అసోం, త్రిపుర రాష్ట్రాలతో మిజోరాంకు గొడవలు ఎందుకు వచ్చాయి?

అసోమ్, మిజోరాం

ఫొటో సోర్స్, Anuwar Hazarika/NurPhoto via Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండు పొరుగు రాష్ట్రాలతో తమకు నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈశాన్య రాష్ట్రం మిజోరాం కోరింది. అయితే, పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉన్నట్లు చెబుతున్నారు.

అసోం, త్రిపుర రాష్ట్రాలతో మిజోరాంకు వివాదాలు ఏర్పడ్డాయి.

కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సోమవారం అసోం, మిజోరాం రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఈ రెండు వివాదాలూ రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించే ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అసోంతో వివాదం

తమ మధ్య జరుగుతున్న చర్చల విషయంలో సంతృప్తితో ఉన్నామని, సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని అసోం, మిజోరాం ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల మధ్య ఓ చిన్న విషయం వివాదంగా మారింది. శనివారం రాత్రి కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అసోంలోని లైలాపుర్‌లో మిజోరాం అధికారులు కోవిడ్-19 తనిఖీ శిబిరం ఏర్పాటు చేశారని... ఆ రాష్ట్రంలోకి వెళ్లే ట్రక్కు డ్రైవర్లకు, ఇతరులకు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారని దక్షిణ అసోం పోలీస్ డీఐజీ దిలీప్ కుమార్ తెలిపారు.

తమ రాష్ట్రంలో మిజోరాం ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించడమేంటని అసోం ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ విషయమై అసోం ప్రబుత్వ అధికారులు అభ్యంతరం చెప్పారని, ఇంతలో అక్కడికి కొందరు మిజోరాం యువకులు వచ్చి ట్రక్కులు, ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేశారని లైలాపుర్ జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయని వివరించారు.

ప్రధాన రహదారి మార్గంలో అసోం పోలీసులు మూడు చోట్ల చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారని, అత్యవసర వస్తువులతో వస్తున్న వాహనాలను అడ్డుకున్నారని మిజోరాం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

థింఘులున్, సాయీహాయీపూయీ, వాయరెంగటే ప్రాంతాల్లో అసోం ప్రభుత్వం ఇలా వాహనాల రాకపోకలను అడ్డుకుందని మిజోరాం ప్రభుత్వం పేర్కొంది.

ఈ అంశమై మిజోరం మంత్రి మండలి అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది. అనంతరం మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్‌థాంగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని, సోనోవాల్ కూడా వివాద పరిష్కారానికి చొరవ చూపించారని జోరామ్‌థాంగ్ అన్నారు. సోనోవాల్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేశారు.

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతంలో అసోం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పరిమల్ సుక్లా పర్యటించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి కుదుటపడిందని పాత్రికేయులతో ఆయన చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, BARCROFT MEDIA

త్రిపురతో వివాదం

ఇటు త్రిపురతో మిజోరాంకు గొడవ ఏర్పడటానికి కూడా కారణం సరిహద్దు వివాదమే.

మిజోరాంకు చెందిన కొందరు గిరిజన యువకులు మామిత్ జిల్లాలో గుడి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ జిల్లా అధికార యంత్రాంగం దీనికి అనుమతి ఇవ్వలేదని త్రిపుర హోంశాఖ అదనపు కార్యదర్శి ఆనిందియా భట్టాచార్య్ అన్నారు.

ఈ విషయంలో ఉద్రిక్తతలు పెరగడటంతో ఆ ప్రాంతంలో మిజోరాం 144 సెక్షన్ విధించింది. అయితే, సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడంతో త్రిపురలోని మామిత్ జిల్లాలో కూడా దీన్ని అమలు చేశారు.

దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. అయితే, సీనియర్ అధికారులు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితులు శాంతించాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ చెబుతున్నాయి.

అసోంతో మిజోరాంకు దాదాపు 165 కి.మీ.ల పొడవైన సరిహద్దు ఉంది. అయితే, దీన్ని సరిగ్గా గుర్తించలేదు. దీంతో మాటిమాటికీ వివాదాలు తలెత్తుతున్నాయి.

సరిహద్దును గుర్తించే ప్రక్రియ 1995లో మొదలైందని, ఇంకా పూర్తి కాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అసోంలోని లైలాపుర్ జిల్లా కూడా ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఒకటి. ఈ జిల్లాలోని ఓ పెద్ద ప్రాంతం తమదని మిజోరాం అంటోంది. సరిహద్దులు సరిగ్గా గుర్తించకపోవడంతో స్థానికులకు ప్రభుత్వాల కల్పించే ప్రయోజనాలు కూడా సరిగ్గా అందడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)