చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?

టిబెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నార్బెట్రో పెరెడెస్‌
    • హోదా, బీబీసీ ముండో

టిబెట్‌ 1949కి ముందు 40 సంవత్సరాలపాటు స్వతంత్రంగా ఉంది. నిజమైన స్వేచ్ఛను అనుభవించింది. కానీ చైనాలో కమ్యూనిస్టు విప్లవం తర్వాత ఈ హిమాలయ ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. చరిత్ర కూడా మారడం మొదలు పెట్టింది.

1950 అక్టోబర్ 7న వేల మంది మావో సెటుంగ్‌ (మావో జెడాంగ్‌) నాయకత్వంలోని సైనికులు టిబెట్‌లోకి ప్రవేశించారు. అక్టోబర్ 19న చమదు అనే పట్టణ శివార్లను స్వాధీనం చేసుకున్నారు. సైన్యం టిబెట్‌లోకి రావడం చూసి అధికారులు, ప్రజలు భయపడి పోయారు.

ఎనిమిది నెలలపాటు కొనసాగిన ఆక్రమణ, అనేక ఒత్తిళ్ల తర్వాత టిబెట్‌ నాయకుడు, బౌద్ధ మత గురువు దలైలామా వివాదాస్పద సెవెంటీన్‌ పాయింట్‌ అగ్రిమెంట్‌(17 పాయింట్ల ఒప్పందం)పై సంతకం చేయడంతో ముగిసింది. ఇది టిబెట్‌ను చైనాలో అంతర్భాగం చేసే ఒప్పందం.

కానీ ఈ అగ్రిమెంట్‌ చెల్లదంటారు దలైలామా. "ఈ ఒప్పందం నిస్సహాయమైన ప్రభుత్వంతో బలవంతంగా చేయించింది. ఇది మా ప్రభుత్వానికి ఇష్టం లేదు” అన్నారు.

దీనిపై సంతకం చేసేనాటికి దలైలామా వయసు 15 సంవత్సరాలు.

కానీ చైనా మాత్రం దీనిని టిబెట్‌కు “శాంతియుత విముక్తి’’ గా అభివర్ణిస్తుంది. చైనాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ప్రవాసంలోకి వెళ్లిన బౌద్ధ మత గురువులు, టిబెట్‌ నాయకులు మాత్రం దండయాత్రగా, ఆక్రమణగా వ్యవహరిస్తారు.

దలైలామాపై టిబెటన్లకు ఉన్న ప్రేమను చైనా భక్తి వైరస్ లా భావిస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దలైలామాపై టిబెటన్లకు ఉన్న ప్రేమను చైనా భక్తి వైరస్ లా భావిస్తుంది

వివాదం ఎక్కడ మొదలైంది?

హిమాలయాలకు ఉత్తరాన ఉన్న టిబెట్ 12 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాని చరిత్ర అంతా అనేక ఒడిదొడుకులతో నిండింది. 1951 మే 23న ఆ దేశం చైనాతో వివాదాస్పద ఒప్పందంపై సంతకం చేసింది.

ఆ రోజును టిబెట్‌లో చీకటి దినంగా పాటిస్తారు. ఇది టిబెట్ ప్రజల హృదయాలకు గాయమైన రోజు. జీవితాంతం వారిని తీరని అసంతృప్తిలోకి నెట్టింది. టిబెట్ అధికారికంగా స్వేచ్ఛను కోల్పోయి, చైనాలో అంతర్భాగమైంది.

చైనా ఆక్రమణ తర్వాత టిబెట్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. 1956 మార్చి 10 నుంచి చైనాలో తీవ్రమైన ఉద్యమాలు, ఆందోళనలు నడిచాయి. 1959 వరకు ఈ ఆందోళన కొనసాగింది. తిరుగుబాటు తీవ్రమై వేలమంది టిబెటన్లు మరణించారు.

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆఫ్ చైనా ఈ ఆందోళనలను కఠినంగా అణచివేసింది. దీంతో దలైలామా భారతదేశానికి ప్రవాసం వచ్చారు.

టిబెట్

టిబెటన్ 'ట్రెజరీ'

చైనాలో కొత్తగా ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వం 1950లో టిబెట్‌లోని చమదు నగరాన్ని ఆక్రమించింది. అయితే అక్కడి ప్రజలు తిరగబడ్డారు. సైన్యం రంగంలోకి దిగింది. ఈ అణచివేతను వేర్పాటువాదంపై జరిపిన తొలితరం రాజకీయ పోరాటంగా చైనా పరిగణించిందని టిబెట్-చైనా వ్యవహారాల నిపుణురాలు కేట్‌ సాండర్స్ వెల్లడించారు.

"1949లో కమ్యూనిస్ట్ సైన్యం తూర్పు, ఉత్తర ప్రాంతాల నుంచి టిబెట్‌లోకి ప్రవేశించింది" అని సాండర్స్ చెప్పారు. ఈ ప్రాంతమంతా సైన్యం ఆధీనంలో ఉండేది. బ్రిటిష్ రేడియో ఆపరేటర్‌ను చైనా మిలిటరీ జైల్లో పెట్టింది. టిబెటన్ సైన్యం చైనా సైన్యంతో పోరాడింది. కానీ చైనా సైన్యం వారిని పూర్తిగా అణచివేసింది’’ అని రాశారు సాండర్స్‌.

అధికారం చేపట్టిన వెంటనే టిబెట్‌ను ఆక్రమించుకోవడం మావో సెటుంగ్‌ లక్ష్యాలలో ఒకటని ఆమె చెప్పారు. ఎందుకంటే ఇది వ్యూహాత్మక ప్రాంతం. చైనాకు నైరుతి సరిహద్దు.

చైనాలో అంతర్భాగంగా మారిన ఈ ప్రాంతాన్ని “ఖజానా”గా కూడా పరిగణిస్తారు. టిబెట్ సహజ సంపదలున్న దేశం. లిథియం, యురేనియం ఇక్కడ విరివిగా లభిస్తాయి. నీరు పుష్కలంగా ఉంటుంది.

అంతేకాదు ప్రపంచంలోనే ఎత్తైన, పొడవైన పీఠభూమి టిబెట్. ఆసియాలో ప్రవహించే చాలా పెద్ద నదులు టిబెట్‌లోనే పుట్టాయి. నీటి కొరత వస్తే తనకు ఈ ప్రాంతం బాగా ఉపయోగపడుతుందని చైనా భావించింది.

టిబెట్

ఫొటో సోర్స్, Getty Images

పోరాటం ఎలా ప్రారంభమైంది?

13వ శతాబ్దంలో టిబెట్ మంగోల్‌ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. అయినా అది స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవించేది. 1850లో మధ్య ఆసియాపై ఆధిపత్యం కోసం రష్యా, బ్రిటన్‌ మధ్య పోటీ ఏర్పడింది. దీనిని గమనించిన టిబెట్‌ తమ దేశంలోకి ఎవరూ రాకుండా సరిహద్దులను మూసివేసింది. విదేశీయుల టిబెట్‌ సందర్శనను నిషేధించారు.

కానీ 1865 సంవత్సరంలో బ్రిటన్‌ తెలివిగా ఈ ప్రాంతాన్ని తన భూభాగంగా చూపడం ప్రారంభించింది. 1904లో అప్పటి దలైలామాను కల్నల్ ఫ్రాన్సిస్ యంగ్‌ హస్బెండ్ నేతృత్వంలోని బ్రిటిష్‌ సైనిక పటాలం ఓడించింది. తదనంతరం రష్యాను నిరోధించడానికి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాల్సిందిగా యునైటెడ్ కింగ్‌డమ్ టిబెట్‌ను బలవంతం చేసింది.

రెండు సంవత్సరాల తరవాత గ్రేట్‌ బ్రిటన్, చైనాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. చైనా ప్రభుత్వం నుంచి పరిహారం పొందడానికి బదులుగా, ఆ ప్రాంతంలో ఇతరులు ఎవరు ప్రవేశించకుండా చూడాలని చైనాను కోరింది బ్రిటన్‌. అందుకు బదులుగా తాను కూడా ఆ ప్రాంతంలో జోక్యం చేసుకోనని హామీ ఇచ్చింది. ఈ ఒప్పందం చైనా టిబెబ్‌ ఆక్రమణను ధృవీకరించింది.

1908, 1909 మధ్య చైనా దలైలామాను తిరిగి నియమించింది. కాని తన దళాలను టిబెట్‌కు పంపినప్పుడు దలైలామా భారతదేశానికి పారిపోయారు.

చివరికి 1912 ఏప్రిల్‌లో చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. రిపబ్లిక్‌గా ఉద్భవించిన తర్వాత చైనా టిబెట్‌ మీద అధికారాన్ని వదులుకుంది. అంతకు ముందే స్వాంతంత్ర్యాన్ని ప్రకటించుకున్న 13వ దలైలామ భారతదేశం నుంచి తిరిగి టిబెట్‌ చేరుకున్నారు.

1913లో టిబెట్‌ను పూర్తిగా స్వతంత్ర దేశంగా చైనా గుర్తించిందని ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వం చెబుతోంది. అయితే చైనా మాత్రం తనకు టిబెట్‌పై సర్వాధికారాలు ఉన్నాయని, కొన్నాళ్లు వాటిని అనుభవించలేకపోయాననీ అంటోంది.

చైనాలో అంతర్భాగమైనా స్వతంత్ర ప్రతిపత్తి కావాలని దలైలామా కోరుతున్నారు

ఫొటో సోర్స్, AFP / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చైనాలో అంతర్భాగమైనా స్వతంత్ర ప్రతిపత్తి కావాలని దలైలామా కోరుతున్నారు

స్థానిక సంస్కృతుల విధ్వంసం

టిబెట్‌ ఆధునిక దేశం కాదు. కానీ అక్కడి సంస్కృతి మాత్రం భిన్నంగా ఉంటుంది. భాష, మతం, రాజకీయ వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటాయి.

"దలైలామా అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చేశారు. పొరుగు వారితో దౌత్య సంబంధాలు పెంచుకున్నారు. 1912లో 13వ దలైలామా టిబెట్ స్వతంత్ర దేశమని ప్రకటన చేశారు. ఆ దేశానికి సొంత జెండా, కరెన్సీ, పాస్‌పోర్ట్‌, సైన్యం ఉన్నాయి’’ అని కేట్‌ సాండర్స్‌ అన్నారు.

కానీ ఇప్పుడు టిబెట్‌లో ఎప్పుడైనా ఆందోళనలు జరిగితే మాత్రం చైనా వాటిని తీవ్రంగా అణచివేస్తుంది. "చైనా పాలనలో 12 లక్షల మంది టిబెటన్లు మరణించారు" అని దలైలామా అంటారు. అయితే చైనా దీనిని అంగీకరించదు.

మృతుల సంఖ్య విషయమై టిబెట్‌ నేతలు చెబుతున్నది కాస్త అతిశయోక్తని స్వతంత్ర నిపుణులు అంటున్నారు. అయితే మృతుల సంఖ్య రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉండవచ్చని వారి అంచనా.

ఇటీవలి కాలంలో టిబెట్‌లో నిరసనలు పెరిగాయి. స్థానిక సంస్కృతిని నాశనం చేయడానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు గొంతెత్తుతున్నారు. అదే సమయంలో చైనా సైన్యం టిబెటన్లతో వ్యవహరించే తీరుపై కూడా నిరసనల స్వరం పెరిగింది.

1960, 70ల మధ్య కాలంలో చైనా సాంస్కృతిక విప్లవం జరుగుతున్నప్పుడు చైనాలోని అనేక మఠాలు, ఆలయాలు నాశనమయ్యాయి.

1980 నుండి కమ్యూనిస్ట్‌ పార్టీ టిబెట్ సంస్కృతిని పరిరక్షించేందుకు మఠాలను మళ్లీ నిర్మించింది. అయితే ఇదంతా తాము నిషేధించిన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నమని టిబెటన్లు భావిస్తున్నారు.

వేలమంది టిబెటన్‌లు భారతదేశంలోని హిసార్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. చైనా సైన్యం అక్కడి తిరుగుబాటుదారులపై అమలు చేస్తున్న అమానుషాలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లాంటి సంస్థలు బైటపెట్టాయి.

సైనిక తరహా శిక్షణాలయాల్లో ఉండాలంటూ చైనా ప్రభుత్వం వందలమంది టిబెటన్లను ఒత్తిడి చేస్తోందని జేమ్స్‌టౌన్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. “జిన్‌జియాంగ్‌లో వీగర్‌ ముస్లింలను హింసించడానికి టిబెట్‌ను ఒక ప్రయోగశాలగా వాడుకున్నారు ” అని కేట్‌ సాండర్స్‌ అన్నారు.

లాబ్సాంగ్ సాంగే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాబ్సాంగ్ సాంగే 2011లో టిబెట్ రాజకీయవేత్తగా అవతరించారు

టిబెట్‌ - కరోనా వైరస్‌

“మత నాయకుడు దలైలామా పట్ల టిబెటన్లకున్న భక్తి ప్రపత్తులను చైనా భక్తి వైరస్‌లా భావించింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ టిబెట్‌కు కూడా వ్యాపించింది’’ అని కేట్‌సాండర్స్‌ అన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో దలైలామా ఒక మేగజైన్‌కు రాసిన కథనంలో అంటువ్యాధిపై పోరాటానికి ప్రార్ధనలు ఒక్కటే సరిపోవని, దయతో, సృజనాత్మకతతో వ్యవహరించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రార్ధనలు రాసినందుకు కొందరు టిబెటన్లను చైనా ప్రభుత్వం జైల్లో పెట్టింది.

ప్రవాస ప్రభుత్వం నడుపుతున్న దలైలామా చైనాకు ఒక మధ్యేమార్గాన్నిసూచించారు. తమ దేశం చైనాలో భాగమేనని అంగీకరిస్తూ, తమకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఆయన కోరారు.

కానీ టిబెట్‌లో యువత మాత్రం తమకు చైనా నుంచి పూర్తి స్వేచ్ఛ కావాల్సిందేనంటోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)