహిళలో కూడా ఇదే ఈస్ట్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆహరంలో తీసుకున్న పిండిపదార్థాలు పులిసి ఆల్కహాల్‌గా మారుతున్నాయని గుర్తించారు.
ఆ ఇద్దరు మహిళలకు యాంటీ ఫంగల్ మందులను అందించి, వారి ఆహారంలో కార్బోహైడ్రేట్‌లను పరిమితం చేసినప్పుడు, ఏబీఎస్ లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి.
అయితే, ఇటీవల వచ్చిన అధ్యయనాల్లో, ఏబీఎస్ రావడానికి పలు కారణాలు ఉన్నాయని తేలింది. జీర్ణశయ పేగులలో, డయాబెటిస్ ఉన్నవారికి మూత్ర నాళంలో కూడా ఆల్కహాల్ ఉత్పత్తి చేసే అనేక శిలీంధ్రాలు, బ్యాక్టీరియా అత్యధిక మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి చేయవచ్చు.
ముఖ్యంగా కాండిడా అల్బికాన్స్, కాండిడా కెఫైర్, కాండిడా గల్బ్రాటా వంటి కాండిడా ఈస్ట్‌లు, వైన్ తయారీలో వాడే సాక్రోరోమైసెస్ సెరెవిసియా ఈస్ట్, క్లెబ్సియెల్లా న్యుమోనియా అనే గట్ బ్యాక్టీరియా కడుపులో అత్యధిక ఆల్కహాల్ ఉత్పత్తికి కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అంతే కాకుండా, జీర్ణశయ సమస్యలతో బాధపడే వారికి కూడా ఏబీఎస్ రావచ్చు. ఈ సమస్యలు ఉన్నవారికి జీర్ణవ్యవస్థలో ఆహారం నిలిచిపోతుంది. దానివల్ల ఆల్కహాల్‌ను అధిక మోతాదులో ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందవచ్చు.
ఆల్కహాల్ అలవాటు లేనివారిలో ఈ లక్షణాలు ఎక్కువ స్థాయిలో కనిపించవచ్చు.
'పిండిపదార్థాలను వీలైనంత తగ్గించడమే చికిత్స'
"ఏబీస్ రోగనిర్ధరణ, చికిత్స గత దశాబ్దంలో గణనీయమైన పురోగతిని సాధించింది" అని టెక్సాస్‌లోని పనోలా కాలేజీలో పరిశోధకురాలు బార్బరా కోర్డెల్ చెప్పారు. ఆమె ఏబీస్‌పై పరిశోధనలు చేస్తున్నారు. లాభాపేక్షలేని సంస్థ 'ఆటో-బ్రూవరీ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్'కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
"ఇతర ఇన్ఫెక్షన్ల లాగానే మోతాదుకు మించిన ఈస్ట్, బ్యాక్టీరియాలు వ్యవస్థను అతలాకుతలం చేస్తాయి. ఏబీఎస్‌కు కారణమవుతాయి" అని ఆమె వివరించారు.
అయితే, దీనికి దీర్ఘకాలం పాటు యాంటీబయొటిక్స్ వాడడం వలన ఏ ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆ మందులు వాడడం ఆపేశాక రోగులలో మళ్లీ ఏబీఎస్ లక్షణాలు పెరిగినట్లు గమనించారు. యాంటీబయోటిక్స్ కూడా కడుపులో సూక్ష్మజీవులను అస్తవ్యస్తం చేయవచ్చు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.
జంక్ ఫుడ్, బాగా ప్రాసెస్ చేసిన అహారాన్ని తీసుకోవడం వలన కూడా ఈ కండిషన్ రావచ్చు. వీటివల్ల కడుపులో సమతుల్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
"దీనికి ప్రధానంగా పిండిపదార్థాలను వీలైనంత తగ్గించడమే చికిత్స" అని కార్డెల్ అంటున్నారు.
"సాధారణంగా కడుపులో ఉండే pH స్థాయిలు 1.5-3.5 మధ్యలో ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం కడుపులోకి చేరగానే pH స్థాయి పెరుగుతుంది. జీర్ణాశయ సమస్యలు ఉన్నవారిలో పెరిగిన pH స్థాయి అక్కడే ఎక్కువసేపు నిలిచిపోతుంది. ఇథనాల్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది" అని పోర్చుగల్‌లోని పాలిటెక్నిక్ అండ్ యూనివర్శిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోఆపరేటివ్‌లో టాక్సికాలజిస్ట్ రికార్డో డినిస్-ఒలివేరా తెలిపారు.
ఇటీవల ఆయన రాసిన పరిశోధనా పత్రంలో ఈ వివరాలను అందించారు.
64 ఏళ్ల నిక్ కార్సన్‌కు శరీరంలోని కనెక్టివ్ టిష్యూలను ప్రభావితం చేసే, జన్యుపరంగా సంక్రమించే హైపర్‌మొబైల్ ఎహ్లర్స్ డాన్‌లోస్ సిండ్రోమ్ (హెచ్‌ఈడీఎస్) వ్యాధి ఉంది. ఈ వ్యాధి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివలనే తనకు ఏబీఎస్ కూడా వచ్చిందని కార్సన్ భావిస్తున్నారు.
కానీ ఈ రెండింటికీ సంబంధం ఉన్నట్టు పరిశోధనలలో బయటపడలేదు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.
కాగా, పోషకాహార నిపుణుల సలహాతో కఠిన ఆహార నియమాలు పాటించడం, యాంటీ ఫంగల్ చికిత్సలు, మల్టీవిటమిన్ మందులు తీసుకోవడం వలన కార్సన్‌కు ఉన్న ఏబీఎస్‌ను కొంతవరకు నియంత్రణలోకి వచ్చింది.
ఏబీఎస్ కండిషన్ కార్సన్ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపింది. మత్తు ఎక్కినప్పుడు తనకేమీ గుర్తుండేది కాదని, దానివలన ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉండేవారని కార్సన్ చెప్పారు.
ఇప్పుడు కారన్‌కు ఏబీఎస్ కండిషన్ గురించి చాలా విషయాలు తెలుసు. డాక్టర్ల పర్యవేక్షణలో దాన్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత క్షీణిస్తుందని ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- మహిళను ‘ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














