దగ్గు మందు మరణాలు: భారత్‌లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019 శీతాకాలంలో జమ్మూలో వరసగా కొంత మంది పిల్లలు అనారోగ్యం బారినపడ్డారు. అసలు వారికి ఏమవుతుందో తెలియక వారి తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. మరోవైపు ఇదొక కొత్త ఇన్ఫెక్షన్‌గా మీడియాలో వార్తలు వచ్చాయి.
పిల్లలకు దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపించడంతో ఓ దగ్గు మందు వేసుకోవాలని స్థానిక వైద్యులు వీరికి సూచించారు. అయితే, వీరు కోలుకోవడానికి బదులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. ముఖ్యంగా వాంతులు చేసుకోవడం, విపరీతమైన జ్వరం, కిడ్నీల ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు వీరిలో కనిపించాయి.
అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే రెండు నెలల నుంచి ఆరేళ్లలోపు వయసున్న 11 మంది చిన్నారులు మరణించారు.
అనంతర పరీక్షల్లో ఆ బాధిత చిన్నారులు తీసుకున్న దగ్గు మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ (డీఈజీ) స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఆ దగ్గు మందును ‘‘డిజిటల్ విజన్’’ అనే కంపెనీ తయారుచేసింది. డీఈజీని పెయింట్లు, పెన్నులు తయారుచేసే పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. విషపూరిత ఆల్కహాల్‌గా భావించే దీన్ని తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ముప్పుంటుంది.
ఇటీవల ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లల మరణాలకు భారత్‌లో తయారుచేసిన నాలుగు దగ్గు మందులతో సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీచేసింది. ఈ నాలుగు సిరప్‌లను మందుల తయారీలో 33ఏళ్ల అనుభవమున్న మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసింది. వీటిలో డీఈజీతోపాటు మరో విషపూరిత ఆల్కహాల్ ఇథైలీన్ గ్లైకాల్ కూడా ఆమోదయోగ్యంకాని స్థాయిలో ఉందని పరీక్షల్లో వెల్లడింది.
దీంతో మరోసారి భారత్‌లో కలుషిత ఔషధాలు, వీటి వల్ల మృతులపై మరోసారి చర్చ మొదలైంది. భారత్‌లో ఔషధ రంగం మొత్తం విలువ 42 బిలియన్ డాలర్లు (రూ.3,45,212 కోట్లు). మొత్తం రెవెన్యూలో సగం ఆదాయం ఎగుమతుల ద్వారానే కంపెనీలు అర్జిస్తున్నాయి.
భారత్‌లో దాదాపు 3,000 కంపెనీలు 10,000పైగా ఫ్యాక్టరీల్లో భారీయెత్తున జెనెరిక్ ఔషధాలు(బ్రాండెడ్ ఔషధాల కాపీలు, వీటిని తక్కువ ధరకే విక్రయిస్తారు) ఉత్పత్తి చేస్తున్నాయి. జెనెరిక్ మందుల నుంచి ఓవర్-ద-కౌంటర్ మెడిసిన్, వ్యాక్సీన్లు, ఇతర ఔషధాల్లో ఉపయోగించే ఔషధ సమ్మేళనాలు.. ఇలా భిన్న రకాల ఉత్పత్తులను ఇక్కడ తయారుచేస్తుంటారు. భారత్‌లో తయారయ్యే ఔషధాలకు కావాల్సిన రసాయనాల్లో 70 శాతాన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, వీటిని స్థానికంగా ఉత్పత్తి లేదా తయారుచేసే విధానాలపై ప్రస్తుతం దృష్టిసారిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ప్రపంచ ఫార్మసీ
భారత్‌ను ‘‘ప్రపంచ ఫార్మసీ’’గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తుంటారు. జెనెరిక్ మందులను తయారుచేయడంలో ఇక్కడి కంపెనీలకు మంచి అనుభవముంది. ఔషధాల ధరలు తక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణం. దీంతో ప్రపచంలోని చాలా దేశాలకు చౌక ధరలకే ఔషధ ఎగుమతిచేసే దేశంగా భారత్ మారింది.
అమెరికాలో విక్రయించే దాదాపు 40 ఓవర్-ద-కౌంటర్, జెనిరిక్ ఔషధాలు భారత్ నుంచి వస్తుంటాయి. మరోవైపు బ్రిటన్ విషయంలో ఇది 25 శాతం వరకు ఉంటుంది. హెచ్‌ఐవీతో పోరాడేందుకు ఉపయోగించే యాంటీ-రెట్రోవైరల్ ఔషధాల్లో మూడింట రెండొంతులను భారత్ తయారుచేస్తోంది.
అమెరికా తర్వాత అంత ఎక్కువ ఔషధ తయారీ పరిశ్రమలు ఉన్నది భారత్‌లోనే. వీటిలో దాదాపు 800 సంస్థలు అమెరికా హెల్త్ అండ్ సేఫ్టీ రిక్వైర్‌మెంట్స్ నిబంధనలను అనుసరిస్తున్నాయి.
భారత్‌లో ఔషధ తయారీ రంగం వృద్ధి రేటు కూడా 9 శాతానికిపైనే ఉంటుంది. అయినప్పటికీ, ఔషధాల నాణ్యత, నిబంధనలు పాటించకపోవడం లాంటి ఆరోపణలు కూడా తరచూ వినిపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, AFP
భారత్‌లో నకిలీ ఔషధాల బెడద ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఫార్మసీలకు ఈ ఔషధాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతుంటాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే, ఇక్కడి వైద్యులు, రోగులు మాత్రం నాసిరకమైన ఔషధాలను నకిలీ ఔషధాలుగా భావిస్తుంటారని ఔషధ నిపుణులు అంటున్నారు.
‘‘ఇక్కడ ప్రభుత్వ నియంత్రణలోని ఔషధాల పరీక్షాల కేంద్రాలకు నిధులు సరిగా సమకూర్చడం లేదు. మరోవైపు ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో నియంత్రణతోపాటు నిబంధనల అమలు కూడా కష్టంగా మారుతోంది’’అని నిపుణులు చెబుతున్నారు. ‘‘అమెరికా తరహా ప్రమాణాలు ఇక్కడ అనుసరిస్తే, ఇక్కడి తయారీ పరిశ్రమలను పూర్తిగా మూసేయాల్సి ఉంటుంది’’అని 2014లో భారత్‌లోని ఔషధ నియంత్రణా సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి మీడియాతో చెప్పారు.
1972 నుంచి ఇప్పటివరకు ఔషధాల్లో డీఈజీ స్థాయిలు పెరగడం వల్ల ఐదుసార్లు పిల్లలు పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురైనట్లు తేలింది. మొత్తంగా ఇప్పటివరకు డీఈజీ వల్ల ఇక్కడ 70 మందికిపైగా మరణించారు.
2013లో ఏడేళ్లపాటు దర్యాప్తు కొనసాగిన అనంతరం, ఔషధాల తయారీలో సరైన ప్రమాణాలు పాటించలేదని భారత ఔషధ తయారీ సంస్థ ర్యాన్‌బాక్సీ లేబరేటరీస్‌కు అమెరికా 500 మిలియన్ డాలర్లు (రూ. 4,107 కోట్లు) జరిమానా విధించింది.

ఫొటో సోర్స్, AFP
‘‘2007 నుంచి 2020 మధ్య భారత్‌లోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షల్లో 7,500కుపైగా ఔషధ శాంపిళ్ల నాసిరకమైనవిగా తేలినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి’’అని ప్రజారోగ్య నిపుణుడు, పరిశోధకులు దినేశ్ ఠాకుర్ చెప్పారు.
‘‘ఉండాల్సిన మోతాదులో రసాయనాలు ఉండకపోవడం లేదా రోగుల రక్తంలో ఔషధాలు కలవలేకపోవడం, లేదా కలుషితం కావడం లాంటి సమస్యలు ఆ శాంపిళ్లలో కనిపించాయి’’అని ఆయన వివరించారు.
‘‘ఇక్కడ ఒక్కో శాంపిల్ ఒక్కో బ్యాచ్ నుంచి సేకరించారు. అంటే మార్కెట్‌లో లక్షల సంఖ్యలో ట్యాబెట్లు, క్యాప్సుళ్లు, ఇంజెక్షన్ల రూపంలో ఇవి అందుబాటులో ఉండొచ్చు. ఇలాంటి నాసిరకమైన మందులతో ప్రభావితమైన ప్రజల సంఖ్య కూడా లక్షల్లో ఉండొచ్చు’’అని ద ట్రూత్ పిల్ పుస్తకాన్ని రాసిన ఠాకుర్ వివరించారు.
అసలు చాలా భారత కంపెనీలు గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ) నిబంధనలను పట్టించుకోవడం లేదని ఠాకుర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఔషధాల నాణ్యత సరిగ్గా ఉండేలా చూసేందుకు జీఎంపీ నిబంధనలను ఔషధ తయారీ సంస్థలు అనుసరిస్తుంటాయి. ‘‘డీఈజీ కాలుష్యం కేసులు ఇక్కడా ఉండే ఉంటాయి. ఎందుకంటే చాలా కంపెనీలు ముడి పదార్థాలు లేదా ఔషధాలకు కనీసం పరీక్షలు కూడా నిర్వహించకుండా మార్కెట్‌లోకి పంపిస్తుంటాయి’’అని ఠాకుర్ అన్నారు.
‘‘భారీ స్థాయిలో ఔషధాలు నాసిరకమైనవని గత దశాబ్ద కాలంలో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అంటే చాలా కంపెనీలు అసలు నిబంధనలనే పట్టించుకోవట్లేదని స్పష్టం అవుతోంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు పరీక్షలకు పరికరాలే లేవు..
అయితే, ఇక్కడితో ఈ సమస్యలు ఆగిపోవడం లేదు. మన దేశంలోని చాలా ఔషధ పరీక్షల ల్యాబ్‌లలో అసలు కీలకమైన పరికరాలే లేవని సమాచార హక్కు చట్టం ద్వారా ఠాకుర్ తెలుసుకున్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1875లో తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఇప్పటికీ మార్కెట్‌లో కొన్ని మందులను తీసుకొని పరీక్షలు చేపడుతున్నారని ఆయన అన్నారు.
అసలు నాసిరకమైన మందులను మార్కెట్‌లో నుంచి ఎలా వెనక్కు తీసుకోవాలని అర శతాబ్దం నుంచి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ‘‘ఇక్కడ నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటి గురించి చాలా రాష్ట్రాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు అవగాహనే ఉండటం లేదు. అసలు భారత్‌లో మార్కెట్‌లో ఔషధాలను వెనక్కి తీసుకున్నట్లు ఎప్పుడైనా మీరు వార్తలు విన్నారా?’’అని ఠాకుర్ ప్రశ్నించారు.
ఇప్పటికీ అసలు సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడం కష్టగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రపంచ స్థాయి ఔషధ కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్ తయారుచేసే ఔషధాలను మనం నమ్మొచ్చని వైద్యులు కూడా అంటున్నారు.
‘‘ఒక రోగి బ్రాండెడ్ ఔషధం నుంచి చవకైన జెనెరిక్ ఔషధానికి మారినప్పుడు ఆయన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినట్లు ఓ వార్త వచ్చింది. అప్పుడు మాత్రమే ఆ ఔషధంపై నాకు సందేహాలు వచ్చాయి’’అని ముంబయికి చెందిన డయాబెటాలజిస్టు డాక్టర్ రాహుల్ బక్షి చెప్పారు.
అయితే, చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లో నకిలీ లేదా నాసిరకమైన ఔషధాలు ఉండొచ్చని ఆయన అన్నారు.
‘‘మా దగ్గరకు వచ్చే రోగుల్లో కొంతమంది మారుమూల ప్రాంతాలకు చెందిన వారుంటారు. వారు ఒకేసారి ఇక్కడకు వచ్చి ఆరు నెలలకు సరిపడా మందులు కొనుక్కుంటారు. ఎందుకంటే వారి ప్రాంతాల్లోని దొరికే మందులను వారు నమ్మరు’’అని బక్షి వివరించారు.
గాంబియా పిల్లల మరణాల తర్వాత, ఇక్కడి కేంద్ర ఔషధ ప్రాధికార సంస్థ చాలా పకడ్బంధీగా పనిచేస్తుందని భారత్ వెల్లడించింది. ఆ దగ్గు మందుల మరణాలకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని డబ్ల్యూహెచ్‌వోను కోరింది.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేపట్టినట్లు అమెరికాలో ఔషధాలను నియంత్రించే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా వెల్లడించింది. ప్రజలకు హెచ్చరికలు కూడా జారీచేసింది. కంపెనీలు ఎక్కడ ఉన్నప్పటికీ, అమెరికాలో ప్రజలకు ఔషధాలను విక్రయించేటప్పుడు ఎఫ్‌డీఏ ప్రమాణాలను పాటించాల్సిందేనని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.
అయితే, కొన్ని దేశాల్లో ప్రమాణాలు మరీ కఠినంగా ఉంటాయని, భారత్‌లో తయారుచేసే ఔషధాలు పూర్తి సురక్షితమైనవని ఒక ఫార్మా ఇండస్ట్రీ నాయకుడు బీబీసీకి చెప్పారు. ‘‘మేం తప్పులను వెనకేసుకు రావడం లేదు’’అని ఆయన అన్నారు. ఈ ఘటనలను ఒక్కోసారి నిబంధనలు సరిగా పాటించకపోవడంగా చూడాలని ఆయన వివరించారు.
‘‘అయితే, ఏదో ఒకసారి నిబంధనలు పాటించకపోతే సహించొచ్చు. కానీ, ప్రజల జీవితాలతో ఆటలు ఆడకూడదు’’అని ఠాకుర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'శారీరక శక్తి కన్నా మెదడు ప్రమాదకరం' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు
- కాంతార మూవీ రివ్వూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి
- ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు
- కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












