అఫ్గానిస్తాన్‌: తమ పాలనలో మహిళల జీవితం ఎలా ఉంటుందో చెప్పిన తాలిబాన్లు

సుహైల్ షాహీన్

ఫొటో సోర్స్, REUTERS/TATYANA MAKEYEVA

ఫొటో క్యాప్షన్, తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్

తాలిబాన్లు గత కొన్ని వారాలుగా కాబుల్ వైపు ఒక్కో అడుగు వేస్తున్నకొద్దీ అఫ్గానిస్తాన్‌ మహిళల్లో ఆందోళన పెరుగుతూ వచ్చింది.

తాలిబాన్ల పాలన మొదలైతే అఫ్గానిస్తాన్‌లో మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వరకు ఆ దేశంలో మహిళల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

"అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతున్న ఘర్షణ, మానవ హక్కుల ఉల్లంఘన వార్తలతో వేల మంది అక్కడ నుంచి పారిపోతున్నారు. అన్ని రకాల హింస ఆగాలి. అంతర్జాతీయ మానవతా చట్టం, మానవ హక్కులు ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కులను సంరక్షించాల్సి ఉంటుంది" అని ఆంటోనియో గుటెరస్ సోమవారం ఒక ట్వీట్ చేశారు.

అఫ్గానిస్తాన్ మహిళలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ మహిళలు

మరోవైపు, తాలిబన్ల పాలనలో మహిళల జీవితం గురించి ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు, నిపుణులు, ప్రముఖులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ తన వాదన వినిపించారు.

తమ ప్రభుత్వంలో మహిళలకు ఉద్యోగం చేయడానికి, చదువుకోడానికి స్వేచ్ఛ ఉంటుందని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు.

తాలిబాన్ల పాలనలోని న్యాయ వ్యవస్థ, పరిపాలన, సామాజిక వ్యవస్థ గురించి సుహైల్ బీబీసీ ప్రతినిధి యాల్దా హకీమ్‌తో మాట్లాడారు.

వీడియో క్యాప్షన్, కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు

యాల్దా హకీమ్ - తాలిబాన్ల పాలనలో మహిళలు న్యాయమూర్తి కాగలరా?

సుహైల్ షాహీన్ - న్యాయమూర్తులు ఉంటారనడంలో సందేహం లేదు. కానీ మహిళలు వారికి సహకారం అందించే ఉద్యోగాలు చేయవచ్చు. వారికి వేరే ఉద్యోగాలు ఉండవచ్చు. అది భవిష్యత్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది.

యాల్దా హకీమ్- జనం ఎక్కడ పనిచేయవచ్చు, ఎక్కడకు వెళ్లవచ్చు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందా?

సుహైల్ షాహీన్ - అది భవిష్యత్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. స్కూల్ లాంటి వాటికి యూనిఫాంలు ఉంటాయి. మేం విద్యా రంగం కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థతోపాటూ ప్రభుత్వానికి చాలా పని ఉంటుంది. కానీ మహిళలకు ఉద్యోగం చేసే, చదువుకునే స్వేచ్ఛ ఉంటుంది అనేదే మా విధానం.

వీడియో క్యాప్షన్, తాలిబన్ల అధీనంలోని ప్రాంతం నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

90వ దశకంలోని పరిస్థితి ఉంటుందా లేక పాలన కొత్తగా ఉంటుందా?

యాల్దా హకీమ్- ఇంతకు ముందులా, మహిళలు ఇంటి నుంచి బయటికెళ్లాలంటే తండ్రి, భర్త, సోదరుడు ఇలా మగవారిని ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంలో ఉండదు కదా?

సుహైల్ షాహీన్ - కచ్చితంగా ఉండదు. వారు ఇస్లాం చట్టాల ప్రకారం అన్నీ చేయవచ్చు. గతంలో కూడా మహిళలు ఒంటరిగా రోడ్లపై వెళ్లడం మీరు చూసుంటారు.

యాల్దా హకీమ్- ఇంతకు ముందు మహిళలు ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్తే, పోలీసులతో కొట్టించేవారు. మేం మాట్లాడిన ఎంతోమంది మహిళలు తమ తండ్రి, సోదరుడు, భర్తతోనే ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించేవారని చెప్పారు.

సుహైల్ షాహీన్ - లేదు, అలా ఏం లేదు. అలా ఇకముందు కూడా జరగదు.

యాల్దా హకీమ్- తాలిబాన్లు మళ్లీ రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న యువతులకు, బాలికలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?

సుహైల్ షాహీన్ - వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. మేం వారి గౌరవం, ఆస్తి, పని, చదువుకునే హక్కులను కాపాడ్డానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి వారు ఆందోళనకు గురికావాల్సిన అవసరమే లేదు. చదువుకునే దగ్గరి నుంచి ఉద్యోగం చేయడం వరకు వారి పరిస్థితులు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉంటాయి.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

యాల్దా హకీమ్- నేను కొంతమంది తాలిబాన్ కమాండర్లతో మాట్లాడాను. వారంతా బహిరంగ మరణదండన, స్టోనింగ్(రాళ్లతో కొట్టడం) చేతులు, కాళ్లు నరకడం లాంటి శిక్షలు విధించే చట్టాలు కోరుకుంటున్నారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా?

సుహైల్ షాహీన్ - ఇది ఒక ఇస్లామిక్ ప్రభుత్వం. కాబట్టి అదంతా ఇక్కడి ఇస్లామిక్ చట్టాలు, రిలిజియస్ ఫోరం, కోర్టు నిర్ణయిస్తాయి. శిక్ష గురించి వారు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజుల క్రితం మరో తాలిబాన్ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ కూడా ఇదే అంశం గురించి చెప్పారు. ఈ విషయం ఇస్లామిక్ చట్టానికి సంబంధించినది అన్నారు.

ఇవి కూడా చదవండి:

వీడియో క్యాప్షన్, నా ముగ్గురు కొడుకుల్ని చంపారు, ఇక నేను బతకలేను

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)