బండ్ల శిరీష, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images/Sirisha/Twitter
బండ్ల శిరీష రోదసి యాత్ర మరికొద్ది గంటల్లో మొదలు కానుంది.
బ్రిటిష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ పంపిస్తున్న 'యూనిట్' వ్యోమ నౌకలో ఆమె రోదసిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఆమె రోదసి యాత్ర విజయవంతమైతే ఆ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి కావడంతో పాటు నాలుగో భారత్/భారత్ మూలాలున్న వ్యక్తి అవుతారు. భారత్ మూలాలున్న మూడో మహిళ అవుతారు.
ఇంతకుముందు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రలు చేయగా ఇప్పుడు శిరీష అందుకు సిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, Twitter/bandlasirisha
బండ్ల శిరీష.. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతరిక్షం దాకా
బండ్ల శిరీష(34) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాలలో అమ్మమ్మ గారింట్లో జన్మించారు.
శిరీష తల్లిదండ్రులది గుంటూరు జిల్లా. 1989లో ఆ కుటుంబం అమెరికాలోని హ్యూస్టన్‌కు తరలిపోయింది.
తండ్రి మురళీధర్ పెథాలజిస్ట్‌గా పనిచేస్తారు.

ఫొటో సోర్స్, virgingalactic
2011లో శిరీష తన ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతరం జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు.
ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, BRUCE WEAVER/gettyimages
కల్పన చావ్లా... భూమిని చేరుతూ తిరిగిరాని లోకాలకు
హరియాణాలోని కర్నాల్‌లో జన్మించిన కల్పన చావ్లా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి చేరుకుంటున్న దశలో 'కొలంబియా' స్పేస్ షటిల్ కూలి మరణించారు.
భారత్‌లోనే ఆమె విద్యాభ్యాసమంతా సాగింది. కర్నాల్‌లోని ఠాగోర్ స్కూల్‌లో చదివిన ఆమె అనంతరం పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో 1982లో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకున్నారు. అనంతరం టెక్సస్ యూనివర్సిటీ నుంచి 1984లో మాస్టర్ ఆఫ్ స్పేస్ డిగ్రీ సంపాదించారు. 1988లో కొలరాడో యూనివర్సిటీ నుంచి ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ అందుకున్నారు.
1988 నుంచి ఆమె నాసా రీసెర్చ్ సెంటర్‌లో పనిచేయడం ప్రారంభించారు. అంతరిక్షయానం కోసం 1994లో ఆమెను ఎంపిక చేయగా 1995లో జాన్సన్ స్పేస్ సెంటర్‌లో చేరి ఏడాది శిక్షణ పూర్తిచేసుకున్నారు.
1997లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేసిన ఆమె అనంతరం 2003లో కొలరాడో స్పేస్ షటిల్‌లో మరోసారి రోదసిలోకి వెళ్లారు. స్పేస్ షటిల్ షెడ్యూల్ కంటే 16 నిమిషాలు ముందు భూమిని చేరి ప్రమాదానికి గురవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం 30 రోజుల 14 గంటల 54 నిమిషాలు ఆమె అంతరిక్షంలో ఉన్నారు.
మొదటి విడతలో 1997 నవంబరు 19న ఎస్‌టీఎస్-87 కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో వెళ్లిన ఆమె ఆ ఏడాది డిసెంబరు 5 వరకు అంతరిక్షంలో ఉండి తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు.
రెండోసారి 2003 జనవరి 16న ఎస్‌టీఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్‌లో వెళ్లిన ఆమె ఫిబ్రవరి 1 వరకు అంతరిక్షంలో ఉన్నారు. తిరిగి భూమిని చేరుకోవడంలో ఎస్‌టీఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదానికి గురి కావడంతో కల్పన మరణించారు.
- 'చంద్రుడిపైకి వెళ్లేందుకు ఎనిమిది మంది కావలెను’
- నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్ ఇంటర్వ్యూ: ‘‘భూమి మీద నుంచి సూక్ష్మజీవులు మార్స్ మీదకు

ఫొటో సోర్స్, Getty Images
సునీత విలియమ్స్.. 322 రోజులు అంతరిక్షంలోనే
సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది భారత్‌లోని గుజరాత్ రాష్ట్రం. తల్లి అమెరికన్. సునీత జననం, విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే.
సునీత విలియమ్స్ 1965 సెప్టెంబరు 19న ఓహియో రాష్ట్రం యూక్లిడ్‌లో జన్మించారు.
మసాచూషెట్స్‌లోని నీధమ్ హైస్కూల్‌లో చదివిన ఆమె 1987లో యూఎస్ నావల్ అకాడమీలో భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేశారు. 1995లో ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు.
అనంతరం 1998లో ఆమె నాసాలో ఆస్ట్రోనాట్‌గా ఎంపికయ్యారు.
కల్పన చావ్లా తరహాలోనే సునీత విలియమ్స్ కూడా రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు.
2006 డిసెంబర్ 9న తొలిసారి ఎస్‌టీఎస్-116లో అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె డిసెంబరు 11న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చేరారు. ఆ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన 14 మంది బృందంలో సునీత ఫ్లైట్ ఇంజినీర్. 2007 జూన్ 22 వరకు అంతరిక్షంలో ఉన్నారామె.
నాలుగు సార్లు స్పేస్ వాక్( మొత్తం 29 గంటల 17 నిమిషాలు) చేసిన తొలి మహిళగా ఆమె పేరిట ప్రపంచ రికార్డ్ ఉంది. 2008లో పెగ్గీ విట్సన్ అయిదుసార్లు స్పేస్ వాక్ చేసి ఆ రికార్డు బద్దలుగొట్టారు.
సునీత రెండోసారి 2012 జులై 14న అంతరిక్షంలోకి వెళ్లారు. నవంబరు 18 వరకు అంతరిక్షంలోనే ఉన్నారు.
రెండుసార్లు కలిపి మొత్తం 322 రోజులు అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ అన్ని రోజులు అంతరిక్షంలో ఉన్న ఆరో ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో ఉన్న మహిళల్లో ఆమెది రెండో స్థానం.
ఇవి కూడా చదవండి:
- మార్స్ మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- మార్స్ రోవర్: అంగారకుడిపై నాసా హెలీకాప్టర్ ప్రయోగం... రైట్ బ్రదర్స్ తొలి విమాన ప్రయోగానికి సమానమైందా?
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్ ఇంటర్వ్యూ: ‘‘భూమి మీద నుంచి సూక్ష్మజీవులు మార్స్ మీదకు చేరకుండా చూడటం చాలా కష్టమైన పని’’
- వఖాన్ కారిడార్: అఫ్గానిస్తాన్‌లోని ఈ అందమైన సీమలో చైనా ఎందుకు రహదారి నిర్మిస్తోంది?
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- వీపీ సింగ్ కేబినెట్లోని పర్వతనేని ఉపేంద్ర దూరదర్శన్ను ఆయనపై ఆయుధంగా వాడుకున్నారా
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








