అఫ్గానిస్తాన్‌లో LGBT: 'స్పాట్‌లో నన్ను చంపేసి ఉండేవారు'

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కిరస్టీ గ్రాంట్
    • హోదా, న్యూస్ బీట్ రిపోర్టర్

అఫ్గానిస్తాన్‌కు చెందిన స్వలింగసంపర్కుడు అబ్దుల్(పేరు మార్చాం) జీవితం తాలిబాన్ల ప్రాబల్యం పెరగడానికి ముందు కూడా నిత్యం ప్రమాదంలోనే ఉండేది.

తనలాంటి వారు కాకుండా ఇతరులెవరి దగ్గరైనా తన లైంగిక ధోరణిని ఆయన బయటపెట్టుకుంటే అరెస్టయ్యే ప్రమాదం ఉండేది. అఫ్గాన్ చట్టాల ప్రకారం ఆయన కోర్టుకెళ్లాల్సి వచ్చేది.

కానీ, గతవారం అఫ్గానిస్తాన్‌‌ తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చిన తరువాత అబ్దుల్ రేడియో-1 న్యూస్‌బీట్‌తో మాట్లాడుతూ ''ఇప్పుడు కనుక నా లైంగికతను నేను బయటపెడితే అక్కడికక్కడే నన్ను కాల్చేస్తారు'' అని చెప్పారు.

తాలిబాన్లు కఠిన శిక్షలకు పెట్టింది పేరు. తాలిబాన్లు అమలు చేసే షరియా చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నిషేధం. అంతేకాదు, దానికి వారు మరణ శిక్ష కూడా వేస్తారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు ఇంతకుముందు పాలనలో ఉన్నప్పటికి అబ్దుల్ ఇంకా పుట్టలేదు.

''నా తల్లిదండ్రులు, పెద్దవాళ్లు తాలిబాన్ల గురించి చెప్పుకోవడం నేను విన్నాను. తాలిబాన్లకు సంబంధించిన కొన్ని సినిమాలు కూడా చూశాను. ఇప్పుడు నిజంగా అలాంటి సినిమాలో ఉన్నట్లుంది'' అన్నారు అబ్దుల్.

''ఒకప్పుడు ఈ నగరంలో జీవం ఉండేది''

అబ్దుల్ ఈ వారం తన యూనివర్సిటీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది. స్నేహితులతో లంచ్‌కి వెళ్లాలని, తన బాయ్‌ఫ్రెండ్‌ని కలవాలని కూడా అనుకున్నారు. అబ్దుల్ తొలిసారి మూడేళ్ల కిందట ఓ స్విమింగ్ పూల్ వద్ద తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిశారు.

మామూలుగా అయితే, ఈ వారంలో అబ్దుల్ ఇవన్నీ చేయాల్సి ఉంది. కానీ, నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నారాయన. బయటకు వెళ్దామంటే తమ ఇంటి తలుపు బయటే తాలిబాన్లు కాచుకు కూర్చున్నారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

''కిటికీలోంచి చూసినప్పుడు వారు కనిపించినా భయం వేస్తోంది. వాళ్లను చూడగానే భయంతో వణికిపోతున్నాను'' అన్నారు అబ్దుల్.

''సాధారణ పౌరులను కూడా చంపేస్తున్నారు. వారు ఎదురుగా నేనెప్పుడైనా మాట్లాడుతానని అనుకోవడం లేదు''

అఫ్గానిస్తాన్‌ను నియంత్రిస్తున్న తాలిబాన్లే కాదు అబ్దుల్ కుటుంబసభ్యులు, ఆయన స్నేహితులకు కూడా ఆయన లైంగికత గురించి తెలియదు.

''నువ్వొక గే అయినప్పుడు అఫ్గానిస్తాన్‌లో నీ గురించి నువ్వు బయటపెట్టుకోకూడదు. స్నేహితులు, కుటుంబసభ్యులకు కూడా తెలియనివ్వకూడదు'' అన్నారు అబ్దుల్.

''ఒకవేళ నేను నా కుటుంబసభ్యులకు చెబితే వారు నన్ను కొట్టొచ్చు, చంపేయొచ్చు కూడా''

అబ్దుల్ తన లైంగికత గురించి ఎవరికీ చెప్పకపోయినా కూడా కాబుల్ సిటీ సెంటర్‌లో తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసేవారు.

''నా చదువు బాగా సాగుతుండేది. కాబుల్ నగరంలో జీవితం బాగుండేది. నగరమంతా జనంతో నిండిపోయేది'' అన్నారు అబ్దుల్.

వీడియో క్యాప్షన్, ఆభరణాల తయారీతో సెక్స్ వర్కర్ల కొత్త జీవితం

ఒక్క వారంలో అంతా మారిపోయింది. తన జీవితం తన కళ్ల ముందే మాయమైపోయినట్లుగా అనిపిస్తోందని అబ్దుల్ అన్నారు.

''మాకిక భవిష్యత్తే లేదు'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

''నా చదువు కొనసాగుతుందో లేదో తెలియదు. స్నేహితులతో సంబంధాలు తెగిపోయాయి. వారెలా ఉన్నారో తెలియదు''

''నా భాగస్వామి వేరే నగరంలో తన తల్లిదండ్రులతో పాటు చిక్కుకుపోయాడు. నేనక్కడికి వెళ్లలేను. ఆయనిక్కడికి రాలేరు''

'ఎల్‌జీబీటీలు కనిపిస్తే కాల్చేస్తారు'

అబ్దుల్ తండ్రి గత ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఇప్పుడు తాలిబాన్ల భయంతో ఆయన దొరక్కుండా దాక్కున్నారు.

అబ్దుల్‌కి తెలిసిన చాలామంది మహిళలు బయటకు వెళ్లడానికే భయపడుతున్నారు.

''నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాను''

''ఇలాంటి జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. స్వేచ్ఛగా బతికే భవిష్యత్తు కావాలి నాకు. నువ్వు గేగా ఉండకూడదంటూ ఎవరూ వేలెత్తి చూపించకూడదు''

ఇంతకుముందు కంటే భిన్నంగా పాలిస్తామని, మహిళలకు హక్కులుంటాయని చెబుతున్న తాలిబాన్ల మాటలను అబ్దుల్ నమ్మడం లేదు.

'స్కూళ్లలో చదువుకోవడానికి, గవర్నమెంట్‌లో పనిచేయడానికి మహిళలకు తాలిబాన్లు అవకాశం కల్పిస్తారేమో కానీ.. గేలు, ఎల్‌జీబీటీ సమాజానికి చెందినవారిని మాత్రం వారు ఆమోదించరు. అందరినీ ఒకేసారి స్పాట్‌లో చంపేస్తారు'' అన్నారు అబ్దుల్.

వీడియో క్యాప్షన్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని అఫ్గాన్ విద్యార్థులు ఏమంటున్నారు?

విమానాలకు వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించిన అఫ్గాన్ల గురించి అబ్దుల్ మాట్లాడుతూ 'వారేమీ వెర్రోళ్లు కారు. వారికిక్కడ వ్యాపారాలుండేవి. వారికిక్కడ ఉద్యోగాలుండేవి. వారికిక్కడ మంచి జీవితం ఉండేది.. విమానాలకు వేలాడి వెళ్లడానికి వారేమీ పిచ్చోళ్లు కాదు. కానీ, అఫ్గానిస్తాన్ ఎంతమాత్రం సురక్షితం కాదని వారికి తెలుసు. అందుకే ప్రాణాలకు తెగించి ఆ పని చేశారు'' అన్నారు అబ్దుల్.

అఫ్గానిస్తాన్ నుంచి బయటపడడానికి గల మార్గాలను అన్వేషిస్తున్నట్లు అబ్దుల్ చెప్పారు.

అబ్దుల్ వంటివారి రక్షణ కోసం ప్రయత్నిస్తున్న కొన్ని ధార్మిక సంస్థలు, ఎన్జీవోలు ఉన్నాయి. బ్రిటన్ 20 వేల మంది అఫ్గాన్‌లను తీసుకెళ్లాలనుకుంటున్నట్లు తెలిసిందని, కానీ, అందుకోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు.

బ్రిటన్‌కు చెందిన 'స్టోన్ వాల్' సంస్థ ఎల్‌జీబీటీలను రక్షించే కార్యక్రమం చేపట్టాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.

''నా వయసు 21 ఏళ్లు. నా జీవితమంతా బాంబు పేలుళ్ల మధ్యే సాగింది. స్నేహితులు, బంధువులను యుద్ధంలో కోల్పోయాను''

''మాకోసం ప్రార్థించండి. మా జీవితాల కోసం ప్రార్థించండి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)