అఫ్గానిస్తాన్: ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్‌పాయింట్లను దాటి వెళ్లా. కానీ, దేశం దాటలేకపోయా..’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజిని వైద్యనాథన్
- హోదా, బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి
యూకే వెళ్లడానికి అన్ని అధికారాలు ఉన్న ఓ అప్గాన్ వ్యక్తి, కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ కారణంగా యూకే విమానాన్ని ఎక్కలేకపోయారు. మరింత ఆలస్యం కాకముందే అఫ్గాన్ నుంచి బయటపడేందుకు తనకు సహాయం చేయాలని ఆయన బ్రిటన్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
అఫ్గాన్ నుంచి ప్రజలు, అధికారుల తరలింపు ప్రక్రియను యూకే నిలిపివేసింది. ఇప్పటికీ యూకే తరలడానికి అన్ని అర్హతలు ఉన్న ఎన్నో కుటుంబాలు అఫ్గాన్‌లోనే చిక్కుకుపోయాయి.
అఫ్గాన్‌లో మిగిలిపోయిన ఆ వ్యక్తి తన వ్యథను బీబీసీతో చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన గుర్తింపును మేం దాచిపెట్టాం.

ప్రస్తుతం నేను నరకంలో ఉన్నా.
గత రెండు వారాల్లో నేను, నా కుటుంబంతో కలిసి 15 సురక్షిత గృహాల్లో తల దాచుకున్నా. ఎందుకంటే నన్ను వెతికి పట్టుకునేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.
కొన్ని రోజులుగా ఎవరైనా ఇంటి తలుపు కొడితే చాలు నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. వచ్చింది తాలిబాన్లేనా? నేను, నా కుటుంబం ఇక్కడ ఉన్నట్లు వారికి తెలిసిపోయిందా? అని నా మెదడులో రకరకాల ప్రశ్నలతో చిత్రవధ అనుభవిస్తున్నా.
ఒక్క నేనే కాదు, ఇక్కడ ప్రభుత్వం కోసం మీడియా, ఎన్జీవోలు, మానవ హక్కుల కార్యాలయాల్లో పనిచేసిన వందలాది మంది ప్రజలు ఇదే వేదనను అనుభవిస్తున్నారు. తమ వంతు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ వారంతా వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
తాలిబాన్లు నిర్బంధించి, చంపాలని చూసే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.

ఫొటో సోర్స్, EPA
ఇక్కడ మా పరిస్థితి నిజంగా అధ్వాన్నంగా ఉంది.
యూకే వెళ్లేందుకు నాకు అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ ఎయిర్‌పోర్టులోకి వెళ్లేసరికి అక్కడి అన్ని గేట్ల ముందు 4 నుంచి 5 వేల మంది ప్రజలు ఉన్నారు. అంత రద్దీ కారణంగా మేం లోపలికి వెళ్లలేకపోయాం. అవకాశం వస్తుందేమో అని అక్కడే 36 గంటలు వేచి చూశా.
బుర్ఖాలో మారువేషంలో 11 చెక్‌పాయింట్లను దాటి వెళ్లాను. కానీ అక్కడ నుంచి తాలిబాన్లు మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వలేదు.
ఆరోజు మాతో పాటు ఇంకా 15 నుంచి 16 కుటుంబాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. బ్రిటీష్ పాస్‌పోర్ట్‌లు ఉన్నవారు కూడా ఇదే దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారంతా దేశాన్ని విడిచే మరో అవకాశం కోసం ఎదురుచూస్తూ, ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటింటికీ తిరుగుతున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పేలిన రాత్రి నేను దాని సమీపంలోనే, గేటు వద్ద ఉన్నా.
ఆ ఘటనతో నా పిల్లలు చాలా భయపడ్డారు. వారు ఇప్పటికీ నిద్రలో ఉలిక్కిపడుతున్నారు.
ఇప్పుడు మా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలా సరిహద్దులు మాతపడ్డాయి. సహాయం కోసం నేను ఈ మెయిల్స్ ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నా. నా కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు నేను అనేక మార్గాలను అన్వేషిస్తున్నా.
యూకే ప్రభుత్వం తామిచ్చిన హామీలను నిలుపుకోవాలి. ప్రభుత్వం కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని కాపాడాలి.
ప్రభుత్వం కోసం పనిచేయడానికి మేం చాలా త్యాగాలు చేశాం.
దయచేసి మేం ఇక్కడ నుంచి బయటపడేందుకు సహాయపడండి.
మరికొన్ని రోజుల్లో నేను ఇక్కడ నుంచి బయటపడకపోతే, చచ్చిపోతానేమో అని భయంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
నా కన్నా ఎక్కువగా, నా కుటుంబం గురించి నేను తల్లడిల్లుతున్నా.
నాకు చిన్న పిల్లలున్నారు. వారింకా ప్రపంచాన్ని సరిగా చూడనే లేదు.
మాకు సమయం లేదు. మహా అయితే ఇంకా మూడు లేదా నాలుగు రోజులు అంతే. నేను చేసిన పనుల వల్ల వారెందుకు చావాలి? నా పనిని తాలిబాన్లు పాపకార్యంగా భావిస్తారు.
యూకే ప్రభుత్వానికి నేను చెప్పేదేంటంటే ''ప్రాణాలు కాపాడుకునేందుకు మేం పోరాడుతున్నాం. ఏదైనా జరగడానికి రోజులు, గంటలు అవసరం లేదు. కేవలం సెకన్ల వ్యవధిలో ప్రాణాలు పోవచ్చు'' అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
ఆగస్టు 14 నుంచి యూకే ప్రభుత్వం 15,000 మందికి పైగా తరలించింది. ఇందులో 2,200 మంది పిల్లలున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అఫ్గాన్‌లో అమెరికా బలగాలు వైదొలిగేందుకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో, కాబుల్ నుంచి తరలింపు విమానాలను బ్రిటన్ ప్రభుత్వం నిలిపివేసింది. అయినప్పటికీ బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు అర్హులైన అందరినీ కాపాడతామని ప్రధాని బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు.
ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో జీ7 సభ్యదేశాలు, నాటో, టర్కీ, ఖతర్‌లతో పాటు యూకే విదేశాంగ కార్యదర్శి డోమినిక్ రాబ్ పాల్గొన్నారు.
అఫ్గాన్ శరణార్థులను ఆదుకునేందుకు సమష్టిగా కృషి చేయాలంటూ రాబ్ తన సహచర అధికారులను కోరారు. మానవ హక్కులను కాపాడటంతో పాటు, గత 20 ఏళ్లలో సాధించిన ఫలాలను రక్షించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.
ఈ అంశంపై స్పందించాల్సిందిగా యూకే ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదించింది.
ఇవి కూడా చదవండి:
- పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం.. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సుమిత్ అంతిల్
- తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు అంటే ఏమిటి?
- ‘దళిత బంధు’తో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు సాధ్యమేనా?
- ఉత్తరకొరియాలో అణు రియాక్టర్ మళ్లీ పనిచేస్తోంది - ఐరాస
- భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే భర్త రేప్ చేసినట్లేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











