అఫ్గానిస్తాన్ శరణార్థులు: ఆదుకునేదెవరు, ఆశ్రయమిచ్చేదెవరు?

ఫొటో సోర్స్, Reuters
సంక్షుభిత అఫ్గానిస్తాన్ నుంచి బయటపడాలని అనుకుంటున్నవారికి సహకరిస్తామని ప్రపంచ నాయకులు మాటిచ్చారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దేశాల సరిహద్దుల్లో కంచెలు పెద్దవవుతున్నాయి.
మరి, శరణార్థులను ఆదుకోవడానికి ఏం చేస్తున్నారు? అంతర్జాతీయ వలసల సంక్షోభం ముంచుకొస్తోందా?
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా, దగ్గరగా చూస్తే పరిస్థితులు ఎంత మారాయో అర్థమవుతుంది.
కొద్దిరోజుల కిందట వందలాది మంది అఫ్గాన్ పౌరులు తీవ్ర భయాందోళనలతో సరిహద్దు పట్టణం టోర్ఖామ్ వద్ద చేరారు.
కానీ, వారిలో వ్యాపారులు, సరైన పత్రాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు.
పాకిస్తాన్ సరిహద్దులోని అధికారులు 'బీబీసీ ఉర్దూ'తో మాట్లాడుతూ, తమ దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే వారి డాక్యుమెంట్ల పరిశీలన విధానాలను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.
యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూఎన్‌హెచ్‌సీఆర్) గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో ఇప్పటికే 14 లక్షలమంది రిజిష్టర్డ్ అఫ్గాన్ శరణార్థులు దశాబ్దాలుగా ఉంటున్నారు. అనధికారికంగా కూడా అంతే సంఖ్యలో అఫ్గాన్ శరణార్థులు పాకిస్తాన్‌లో ఉంటారని అంచనా.

కంచెలు పెరుగుతున్నాయి
తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున చోటు చేసుకోబోయే వలసలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి.
అఫ్గానిస్తాన్ పాస్‌పోర్టులున్న 7,80,000 మంది అఫ్గాన్ పౌరులు ఇరాన్‌లో ఇప్పటికే ఉండగా ఆ దేశం ఇకపై ఎవరినీ అనుమతించొద్దని, తిప్పి పంపించేయమని తన సరిహద్దు భద్రతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ పేర్కొంది.
36 లక్షల మంది సిరియా శరణార్థులకు, ఇతర దేశాలకు చెందిన మరో 3,20,000 మంది ఇతర దేశాలవాసులకు ఆశ్రయం ఇచ్చిన టర్కీ చాలాకాలంగా అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా శరణార్థులు వస్తారని చాలాకాలంగా ఆందోళన వ్యక్తంచేస్తోంది.
ఇరాన్‌తో తమ దేశానికి ఉన్న సరిహద్దుల్లో గోడ నిర్మాణం పూర్తి చేస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్ ఇప్పటికే చెప్పారు. కొన్నివారాలుగా అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇరాన్ మీదుగా టర్కీ చేరుకోవడానికి అక్కడి సరిహద్దులకు చేరుకుంటున్నారు.

అఫ్గాన్ శరణార్థుల సహాయార్థం అంతర్జాతీయ సమాజం ఏం చేస్తోంది
అమెరికా, మిత్ర దేశాల 20 ఏళ్ల మిలటరీ ఆపరేషన్‌లో దుబాసీలుగా, ఇతర పనుల్లో సహాయపడిన వేలాది మంది అఫ్గాన్ పౌరులను, వారి కుటుంబాలను అమెరికా, యూరప్ దేశాలు అక్కడి నుంచి సురక్షితంగా తరలిస్తున్నాయి.
అఫ్గానిస్తాన్‌లో తమకు సహకరిచిన వారు, వారి కుటుంబసభ్యుల కోసం అమెరికా 26,000 స్పెషల్ ఇమిగ్రెంట్ వీసా(ఎస్ఐవీ)లు కేటాయించింది.
గత 24 గంటల్లో అమెరికా సైనిక విమానాలు సుమారు 2 వేల మందిని తరలించాయని అమెరికా డిప్యూటీ సెక్రటరీ వెండి షెర్మాన్ బుధవారం(18.08.2021) చెప్పారు.
అయితే, దేశం వీడి వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ పౌరులను విమానాశ్రయానికి చేరుకోకుండా తాలిబాన్లు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
మరోవైపు అమెరికా అభ్యర్థన మేరకు యుగాండా 2 వేల మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించింది.
తాలిబాన్ ప్రతీకార దాడుల నుంచి రక్షించేందుకు గాను మహిళా నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, రిపోర్టర్లు 20 వేల మందిని తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని కెనడా చెప్పింది.
అయిదేళ్లలో 20 వేల మందిని తీసుకుంటామని బ్రిటన్ చెప్పింది. ఈ ఏడాది 5 వేల మందికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గాన్ పౌరులను తీసుకుని ఉజ్బెకిస్తాన్ నుంచి బయలుదేరిన జర్మనీ విమానం బుధవారం ఆ దేశానికి చేరుకుంది.
జర్మన్లతో కలిసి పనిచేసిన అఫ్గాన్‌లు, అక్కడి లాయర్లు, మానవ హక్కుల కార్యకర్తలు, తాలిబాన్ల నుంచి ముప్పు ఉన్న మిగతావారు అంతా కలిపి సుమారు 10 వేల మందిని తరలించాల్సి ఉందని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు.
అయితే, ఇదంతా యూరప్‌లో భారీ వలసల సంక్షోభానికి దారి తీస్తుందంటూ యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
సోమవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ.. అక్రమ వలసల నుంచి రక్షించుకోవడానికి యూరప్ దేశాలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల పర్యవసానాలను యూరప్ ఒక్కటే భరించలేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తాజా పరిస్థితుల పట్ల పశ్చిమ దేశాల నుంచి వస్తున్న స్పందనలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అఫ్గాన్లను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని విమర్శలొస్తున్నాయి.
జర్మనీ ప్రభుత్వం మరింత మంది శరణార్థులను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెర్లిన్‌లో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్న అలీనా లియాపినా రాయిటర్స్ వార్తాఏజెన్సీతో మాట్లాడుతూ.. జర్మనీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ముప్పు ముంగిట ఉన్న అందరినీ తక్షణమే అఫ్గానిస్తాన్ నుంచి జర్మనీకి తరలించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా అఫ్గానిస్తాన్ నుంచి ఇంతకుముందే వలస వచ్చిన వారిని తిరిగి ఆ దేశానికి పంపించేందుకు పశ్చిమ దేశాలు ఇటీవల వరకు విమానాలు నడిపాయి.
యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ 'ఫిలిపో గ్రాండీ' బీబీసీతో మాట్లాడుతూ... అలా తిప్పి పంపించేయడం ఆపాలని ప్రభుత్వాలను కోరారు.
అఫ్గానిస్తాన్ పొరుగుదేశాలు ఇరాన్, పాకిస్తాన్ వంటివి తమ సరిహద్దులు తెరిచి ఉంచాలని గ్రాండీ కోరారు.
ఇరాన్, పాకిస్తాన్‌లకు అఫ్గాన్‌లు ఎక్కువగా వెళ్తున్నందున ఆ భారాన్ని మోయడానికి గాను ఆ దేశాలకు ఆర్థిక, రవాణా సహాయం అవసరమని గ్రాండీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, EPA
రెండు దేశాలు చాలాకాలంగా ఆఫ్ఘన్లకు స్వర్గధామంగా ఉన్నాయని గుర్తించిన గ్రాండి, మరింత మంది శరణార్థుల రాకను ఎదుర్కోవటానికి వారికి తీవ్రమైన ఆర్థిక మరియు లాజిస్టికల్ సహాయం అవసరమని చెప్పారు.
అయితే, వలసల ప్రవాహం ఎక్కువగా ఉండకపోవచ్చని... తాలిబాన్లు ప్రజలను అఫ్గాన్ విడిచి వెళ్లనివ్వకపోవడమే అందుకు కారణమని గ్రాండీ అన్నారు.
మరోవైపు అఫ్గానిస్తాన్‌లోనే అంతర్గతంగా 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, వారికి తక్షణ సాయం అవసరమని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- తాలిబాన్లు ఎవరు?
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








