Dolo 650 - పారాసిటమల్‌: జ్వరాన్ని తగ్గించే పారాసిటమల్‌ను పాములను చంపడానికి ఎందుకు వాడుతున్నారు?

పారాసెటమాల్

ఫొటో సోర్స్, Getty Images

మనం జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమల్‌ను పాములను చంపడానికి వాడుతోంది అమెరికా. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.

అమెరికాకు చెందిన గువామ్ దీవిలో 'బ్రౌన్ ట్రీ స్నేక్' జాతి పాములను చంపేందుకు పారాసిటమల్‌ను వాడుతోంది అక్కడి ప్రభుత్వం.

గువామ్ దీవిలో ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి పాములను చంపడానికి 80 మిల్లీ గ్రాముల పారాసిటమల్‌ను వాడుతోంది అమెరికా.

చనిపోయిన చిన్నచిన్న ఎలుకలకు 80 మిల్లీ గ్రాముల చొప్పున పారాసిటమల్ ఇంజెక్ట్ చేస్తారు. వాటిని కార్డ్‌బోర్డ్ పారాచూట్‌లకు అంటించి హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోని చెట్ల మీద వదులుతారు.

ఎక్కువగా చెట్లమీదే ఉండే బ్రౌన్‌ ట్రీ పాములు ఆ కొమ్మలకు చిక్కుకున్న కార్డ్‌బోర్డ్ పారాచూట్‌కు ఉండే ఎలుకలను తింటాయి. ఎలుకల్లో ఉండే పారాసిటమల్ వల్ల కొన్ని గంటల్లో ఆ పాములు చనిపోతాయి.

పారాసిటమల్ తినడం వల్లే పాములు చనిపోయాయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు కొన్ని ఎలుకల్లో రేడియో ట్రాకర్స్‌ను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అమర్చుతోంది.

బ్రౌన్ ట్రీ స్నేక్

ఫొటో సోర్స్, James Stanford

'పాము'పై అమెరికా యుద్ధం

సుమారు మూడు మీటర్ల పొడవు ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్‌తో యుద్ధమే చేస్తోంది అమెరికా. ఇందుకు ఏటా 8 మిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.60 కోట్లు వెచ్చిస్తోంది.

వన్యప్రాణులను కాపాడాల్సిన ప్రభుత్వం బ్రౌన్ ట్రీ స్నేక్‌ను ఎందుకు చంపుతోందనే సందేహం రావచ్చు. అది చేస్తున్న నష్టం వల్లే దాన్ని చంపాల్సి వస్తోందని అమెరికా అంటోంది.

అమెరికాకు చెందిన గువామ్ దీవి పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంటుంది. అమెరికా మెయిన్ ల్యాండ్ నుంచి గువామ్ దీవి సుమారు 11వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ దీవికి సుమారు 2,500 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పిన్స్, 4,500 కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియా ఉంటాయి.

గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ స్నేక్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్థానికంగా ఉండే అనేక రకాల జీవజాతులను అవి అంతం చేస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, అరిచే పాము వెనుక అసలు కథ

దీని వల్ల గువామ్ దీవికి చెందిన 11 జాతుల పక్షుల్లో 9 జాతులు అంతరించి పోయాయని అమెరికా చెబుతోంది. అంతేకాదు తొండలు, గబ్బిలాలు వంటి వాటి మనుగడ ప్రమాదంలో పడింది.

విద్యుత్ స్తంభాలు, తీగల్లో ఈ పాములు చిక్కుకోవడంతో తరచూ పవర్ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాలు దెబ్బతింటున్నాయి. తరచూ కరెంటు పోవడం, మరమ్మతులు చేయించాల్సి వస్తుండటంతో ఏడాదికి 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వస్తోందని గువామ్ పవర్ అథారిటీ చెబుతోంది.

ఈ కారణాల వల్ల బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి పాముల సంఖ్యను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. విస్తీర్ణంలో హైదరాబాద్ కంటే చిన్నగా ఉండే గువామ్ ద్వీపంలో 30 లక్షలకుపైగా బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఉంటాయని అంచనా.

అయితే ఇలా పారాసిటమల్‌తో భారీ సంఖ్యలో పాములను చంపడాన్ని పెటా వంటి సంస్థలు తప్పు పట్టాయి. ఇది అరాచకమంటూ విమర్శించాయి.

గువామ్ దీవి

ఫొటో సోర్స్, fb/Visit Guam

ఫొటో క్యాప్షన్, గువామ్ దీవి

షిప్‌ల ద్వారా గువామ్‌కు చేరిన బ్రౌన్ ట్రీ స్నేక్

గువామ్ దీవిపై పాముల దండయాత్ర గురించి మాట్లాడుకునే ముందు గుర్రపు డెక్క గురించి మనం కాస్త చెప్పుకోవాలి.

మన వద్ద చెరువుల్లో, కాలువల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ పోయే గుర్రపు డెక్కను కంట్రోల్ చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు.

గుర్రపు డెక్క ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం అది భారత్‌కు చెందిన మొక్క కాకపోవడమే.

అమెజాన్ అడవులకు చెందిన ఈ మొక్క కొన్ని దశాబ్దాల కిందట ఇండియాలోకి వచ్చింది. కానీ దీన్ని తినే జంతువులు ఇక్కడ లేకపోవడంతో అది విపరీతంగా పెరిగిపోతూ సమస్యగా మారుతోంది.

వీడియో క్యాప్షన్, భయంకరమైన పాము విషంతో కరోనాకు చెక్

గువామ్ దీవిలో బ్రౌన్‌ ట్రీ స్నేక్‌ల విషయంలోనూ జరిగింది ఇదే. విదేశాలకు చెందిన ఈ జాతి పాము సుమారు 70ఏళ్ల కిందట గువామ్ దీవికి చేరింది.

రెండో ప్రపంచ యుద్ధంలో గువామ్ దీవి అమెరికాకు సైనిక స్థావరంగా ఉండేది. కొంత కాలం జపాన్ ఆధీనంలోనూ ఉంది.

ఆ దీవి నుంచి రాకపోకలు సాగించే సమయంలో సరకు రవాణా ఓడల ద్వారా ఈ పాము గువామ్‌కు చేరి ఉంటుందని అంచనా.

ఆస్ట్రేలియా, ఇండోనేసియా, పపువా న్యూగినీ వంటి దేశాలు బ్రౌన్ ట్రీ స్నేక్ సహజ ఆవాసాలు. గువామ్ దాని సహజ ఆవాసం కాదు. అందువల్ల అక్కడ ఆ జాతి పాముకు శత్రువులు లేకుండా పోయారు.

దీంతో గువామ్‌లో బ్రౌన్ ట్రీ స్నేక్స్ సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అవి చెట్ల మీద నివసిస్తుంటాయి కాబట్టి వాటిని గుర్తించడం కూడా కష్టమే.

ఇలా భారీ సంఖ్యలో పెరిగిన బ్రౌన్ ట్రీ స్నేక్, గువామ్‌లోని స్థానిక జీవజాతులను తినేయడం మొదలుపెట్టింది. అలా అక్కడ జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

వీడియో క్యాప్షన్, డైనోసార్లు పూర్తిగా అంతమై, పాములు భారీగా వృద్ధి చెందడానికి కారణమేంటి?

గువామ్‌కు పరిమితం చేయడమే లక్ష్యం

గువామ్ దీవిలో 1950లో తొలిసారి బ్రౌన్ ట్రీ స్నేక్‌ను గుర్తించారు. ఆ తరువాత 1990ల నాటికి అదొక పెద్ద సమస్యగా మారింది. నాటి నుంచి ఆ పాము జాతిని కంట్రోలో చేసే చర్యలను తీసుకుంటున్నారు.

పారాసిటమల్‌తో వాటిని చంపడమనేది కూడా ఈ చర్యల్లో భాగమే. ప్రధానంగా గువామ్ దీవికి మాత్రమే ఆ పామును పరిమితం చేయాలన్నది అమెరికా లక్ష్యం.

ఆ జాతి పామును పూర్తిగా చంపడం తమ ఉద్దేశం కాదని, వాటి సంఖ్యను నియంత్రించడమే ప్రధాన లక్ష్యమని అది చెబుతోంది.

గువామ్ దీవి నుంచి ఆ పాము హవాయికి లేదా అమెరికా మెయిన్ ల్యాండ్‌కు చేరితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని భావిస్తోంది ఆ దేశం.

వాటికి సహజమైన శత్రువులు అమెరికాలో లేనందున, ఇతర జీవజాతులకు బ్రౌన్ ట్రీ స్నేక్స్ ప్రాణాంతకంగా మారతాయని భయపడుతోంది.

అందుకే నౌకలు, విమానాల ద్వారా ఆ పాము బయటి ప్రాంతాలకు చేరకుండా గట్టి నిఘా పెడుతోంది అమెరికా.

గువామ్‌ ఎయిర్‌పోర్ట్, పోర్ట్‌ల చుట్టూ బ్రౌన్ ట్రీ స్నేక్ పాములను పూర్తిగా లేకుండా నిర్మూలిస్తున్నారు. విమానాశ్రయాల్లో పాములను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్‌ను కూడా అధికారులు మోహరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అరుదైన నాగుపామును చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)