9/11 Attacks: ‘బాధ కత్తిలా పదునుగా ఉంటుంది, కాలం దాని తీవ్రతను తగ్గిస్తుంది’

కొడుకు శాంతితో జూపిటర్ యాంబెమ్

ఫొటో సోర్స్, NANCY YAMBEM

ఫొటో క్యాప్షన్, కొడుకు శాంతితో జూపిటర్ యాంబెమ్

తన అయిదేళ్ల కొడుకు శాంతితో మరింత సమయం గడిపేందుకు వీలుగా ప్లాన్ చేసుకున్న జూపిటర్ యాంబెమ్ ఆ రోజు మార్నింగ్ షిష్ట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

ఆయన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని ఒక రెస్టారెంటులో పనిచేసేవారు.

ఆయన మార్నింగ్ షిఫ్ట్‌లో పనిచేయాలనుకున్న రోజు 2001, సెప్టెంబర్ 11.

న్యూయార్క్ నగరంలోని ఆ భవనం నార్త్ టవర్ పైఅంతస్తులో ఉన్న 'విండోస్ ఆన్ ది వరల్డ్' రెస్టారెంట్‌లో పనిచేసే యాంబెమ్ నైట్ షిఫ్ట్ కనుక పనిచేస్తే కొడుకుతో ఆడుకోవడానికి పెద్దగా సమయం దొరకదన్న ఉద్దేశంతో మార్నింగ్ షిఫ్ట్ ఎంచుకున్నారు.

2001, సెప్టెంబర్ 11 మంగళవారం.. వేకువనే నిద్రలేచిన యాంబెమ్ స్నానం చేసి, దుస్తులు వేసుకుని భార్య నాన్సీకి ఓ ముద్దిచ్చి బైక్‌పై బయలుదేరారు.

మరికొద్ది సేపట్లో చీకట్లు తొలగి తెల్లవారనుంది.

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్ర మణిపుర్‌కు చెందిన జూపిటర్ యాంబెమ్ 1981లో అమెరికా వెళ్లారు. వెర్మాంట్‌లోని బధిరుల కోసం నిర్వహించిన ఓ సమ్మర్ క్యాంపులో పాల్గొనేందుకు ఆయన అప్పుడు వెళ్లారు.

అప్పటి నుంచి రకరకాల పనులు చేస్తూ పేరున్న 'విండోస్ ఆన్ ది వరల్డ్' రెస్టారెంట్‌లో బాంక్వెట్ మేనేజర్ స్థాయికి చేరారు.

110 అంతస్తుల ఆ భవనంలో ఆయన అయిదేళ్లుగా పనిచేస్తున్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో సుమారు 50 వేల మంది పనిచేసేవారు.

బిజినెస్ పనులపై వచ్చేవారు, షాపింగ్ చేసేవారు, 'విండోస్ ఆన్ ది వరల్డ్'లో భోజనానికి వచ్చేవారు కొన్ని వేల మంది ప్రతిరోజూ ఆ ప్రాంగణంలో అడుగుపెట్టేవారు.

ఆ రోజు ఆ రెస్టారెంట్‌లో జరగబోయే ఒక విందు బాధ్యతలన్నీ యాంబెమ్ చూసుకోవాల్సి ఉంది.

‘విండోస్ ఆన్ ది వరల్డ్’

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'విండోస్ ఆన్ ది వరల్డ్'

మరోవైపు బీకన్‌లోని ఆయన ఇంట్లో భార్య నాన్సీ కూడా తన పనుల్లో తీరికలేకుండా ఉన్నారు.

శాంతి కిండర్‌గార్టెన్‌లో చేరి అప్పటికి రెండు వారాలైంది. పిల్లాడిని తీసుకెళ్లాల్సిన బస్సు ఎప్పుడు వస్తుందో ఆమె కనుక్కున్నారు.

పిల్లాడిని స్కూలుకి పంపించిన తరువాత ఆమె తాను పనిచేసేచోటికి బైక్‌పై బయలుదేరారు.

వారు ఉండే ఇంటికి 64 కిలోమీటర్ల దూరంలో ఆరంజ్‌బర్గ్‌లో ఉండే ఓ మానసిక వికలాంగుల, మాదకద్రవ్యాల బాధితుల రెసిడెన్షియల్ హోంలో ఆమె పనిచేసేవారు.

ఆమె ఆ రెసిడెన్షియల్ హోంకు చేరిన వెంటనే అక్కడున్నవారు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోకి విమానం దూసుకెళ్లిన ఘటన గురించి ఆమెకు చెప్పారు.

''అందరూ టీవీలు చూస్తున్నారు. నేనైతే విమానాలు ఢీకొన్న దృశ్యాలు చూడలేదు'' అని నాన్సీ చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.46 గంటలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌లోని 93, 99వ అంతస్తుల మధ్య భాగంలోకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-11 విమానం దూసుకెళ్లింది.

దట్టమైన నల్లని పొగ ఆవరించడంతో 'విండోస్ ఆన్ ది వరల్డ్'లో ఉన్నవారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.

రెస్టారెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భయంతో అధికారులకు ఫోన్ చేసి రెస్టారెంట్లోని అతిథులు, తమ ఉద్యోగులు బయటపడే మార్గం చెప్పాలని కోరారు.

అక్కడ కాన్ఫరెన్సులో పాల్గొన్న ఒకరు మరో సహోద్యోగిని పిలిచి ''భారీ పేలుడు సంభవించింది. కిటికీలన్నీ ఊడిపడ్డాయి. పైకప్పు అలా కిందకు దిగిపోయింది. అందరినీ ఖాళీ చేయిస్తారు'' అని చెప్పారు.

1991లో మణిపుర్‌లో తమ పెళ్లి సందర్భంగా జూపిటర్ యాంబెమ్, నాన్సీ

ఫొటో సోర్స్, NANCY YAMBEM

ఫొటో క్యాప్షన్, 1991లో మణిపుర్‌లో తమ పెళ్లి సందర్భంగా జూపిటర్ యాంబెమ్, నాన్సీ

విండోస్ ఆన్ ది వరల్డ్ రెస్టారెంట్లో పనిచేసే షెఫ్ ఉదయం 8.30 గంటలకు తన విధులు ప్రారంభించాల్సి ఉన్నా కొత్త కళ్లద్దాలు కొనుక్కోవడం కోసమని వరల్డ్ ట్రేడ్ సెంటర్ దిగువన ఉన్న ఓ దుకాణంలోని ఆగారు. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ దాడిలో చనిపోయినవారి సంఖ్య లెక్కించడానికి కొన్ని రోజులు పట్టింది. 'విండోస్ ఆన్ ది వరల్డ్'లో 72 మంది చనిపోయారు.

''టవర్లు ఉన్నఫలంగా కుప్పకూలిపోవడాన్ని చూసి నమ్మలేకపోయాను. యాంబెమ్‌కు అదేపనిగా ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన తీయలేదు'' అని నాన్సీ చెప్పారు.

యాంబెమ్ మృతదేహం శిథిలాల్లో పైనే దొరికింది. డీఎన్ఏ పరీక్షల అనంతరం యాంబెమ్‌ను గుర్తించారు.

''కనీసం మాకు యాంబెమ్ మృతదేహం దొరికి అంతిమ సంస్కారాలు చేయగలిగాం. ఆయన అస్తికలు తీసుకున్నాం. కానీ, చాలామందికి ఆ అదృష్టం కూడా లేదు' అన్నారు నాన్సీ.

దాడి జరిగి 20 ఏళ్లయిన తరువాత కూడా మరణించిన 2,754 మందిలో 1600 మందిని మాత్రమే గుర్తించగలిగారు.

చనిపోయేనాటికి యాంబెమ్ వయసు 42. నాన్సీ వయసు అప్పటికి 40 ఏళ్లు. వారిద్దరికీ పరిచయమై అప్పటికి ఇరవయ్యేళ్లు.

1981లో వారిద్దరూ కాలేజీలో కలుసుకునేనాటికి యాంబెమ్ ఎకనమిక్స్, నాన్సీ మ్యూజిక్ థెరపీ కోర్సులో ఉన్నారు.

నాన్సీ పనిచేసేచోటికి వెళ్లి యాంబెమ్ ఆమెను కలిసేవారు.

1991లో వారిద్దరికీ పెళ్లయింది.

జూపిటర్ యాంబెమ్

ఫొటో సోర్స్, NAncy yambem

ఫొటో క్యాప్షన్, జూపిటర్ యాంబెమ్

మణిపుర్‌లో పుట్టిపెరిగిన యాంబెమ్ అయిదుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. ఆయన తండ్రి బ్యాంక్ ఉద్యోగి కాగా తల్లి డాక్టర్.

స్కూల్ చదువు పూర్తయిన తరువాత దిల్లీలో జర్మన్ భాష నేర్చుకున్నారు యాంబెమ్.

''యాంబెమ్ నిజంగా నాకు మంచి స్నేహితుడిలా ఉండేవాడు'' అని ఆయన అన్నయ్య లాబా గుర్తుచేసుకున్నారు.

''యాంబెమ్ తన ఉద్యోగాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. రెస్టారెంట్లో బిల్ క్లింటన్, బ్రాడ్‌కాస్టర్ బార్బరా వాల్టర్స్, స్కేటర్ క్రిస్టీ యమాగుచీ వంటివారితో ఫొటోలు దిగడం గురించి చెప్పేవారు. తనకు ఎంతో ఇష్టమైన అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ను కలిసినా ఆయనతో ఫొటో దిగకపోవడంపై బాధపడేవారు'' అని నాన్సీ చెప్పారు.

''ఒక అందమైన మంగళవారం ఉదయాన ఈ ఆనందమంతా ముగిసిపోయింది. వేదనాభరితమైన శూన్యం ఆవరించింది''

''యాంబెమ్ చనిపోయిన ఏడాది వరకు నాకు నిద్ర పట్టేది కాదు.. ప్రతి రాత్రీ ఏడ్చేదాన్ని'' అన్నారు నాన్సీ.

''ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయాను. మమ్మల్ని ఇంతగా ఎందుకు ద్వేషించారు? నేను చదవడం, నేర్చుకోవడం ప్రారంభించాను. టెర్రరిస్టులను క్షమించేశాను'' అని చెప్పారామె.

''ద్వేషంతో జీవించలేం. కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాను. నేనేంటో తెలుసుకోవాలనుకున్నాను''

2006లో జెరెమీ ఫెల్డ్‌మన్ అనే ఇంజినీర్‌ను నాన్సీ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ''చివరికి ప్రేమ నిన్ను రక్షిస్తుంది'' అంటారు నాన్సీ.

శాంతి యాంబెమ్, జెరెమీ ఫెల్డ్‌మన్, నాన్సీ యాంబెమ్

ఫొటో సోర్స్, NANCY YAMBEM

ఫొటో క్యాప్షన్, శాంతి యాంబెమ్, జెరెమీ ఫెల్డ్‌మన్, నాన్సీ యాంబెమ్

''యాంబెమ్‌ను గుర్తుచేసుకోని రోజు లేదు'' అని చెప్పారు నాన్సీ. ఆయన గుర్తుగా ఇంట్లోనే చిన్న స్మారకం ఉంది.

'విండోస్ ఆన్ ది వరల్డ్'' యాంబెమ్‌కు బహూకరించినవి, యాంబెమ్‌కు సంబంధించిన మరికొన్ని వస్తువులను ఆమె 9/11 మ్యూజియానికి ఇచ్చారు.

యాంబెమ్ బిజినెస్ కార్డ్, ఓ ప్రత్యేక ఈవెంట్లో ఆయనకు ఇచ్చిన రెండు వైన్ బాటిళ్లు, మరో ఉడెన్ వైన్ కిట్ వంటివన్నీ ఇప్పుడు ఆ మ్యూజియంలో ఉన్నాయి.

ఆ కుటుంబమంతా అప్పుడప్పుడు మణిపుర్‌లో యాంబెమ్ ఇంటికి వస్తుంటారు. యాంబెమ్ కొడుకు శాంతికి ఇప్పుడు 25 ఏళ్లు. న్యూయార్క్‌లోనే ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. మణిపుర్ సంప్రదాయ డ్రమ్స్‌ను వాయించడం శాంతి నేర్చుకున్నారిప్పుడు.

యాంబెమ్ కనుక బతికి ఉంటే ఇప్పుడు రానున్న అక్టోబరులో యాంబెమ్, నాన్సీ జంట తమ 30వ పెళ్లి రోజు జరుపుకొనేది.

''బాధ కత్తిలాంటిది. మొదట్లో పదునుగా ఉండి కోసుకుపోతుంది. కాలక్రమేణా కత్తి పదును తగ్గినట్లే బాధ తీవ్రతా తగ్గుతుంది''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)