'డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం పాముల వృద్ధికి కారణమైంది'

రెయిన్‌బో బోవా

ఫొటో సోర్స్, Getty Images

66 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో డైనోసార్లు అంతమయ్యాయని చెబుతుంటారు.

అయితే, పాముల అభివృద్ధికి ఈ గ్రహశకలమే కొంతవరకు దోహదం చేసిందని కొత్త అధ్యయనం చెబుతోంది.

ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల అనేక వృక్ష జాతులు, జంతువులు అంతరించిపోయాయి.

కానీ ఈ ప్రళయం తర్వాత కూడా భూగర్భంలో తలదాచుకుని, సుదీర్ఘ కాలం పాటు ఆహారం కూడా లేకుండా కొన్ని రకాల పాములు బతికి బయటపడగలిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని బతికిన సర్పాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. సుమారు 3000 రకాల జాతుల పాములుగా అభివృద్ధి చెందాయి.

66 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు భూకంపాలు, సునామీలు, కార్చిచ్చులు ఏర్పడ్డాయి. అనంతరం చెలరేగిన ధూళి సూర్యుడిని కనిపించనీయకుండా చేసి దశాబ్దాల పాటు భూమిని కటిక చీకట్లోకి నెట్టింది. దాంతో డైనోసార్లు అంతరించిపోయాయని భావిస్తున్నారు.

భూమి పైనున్న సుమారు 76 శాతం మొక్కలు, జంతువులు అదృశ్యమయ్యాయి. కానీ, కొన్ని క్షీరదాలు, పక్షులు, కప్పలు, చేపల మాదిరిగానే పాములు కూడా బతికి బయటపడ్డాయి.

"ఆహార గొలుసు పతనమయ్యాక కూడా సర్పాలు జీవించగలిగాయి. అంతేకాకుండా, వేరే ఖండాలకు వ్యాపించాయి. అక్కడ కొత్త వాతావరణంలోనూ తమ సంతతిని వృద్ధి చేసుకున్నాయి" అని బాథ్ యూనివర్సిటీలో అధ్యయనం నిర్వహించిన లీడ్ పరిశోధకులు డాక్టర్ క్యాథరీన్ క్లీన్ చెప్పారు.

"గ్రహ శకలం ఢీకొట్టి ఉండకపోతే, వాటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నట్లుగా ఉండేది కాదు" అని అన్నారు.

ఈ శకలం మెక్సికోను తాకేటప్పటికి, ఇప్పుడున్న తరహాలోనే పాములుండేవి. కాళ్లు లేకుండా, వేటాడిన వాటిని తినేందుకు వీలుగా ఉండే సాగే దవడలతోనే ఉండేవి.

ప్రళయం తర్వాత ఆహార కొరత ఏర్పడింది. దాంతో ఒక సంవత్సరం వరకు ఆహారం లేకుండా ఉండి, ఆ తర్వాత నెలకొన్న కఠినమైన పరిస్థితుల్లో కూడా తిండిని వేటాడగలగడం వాటి మనుగడలో కీలక పాత్ర పోషించింది.

భూగర్భంలో, అడవుల్లో లేదా మంచినీటి సరస్సుల్లో ఉండే కొన్ని సర్పజాతులు బతకగలిగాయి.

ఇతర జంతువులతో తక్కువ పోటీ ఉండటంతో అవి ప్రపంచవ్యాప్తంగా తమ పరిధిని విస్తరించుకుంటూ వెళ్లగలిగాయి. దీంతో తొలిసారి ఆసియాలో కూడా తమ సంతానాన్ని పెంచుకోగలిగాయి.

క్రమంగా వీటి సంఖ్య పెరిగింది. ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. కొత్త జాతులు పుట్టుకొచ్చాయి. పది మీటర్ల పొడవు వరకు పెరిగే సముద్ర పాములు పుట్టుకొచ్చాయి.

యెల్లో అనకొండా

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతమున్న సర్పాల జాతి మూలాలు ప్రళయం తర్వాత బతికి బయటపడిన సర్పజాతులవే అని చెప్పవచ్చని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన పరిశోధన చెబుతోంది.

చెట్లపై ఉండే భిన్న జాతులకు చెందిన పాములు, సీ స్నేక్స్, విషపూరిత పాములు, కోబ్రా జాతికి చెందినవి, పెద్ద జంతువులను కూడా మింగగలిగే బోస్, పైథాన్ జాతికి చెందిన సర్పాలు కూడా డైనోసార్లు అంతరించిన తర్వాత పుట్టినవే అని ఈ అధ్యయనం చెబుతోంది.

"భారీగా జీవజాతులు అంతరించిపోయిన తర్వాత జరిగిన పరిణామ క్రమం చాలా వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఉంటుంది" అని బాథ్ యూనివర్సిటీలో మిల్నర్ సెంటర్ ఫర్ ఇవల్యూషన్‌కు చెందిన డాక్టర్ నిక్ లాంగ్‌రిచ్ చెప్పారు.

ఈ భూమి అగ్నిగోళంలా ఉన్న పరిస్థితి నుంచి శీతల వాతావరణంలోకి పరిణామం చెందుతున్న అంటే ఐస్ ఏజ్ మొదలవుతున్న సమయంలోనే పోలార్ ఐస్ క్యాప్స్ ఏర్పడటంతో పాటు, రెండవసారి పాముల అభివృద్ధి జరిగినట్లు కనిపించిందని చెప్పడానికి ఆధారాలు లభించినట్లు ఈ అధ్యయనం చెబుతోంది.

ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచంలోని అన్ని మూలలకూ విస్తరించడంలో పాములు విజయవంతమయ్యాయి.

అవి సముద్రాల నుంచి మొదలుకొని ఎడారుల వరకూ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగలవు.

కొన్ని రకాల పాములు భూగర్భంలో నివసిస్తే, కొన్ని చెట్ల కొమ్మల మీద ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి సైజ్ కొన్ని సెంటీమీటర్ల నుంచి 6 మీటర్ల వరకూ ఉంటుంది.

అయితే, మనుషులతో పొంచి ఉన్న ముప్పు వల్ల ఇప్పుడు అనేక రకాల జాతుల పాములు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)