మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు

ఫొటో సోర్స్, Getty Images
మిజోరాం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. 'ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం'గా భావించే జియోనా కుటుంబం ఉండేది కూడా ఇక్కడే.
ఈ కుటుంబ పెద్ద 76 ఏళ్ల జియోనా చానా ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు.
జియోనా కొంతకాలంగా డయాబెటిస్, రక్తపోటుతో బాధపడుతున్నారు.
"చనిపోవడానికి ముందు మూడు రోజులుగా బక్తావంగ గ్రామంలోని తన నివాసంలోనే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆయన మరణించారు" అని ఆ ఆస్పత్రి డైరెక్టర్ లాల్రింట్లువంగా తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
వంద గదులున్న ఇల్లు
మిజోరాం పర్వత ప్రాంతాల్లో ఉన్న బక్తావంగ తలంగనుం గ్రామంలో జియోనా కుటుంబం నివసిస్తోంది.
నాలుగు అంతస్థులు, వంద గదులున్న ఆ ఇల్లు మిజోరాంలో ఓ ఆకర్షణగా నిలిచింది. అక్కడకు వెళ్లిన పర్యటకులు వీరి కుటుంబాన్ని చూసి వస్తుంటారు.
ఒక విధంగా వీరి కుటుంబం మిజోరాం గుర్తింపుగా మారిందని చెప్పవచ్చు.
మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా ట్విట్టర్ ద్వారా జియోనా చానా మరణానికి సంతాపం తెలియజేశారు.
"38 మంది భార్యలు, 89 పిల్లలతో ప్రపంచంలోనే అతిపెద్ద సంసారాన్ని నడిపిన జియోనా చానా మరణానికి చింతిస్తూ ఆయనకు మిజోరాం తుది వీడ్కోలు పలుకుతోంది. వారి కుటుంబం వల్లే వారి గ్రామం, మిజోరాం కూడా పర్యటక కేంద్రాలుగా వెలుగొందాయి. రెస్ట్ ఇన్ పీస్, సర్" అంటూ జోరమ్‌తంగా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
17 ఏళ్ల వయసులో మొదటి వివాహం
వివిధ వార్తా సంస్థలు అందించిన సమాచారం ప్రకారం, జియోనాకు 17 ఏళ్ల వయసులో మొదటి వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య ఆయనకన్నా మూడేళ్లు పెద్ద.
జియోనా చువాంతర్ సముదాయానికి నాయకుడుగా వ్యవహరించారు. 1942లో హమావంగకాన్ నుంచి తరిమికొట్టిన తరువాత జియోనా వాళ్ల తాత ఖువాంగతుహా ఈ సమితిని ప్రారంభించారు. అప్పటి నుంచి వారి కుటుంబం ఐజ్వాల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్తావంగ గ్రామంలో నివసిస్తోంది.
ఈ సముదాయంలో సుమారు 400 కుటుంబాలు ఉన్నాయి.
వీరి సంప్రదాయంలో బహుభార్యత్వం అమలులో ఉంది.
అయితే, జియోనా కుటుంబమే ప్రపంచంలో అతిపెద్దదని చెప్పడం కష్టం. ఎందుకంటే తమదే ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం అని చాలామంది చెప్పుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








