‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అఫ్గాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. దీంతో దక్షిణ, మధ్య ఆసియా దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌కు కూడా ఈ పరిణామాలు సవాల్ విసురుతున్నాయి.

‘‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? అనేదే నేడు భారత్ ముందున్న అతిపెద్ద సవాల్’’అని భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు అంటున్నారు. అయితే, ఇప్పుడు భారత్ ఏం చేయాలి అనే దానిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

‘‘ఈ విషయంలో భారత్ తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకూడదు, ఎందుకంటే తాలిబాన్ల సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పూలేదు. వారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. షరియా చట్టాలకు అనుగుణంగా వారు దేశాన్ని నడిపించాలని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, మైనారిటీల హక్కులు అక్కడి మతపెద్దలే చేతుల్లోనే ఉండబోతున్నాయి’’అని కొందరు నిపుణులు చెబుతున్నారు.

అమెరికా నేతృత్వంలోని నాటో సేనలు తమ బలగాలను ఉపసంహరించుకోవడంతో ఇక్కడ ఒక్కసారిగా హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. చాలా దేశాల దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే, ఈ పరిణామాల నడుమ చైనా-రష్యా-పాకిస్తాన్‌లు ఇక్కడ సరికొత్త అధికార కేంద్రంగా అవతరించాయి.

అమెరికాతో ఇరాన్ సంబంధాలు కూడా సరిగా లేవు. దీంతో తాలిబాన్లను ఇరాన్‌ కూడా గుర్తించే అవకాశముంది. ఈ పరిణామాలన్నీ భారత్‌ను ఆందోళనకు గురిచేసేవే.

‘‘ఈ విషయంలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాక, భారత్ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తాలిబాన్ల ప్రభుత్వంతో భారత్‌కు వచ్చే ప్రయోజనాలేమీ ఉండవు’’అని భారత మాజీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అరవింద్ గుప్తా బీబీసీతో అన్నారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్ల నిజస్వరూపం అందరికీ తెలుసు

‘‘అందరికీ తాలిబాన్ల నిజ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పటికీ తాలిబాన్ ఒక అతివాద సంస్థే. అతివాదం, ఛాందసవాదం లాంటి వాటితో ప్రపంచ దేశాలకు ముప్పు పొంచివుంది. తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటుతో ఈ అతివాద భావజాలం మరింత పెరుగుతుంది’’అని గుప్తా వివరించారు.

అఫ్గాన్‌ను ఆక్రమించిన వెంటనే ‘‘తాము ఉదారవాదులం’’అని చెప్పుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నించారు. అయినప్పటికీ అఫ్గాన్‌లోని భిన్న ప్రావిన్సుల్లో తాలిబాన్ల అరాచకాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇదివరకటి ప్రభుత్వంలో పనిచేసిన వారిని వెతికి పట్టుకునేందుకు ప్రతి ఇంటినీ తాలిబాన్లు గాలిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి.

ముఖ్యంగా ఇదివరకు తాలిబాన్లకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని నేడు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎవరిపైనా తాము ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబాన్లు ప్రకటించారు. అయితే, తమకు వ్యతిరేకంగా పనిచేసిన బాల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్‌ సలీమా మజారీని తాలిబాన్లు అరెస్టుచేశారు.

‘‘ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్లను నమ్మడం ఎలా? కనీసం విమానాశ్రయం దగ్గరకు కూడా ప్రజలను వెళ్లనివ్వడం లేదు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వారు ప్రభుత్వాన్ని కూడా ఇలానే నడుపుతారేమో’’అని గుప్తా అన్నారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఎప్పుడూ గుర్తించలేదు..

‘‘తాజా పరిణామాలను మనం చైనా, పాకిస్తాన్‌లతో భారత్ సంబంధాల కోణంలో చూస్తే మరింత ఆందోళనకరంగా అనిపిస్తుంది’’అని ఆయన వివరించారు.

‘‘ఇక్కడ చైనా-రష్యా-పాకిస్తాన్‌ల అధికార కేంద్రంలో ఇరాన్‌తోపాటు కొన్ని మధ్య ఆసియా దేశాలకూ భాగస్వామ్యముంది. దీంతో భారత్ మరింత ఆందోళన చెందాల్సిన అవసరముంది’’.

‘‘వేరే దేశాలపై ఉగ్రవాద దాడులు చేపట్టే వారిని తమ భూభాగం ఉపయోగించుకోకుండా అడ్డుకుంటామని తాలిబాన్లు ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే, తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ చైనా, పాకిస్తాన్‌లు మరింత క్రియాశీలంగా పనిచేస్తాయి. పరిస్థితులను అవకాశంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తాయి’’అని గుప్తా అన్నారు.

భారత్ ఎప్పుడూ తాలిబాన్లను గుర్తించలేదు. భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లినప్పుడు మాత్రమే తాలిబాన్ కమాండర్లతో భారత్‌ చర్చలు జరిపింది.

మొదట్నుంచీ తాలిబాన్లను భారత్ దూరం పెడుతూనే వచ్చింది. దోహాలో తాలిబాన్లతో అమెరికా చర్చలు మొదలుపెట్టినప్పుడు కూడా వీటికి భారత్ దూరంగానే ఉంది.

‘‘తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక, జమ్మూకశ్మీర్ వెంబడి మిలిటెంట్ల చొరబాట్లు పెరుగుతాయి. ఎందుకంటే పాక్ వీటిని మరింత ఎక్కువగా ప్రోత్సహిస్తుంది’’అని గుప్తా అంచనా వేశారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

పాక్-తాలిబాన్ల బంధం...

పాకిస్తాన్, తాలిబాన్‌ల మధ్య సంబంధాలు భారత్‌కు అతిపెద్ద సవాల్ విసురుతున్నాయని అఫ్గాన్ విదేశాంగ శాఖలో పనిచేసిన గుల్షన్ సచ్‌దేవ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జేఎన్‌యూలోని దిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

‘‘తాలిబాన్లు ఎవరు? వీరి కథ ఎలా మొదలైంది. అబోటాబాద్‌(పాకిస్తాన్‌)లోని మదర్సాల నుంచే కదా వీరు వచ్చింది. వారి మూలాలు పాక్‌లోనే ఉన్నాయన్న సంగతిని మనం మరచిపోకూడదు. ఇది భారత్‌తోపాటు ప్రపంచం మొత్తాన్నీ కలవరపెట్టే అంశం’’అని గుల్షన్ వ్యాఖ్యానించారు.

‘‘పాకిస్తాన్‌లోని సైన్యం, గూఢ చర్య సంస్థలు.. ఇలా అన్ని సంస్థలకూ తాలిబాన్లతో సంబంధాలున్నాయి. 2001లో తాలిబాన్ కంచుకోటలపై అమెరికా దాడులు చేసి, ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి రాలేరని అంతా భావించారు.’’

‘‘నేడు అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలకు అమెరికాతోపాటు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వానికి కూడా భాగముంది.’’

‘‘లేకపోతే కాబుల్‌లో ఎలాంటి పోరాటం చేయకుండానే తాలిబాన్ల ముందు ఘనీ ప్రభుత్వం ఎలా లొంగిపోయింది. ఇది నిజంగా అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. కాబుల్‌ను చేరడానికి తాలిబాన్లకు దాదాపు మూడు నెలల సమయం పట్టింది. కానీ కాబుల్‌ను వారు కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారు.’’

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

చైనా, రష్యా ఉన్నాయ్..

‘‘ఇదివరకటి తాలిబాన్లతో పోలిస్తే, నేడు అఫ్గాన్‌ను ఆక్రమించిన వారికి రష్యా, చైనా లాంటి శక్తిమంతమైన దేశాల మద్దతు ఉంది. ఐరోపాలోని కొన్ని దేశాలు కూడా ఈ రెండు దేశాల బాటలోనే నడుస్తాయి. అందుకే మన భద్రత, సార్వభౌమత్వాలను దృష్టిలో ఉంచుకొని మనం కూడా చర్యలు తీసుకోవాలి’’అని గుల్షన్ అన్నారు.

‘‘తాలిబాన్ల విషయంలో భారత్ ఎక్కువ జాప్యం చేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ జాప్యాన్ని అవకాశంగా మలుచుకునే అవకాశముంది.’’

మరోవైపు అఫ్గాన్‌లో దౌత్య కార్యాలయాలను భారత్ మళ్లీ తెరవాలా? వద్దా అనే అంశంపైనా వ్యూహాత్మక వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

‘‘వెంటనే భారత్ తమ రాయబారులను అఫ్గాన్‌కు పంపించాలి. అక్కడ రష్యా, చైనా, ఇరాన్, పాకిస్తాన్‌ల దౌత్య కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. అందుకే భారత్‌ కూడా కార్యాలయాన్ని తెరిచి తాలిబాన్లతో చర్చలు మొదలుపెట్టాలి’’అని సీనియర్ జర్నలిస్టు అభిజిత్ అయ్యార్ మిత్ర అన్నారు.

తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా

ఫొటో సోర్స్, HOSHANG HASHIMI/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా

‘‘మార్పు కనిపిస్తోంది’’

‘‘ఇప్పటివరకు భారత్ అనుసరించిన వ్యూహాలన్నీ సవ్యమైనవే. అయితే, నేడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. భారత్ కూడా తమ వ్యూహాల్లో మార్పులుచేయాలి. పాత తాలిబాన్లకు కొత్త తాలిబాన్లకు చాలా వ్యత్యాసం ఉంది’’ అని అభిజిత్ వివరించారు.

‘‘ఒకప్పుడు తాలిబాన్లు పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉండేవారు. అయితే నేడు తాలిబాన్‌లో రెండో అతిపెద్ద నాయకుడు అబ్దుల్ ఘనీ బారాదార్.. పాక్ జైలులో ఎనిమిదేళ్లపాటు చిత్ర హింసలు అనుభవించాడు. అంటే ఇదివరకటిలా పాక్ చెప్పిన మాటలన్నీ ఆయన అనుచరులు వినకపోవచ్చు. అఫ్గాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత పరిస్థితులు వేగంగా మారుతూ వస్తున్నాయి.’’

తాలిబాన్లు ఇస్తున్న సంకేతాల విషయంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలని వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘పాక్ సంరక్షణలో తాలిబాన్లు ఎదిగారన్న మాట వాస్తవమే. కానీ అఫ్గాన్‌లో పాక్ వ్యతిరేక భావజాలం పెరుగుతోంది. దీనికి ఎదురెళ్లి తాలిబాన్లు నిర్ణయాలు తీసుకోలేరు. ఈ పరిస్థితులను భారత్ అవకాశంగా మలచుకోవాలి’’అని అభిజిత్ అన్నారు.

ఇవి కూడా చదవండి: