శిరీష బండ్ల: ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి

శిరీష బండ్ల

ఫొటో సోర్స్, Twitter/sirisha bandla

ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోంది.

దీనిలో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు మూలాలున్న యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు.

ఈ అంతరిక్ష యానం కోసం వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమనౌకను సిద్ధంచేసింది. ముఖ్యంగా అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం దీన్ని అభివృద్ధి చేసింది.

ఈ రాకెట్‌లో అంతరిక్షం వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

రిచర్డ్ బ్రాన్సన్

ఫొటో సోర్స్, virgin galactic

అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌కు అమెరికాకు చెందిన ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీచేసింది.

దీంతో ఈ నెల 11న ప్రయోగం చేపట్టేందుకు వర్జిన్ గెలాక్టిక్ సిద్ధమవుతోంది. ‘‘వాతావరణం అనుకూలించకపోతే లేదా ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ఈ ప్రయోగం కొన్ని రోజులు వాయిదా పడుతుంది. కానీ తప్పకుండా ప్రయోగం జరుగుతుంది’’అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా ఈ నెల 20న అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)