అఫ్గానిస్తాన్: భారత రాయబారిని కలిసిన తాలిబాన్ ప్రతినిధి.. దోహాలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టు 15వ తేదీన కాబుల్ నగరాన్ని, అఫ్గానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న రెండు వారాల తర్వాత తాలిబాన్లు భారత ప్రభుత్వంతో తొలిసారి అధికారికంగా సమావేశమయ్యారు.
ఖతార్ రాజధాని దోహాలో తాలిబాన్ల అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు.
దోహాలోని భారతీయ రాయబార కార్యాలయానికి దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతి మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ మంగళవారం వెళ్లారని, ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్‌తో సమావేశమయ్యారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు త్వరగా, సురక్షితంగా వెనక్కు తిరిగి రావటంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించింది.
అలాగే, భారతదేశానికి రావాలనుకుంటున్న అఫ్గాన్ జాతీయులు, ముఖ్యంగా మైనార్టీల అంశంపైనా చర్చ జరిగినట్లు వివరించింది.
కాగా, అఫ్గానిస్తాన్ భూభాగాన్ని భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు గానీ, తీవ్రవాదానికి గానీ వాడుకోకుండా చూడాలని మొహమ్మద్ అబ్బాస్‌కు భారత రాయబారి మిట్టల్ తెలిపారు.
భారతదేశం వెలిబుచ్చిన ఆందోళనలు, లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా చర్యలు తీసుకుంటామని తాలిబాన్ ప్రతినిధి హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
భారతదేశంతో ‘స్నేహపూర్వక సంబంధాలు’ కోరుకుంటున్నామని మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ గతంలో అమెరికా-తాలిబాన్ చర్చల సందర్భంగా తెలిపారు.
అఫ్గాన్‌కు భారతదేశ సహకారం
అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో భారతదేశం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, సహకరించింది.
తాజాగా 2020 నవంబర్‌లో సైతం 150 కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది.
అఫ్గానిస్తాన్ పార్లమెంటు భవనాన్ని భారతదేశం స్వయంగా నిర్మించింది. అలాగే, ఒక విద్యుత్ ప్రాజెక్టును, నీటిపారుదల ప్రాజెక్టును కూడా నిర్మించింది.
అఫ్గానిస్తాన్‌లో భారతదేశం రోడ్ల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్: ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
కాబుల్ విమానాశ్రయం నుంచి అమెరికా సేనల ఉపసంహరణ అనంతరం, తమ ఫైటర్లను ఉద్దేశించి తాలిబాన్ నాయకులు మంగళవారం ప్రసంగించారు.
''మీ త్యాగాలను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. మీరు ఎంతో శ్రమించడంతో నేడు మనకి ఈ విజయం దక్కింది. మన నాయకుల నిజాయితీ, సహనాన్ని కూడా మనం మరచిపోకూడదు''అని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు.
''మీకు, అఫ్గాన్ ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. మన దేశం మీద ఇకపై ఎలాంటి దాడులూ ఉండవు. మనం సంబరాలు చేసుకోవాలి. శాంతి, సుపంన్నతలతో విలసిల్లే ఇస్లామిక్ రాజ్యాన్ని మనం నెలకొల్పాలి.''
''ముఖ్యంగా అఫ్గాన్ ప్రజలను మీరంతా గౌరవించాలి. ప్రజలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేశం ఎన్నో బాధలుపడింది. ఇక్కడి ప్రజలు ఎంతో వేదన అనుభవించారు. నేడు వారిని మనం ప్రేమించాలి. వారిపట్ల సానుభూతితో నడుచుకోవాలి. అందుకే వారిని గౌరవించండి. మనం వారి సేవకులం. మన పాలన వారిపై బలవంతంగా రుద్దుతున్నట్లు ఉండకూడదు.''
మరో తాలిబాన్ నాయకుడు హన్స్ హక్కానీ కూడా మాట్లాడారు. ''నేడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే, కొంతమంది ఇక్కడి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని అనుకుంటున్నారు. వారి అమెరికా దళాలను శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చూడాలనుకున్నారు.''
హన్స్ హక్కానీ మాట్లాడిన వీడియోను తాలిబాన్ మీడియా ఇన్‌ఛార్జి తారిఖ్ ఘాజ్నివాలా ట్వీట్ చేశారు.
''నేను ఇటీవల ఓ డాక్టర్‌తో మాట్లాడాను. ఇదివరకు ఆసుపత్రులు మృతులు, గాయాలపాలైన వారితో నిండి ఉండేవి.. నేడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన నాతో అన్నారు''అని వీడియోలో హక్కానీ చెప్పారు.
''అధికారం మారేటప్పుడు, మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మనం కొత్త ఇల్లు మారినప్పుడూ అదే జరుగుతుంది. అయితే, అంతా నెమ్మదిగా సద్దుకుంటుంది''అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
కాబుల్ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబాన్లు
తమ చివరి బలగాలతో అమెరికా విమానం వెళ్లిపోయిన వెంటనే, కాబుల్‌లోని హమిద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో తాలిబాన్లు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
''నేను తాలిబాన్లతోపాటే ఉన్నాను. ఎయిర్‌పోర్ట్‌లోని అమెరికా నియంత్రణలోని ప్రాంతాలన్నీ ప్రస్తుతం తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు''అని లాస్ ఏంజెలిస్ టైమ్స్ రిపోర్టర్ నబియా బుల్లోస్ తెలిపారు.
సంతోషంతో తాలిబాన్ ఫైటర్లు తుపాకులు పేలుస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
''ఇది ఓ గుణపాఠం''
అఫ్గాన్‌లో అమెరికా ఓటమి అనేది భవిష్యత్‌లో దురాక్రమణకు తెగబడాలని అనుకునే దేశాలకు ఒక గుణపాఠం అవుతుందని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.
హమిద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైనుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.
''ఇది ప్రపంచ దేశాలకు కూడా ఒక గుణపాఠం లాంటిది.''

ఫొటో సోర్స్, Reuters
విమానాలను ధ్వంసంచేశారు..
అఫ్గాన్‌లో తాము ఉపయోగించిన విమానాలు, సాయుధ వాహనాలు ఇతర సైనిక సామగ్రిని అమెరికా పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లిపోయింది. ముఖ్యంగా తాలిబాన్లు వీటిని మళ్లీ ఉపయోగించకుండా చూసేందుకే వీటిని నిర్వీర్యం చేసింది.
ఈ విషయాన్ని అమెరిక సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ మెకెన్‌జీ స్పష్టంచేశారు. విమానాలతోపాటు 70 సాయుధ వాహనాలు, 27 జీపులను నిర్వీర్యం చేసినట్లు ఆయన వివరించారు.
''ఆ విమానాలు ఇక ఎప్పటికీ ఎగరలేవు. ఎవరు వాటిని ఉపయోగించుకోలేరు.''
కాబుల్‌ను అమెరికా సైనికులు వదిలివెళ్లిపోయిన అనంతరం, అక్కడే ఉన్న ఓ అమెరికా విమానానికి సంబంధించిన దృశ్యాలను లాస్‌ఏంజెలిస్ రిపోర్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు.
ఆధునిక రాకెట్ వ్యవస్థలను కూడా అమెరికా నిర్వీర్యం చేసి వెళ్లిపోయింది. ఇస్లామిక్ స్టేట్ రాకెట్ దాడిని అడ్డుకునేందుకు ఉపయోగించిన సీ-ఆర్‌ఏఎం వ్యవస్థలను కూడా నిర్వీర్యంచేశారు.
గత కొన్ని వారాలుగా అమెరికా ఆయుధాలు, సాయుధ వాహనాలను తాలిబాన్లు ఉపయోగిస్తూ కనిపించారు.
ఇవి అఫ్గాన్ సైన్యం కోసం అమెరికా ఇచ్చిన వాహనాలు. వీటిని అఫ్గాన్ సైన్యం నుంచి తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆయుధాలు కూడా వారి చేతుల్లోకి వెళ్లకుండా అమెరికా బలగాలు ఇలా నిర్వీర్యంచేసి వెళ్లిపోయాయి.

ఫొటో సోర్స్, US department of defence
అఫ్గానిస్తాన్ నుంచి బయలుదేరిన చిట్టచివరి అమెరికా సైనికుడు ఈయనే
ఇరవై ఏళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా సేనలు నేడు(ఆగస్టు 31, 2021) అక్కడి నుంచి పూర్తిగా వైదొలిగాయి.
తాలిబాన్‌లు ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. సోమవారం వారు గాలిలోకి కాల్పులు జరిపి వేడుక చేసుకున్నారు.
అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు సాగిన మిషన్ ముగియబోతోందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం 'పెంటగాన్' ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయినట్లు అమెరికా సెంట్రల్ కమాండర్ కెన్నెత్ మెకెంజీ ధ్రువీకరించారు.
చివరి అమెరికా విమానం హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్థరాత్రి (స్థానిక సమయం) బయలుదేరింది.
"దీంతో, అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనల తరలింపు ప్రక్రియ పూర్తయినట్లే. 2001 సెప్టెంబర్ 11న ప్రారంభమైన ఇరవై ఏళ్ల పాటు సాగిన అమెరికా మిషన్ ముగిసింది" అని మెకెంజీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అఫ్గానిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా బయలుదేరిన చిట్టచివరి యూఎస్ సోల్జర్ మేజర్ జనరల్ క్రిస్ డొనాహు అని అమెరికా తెలిపింది. కాబుల్‌లో మిషన్‌ను ముగించుకొని అమెరికా వచ్చేందుకు ఆయన సీ-17 విమానం ఎక్కారని స్పష్టంచేసింది.
ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరవయ్యేళ్లలో అమెరికాకు ఎంత నష్టమంటే..
తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఆగస్టు 31 లోపు అమెరికా సైనిక దళాలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగాలి.
గత రెండు దశాబ్దాలలో అఫ్గానిస్తాన్‌లో మొత్తం 2461 మంది అమెరికన్ సైనికులు, పౌరులు మరణించారని, 20 వేలకు పైగా గాయపడ్డారని పెంటగాన్ తెలిపింది.
ఇందులో 13 మంది సైనికులు గత వారం కాబుల్ విమానాశ్రయంపై జరిగిన ఐఎస్-కే దాడిలో మరణించారు.
తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న ముందు రోజు, అంటే ఆగస్టు 14న అమెరికా 79,000 మందికి పైగా పౌరులను ఆ దేశం నుంచి తరలించింది.
ఇందులో 6,000 మంచి అమెరికన్ పౌరులు కాగా, 73,503 కన్నా ఎక్కువమంది ఇతర దేశాల పౌరులు, అఫ్గాన్ పౌరులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
20 ఏళ్ల యుద్ధంలో ఎప్పుడు ఏమైంది?
2001 అక్టోబర్ 7: అమెరికా నేతృత్వంలోని సైనిక దళాల కూటమి, అఫ్గానిస్తాన్‌లోని కాబుల్, కాందహార్, జలాలాబాద్ నగరాలను లక్ష్యాలుగా చేసుకుని తాలిబాన్, అల్-ఖైదా స్థావరాలపై బాంబులతో దాడి చేసింది.
అఫ్గానిస్తాన్‌లో ఓ దశాబ్దం పాటు కొనసాగిన సోవియట్ దళాల ఆక్రమణ, అంతర్యుద్ధం తర్వాత తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. ఆ దేశంలో స్థావరం ఏర్పరచుకున్న అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబాన్లు నిరాకరించారు.
2001 నవంబర్ 13: పశ్చిమ దేశాల సైనిక దళాల మద్దతుతో అఫ్గానిస్తాన్ ఉత్తర కూటమి కాబుల్‌ను స్వాధీనం చేసుకుంది.
2009 ఫిబ్రవరి 7: అఫ్గానిస్తాన్‌కు పంపే సైనికుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. అమెరికా గరిష్ఠంగా 1,40,000 మందిని పంపింది.
2014 డిసెంబర్ 28: అఫ్గానిస్తాన్‌లో నాటో తన యుద్ధ కార్యకలాపాలను ముగించింది. అఫ్గాన్‌లో పరిస్థితులు కుదుటపడడంతో అమెరికా వేలల్లో తమ సైనికులను వెనక్కు రప్పించింది. మిగిలినవారు అఫ్గాన్ భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టారు.
2020 ఫిబ్రవరి 29: అమెరికా, తాలిబాన్ మధ్య దోహాలో శాంతి ఒప్పందం కుదిరింది. తాలిబాన్ మిలిటెంట్లు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లయితే 14 నెలలలోపు అఫ్గానిస్తాన్ నుంచి తమ సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకునేందుకు అమెరికా, నాటో కూటమి అంగీకరించింది.
2021 ఏప్రిల్ 13: సెప్టెంబర్ 11 నాటికి అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాలన్నీ వెనుదిరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
2021 ఆగస్ట్ 16: కేవలం నెలరోజుల్లోనే తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. కాబుల్‌ను కూడా స్వాధీనం చేసుకోవడంతో అఫ్గాన్ భద్రతా దళాలు పూర్తిగా లొంగిపోయాయి.
2021 ఆగస్టు 31: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు
- 1945 తరువాత అమెరికా యుద్ధాల్లో ఎందుకు ఓడిపోతోంది
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పామాయిల్ మిషన్’ ఏంటి? ఎలా పని చేస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











