ప్లాస్టిక్ సర్జరీ: ప్రమాదం అని తెలిసినా చైనాలో ఈ సర్జరీలు ఎందుకు ఎక్కువగా చేయించుకుంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వయి ఇప్
- హోదా, బీబీసీ న్యూస్
చాలా మంది అమ్మాయిల్లాగే, 23 ఏళ్ల రక్సిన్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లను ప్రతి రోజూ చూస్తుంటారు.
కానీ, ఆ ఫీడ్‌లో ఆమె కాస్మెటిక్ సర్జరీ (సౌందర్య శస్త్రచికిత్స)కు సంబంధించి సమాచారం కోసం వెతుకుతుంటారు..
ఆమె ఎప్పటినుంచో కళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారు. అయితే, ఆ సర్జరీ కంటి సమస్యల కోసం కాదు. ఆమె అందమైన కళ్ల కోసం అది చేయించుకోవాలని అనుకుంటున్నారు.. ఈ సర్జరీలో కంటికి చిన్న గాటు పెట్టి డబుల్ ఐలిడ్ సర్జరీ చేస్తారు. దాంతో, ఆమె కళ్లు పెద్దవిగా కనిపించే అవకాశం ఉంది.
గేంగ్మెయి అనే యాప్‌లో లాగిన్ అయిన ఆమె ఈ శస్త్ర చికిత్స చేసే సర్జన్ కోసం వెతుకుతూ ఉంటారు.
"గ్వాంగ్‌ఝోలో సౌందర్య శస్త్ర చికిత్సలు చేసే చాలా క్లినిక్‌లు ఉన్నాయి. కానీ, నాకు మంచి క్లినిక్‌కు వెళ్లాలని ఉంది. నేను నా ముఖానికి చేయించుకుంటున్నాను కదా" అని ఆమె బీబీసీకి చెప్పారు.
గేంగ్మెయి అంటే అందంగా ఉండటం అని అర్ధం. కాస్మెటిక్ సర్జరీలకు సంబంధించిన ఇలాంటి యాప్‌లు చైనాలో చాలా ఉన్నాయి. అందులో యూజర్లు ప్లాస్టిక్ సర్జరీ, లైపోసక్షన్, ముక్కు సరిచేయడం లాంటి అప్‌డేట్లు పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఈ యాప్‌లలో సెర్చ్ ఫలితాలను ఫిల్టర్ చేసుకునే వీలు కూడా ఉంటుంది.

ఫొటో సోర్స్, Gengmei/So-young
2013లో ఈ యాప్‌ను లాంచ్ చేశారు. అప్పుడు 10 లక్షల మంది యూజర్లు ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 3.6 కోట్లకు పెరిగింది. అందులో సగం మంది 20లలో ఉన్న అమ్మాయిలే ఉన్నారు.
కాస్మెటిక్ సర్జరీ ప్లాట్‌ఫార్మ్ 'సో యంగ్' లో కూడా 2018లో 14 లక్షల మంది యూజర్లు ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం 84 లక్షలకు పెరిగింది.
చైనాలో కాస్మెటిక్ సర్జరీ పట్ల మారుతున్న ధోరణిని ఈ పెరుగుతున్న యూజర్ల సంఖ్య చెబుతోంది. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కాస్మెటిక్ సర్జరీలు జరుగుతున్న దేశం చైనానే.
ఈ కాస్మెటిక్ సర్జరీ మార్కెట్ నాలుగేళ్లలో మూడింతలు పెరిగిందని డెలాయిట్ నివేదిక చెబుతోంది. 2019లో 28.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో దీని మార్కెట్ విలువ 27.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది అంతర్జాతీయ వృద్ధి రేటు కంటే 8.2 శాతం ఎక్కువ.
ఇదే పంథా కొనసాగితే, ఈ దశాబ్దం మధ్య నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మెటిక్ సర్జరీ మార్కెట్‌గా అవతరిస్తుందని ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
కళ్లకు, చెంపలకు చేసే సర్జరీలు అన్నిటి కంటే ఎక్కువ పాపులర్ అయ్యాయి. కొత్త రకమైన శస్త్ర చికిత్సలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. అందులో చెవులకు సంబంధించిన సర్జరీలు కూడా ఉన్నాయి.
గతంలో ఇలాంటి సర్జరీలు చేసుకోవడాన్ని తప్పుగా చూసినప్పటికీ , 1996 తర్వాత పుట్టిన తరం వారు కొత్తరకం శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు.
రక్సిన్ ఒక ఫ్యాషన్ రిటైల్ సంస్థలో పని చేస్తున్నారు. ఆమె స్నేహితులు ఈ కాస్మెటిక్ ప్రక్రియల గురించి బాహాటంగా మాట్లాడుకుంటారని ఆమె చెప్పారు.
"సర్జరీ చేయించుకున్నట్లు ప్రచారం చేసుకోరు, కానీ, ఎవరైనా అడిగితే మాత్రం ఆ విషయం చెప్పడానికి సంకోచించరు" అని ఆమె చెప్పారు.
మరింత నియంత్రణ అవసరం
కానీ, చైనాలో కాస్మెటిక్ సర్జరీ విప్లవంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.
చైనాలో 2019లో 60 వేల లైసెన్సు లేని ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్‌లు ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ నివేదిక తెలిపింది.
ఈ క్లినిక్‌ల వల్ల ఏటా 40 వేల వైద్యపరమైన తప్పిదాలు జరుగుతున్నట్లు అది పేర్కొంది. అంటే, సగటున రోజుకు 110 సర్జరీలు విఫలమవుతున్నాయి.
గావ్ లియూ అనే నటికి చేసిన సర్జరీలో ఆమె ముక్కుకు గాయమై, ముక్కు చివర టిష్యుూ పూర్తిగా నిర్జీవం అయ్యింది. ఆమె తన సమస్యను వివరిస్తూ ఆన్‌లైన్‌లో ఫోటోలు కూడా షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Weibo/Gao Liu
ఇప్పుడు ఆ ముక్కును సరిచేయడానికి మరో సర్జరీ అవసరమని ఆమె చెప్పారు. కానీ, ఈ సమస్య కోసం ఆమె ఇప్పటికే 4 లక్షల యువాన్‌లు (రూ.46 లక్షలు పైనే) ఖర్చు చేశారు.
ఆమెకు ఆ సర్జరీ చేసిన డాక్టరును ఆరునెలల వరకు సస్పెండ్ చేశారు. ఆ ఆసుపత్రికి 49 వేల యువాన్లు (రూ. 5.5 లక్షలు పైనే) జరిమానా విధించారు.
అయితే, ఈ జరిమానా వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఇంటర్నెట్‌లో చాలా మంది అంటున్నారు.
"ఆమె వైకల్యానికి గురయినందుకు విధించే శిక్ష ఇంతేనా" అని, ఒక ఇంటర్నెట్ యూజర్ ప్రశ్నించారు ఇలాంటి సర్జరీలపై మరిన్ని నియంత్రణలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
వినియోగదారులు చేసే ఫిర్యాదులను మరింత నిశితంగా పరిశీలించేందుకు, లైసెన్స్ లేని కాస్మెటిక్ సర్జరీలు చేసే క్లినిక్‌లను గుర్తించేందుకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గత నెలలో ప్రచారం చేపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకు?
చైనాలో చాలా మంది తమ బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అందంగా కనిపించాలనే తపన ఈ కాస్మెటిక్ సర్జరీ ట్రెండ్‌కు దారి తీస్తోందని నిపుణులు బీబీసీతో అన్నారు.
"ఈ ధోరణి కేవలం రొమాన్స్ కోసమే కాదు, ఉద్యోగాలు సంపాదించేందుకు కూడా" అని హాంకాంగ్ యూనివర్సిటీ జెండర్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రెండా అలెగ్రే చెప్పారు.
చైనాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ఫోటోలను కూడా జత చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని ఉద్యోగ ప్రకటనలు శరీరం కొలతలు కూడా అడుగుతాయి. ఆ ఉద్యోగం మహిళలే చేయాల్సిన అవసరం లేకపోయినా, మహిళా ఉద్యోగులకు ఎక్కువగా ఇలాంటి నియమాలు ఉంటాయి.
"బట్టలు అమ్మడానికి అందమైన సేల్స్ ఉద్యోగి కావాలి"లాంటి ఉద్యోగ ప్రకటనలను 2018లో హ్యూమన్ వాచ్ రిపోర్ట్ ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే, ఫ్యాషన్‌గా, అందంగా ఉన్న ట్రయిన్ కండక్టర్ కావాలని కూడా ఇచ్చిన ప్రకటనలు ఉన్నాయి.
ఇంటర్నెట్ ఆవిర్భావంతో కొత్త కొత్త రకాల ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. అందులో బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చేవి ఎక్కువగా ఉంటున్నాయి.
గతంలో కంటే, ఇటీవల కాలంలో బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం పెరిగిందని నిపుణులు అంటున్నారు.
"అందంగా ఉండటం వల్ల ఆ అవకాశాలు కొంతవరకు పెరగొచ్చు. ఉదాహరణకు లైవ్ స్ట్రీమింగ్ చేయడం, ఆన్‌లైన్‌లో వీడియోలను పెట్టడం వల్ల కూడా చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు" అని గేంగ్మెయి వైస్ ప్రెసిడెంట్, వాంగ్ జున్ బీబీసీకి చెప్పారు.
తమ సంస్థ లైసెన్స్ ఉన్న డాక్టర్లతోనే పని చేస్తుందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అందంగా ఉండడం.. వికృతంగా మారడం..
చైనా వార్తా పత్రికల సంస్కృతి కూడా అమానుషంగానే ఉంటుంది. కొన్ని ప్రచురణలు సెలబ్రిటీల బాహ్య సౌందర్యం గురించి విమర్శలు చేస్తుంటాయి.
ముందు ముందు ప్రజలు బాహ్య సౌందర్యం విషయంలో మరింత సూటిగా వ్యవహరిస్తారని, కాస్మెటిక్ సర్జరీ గురించి పుస్తకం రాస్తున్న లూ యుఫాన్ అనే ఫోటోగ్రాఫర్ అన్నారు.
"మా బంధువులు నన్ను కామెడీ పాత్రలు చేసే టెలివిజన్ నటిలా ఉన్నావని అంటుంటారు" అని యుఫాన్ చెప్పారు.
"అలాగే, నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా క్లాస్‌లో అబ్బాయిలు వారికి అంద వికారంగా అనిపించిన అమ్మాయిల జాబితా తయారు చేశారు. అందులో నాది అయిదో స్థానం అని నాకే చెప్పారు" అని ఆమె అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Lu Yufan
లూ ఆమె ప్రాజెక్టులో భాగంగా 30 కాస్మెటిక్ సర్జరీ క్లినిక్‌లను సందర్శించారు. ఆ సమయంలో కూడా తన ముఖాన్ని ఎలా మెరుగుపరచవచ్చో చెప్పడానికి అక్కడ ఉన్నవారు వెనకాడలేదని ఆమె చెప్పారు.
" వాళ్లు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించినపుడు, వద్దని చెప్పడానికి నాకు చాలా కష్టం అయింది. చివరికి నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పి తప్పించుకున్నా" అన్నారు.
రక్సిన్ చేయించుకోవాలని అనుకుంటున్న కంటి సర్జరీకి 300 డాలర్ల నుంచి 1200 డాలర్ల మధ్యలో ఖర్చవుతుంది. కానీ అది తొలి దశకు మాత్రమే.
"ఈ సర్జరీ బాగా జరిగితే, నేను మరిన్ని చేయించుకుంటాను. అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు?" అంటున్నారు ఆమె.
ఇవి కూడా చదవండి:
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








