అఫ్గానిస్తాన్: జైలును స్వాధీనం చేసుకుని ఖైదీలందరినీ వదిలేశామని ప్రకటించిన తాలిబన్లు -Newsreel

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, EPA

అఫ్గానిస్తాన్‌లోని ఉత్తర జాజాన్ ప్రావిన్స్‌లో ఓ జైలును ఆధీనంలోకి తీసుకుని, అక్కడి ఖైదీలను విడిచిపెట్టేశామని తాలిబన్లు ప్రకటించారు.

తాలిబాన్ల దాడి అనంతరం, షెబెర్గాన్ నగరంలోని జైలు నుంచి వందల మంది ఖైదీలు పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

షెబెర్గాన్ నగరాన్ని ఇప్పటికే తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన రెండో ప్రాంతీయ రాజధాని ఈ నగరమే.

దేశ భద్రతా బలగాలకు ఇదొక పెద్ద సవాల్ లాంటిదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా తాలిబన్లు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి.

అఫ్గానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తోమ్‌కు షెబెర్గాన్ కంచుకోట లాంటిది. ఇక్కడ ఆయన మద్దతుదారులు భద్రతా బలగాలతో కలిసి తాలిబన్లపై పోరాడుతున్నారు.

అఫ్గాన్ భద్రతా బలగాలకు సాయం చేసేందుకు మరో 150 మంది నగరానికి చేరుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, EPA

మొదట ఇక్కడి ప్రాంతీయ గవర్నర్ కార్యాలయాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, భీకర ఘర్షణల అనంతరం మళ్లీ భద్రతా బలగాలు ఈ ప్రాంతంపై పట్టు సాధించాయి.

వైమానిక స్థావరాలు మినహా నగరంలోని అన్ని ప్రాంతాలపై తాలిబన్లు పట్టు సాధించారని సీనియర్ ప్రభుత్వ అధికారి బాబుర్ ఎస్చి.. బీబీసీతో చెప్పారు. వైమానిక స్థావరాల వద్ద ఇంకా ఘర్షణలు కొనసాగుతున్నాయని వివరించారు.

అధికారులంతా స్థానిక విమానాశ్రయానికి పరుగులు తీశారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో జవ్జాన్ డిప్యూటీ గవర్నర్ ఖాదెర్ మలియా తెలిపారు.

నిమ్రోజ్ ప్రావిన్స్‌ రాజధాని జరంజ్‌ను ఇప్పటికే తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తొలి ప్రాంతీయ రాజధాని ఈ నగరమే.

హెరాత్, కాందహార్, లష్కర్‌గాహ్ తదితర ప్రాంతీయ రాజధానుల్లోనూ ఘర్షణలు భీకరంగా జరుగుతున్నాయి.

పరిస్థితులు దిగజారుతుండటంతో వెంటనే వెనక్కి వచ్చేయాలని తమ దేశ పౌరులను అమెరికా, బ్రిటన్ అభ్యర్థించాయి.

టోక్యో రైలు దాడి

ఫొటో సోర్స్, Reuters

టోక్యో: సంతోషంగా ఉన్నారని రైల్లోని ప్రయాణికులను పొడిచిన యువకుడు

టోక్యోలో నడుస్తున్న రైల్లో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడంతో, పది మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

"రైల్లో ఉన్న మహిళలు చాలా సంతోషంగా కనిపించడంతో, నాకు చాలా కోపం వచ్చింది, అందుకే వాళ్లను చంపాలనుకున్నా" అని 36 ఏళ్ల నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

బాధితుల్లో ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడగా, మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి.

జపాన్‌లో హింసాత్మక నేరాలు జరగడం చాలా అరుదు. ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతుండడం వల్ల టోక్యోలో కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.40కి ఒక వ్యక్తి సీజోగాకూన్ స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు.

ఆ దాడి తర్వాత బోగీలోంచి అరుపులు వినిపించడంతో డ్రైవర్ రైలును అత్యవసరంగా ఆపేశారు.

దాడి జరిగిన రైలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దాడి జరిగిన రైలు

తర్వాత నిందితుడు రైల్లోంచి దూకి పారిపోయాడని, రైలు సిబ్బంది ప్రయాణికులను పట్టాల మీదుగా నడిపించుకుని సమీప స్టేషన్‌కు తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు.

జనం హఠాత్తుగా తనవైపు దూసుకొచ్చారని, ఒక బోగీ లోంచి మరో బోగీలోకి పరుగులు తీశారని ఒక ప్రత్యక్ష సాక్షి ఎన్‌హెచ్‌కే న్యూస్‌కు చెప్పారు.

ఈ దాడి చేసిన వ్యక్తి తర్వాత ఒక షాపు దగ్గరకు వెళ్లి న్యూస్‌లో చూపిస్తున్న ఘటనలో నిందితుడిని తనేనని, పారిపోడానికి ప్రయత్నించానని అక్కడి సిబ్బందికి చెప్పాడు.

30ల్లో ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని శనివారం ఉదయం టోక్యో పోలీసులు కూడా చెప్పారు. మిగతా వివరాలేవీ వారు వెల్లడించలేదు.

ఈ ఘటనలో గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రిలో చేర్పించగా, ఒకరు వెళ్లిపోయారు.

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా భావించే జపాన్‌లో గత కొన్నేళ్లుగా కత్తి దాడులు పెరుగుతున్నాయి.

2019లో కూడా కావసాకిలో బస్సు కోసం వేచిచూస్తున్న స్కూలు పిల్లలపై ఇద్దరు దాడి చేశారు. అప్పుడు 18 మంది వరకూ గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)