ఖడ్గమృగాన్ని తలక్రిందులుగా వేలాడదీసిన ప్రయోగానికి ‘నోబెల్ బహుమతి’ ఎందుకు?

Rhino

ఫొటో సోర్స్, Robin Radcliffe

ఫొటో క్యాప్షన్, తలకిందులుగా వేలాడదీస్తే జంతువులపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న దానిపై ఇంతవరకు ఎవరూ ప్రాథమిక పరిశోధన చేయలేదు.
    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్

ఖడ్గమృగాలను తలకిందులుగా వేలాడదీస్తే, అది వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి చేసిన ప్రయోగం ఈ ఏడాది ఐజీ నోబెల్ బహుమతి దక్కించుకుంది.

నేలకు అతుక్కున్న బబుల్ గమ్‌లో ఉండే బాక్టీరియా, సబ్‌మెరైన్‌లో బొద్దింకలను నియంత్రించడంపై చేసిన ప్రయోగాలు కూడా ఐజీ నోబెల్ ప్రైజ్ అందుకున్నాయి.

ఐజీ నోబెల్ నిజమైన నోబెల్ బహుమతి కాదు. నోబెల్‌కు స్ఫూఫ్‌గా సరదాగా వీటిని ఇస్తుంటారు.

సాధారణంగా అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ అవార్డుల వేడుక నిర్వహిస్తూ ఉంటారు. కానీ కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

ఐజీ నోబెల్ అవార్డులు మొదట మిమ్మల్ని నవ్విస్తాయి. ఆ తర్వాత ఆలోచించేలా చేస్తాయని సైన్స్ హ్యూమర్ మ్యాగజైన్ అన్నల్స్ ఆఫ్ ఇంప్రొబబుల్ రిసెర్చ్‌ పేర్కొంది.

రైనో

ఫొటో సోర్స్, Namibian Ministry of Environment

రవాణా పరిశోధన విభాగంలో ఈ ఏడాది అవార్డు గెలుచుకున్న ఖడ్గమృగాలపై చేసిన అధ్యయనం కూడా ఇలా సరదాగానే ఉంటుంది.

కార్నెల్ యూనివర్సిటీకి చెందిన పశు వైద్యుడు రాబిన్ రాడ్‌క్లిఫ్ ఆయన సహచరులు నమీబియాలో ఈ ప్రయోగం చేశారు.

జంతువులను తలకిందులుగా వేలాడదీసి హెలికాప్టర్ ద్వారా తరలించే సమయంలో వాటి ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేశారు.

ఖడ్గమృగాలను తరలించడానికి ఆఫ్రికాలో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఏదేమైనా తరలింపు సమయంలో ఆ జంతువుల గుండె, ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉంటోందన్న అంశంపై ఇంతవరకు ఎవరూ ప్రాథమిక పరిశోధన చేయలేదని రాబిన్ చెప్పారు.

ఇలా చేయడం ఖడ్గమృగాలకు సురక్షితమేనా? దీనిపై అధ్యయనం చేసి చూద్దామని నమీబియా అనుకుందని ఆయన బీబీసీతో అన్నారు.

రైనో

ఫొటో సోర్స్, Namibian Ministry of Environment

రాబిన్ బృందం, నమీబియా పర్యావరణ, అటవీ, పర్యాటక మంత్రిత్వశాఖ సహకారంతో 12 నల్ల ఖడ్గమృగాల పాదాలను కట్టేసి క్రేన్ సాయంతో వాటిని తలకిందులుగా వేలాడదీసింది. ఆ తర్వాత వాటి ప్రతిస్పందనలను అంచనా వేసింది.

తలకిందులుగా వేలాడదీసినా కూడా రైనోలు ఏమాత్రం ఇబ్బంది పడలేదు. నిజానికి ఖడ్గమృగాలు సాధారణ స్థితి కంటే ఈ అసాధారణ స్థితిలో అంటే తలకిందులుగా వేలాడ తీసినప్పుడే అవి ఇంకాస్త బాగున్నట్లు అనిపించింది.

''దానికి కారణం ఖడ్గమృగం మామూలుగా నిలబడి ఉన్నప్పుడు, రక్త ప్రసరణపై స్థాన ప్రభావం (పొజిషనల్ ఎఫెక్ట్) ఉంటుందని అనుకుంటున్నాను. మరో విధంగా చెప్పాలంటే గ్యాస్ మార్పిడి కోసం ఊపిరితిత్తుల దిగువ భాగాల్లోకి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. కానీ భూమి గురుత్వాకర్షణ కారణంగా రక్త ప్రసరణ ఊపిరితిత్తుల పైభాగంలో కింది భాగంతో పోలిస్తే తక్కువగా జరుగుతుంది. తలకిందులుగా వేలాడదీసినప్పుడు ఊపిరితిత్తుల పైభాగం కిందికి, కింది భాగం పైకి అవుతాయి. అప్పుడు పైభాగంలో రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. ఖడ్గమృగం తలకిందులుగా వేలాడుతున్నప్పుడు కూడా ఊపిరితిత్తులు మామూలుగానే పని చేస్తాయి''

విజేతలు

ఫొటో సోర్స్, Ig Nobel

సంప్రదాయం ప్రకారం విజేతలకు ఈ ఐజీ నోబెల్స్‌ బహుమతులను నిజమైన నోబెల్ గ్రహీతలు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ (కెమిస్ట్రీ-2018), కార్ల్ వీమన్ (ఫిజిక్స్-2001) ఎరిక్ మస్కిన్ (ఎకనామిక్స్-2007)లు అందజేశారు.

విజేతలకు ఒక పీడీఎఫ్ ప్రింటవుట్ ఇస్తారు. దాన్నీ స్వయంగా విజేతలే పేర్చుకుని ట్రోఫీగా మార్చుకోవాలి. నగదు బహుమతిగా చెల్లని 10 ట్రిలియన్ డాలర్ జింబాబ్వే బ్యాంక్ నోటు ఇస్తారు.

ఈ ''నగదు''తో ఏమి చేస్తారని అడిగినప్పుడు, రాబిన్ రాడ్‌ క్లిఫ్ నవ్వుతూ ''మేం నిధుల కోసం ఎదురుచూస్తున్నాం'' అని అన్నారు.

''ఐజీ నోబెల్ గురించి నేను మొదట విన్నప్పుడు, అది మంచిదా చెడ్డదా అన్న విషయం నాకు తెలియదు. కానీ ఆ సందేశం మిమ్మల్ని నవ్విస్తుంది. తర్వాత ఆలోచింపజేస్తుంది'' అని అనుకుంటున్నాను. మా గురించి చెప్పుకోవడానికి ఇంతే ఉంది. మనతో పాటు ఈ భూమిపై నివసించే ఈ అద్భుతమైన జంతువులను రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మరింత మంది అర్థం చేసుకోవాలి అని రాబిన్ రాడ్‌ క్లిఫ్ అన్నారు.

''ఇది నిజంగా ఖడ్గమృగం తరలింపులో మార్పు తెచ్చింది. ఏనుగుల తరలింపులో కూడా మార్పులకు నాంది పలికింది. ఈ జంతువులను తలక్రిందులుగా వేలాడదీసి తరలించడాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. గేదె, హిప్పో, జిరాఫీ వంటి ఇతర జాతులపై ఈ పరిశోధన చేయాల్సి ఉంది'' అని పశువైద్యుడు పీట్ మోర్కెల్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, క్రూర జంతువులు ఈయనకు నేస్తాలు!

2021 ఐజీ నోబెల్ విజేతల పూర్తి జాబితా

జీవశాస్త్రం బహుమతి: పిల్లి - మనిషి కమ్యూనికేషన్‌లో అరుపులు, గొణుగుడు, మూలుగులు, కీచు, హిస్సింగ్, యౌలింగ్, మియావింగ్, కేకల్లో వ్యత్యాసాలపై పరిశోధన చేసినందుకు సుసన్నే స్కాట్జ్‌కు ఈ బహుమతి ప్రధానం చేశారు.

ఎకాలజీ ప్రైజ్: లీలా సతారి, ఆమె సహచరులకు ఈ అవార్డు దక్కింది. ఈమె జన్యు విశ్లేషణను ఉపయోగించి, వివిధ దేశాలలో నేలకి అతుక్కున్న చూయింగ్ గమ్‌లో ఉండే వివిధ బ్యాక్టీరియాను గుర్తించడానికి ప్రయత్నించారు.

రసాయనశాస్త్ర బహుమతి: సినిమా థియేటర్ల లోపల గాలిని రసాయనికంగా విశ్లేషించినందుకు జార్గ్ వికర్, సహచరులు ఈ అవార్డు అందుకున్నారు. ప్రేక్షకులు చూసే సినిమాలో హింస, సెక్స్, సంఘ విద్రోహ చర్యలు, డ్రగ్స్ వినియోగం, బూతులు తదితర అంశాల స్థాయిల సంకేతాలు ప్రేక్షకులు వదిలే శ్వాసలో ఉంటాయా అని వీళ్లు పరిశోధన చేశారు.

ఎకనామిక్స్ ప్రైజ్: పావ్లో బ్లావాట్స్కీకి ఈ అవార్డు దక్కింది. ఒక దేశ రాజకీయ నాయకుల స్థూలకాయం, ఆ దేశ అవినీతికి సూచిక అవుతుందా అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించినందుకు అవార్డు వరించింది.

శాంతి బహుమతి: ముఖాలకు తగిలే దెబ్బల నుంచి తప్పించుకునేందుకు మానవులకు గడ్డాలు వచ్చాయని నిరూపించేందుకు చేసిన అధ్యయనానికి ఈ బహుమతి దక్కింది. ఈతన్ బెసేరిస్, సహోద్యోగులు ఈ రిసెర్చ్ చేశారు.

భౌతికశాస్త్రం: అలెశాండ్రో కార్బెట్టా, సహచరులకు ఈ అవార్డు దక్కింది. ఎదురుగా వచ్చే పాదచారులు ఎందుకు ఢీ కొట్టరో తెలుసుకునే ప్రయోగాలు చేసినందుకు వారికి పురష్కారం దక్కింది.

గతిశాస్త్ర బహుమతి: పాదచారులు కొన్నిసార్లు ఇతర పాదచారులను ఎందుకు ఢీ కొంటారో తెలిపినందుకు హిషాషి మురకమి, సహచరులు అవార్డు గెలుచుకున్నారు.

ఎంటమాలజీ బహుమతి: జలాంతర్గాముల్లో బొద్దింకల నియంత్రణకు కొత్త పద్ధతిని కనిపెట్టిన జాన్ ముల్లెన్నన్ జూనియర్, సహచరులకు ఈ అవార్డు లభించింది.

రవాణా విభాగంలో బహుమతి: ఖడ్గమృగాన్ని తలకిందులుగా గాలిలో రవాణా చేయడం సురక్షితమేనా అనే ప్రయోగం చేసినందుకు రాబిన్ రాడ్‌క్లిఫ్, ఇతర సహచరులు ఈ అవార్డు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)