తాలిబాన్లు అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను చంపి క్రేన్‌కు వేలాడదీశారు... ఆ రోజుల్లో అసలేం జరిగింది?

నజీబుల్లా
ఫొటో క్యాప్షన్, నజీబుల్లా
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1992 మార్చి 18. ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటుచేయగానే రాజీనామా చేస్తానని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు నజీబుల్లా ప్రకటించారు. రాజీనామా చేసే తేదీని చెప్పకపోయినా, దేశంలో మొదట ప్రత్యామ్నాయ వ్యవస్థ చాలా అవసరం అని ఆయన అనుకున్నారు.

1989లో అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ సైన్యం వెళ్లిపోయినప్పటి నుంచీ నజీబుల్లాకు అధికారంపై పట్టు క్రమక్రమంగా సన్నగిల్లింది. గత కొన్నేళ్లుగా దాదాపు 15 రకాల ముజాహిదీన్ సంస్థలు కాబూల్ వైపు ముందుకొస్తూనే ఉన్నాయి. అందరి ఉద్దేశం ఒకటే. నజీబుల్లాను గద్దె దించడం.

సోవియట్ యూనియన్ ఆడించినట్టు నజీబుల్లా ఆడుతున్నాడని ముజాహిదీన్‌లు భావించారు. ఒక ముస్లిం దేశాన్ని పాలిస్తున్న అతడు భగవంతుడిపై నమ్మకమే లేని కమ్యూనిస్టని కూడా అనుకున్నారు.

నజీబుల్లా

భారత్‌లో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నం

1992, ఏప్రిల్ 17 నాటికి నజీబుల్లా స్వదేశంలోనే ఏకాకి అయ్యారు. అంతకు రెండు వారాల క్రితమే ఆయన భార్యాపిల్లలు భారత్ వెళ్లిపోయారు. అదే రోజు ఆయన అఫ్గానిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి బెనాన్ సేవన్‌తో కలిసి ఒక రహస్య విమానంలో భారత్ వెళ్లాలని అనుకున్నారు.

భారత మాజీ దౌత్యవేత్త ఎంకే భద్రకుమార్ హిందూ పత్రికకు 2011 మే 15న రాసిన ‘మన్మోహన్ సింగ్ రిసెట్స్ అఫ్గాన్ పాలసీ’ అనే ఆర్టికల్‌లో “నజీబుల్లా భారత్‌ను రాజకీయ ఆశ్రయం కోరే ముందే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆయనకు ఆశ్రయం ఇస్తారని సేవన్ నమ్మారు.

మరో గంటలోనే ప్రభుత్వ అతిథిలా నజీబుల్లాను ఆహ్వానించడానికి భారత్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాని పీవీ నరసింహారావు సేవన్‌కు సందేశం పంపించారు.

నజీబుల్లా మూడు కార్ల కాన్వాయ్‌ కాబూల్ విమానాశ్రయం వైపు బయల్దేరింది.

బేనాన్ సేవన్
ఫొటో క్యాప్షన్, బేనాన్ సేవన్

ఐక్యరాజ్యసమితికి చెందిన మరో అధికారి ఫిలిప్ కార్విన్ తన ‘డూమ్డ్ ఇన్ అఫ్గానిస్తాన్-ఎ యూఎన్ ఆఫీసర్స్ మెమొయిర్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ కాబూల్ అండ్ నజీబుల్లా ఫెయిల్డ్ ఎస్కేప్‌’లో ఆ రోజు జరిగిన ఘటనలను వర్ణించారు.

“1992 ఏప్రిల్ 17న అర్ధరాత్రి ఒకటిన్నరకు నేను నజీబ్ ఇంటికి చేరుకున్నాను, ఆయన డార్క్ గ్రేసూట్‌లో ఉన్నారు. ఆయనతోపాటూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ తౌఖీ, ఆయన భార్య, పిల్లలు కూడా ఉన్నారు. నజీబ్‌తో ఆయన సోదరుడు, అంగరక్షకుడు, ఒక నౌకర్ కూడా ఉన్నారు. అక్కడ మొత్తం 9 మంది ఉన్నారు.

రాత్రి 1.45కు మేమంతా మూడు కార్లలో అన్ని సామాన్లూ సర్దేశాం. నేను ఐక్యరాజ్యసమితి పరిపాలనాధికారి డేన్ క్వర్క్ తో కలిసి మొదటి కార్లో ముందు సీట్లో కూర్చున్నా. వెనక సీట్లో ఏకే 47తో ఉన్న నజీబుల్లా అంగరక్షకుడు, నౌకర్ కూర్చున్నారు. మధ్యలో వస్తున్న కారు సెడాన్. దాని వెనక సీట్లో నజీబ్, ఆయన సోదరుడు కూర్చున్నారు.

మూడో టొయోటా ఒక మినీ బస్‌. అందులో జనరల్ తౌఖీ, ఆయన కుటుంబం ఉంది. మాకు అంతర్గత భద్రతా మంత్రి ఒక కోడ్ వర్డ్ ఇచ్చారు. దానిని ఉపయోగించి మేం చాలా సెక్యూరిటీ పోస్టులు దాటేశాం. చివరి పోస్ట్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడి బలగాలు అప్పటివరకూ చెప్పిన కోడ్‌వర్డ్ ఒప్పుకోలేదు. డేన్ క్వర్క్ చాలాసార్లు ఆ కోడ్ వర్డ్ చెప్పారు. కానీ సైనికులు మా వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వలేదు.”

నజీబుల్లా భార్య

ఫొటో సోర్స్, @facebook

ఫొటో క్యాప్షన్, నజీబుల్లా భార్య

కార్లను విమానాశ్రయం దగ్గర ఆపేశారు

క్వర్క్ హఠాత్తుగా ఆ సైనికులు వేరే యూనిఫాంలో ఉండడం గమనించారు. అంటే రాత్రికిరాత్రే విమానాశ్రయాన్ని అబ్దుల్ రషీద్ దోస్తం ముజాహిదీన్ సంస్థ ఆక్రమించిందని క్వర్క్, కార్విన్‌కు అర్థమైంది. నజీబ్ అంకరక్షకుడు తన ఏకే 47తో కిందికి దిగి, అక్కడ సైనికులతో గొవడపడుతున్నాడు. ఈలోపు ఆ కార్ డ్రైవర్ విమానాశ్రయంలో ఉన్న బెనాన్‌తో మాట్లాడాడు. ఆయన రన్‌వే మీద ఉన్న ఐక్యరాజ్యసమితి విమానంలో నజీబుల్లా కోసం వేచిచూస్తున్నాడు. లోపలికి ఎక్కడానికి ఆ విమానాన్ని సైనికులు చుట్టుముట్టారని ఆయన చెప్పారు.

“అదే సమయంలో, నజీబ్ తన కార్లో నుంచే, అక్కడ అడ్డుకుంటున్న సైనికులను తిట్టడం మొదలెట్టారు. ఆయనది చాలా గట్టి గొంతు,. కానీ, వాళ్లు మనల్ని ముందుకు వెళ్లనిచ్చినా, విమానాశ్రయంలో ఉన్న సైనికులు మనల్నందరినీ చంపేస్తారని ఆయన సార్జెంట్ చెప్పాడు. ఎందుకంటే లోపలున్న దోస్తం సైనికులు బయటివారిని లోపలికి, లోపలివారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. దాంతో నజీబుల్లా కార్లు వెనక్కు తిప్పాలని ఆదేశించారు. డ్రైవర్ ఆయనతో మనం నేరుగా మీ నివాసానికి వెళ్దామా సర్ అన్నాడు. నజీబ్ గట్టిగా ‘వద్దు, మనం ఐక్యరాజ్యసమితి కాంపౌండ్‌లోకి వెళ్దాం’ అన్నారు. తన ఇంటికి వెళ్తే దోస్తాం సైనికులు తమను కాల్చి చంపేస్తారని ఆయనకు అర్థమైంది. రాత్రి 2 గంటలకు మా కార్ల కాన్వాయ్ తిరిగి యూఎన్ ఆఫీస్ వైపు బయల్దేరింది” అని రాశారు.

అబ్దుల్ రషీద్ దోస్తమ్
ఫొటో క్యాప్షన్, అబ్దుల్ రషీద్ దోస్తమ్

నజీబుల్లాను నమ్మినవారే మోసం చేశారు

దోస్తాం మాత్రమే కాదు, ఆయన పార్టీలో ఉన్న వారు కూడా ఆయనను వదిలించుకోవాలని అనుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ 1992 ఏప్రిల్ 18న ప్రచురించిన ఒక కథనంలో “నజీబుల్లా విదేశాంగ మంత్రి అబ్దుల్ వకీల్, ఆయన సైన్యాధ్యక్షుడు జనరల్ మొహమ్మద్ నబీ అజీమీ తమ రాజకీయ మనుగడ కోసం నజీబుల్లాను ముందుకొస్తున్న ముజాహిదీన్లకు ఒక బహుమతిలా అప్పగించాలని అనుకున్నారు. రేడియో కాబూల్‌లో దేశం పేరిట ఒక సందేశం ప్రసారం చేసిన వకీల్.. ‘నజీబుల్లా దేశం నుంచి పారిపోయే ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది’ అన్నారు. వకీల్ దృష్టిలో నజీబుల్లా కొన్ని గంటల్లో నీచ నియంతలా మారిపోయాడు. సేవన్ ఇలాంటి పరిస్థితుల్లో మొదట నుంచీ నజీబ్‌ను కాపాడుతూ వచ్చారు.

దాదాపు 3.20కి నజీబ్ యూఎన్ హాండ్లర్స్ భారత రాయబారి సతీష్ నంబియార్‌కు దోస్తాం సైనికులు నజీబ్‌ను అడ్డుకున్నారనే వార్తను అందించారు. 4.35కు నంబియార్ ఐక్యరాజ్యసమితి ఆఫీసుకు చేరుకున్నారు. ఆరోజు నజీబుల్లాను కలిసిన మొదటి వ్యక్తి ఆయనే. తర్వాత నంబియార్ ఒక ఇంటర్వ్యూలో “నజీబ్‌ను తప్పించే ఆ ప్లాన్ మీద భారత్, ఐక్యరాజ్యసమితి చాలా నమ్మకంగా ఉన్నాయి. అందుకే, మేం ప్లాన్ బీ కూడా ఆలోచించలేదు” అన్నారు.

నజీబుల్లా

తర్వాత ఐక్యరాజ్యసమితి అధికారులు పట్టుబట్టడంతో నజీబుల్లాకు భారత ఏంబసీలో ఆశ్రయం ఇచ్చేందుకు నంబియార్ ఒప్పుకున్నారు. దాని గురించి అవినాశ్ పాలివాల్ తన ‘మై ఎనిమీస్ ఎనిమీ’ పుస్తకంలో రాశారు.

“నంబియార్ హామ్ రేడియోలో దిల్లీని సంప్రదించి వారికి తాజా పరిస్థితులు చెప్పారు. నజీబ్‌కు భారత ఏంబసీలో ఆశ్రయం ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. నజీబ్ భార్యాపిల్లలకు దేశంలో ఆశ్రయం ఇచ్చిన భారత్‌కు, ఆయనకు తమ రాయబార కార్యాలయంలో ఉంచడం సమస్యగా అనిపించింది.

ఉదయం 5.15కు నజీబ్‌కు తమ ఎంబసీలో ఆశ్రయం ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. ఆయన ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఉండడమే సురక్షితం అని నంబియార్ వాదించారు. మేం ఆయనకు ఆశ్రయం ఇస్తే చాలా సమస్యలు వస్తాయని, నజీబ్‌కు రక్షణ కల్పించడం కూడా కష్టం అవుతుందని చెప్పారు.

సతీశ్ నంబియార్

ఫొటో సోర్స్, Satish_Nambir_twitter

ఫొటో క్యాప్షన్, సతీశ్ నంబియార్

నజీబుల్లాకు ముఖం చాటేసిన భారత్

నజీబుల్లా భారత రాయబార కార్యాలయంలో ఉన్నారని కాబూల్‌లో తెలిస్తే, నగరంలో ఉంటున్న భారతీయులను టార్గెట్ చేస్తారని భారత్ కంగారుపడింది. అప్పట్లో కాబూల్ ఏంబసీలో ఉద్యోగులతోపాటూ అక్కడ దాదాపు వందమంది భారతీయులు ఉండేవారు. అక్కడ అప్పట్లో జేఎన్ దీక్షిత్ 1991 నుంచి 1994 వరకూ భారత విదేశాంగ కార్యదర్సిగా ఉన్నారు. నజీబ్‌కు ఆశ్రయం ఇస్తే భారత్‌కు రాజకీయంగా పరిస్థితులు మరింత కఠినం అవుతాయని, ముజాహిదీన్‌లతో భారత్ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సంప్రదింపులు జరపలేదని భావించారు.

1992 ఏప్రిల్ 22న ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ హఠాత్తుగా భారత పర్యటనకు వచ్చారు. నజీబుల్లాను కాబూల్ నుంచి తప్పించి, భారత్‌లో ఆశ్రయం ఇప్పించేందుకు ప్రధాని నరసింహారావును ఒప్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చారు.

పీవీ నరసింహారావు
ఫొటో క్యాప్షన్, నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో అప్పటి హోంమంత్రి శంకర్‌రావ్ చవాన్

ఆరు రోజుల చర్చల తర్వాత, నజీబుల్లా కోరితే, భారత్ ఆయనకు ఆశ్రయం ఇస్తుందని హోంమంత్రి శంకర్‌రావ్ చవాన్ ప్రకటించారు. చవాన్ వ్యాఖ్యలను బట్టి భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాలని అనుకుంటున్నట్లు స్పష్టమైంది.

పార్లమెంటులో దీనిపై ప్రశ్నించినపుడు విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎడ్వర్డ్ ఫెలేరో ఇది ఊహాజనిత ప్రశ్న అన్నారు. ఆశ్రయం గురించి నజీబుల్లా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా అందలేదని చెప్పారు.

ఆయన ఆశ్రయం అడిగితే ప్రభుత్వ వైఖరి ఎలా ఉండేది, అని ఎంపీలు నిలదీసినప్పుడు, ప్రధాని నరసింహారావు, ఫెలోరో సమాధానం దాటవేశారు.

భారత్ నజీబుల్లాను కాబూల్ నుంచి విమానంలో లేదా మరో మార్గంలో తప్పించడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదని అవినాశ్ పాలివాల్ తన ‘మై ఎనిమీస్ ఎనిమీ’లో చెప్పారు.

“ఐక్యరాజ్యసమితి నుంచి అభ్యర్థన వస్తే మేం కాబూల్‌కు విమానం పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ చెప్పింది. కానీ ఆలోపు పాకిస్తాన్, ముజాహిదీన్ల నుంచి దానికి ఆమోదం పొందాలని బౌత్రోస్ ఘలీకి స్పష్టం చేసింది. దిల్లీలో నజీబుల్లా కుటుంబాన్ని చూసుకోవడం తప్ప, ఆయన్ను కాపాడ్డానికి భారత్ ఏ ప్రయత్నం చేయలేదు“ అని పాలివాల్ రాశారు.

జే ఎన్ దీక్షిత్
ఫొటో క్యాప్షన్, జే ఎన్ దీక్షిత్

తర్వాత రాకు చెందిన ఒక సీనియర్ అధికారి పేరు బయటపెట్టకూడనే షరతుతో అవినాష్ పాలివాల్‌కు ఒక విషయం చెప్పారు.

“నజీబుల్లాను కాపాడలేకపోయామే అనే బాధ దీక్షిత్ ఆయన బృందానికి ఎప్పుడూ ఉండేది. మేం నజీబ్ కోసం విమానం పంపించాం. అయితే, అది మా విమానం కాదు. ముజాహిదీన్‌లు ఆయన్ను వెళ్లనిస్తారనే అనుకున్నాం. కానీ, అది జరగలేదు. మేం నజీబ్‌ను బయటకు తీసుకొస్తున్నట్లు దండోరా వేసేశాం. కానీ మెయిన్ ప్లేయర్ అయిన రషీద్ దోస్తంతో దాని గురించి మాట్లాడలేదు. నిజానికి నజీబ్‌ను తప్పించడానికి మేం అంతసేపు వెయిట్ చేసుండకూడదు” అన్నారు.

1994లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ డెస్క్ తో కలిసి జాయింట్ సెక్రటరీ ఎంకే భద్రకుమార్ కాబూల్ వెళ్లారు. ఆయనకు కాబూల్లో ఇండియన్ ఏంబసీని తెరవడానికి ప్రయత్నించాలని, నజీబుల్లా భారత్ వెళ్లడానికి అనుమతించాలని అహ్మద్ షాహ్ మసూద్‌ను కోరాలని ఆదేశించారు. కానీ మసూద్ నజీబుల్లా భారత్ వెళ్లేందుకు ఒప్పుకోలేదు. మిగతా ముజాహిదీన్ నాయకులు దానికి అంగీకరించరని చెప్పారు.

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ
ఫొటో క్యాప్షన్, బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ

నజీబ్‌కు ఆశ్రయం- పాకిస్తాన్ ఆఫర్

ఏప్రిల్ 17న నజీబుల్లాను భారత్ వెళ్లకుండా సైనికులు అడ్డుకున్న సమయంలో, పాకిస్తాన్ తమ రాయబార కార్యాలయంలో ఆశ్రయం ఇస్తామని ఆయనకు ఆఫర్ చేసింది. దాని గురించి మాట్లాడ్డానికి పాకిస్తాన్, ఇరాన్ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి కార్యాలయం వెళ్లారు. బెనాన్ వారిని నజీబ్ దగ్గరకు తీసుకెళ్లారు. ఫిలిప్ కార్విన్ తన ‘డూమ్డ్ ఇన్ అఫ్గానిస్తాన్‌’లో ఆ విషయం రాశారు.

“నజీబ్‌కు వారిని చూడగానే కోపం నషాళానికంటింది. ఆయన ఇరాన్ ప్రతినిధిని గట్టిగట్టిగా అరిచారు. ఆయన ఇరాన్ ప్రతినిధిని కిటికీలోంచి కిందికి తోసేస్తాడేమోనని నాకు అనిపించింది. ఆయన ఇద్దరితో, నాకు మీమీద అస్సలు నమ్మకం లేదు. మీ దగ్గర ఆశ్రయం పొందడానికంటే చావడమే మేలు. మీరు నన్ను కాపాడతారని నాకు నమ్మకం కూడా లేదు అన్నారు”.

అహ్మద్ షా మసూద్
ఫొటో క్యాప్షన్, అహ్మద్ షా మసూద్

శవాన్ని లైట్ పోల్‌కు వేలాడదీసిన తాలిబన్లు

నజీబుల్లా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోనే మరో నాలుగున్నరేళ్లు ఉన్నారు. 1996 సెప్టెంబర్ 27న యుఎన్ఓ ఆఫీసులో తన గదిలో ఉన్న నజీబుల్లా తనను చంపడానికి ఎవరో వస్తున్నట్లు కొన్ని శబ్దాలు విన్నారు. కాబూల్‌పై విజయానికి సూచనగా తాలిబన్లు ప్రయోగిస్తున్న బాంబులు, రాకెట్ల శబ్దాలు ఆయనకు తన కోసం వస్తున్న మృత్యువు అడుగుల చప్పుళ్లులా వినిపిస్తున్నాయి.

ఒకటిన్నరకు యుఎన్ ఆఫీస్ బయట తాలిబన్ల 15 ట్రక్కులు వచ్చి ఆగాయి. ఒక్కో ట్రక్కులో దాదాపు పది మంది సైనికులున్నారు. కార్యాలయం బయట గస్తీ కాస్తున్న సెంట్రీలు హఠాత్తుగా అక్కడనుంచి మాయమైపోయారని నజీబుల్లాకు ఉదయం 3 గంటలకు తెలిసింది. ఆయన వెంటనే మరో ఐరాస కార్యాలయానికి ఫోన్ చేసి సాయం చేయాలని వేడుకున్నారు. కానీ, అవతలివైపు మౌనమే సమాధానం అయ్యింది.

ఆ రోజు జరిగిన ఘటనలతో ప్రముఖ జర్నలిస్ట్ డెనిస్ జాన్సన్ ‘స్క్వేర్’ పత్రికకు 1997 ఏప్రిల్‌లో ‘లాస్ట్ డేస్ ఆఫ్ నజీబుల్లా’ హెడ్‌లైన్‌తో ఒక ఆర్టికల్ రాశారు.

తాలిబాన్లు
ఫొటో క్యాప్షన్, తాలిబాన్లు

“కాసేపటికే తాలిబాన్ మిలిటెంట్లు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోకి చొరబడ్డారు. నజీబుల్లా ఎక్కడని అక్కడున్న ఒక నౌకర్‌ను అడిగారు. అతడు ఏదేదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ, వాళ్లు అతడిని పక్కకు తోసి, భవనం అంతా వెతకడం మొదలెట్టారు. నజీబ్, ఆయన సోదరుడు షాహ్‌పూర్ అహ్మద్‌జై, అంగర్షకుడు జాఫ్సర్, సెక్రటరీ తుఖీలను వారు కొన్ని నిమిషాల్లోనే పట్టుకోగలిగారు.

నజీబుల్లాను గది నుంచి బయటకు లాగిన తాలిబన్లు దారుణంగా కొట్టారు. ఆయన మర్మాంగాలను కోసేశారు. తుపాకీతో తలలో కాల్చిచంపారు. తర్వాత ఆయన శవాన్ని మొదట ఒక క్రేన్‌కు కట్టిన తర్వాత రాజమహలుకు దగ్గరగా ఉన్న ఒక లైట్ పోల్‌కు వేలాడదీశారు.

అందరూ చూసే సమయానికి మృతదేహం కళ్లు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఆయన నోట్లో బలవంతంగా కుక్కిన సిగరెట్లు ఉన్నాయి. ఆయన జేబుల్లో కుక్కిన కరెన్సీ నోట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నజీబుల్లా
ఫొటో క్యాప్షన్, నజీబుల్లా

నజీబుల్లాను తీవ్రంగా ద్వేషించే తాలిబాన్లు ఆయన మృతదేహానికి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి కూడా ఒప్పుకోలేదు. నజీబుల్లా, ఆయన సోదరుడి మృతదేహాలను చివరకు రెడ్ క్రాస్‌కు అప్పగించారు. సంస్థ ఆ శవాలను ఫఖ్తియా ప్రాంతంలోని గర్దేజ్‌కు చేర్చింది. అక్కడ అహ్మద్‌జై వంశస్థులు వాటిని ఖననం చేశారు.

నజీబ్ భార్యాపిల్లలకు ఆశ్రయం ఇచ్చినందుకు అఫ్గానిస్తాన్‌లో కొంతమంది ఇప్పటికీ భారత్‌కు ధన్యవాదాలు చెబుతుంటారు.

కానీ, కొత్త స్నేహితులకు దగ్గరయ్యే ప్రయత్నంలో పాత స్నేహితుడిని అత్యంత అవసరమైన సమయంలో పట్టించుకోలేదని కూడా ఫిర్యాదు చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)