అష్రఫ్ ఘనీ: ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’

అష్రఫ్ ఘనీ

ఫొటో సోర్స్, Reuters

అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(72) తమ దేశానికి శరణార్థిగా వచ్చినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెల్లడించింది.

రాజధాని కాబుల్‌ను గత వారం తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో ఘనీ దేశం వదిలి వెళ్లారు. మానవతా దృష్టితో ఘనీ, ఆయన కుటుంబాన్ని దేశంలోకి ఆహ్వానించామని యూఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆ తర్వాత విడుదల చేసిన ఓ వీడియోలో ఘనీ మాట్లాడుతూ తాను పారిపోయి రాలేదని, 'భారీ విపత్తు'ను తప్పించేందుకే వచ్చేశానని చెప్పారు.

'ప్రస్తుతానికి నేను ఎమిరేట్స్‌లో ఉన్నాను. దీని వల్ల అనవసర రక్తపాతం, గందరగోళం ఆగింది' అని పేర్కొన్నారు. 'అఫ్గానిస్తాన్‌కు తిరిగి వెళ్లేందుకు నేను మంతనాలు జరుపుతున్నాను' అని వెల్లడించారు.

యూఏఈకి భారీగా డబ్బుతో వచ్చారన్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఆధారాల్లేనివని, అబద్దాలని చెప్పారు.

దేశాన్ని విడిచిపెట్టి వెళ్లినందుకు అఫ్గానిస్తాన్‌లోని ఇతర రాజకీయ నాయకులు ఘనీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఘనీ 16.9 కోట్ల డాలర్ల (సుమారు 1257 కోట్ల రూపాయల) డబ్బుతో పారిపోయారని తజికిస్తాన్‌లోని అఫ్గాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ అగ్బర్ ఆరోపించారు. ఘనీ స్వదేశానికి, అఫ్గాన్ జాతికి మోసం చేశారని ఆయన ఆరోపించారు.

తమ రాయబార కార్యాలయం అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కాగా మంగళవారం రాత్రి 'బీబీసీ'కి పంపిన ఒక వాయిస్ మెసేజ్‌లో అమ్రుల్లా సాలేహ్.. అధ్యక్షుడు పారిపోవడంతో తానే అఫ్గానిస్తాన్‌కు చట్టబద్ధమైన కేర్‌టేకర్ ప్రెసిడెంట్‌ని అని, తాలిబాన్లతో యుద్ధం ముగియలేదని చెప్పారు.

పారిపోయినందుకు అఫ్గాన్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం సోమవారం తాను చేసిన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు.

ఘనీ ఇక 'అఫ్గానిస్తాన్‌లో గుర్తింపు పొందిన నాయకుడు ఏ మాత్రం కాదు' అని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ బుధవారం పేర్కొన్నారు.

అయినా, అఫ్గానిస్తాన్ ప్రభుత్వ పగ్గాలు చేతులు మారకపోవడంతో ప్రస్తుతానికి అమెరికా ఆయన్ను 'ప్రెసిడెంట్ ఘనీ' అని పిలుస్తోంది.

తనను భద్రతా బృందం ప్రెసిడెంట్ ప్యాలెస్ నుంచి సురక్షితంగా తరలించిందని ఘనీ ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్‌లో వెల్లడించారు. అప్పుడు తనకు కనీసం బూట్లు వేసుకునే సమయం కూడా లేదన్నారు.

'ముఖ్యమైన పరిణామాలు ఒకదాని తర్వాత మరొకటి వేగంగా చోటు చేసుకున్నాయి. తాలిబాన్‌తో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను భావించాను' అని చెప్పారు. తాలిబాన్లతో, అధికారులు చర్చలు జరిపేందుకు తాను మొగ్గుచూపినట్లు వెల్లడించారు.

తలదాచుకునేందుకు పారిపోయి వచ్చిన విదేశీ నేతలకు యూఏఈ ఆశ్రయం కల్పించడం ఇదే తొలిసారి కాదు. 1990ల్లో పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో దుబాయ్‌కి వచ్చేశారు. అధికారంలోకి వచ్చాక తిరిగి పాకిస్తాన్ వెళ్లారు.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన చాలా మంది ప్రజలు యూఏఈలో పని చేస్తున్నారు. అయితే, తన భూమిని రాజకీయ వేదికగా వాడుకోవడానికి యూఏఈ అంగీకరించదని బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డెనర్ పేర్కొన్నారు.

ఘనీ 2014లో అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చారు. 2020 ఫిబ్రవరిలో రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీతో మాట్లాడుతూ తాలిబాన్ మిలిటరీ విజయం సాధించలేదని ధీమా వ్యక్తం చేశారు. 'ఇది వియత్నాం కాదు. ఇక్కడి ప్రభుత్వం కుప్పకూలదు' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)