అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అసెల్‌తో పాటు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులోని క్రీడాకారిణులందరూ అజ్ఞాతంలో ఉన్నారు. అసెల్ ఆమె అసలు పేరు కాదు. కాబుల్‌లో తాలిబాన్లు ఇప్పటికే అఫ్గానిస్తాన్ మహిళా క్రికెట్ జట్టులోని సభ్యుల కోసం వెతుకుతున్నారు.
''క్రికెట్ లేదా ఇతర క్రీడలు ఆడుతున్న ఏ మహిళ ప్రస్తుతం సురక్షితంగా లేరు. 'కాబుల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది'' అని అసెల్ అన్నారు.
''మాకు ఒక వాట్సాప్ ఓ గ్రూప్ ఉంది. ప్రతి రోజూ రాత్రి మేం మా సమస్యల గురించి చర్చించుకుంటాం. ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాం. మేమంతా నిస్సహాయస్థితిలో ఉన్నాం'' అని చెప్పారు.
ఆగస్ట్ మధ్యలో తాలిబాన్ కాబుల్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి అసెల్ ఇంటి బయట అడుగు పెట్టలేదు. ఆమెతన క్రికెట్ కిట్ దాచేశారు. కాబుల్లో నివసించే ఆమె జట్టు సభ్యుల్లో ఒకరిని తాలిబాన్ లక్ష్యంగా చేసుకున్నారు.
''క్రికెట్ ఆడే గ్రామంలో కొందరు తెలిసినవారు, తాలిబాన్లతో కలిసి పని చేస్తున్నారు. కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ గ్రామానికి వచ్చిన తాలిబాన్లు మమ్మల్ని బెదిరించారు. మరోసారి క్రికెట్ ఆడితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు'' అని అసెల్ చెప్పారు.
తఖ్వా (ఇది కూడా అసలు పేరు కాదు) చాలా ఏళ్లుగా ఆఫ్గాన్ మహిళా క్రికెట్ జట్టులో ఆడుతున్నారు. కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె దేశం వదిలి పారిపోయారు.
దేశం దాటడానికి వారం రోజుల ముందు తనను ఎవరూ గుర్తించకుండా ఆమె రోజుకో ఇల్లు మారారు. తాలిబాన్లు ఆమె తండ్రిని ప్రశ్నించారు. ఆయన తాను తన కూతురితో మాట్లాడి చాలా రోజులు అయిందని చెప్పారు.
''ఏం జరిగి ఉండేదో ఆలోచించాలనుకోవడం లేదు. తాలిబాన్లు కాబుల్‌కు వచ్చినప్పుడు, ఓ వారం పాటు నేను ఏం తినలేదు, సరిగా నిద్ర కూడా పోలేదు'' అని తఖ్వా చెప్పారు.
''నా ఆలోచనలు నా గురించే కాదు. జట్టులోని మా మిగతా అమ్మాయిల గురించి కూడా ఆందోళన కలుగుతోంది. వాళ్లందరూ తమ జీవితాలను, చదువులను త్యాగం చేశారు. కొందరు పెళ్లి చేసుకోలేదు. అంత కష్టపడటం వల్లే వాళ్లు అఫ్గానిస్తాన్ జట్టుకు ఆడగలిగారు'' అని తఖ్వా చెప్పారు.
అఫ్గాన్ మహిళా క్రికెట్ జట్టుకు ఆడటం అంటే వికెట్లు తీయడం, పరుగులు చేయడం మాత్రమే కాదని, అంతకంటే చాలా పెద్ద విషయమని మరో మాజీ క్రీడాకారిణి హరీర్ (పేరు మార్చాం) చెప్పారు.
''ఆడుతున్నప్పుడు నాకు ఒక బలమైన మహిళగా అనిపించేది. 'నాపై పూర్తి విశ్వాసం ఉండేది. నన్ను చూసుకుని గర్వపడేదాన్ని, ఒక మహిళగా నేను ఏదైనా సాధించగలనని, నా కలలను సాకారం చేసుకోగలనని అనుకునేదాన్ని'' అని ఆమె తెలిపారు.
కానీ, హరీర్‌తో పాటు అఫ్గానిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు సభ్యుల కలలు నిజం కాకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాది కిందటే ఈ మహిళా క్రికెట్ జట్టులో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ, ఇప్పుడు వారంతా తమ భద్రత గురించి భయపడుతున్నారు. ఆదుకుంటారనుకున్న క్రీడా అధికారులే, వారిని పట్టించుకోకుండా వదిలేసినట్లు భావిస్తున్నారు.
క్రికెట్ ఎదుగుదల అఫ్గానిస్తాన్‌లో ఒక అద్భుత కథను తలపిస్తుంది. తాలిబాన్ ఈ క్రీడపై నిషేధాన్ని ఎత్తేసిన ఏడాది తర్వాత, 2001లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ద్వారా ఆ దేశానికి అనుబంధ సభ్యత్వం కల్పించింది. తాలిబాన్ శకం ముగిసిన తర్వాత ఫుట్‌బాల్ లాంటి ఇతర క్రీడలతో, క్రికెట్ కూడా వృద్ధి చెందడం ప్రారంభమైంది.
''గత 20 ఏళ్లు వెనక్కి చూసుకుంటే యుద్ధం, ఆత్మాహుతి దాడులు, ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. కానీ, దేశం మొత్తం సంతోషంలో మునిగిన క్షణాలు ఏవైనా ఉన్నాయంటే, అవి వారు క్రీడల్లో పాల్గొనడం వల్ల వచ్చినవే'' అని బీబీసీ పష్తో సంపాదకులు ఎమాల్ పాసర్లీ అన్నారు.
''ప్రజలకు సంతోషంగా గడిపే సమయాన్ని క్రీడలు మాత్రమే ఇచ్చాయి. చుట్టూ ఉన్న కఠిన వాస్తవాలను కాసేపు మర్చిపోయేలా చేశాయి''
2001 తరువాత తొలి దశకంలో పురుషుల జట్టు ప్రపంచ వేదికపై సత్తా చాటడంతో అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ మీద మక్కువ పెరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్‌కు అర్హత సాధించినప్పుడు అఫ్గానిస్తాన్ అంతటా వీధుల్లో వేడుకలు జరుపుకున్నారు.
2017లో అఫ్గానిస్తాన్ జట్టుకు టెస్ట్ హోదా లభించింది. రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ లాంటి క్రీడాకారులు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారికి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
2010లో అఫ్గానిస్తాన్ మొదటి జాతీయ మహిళా క్రికెట్ జట్టు ఏర్పాటు అయింది. వారు ప్రారంభం నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
మొదట్లో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్(ఏసీబీ) మహిళా జట్టును అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడకుండా అడ్డుకుంది.
''తాలిబాన్ బెదిరింపులు'' రావడం వల్లే అలా చేశామని ఏసీబీ చెప్పింది.
2012లో ఆరు జట్ల మధ్య జరిగే ప్రాంతీయ టోర్నమెంట్ కోసం అఫ్గాన్ జట్టు తజకిస్తాన్ వెళ్లింది. వారు ఆ టోర్నమెంట్లో గెలుపొందారు. కానీ, రెండేళ్ల తర్వాత జట్టును ఏసీబీ రద్దు చేసింది. తాలిబాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
జట్టును రద్దు చేసినప్పటికీ, అఫ్గానిస్తాన్ అంతటా బాలికలు, యువతులు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. మహిళల మ్యాచ్‌లను నిర్వహించాలంటే ఏసీబీకి ఇప్పటికీ తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నారు.
కానీ, ఈ కొత్త తరం మహిళా క్రికెటర్లను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.
ఏసీబీ లోపల చాలా మంది తమకు మద్దతుగా నిలవలేదని, ఎంతో ప్రాధేయపడితేనే మహిళల మ్యాచ్‌లు ఏర్పాటు చేసేవారని హరీర్ వెల్లడించారు. మైదానంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా బోర్డు సభ్యులే మహిళా క్రికెటర్లకు చెప్పేవారని తెలిపారు.
''నేను ఒక బౌలర్. ఆటలో వికెట్ తీసినప్పుడు నేను అరవకూడదు. సంతోషంగా కనిపించకూడదు. ఎందుకంటే నన్ను మగవాళ్లు చూస్తుంటారు'' అని ఆమె చెప్పారు.
''నేను నా భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నా సహచరులను ప్రోత్సహించడానికి అరవలేను. నేను వారికి మద్దతు ఇవ్వలేను. మీరు సంబరాలు చేసుకోకూడదు, అరవకూడదు లేదా పోజులు ఇవ్వకూడదు'' అని వారు చెబుతారని హరీర్ తెలిపారు.
కానీ, పురుషుల జట్టు ప్రొఫైల్ పెరిగే కొద్దీ, ఏసీబీ మహిళల జట్టు ఆటపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఐసీసీకి 12 మంది పూర్తి సభ్యులు అవసరం. 2017లో అఫ్గానిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ఏర్పాటైంది. దాంతో 2020 నవంబర్‌లో 25 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు దక్కాయి.
10 నెలల క్రితమే, అఫ్గానిస్తాన్‌లో మహిళల క్రికెట్‌కు కొత్త శకం మొదలైనట్లు కనిపించింది. కానీ, అది ఎంతో కాలం నిలవలేదు.
1996 నుంచి 2001 మధ్య తాలిబాన్ పాలనలో బాలికలు, మహిళలకు దాదాపు అన్ని చదువులూ నిషేధించారు. (8 ఏళ్ల తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లడానికి అనుమతించలేదు). మగ తోడు లేకుండా మహిళలు పనులకు, ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయారు.
తాలిబాన్లు ఈసారి తమ మీద పడిన చెడు ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా, మహిళలు క్రీడల్లో పాల్గొనే అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి.
నవంబర్లో హోబర్ట్లో ఆస్ట్రేలియాతో తమ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు పురుషుల క్రికెట్ జట్టుకు తాలిబాన్ అనుమతి ఇచ్చినట్లు ఏసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హమీద్ షిన్వారీ వెల్లడించారు.
కానీ మహిళా జట్టును మాత్రం ఆపేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అదే జరిగితే అఫ్గానిస్తాన్ ఐసీసీ సభ్యత్వ నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుంది.
ఆగస్టులో ఆస్ట్రేలియా ప్రభుత్వం 50 మంది అఫ్గాన్ మహిళా అథ్లెట్లను తమ దేశానికి తీసుకెళ్లింది. అలానే తాము కూడా తాలిబాన్ పాలన నుంచి బయటపడతామని మహిళా క్రికెటర్లు భావిస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి ఫుట్‌బాల్, ఇతర అథ్లెట్ల తరలింపుపై చర్చలు జరుపుతున్నామని ఫిఫా తెలిపింది.
''మీరు ఊహించినట్లుగానే మేం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో సన్నిహితంగా ఉన్నాం. మేం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఆటగాళ్లకు మా మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చాం'' అని ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఐసీసీ దేశంలోని మహిళా క్రికెటర్లతో నేరుగా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, వారి సంక్షేమంపై ఏసీబీ పెద్దగా శ్రద్ధ కూడా చూపడం లేదని తఖ్వా అన్నారు.
''ఐసీసీ మాకు ఎప్పుడూ సాయం చేయదు. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని నిరాశకు గురి చేస్తుంటారు. మహిళా క్రికెట్ వ్యతిరేకులైన కొత్త ఏసీబీ చైర్మన్ లాంటి వారిని ఐసీసీ సంప్రదిస్తోంది'' అని దేశం తాలిబాన్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత నియమితులైన అజీజుల్లా ఫజ్లీని ఉద్దేశించి తఖ్వా ఆరోపణలు చేశారు.
ఏసీబీ ఇప్పటికీ మహిళా క్రికెట్‌కు మద్దతు ఇస్తుందా అని అడిగినప్పుడు, ''భవిష్యత్ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది'' అని షిన్వారీ అన్నారు.
ప్రస్తుతం తమ పరిస్థితేంటో తెలిసినప్పటికీ, ఎప్పటికైనా తమ జట్టు మళ్లీ కలుసుకుంటుందని అసెల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మంచి భవిష్యత్ గురించి, కలల గురించి మాట్లాడుతుంటే, కొత్త ఉత్సాహంతో జీవితంపై ఆశలు చిగురిస్తాయని హరీర్ అన్నారు.
''నేను అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్‌గా ఉండాలనే అనుకుంటున్నాను'' అని ఆమె చెప్పారు.
''నేను ఇతరుల జీవితాలను మార్చగలిగే బలమైన అఫ్గాన్ మహిళగా ఉండాలనుకుంటున్నాను. నేను మిగతా అఫ్గాన్ మహిళలకు, బాలికలకు ఆదర్శం కావాలనుకుంటున్నాను. అఫ్గానిస్తాన్ పురుషుల్లోని కొందరి ఆలోచనలైనా మార్చాలని అనుకుంటున్నాను. నన్ను చూసి నేను గర్వపడాలనుకుంటున్నాను. అంతే' అన్నారు హరీర్.
''అఫ్గాన్ సంస్కృతిలో మహిళలు క్రీడలు ఆడకుండా చేసే చాలా అడ్డంకులు ఉన్నాయి. మహిళలు బలహీనులని, క్రికెట్ ఆడలేరని వారు చెబుతున్నారు. మహిళలు పెళ్లి చేసుకుని, బిడ్డల్ని కని, ఇంట్లో పనులు చేస్తూ, పిల్లలను పెంచాలి. భర్తలను జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు'' అని అసెల్ అన్నారు.
''మా ఇంట్లో కూడా నేను ఆడలేనని కొందరు బంధువులు చెబుతారు. ఎందుకంటే ఇస్లామిక్ సంస్కృతి స్త్రీని క్రికెట్ ఆడనివ్వదు. కానీ, నాకు అది అంటే చాలా ఇష్టం''
''ప్రస్తుతం మా పరిస్థితి బాగాలేదు. కానీ, మేం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆశ చిగురిస్తోంది. మమ్మల్ని ఈదేశం నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్తే మేం మళ్లీ ఆడతాం, మా కలలను మేం వదులుకోం. ఇన్షా అల్లా" అంటున్నారు హరీర్.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










