11 సెప్టెంబర్ 2001: 20 ఏళ్ల క్రితం అమెరికాలో ట్విన్ టవర్స్ కూలడానికి 2 శాస్త్రీయ కారణాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కార్లోస్ సెరానో
- హోదా, బీబీసీ ప్రతినిధి
2001 సెప్టెంబర్ 11న రెండు బోయింగ్ 767 విమానాలు 110 అంతస్తులతో కూడిన న్యూయార్క్‌లోనే ఎత్తైన కట్టడాలైన ట్విన్ టవర్స్‌ని ఢీ కొట్టాయి.
ఉదయం 8:45 గంటలకు మొదటి విమానం ఉత్తర టవర్‌ను ఢీ కొట్టింది. ఆ భవనం 102 నిమిషాల పాటు మంటల్లో కాలిపోయింది. ఆపై ఉదయం 10:28 గంటలకు కేవలం 11 సెకన్లలో నేలకొరిగింది.
మొదటి ప్రమాదం జరిగిన పద్దెనిమిది నిమిషాల తర్వాత, ఉదయం 9:03 గంటలకు, రెండవ విమానం దక్షిణ టవర్‌ను ఢీ కొట్టింది. ఈ ఆకాశహర్మ్యం 56 నిమిషాల పాటు మంటలతో పోరాడింది. ఆ తర్వాత ఉదయం 9:59 గంటలకు అది 9 సెకన్లలోనే కుప్పకూలింది.
"భవనం కూలిపోయే భారీ శబ్ధం తరువాత, ఎలాంటి చప్పుడు వినిపించలేదు. కొన్ని సెకన్లలో రాత్రిని మించిన చిమ్మ చీకటి ఆ ప్రాంతాన్ని ఆవహించింది. ఆ సమయంలో నేను శ్వాస కూడా తీసుకోలేకపోయాను" అని నార్త్ టవర్ 47వ అంతస్తులో పని చేసిన బ్రూనో డెల్లింగర్ గుర్తు చేసుకున్నారు.
టవర్లు ఎందుకు కూలిపోయాయి?
"టవర్లు కూలిపోయాయి. ఎందుకంటే అవి ఉగ్రదాడికి గురయ్యాయి" అని మసాచుసెట్స్(ఎంఐటీ) ప్రొఫెసర్ కౌసెల్ బీబీసీ ముండోకు చెప్పారు.
దాడుల తర్వాత, కౌసెల్ ఇదే అంశంపై జరిగిన అనేక అధ్యయనాలకు నాయకత్వం వహించారు. ఎంఐటీ నిపుణుల బృందం నిర్మాణాత్మక, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ దృష్టి కోణంలో కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో కూడా పోల్చి విశ్లేషించారు.
భౌతిక, రసాయన శాస్త్రాల్లోని అంశాలను ఆధారం చేసుకుని ఈ టవర్లు కూలడంపై కౌసెల్ వివరించారు. ఆ సమయంలో ఎవరూ ఊహించని విపత్తు సంభవించింది అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణాంతకమైన కలయిక
2002లో ప్రచురించిన ఎంఐటీ అధ్యయనాలు, ట్విన్ టవర్స్ కూలిపోవడంపై అమెరికా ప్రభుత్వం నియమించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టీ) నివేదికలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఎన్ఐఎస్టీ తన తుది నివేదికను 2008లో విడుదల చేసింది.
ఎంఐటీ, ఎన్ఐఎస్టీ రెండు నివేదికలు టవర్లు ప్రధానంగా రెండు అంశాల కలయిక కారణంగా కూలిపోయాయని నిర్ధారించాయి :
- విమానం ఢీ కొట్టడం వల్ల భవనంలో జరిగిన తీవ్రమైన నిర్మాణ నష్టం
- అనేక అంతస్తుల్లోకి వేగంగా వ్యాపించిన మంటలు
"మంటలు లేకపోతే, భవనాలు కూలిపోయేవి కాదు" అని కౌసెల్ చెప్పారు.
"తీవ్రమైన నిర్మాణ నష్టం జరగకుండా, అగ్ని మాత్రమే వ్యాపించి ఉంటే, అవి కూలిపోయేవి కాదు."
"టవర్లు చాలా నిరోధకతను కలిగి ఉన్నాయి" అని కౌసెల్ చెప్పారు.
ఎన్ఐఎస్టీ నివేదిక ప్రకారం.. బోయింగ్ 707 విమానం ఢీ కొట్టినా తట్టుకునేలా టవర్లు నిర్మించినట్టు అధికారిక పత్రాలు చెబుతున్నాయి. బోయింగ్ 707 ట్విన్ టవర్స్ రూపకల్పన సమయంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద వాణిజ్య విమానం.
అగ్ని, విమాన ప్రభావం అనే రెండు అంశాలు కలవడం వినాశకరమైన ఫలితాన్ని ఇచ్చింది. దీంతో రెండు టవర్లు కూలిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
టవర్లు ఎలా నిర్మించారు?
ట్విన్ టవర్స్‌ను 1960లలో నాటి ప్రామాణికమైన డిజైన్ ఆధారంగా నిర్మించారు.
ప్రతి భవనం మధ్యలో ఉక్కు, కాంక్రీటుతో నిర్మించిన నిలువు నిర్మాణం(కోర్) ఉంది. ఇందులో లిఫ్ట్‌లు, మెట్లు ఉన్నాయి.
ప్రతి అంతస్తు ఉక్కు బీములతో(క్షితిజ సమాంతరంగా) రూపొందించారు. ఇది ఆ కోర్ నుంచి ప్రారంభమై స్టీల్ స్తంభాలతో (నిలువు) అనుసంధానించి భవన బాహ్య గోడలను నిర్మించడానికి సహకరిస్తుంది.
ట్రస్ బీములు ప్రతి ఫ్లోర్ బరువును నిలువు వరుసల(స్టీల్ స్తంభాలు)వైపు పంచుకుంటాయి. ప్రతి ఫ్లోర్, నిలువు వరుసలను మెలితిప్పకుండా నిరోధించే పార్శ్వ మద్దతుగా పనిచేస్తుంది. దీనిని సివిల్ ఇంజనీరింగ్‌లో బక్లింగ్ అంటారు.
మొత్తం ఉక్కు నిర్మాణం కాంక్రీటుతో కప్పి ఉంటుంది. ఇది అగ్నిప్రమాదం జరిగినప్పుడు బీములు, నిలువు వరుస స్తంభాలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
బీములు, స్తంభాలు కూడా సన్నని అగ్ని నిరోధక ఇన్సులేటింగ్ పొరతో కప్పి ఉంటాయి.
తాకిడి, అగ్ని, గాలి
రెండు టవర్లు బోయింగ్ 767 విమానాల వల్ల దెబ్బతిన్నాయి. ఇవి బోయింగ్ 707 కన్నా పెద్దవి.
ఎన్ఐఎస్టీ నివేదిక ప్రకారం, నిలువు వరుసలను, ఉక్కు కడ్డీలను విమానాల తాకిడి "తీవ్రంగా దెబ్బతీసింది". మంటలను నిరోధించే చట్రాన్ని తొలగించింది.
"షాక్ నుంచి వచ్చిన వైబ్రేషన్ వల్ల స్టీల్‌పై ఫైర్ ప్రూఫ్ పూత తొలిగిపోయింది. దీని వలన దిమ్మెలకు మంటలు మరింతగా వ్యాపించాయి" అని కౌసెల్ వివరించారు.
అందువలన, మంటలు చెలరేగాయి. ఈ మంటలే చివరకు మరింత నిర్మాణాత్మకమైన నష్టాన్ని కలిగించాయి.
ఈ క్రమంలో దాదాపు వెయ్యి డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత.. కిటికీల్లోని గాజు వ్యాకోచించి పగిలిపోవడానికి కారణమైంది. ఫలితంగా గాలి లోపలికి ప్రవేశించి మంటలు మరింతగా వ్యాపించాయి.
"అగ్నిని స్వయంగా గాలి ప్రేరేపించింది. అందుకే అవి మరింతగా వ్యాపించాయి" అని కౌసెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఎగిరే బాంబులు"
ప్రతి విమానం 10,000 గ్యాలన్ల ఇంధనాన్ని(37,850 లీటర్ల కంటే ఎక్కువ) కలిగి ఉందని అధికారిక డేటా అంచనా.
"అవి ఎగిరే బాంబులు" అని కౌసెల్ చెప్పారు.
భవనాన్ని ఢీ కొట్టినప్పుడు చాలా ఇంధనం మండిపోయింది. కానీ కొంత మొత్తం చిమ్మి కింది ఫ్లోర్లపై పడింది.
ఇది అగ్ని విస్తరించడానికి కారణమైంది. దీంతో పాటు మంటలు వ్యాప్తి చెందడానికి అవసరమైన వస్తువులుండటంతో అవి ఇంకా వ్యాపించాయి.
ఆ కార్చిచ్చు రెండు ప్రధాన ప్రభావాలను కలిగి ఉందని వివరించారు.
తీవ్రమైన వేడి ప్రతి ఫ్లోర్‌లోని పిల్లర్లు, స్లాబ్ వ్యాకోచించడానికి కారణమైంది. దీని వల్ల స్లాబ్‌లు.. పిల్లర్ల నుంచి విడిపోయాయి.
పిల్లర్లు వ్యాకోచించడం వల్ల డోములు కూడా కదిలిపోయాయి.
అప్పుడే రెండో ప్రభావం మొదలైంది..
పిల్లర్లలోని స్టీల్ వేడికి మెత్తబడి.. ఆ పిల్లర్లన్నీ సున్నితంగా మారిపోయాయి.
గతంలో నిర్మాణాలు దృఢంగా ఉండటానికి కారణమిదే. ప్రస్తుతం అవి తాడుల మాదిరి తయారయ్యాయి. వంపుగా ఉండటం వల్ల జత చేసివున్న నిలువు వరుసలను లోపలికి నెట్టడం మొదలుపెట్టాయి.
"అది టవర్లకు ప్రాణాంతకం" అని కౌసెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కుప్పకూలిపోవడం
ఆ సమయంలో, భవనం కుప్పకూలడానికి కావాల్సిన అన్నీ సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు.
స్తంభాలు పూర్తిగా నిలువుగా లేవు, ఎందుకంటే పిల్లర్లు మొదట వాటిని బయటకు నెట్టివేసి, ఆపై లోపలికి లాగడంతో అవి కుంగిపోవడం ప్రారంభించాయి.
అందువలన, ఎన్ఐఎస్టీ నివేదిక ప్రకారం, నిలువు వరుసలు వంపుతో కూలిపోవడం ప్రారంభించాయి. మరోవైపు వీటికి అనుసంధానించి ఉన్న పిల్లర్లు వీటిని లోపలికి లాగాయి.
కౌసెల్ విశ్లేషణ ప్రకారం, కొన్ని సందర్భాల్లో, నిలువు వరుసలను పిల్లర్లు చాలా గట్టిగా లాగేలా చేశాయి. దాని శక్తికి రెండింటినీ కలిపి వుంచిన బోల్టులు నాశనమైపోయాయి. ఫలితంగా ఫ్లోర్లు కూలిపోయాయి. కింది ఫ్లోర్లపై శిథిలాల రూపంలో అధిక బరువు పడింది.
ఇది ఇప్పటికే బలహీనపడిన స్తంభాల సామర్థ్యంపై అదనపు ఒత్తిడిని కలిగించింది.
ఫలితంగా భవనం మొత్తం కుప్ప కూలిపోయింది.
భవనం పేక మేడలా కూలిన సమయంలో అంతస్తుల మధ్య గాలి.. అంచుల నుంచి బలంగా బయటకు వచ్చిందని కౌసెల్ వివరించారు.
దీని వల్ల కూలిన సమయంలో దుమ్ము మేఘంలా భవనాన్ని కప్పేసిందని చెప్పారు. గాలి వల్లనే అరటి పండు తొక్కను తీసే మాదిరి గోడలు బయట వైపునకు కూలిపోయాయని వివరించారు.
రెండు భవనాలు క్షణాల్లో అదృశ్యమయ్యాయి, అయితే శిథిలాల మధ్య మంటలు అలా 100 రోజుల పాటు మండుతూనే ఉన్నాయి.
ఇరవై సంవత్సరాల తరువాత, దాడుల వలన కలిగిన భయం, బాధ ఇంకా తగ్గలేదు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం
- ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా? :డిజిహబ్
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- ఫోర్డ్: భారత్‌కు గుడ్‌బై చెబుతున్న అమెరికన్ కార్ల కంపెనీ
- క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్‌లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?
- INDvsENG ఐదో టెస్టు రద్దు: ‘బీసీసీఐ నిర్ణయం వెనుక ఐపీఎల్ అజెండా ఏమీ లేదు’ - ఈసీబీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










