హాథ్‌రస్ కేసు: ప్రపంచంలో అతి తీవ్రంగా అణచివేతకు గురవుతున్నది దళిత మహిళలే

దళిత మహిళలు

ఫొటో సోర్స్, NURPHOTO

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మేము పేద వాళ్ళం, తక్కువ కులానికి చెందిన మహిళలు కావడం వలనే హింసకు బలవుతున్నాం. అందరూ మమ్మల్ని చిన్న చూపుతోనే చూస్తున్నారు" అని జయశ్రీ మంగుభాయ్ అనే పరిశోధకురాలికి ఒక దళిత మహిళ చెప్పారు.

"మాతో మాట్లాడటానికి కానీ, సహాయం చేయడానికి గానీ ఎవరూ లేరు. మాకు అధికారం లేకపోవడంతో మేము లైంగిక హింసకు ఎక్కువగా గురి కావల్సి వస్తోంది" అని ఆమె అన్నారు.

గత వారంలో ఒక 19 సంవత్సరాల దళిత అమ్మాయి కొందరు అగ్ర వర్ణాల పురుషుల చేతిలో గ్యాంగ్ రేప్ కి గురైన వార్తలు దేశంలో కలకలం రేపాయి. ఈ వార్త దేశంలో ఉన్న 8 కోట్ల దళిత మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింసను వెలుగులోకి తెచ్చింది. వీరు కూడా దేశంలో వేళ్ళూనుకుపోయిన కుల వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్నవారే.

దేశంలో ఉన్న మహిళల జనాభాలో దళిత మహిళలు 16 శాతం ఉంటారు. వీరు మిగిలిన వారి కంటే మూడింతలు ఎక్కువగా లింగ వివక్ష, కుల వివక్షను ఎదుర్కోవడంతో పాటు ఆర్ధికంగా కూడా వెనుకబడి ఉంటారు.

"దళిత మహిళలు ప్రపంచంలోనే అత్యధికంగా అణగారిన వర్గాలకు చెంది ఉంటారని 'క్యాస్ట్ మేటర్స్' పుస్తక రచయిత సూరజ్ ఎంగ్డే రాశారు. "ఈ దేశంలో నెలకొన్న సంస్కృతులు, పద్ధతులు, అణచివేతకు గురి చేసే వ్యవస్థలన్నీ కలిసి చివరకు ఆమె పై హింస రూపంలో పరిణమిస్తున్నాయి" అని ఆయన అంటారు.

దళిత మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల హాథ్‌రస్‌లో అత్యాచార ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ దళితుల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు ఫిర్యాదు నమోదు చేయడంలో చేసిన ఆలస్యం, విచారణలో చేసిన జాప్యం, మరోవైపు అది అత్యాచారం కాదేమోనని అధికారులు లేవనెత్తిన అనుమానాలు, ఆ ఘటనకు కులానికి సంబంధం లేదంటూ లేవదీసిన వ్యంగ్య ఆరోపణలు, అనుమానితుల వైపు నిలిచిన అధికార యంత్రాంగం వ్యవస్థ ఎలా పని చేస్తుందో చూపిస్తోంది.

ఆఖరికి కొన్ని వార్తా సంస్థల్లో పని చేస్తున్న అగ్రవర్ణాల విలేకరులు కూడా లైంగిక హింసకు, కులానికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇంకోలా చెప్పాలంటే, ప్రభుత్వం, సమాజంలో ఉన్న కొన్ని వ్యవస్థలు కలిసి లైంగిక హింసకు కుల వ్యవస్థకి మధ్యన ఉన్న సంబంధాన్ని తగ్గించి చూపించడానికి కానీ, లేదా వాటిని పూర్తిగా తుడిచి తుడిచి పెట్టడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటాయి.

గత వారం హాథ్‌రస్ అత్యాచార బాధితురాలికి ఉత్తరప్రదేశ్ పోలీసులు, అధికారులు కలిసి కుటుంబ సభ్యులు లేకుండా అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. మీడియా వ్యక్తులు కానీ, ప్రతిపక్ష పార్టీల నేతలు కానీ బాధితురాలి గ్రామానికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిసేందుకు లేకుండా కట్టడి చేశారు. దీంతో ఈ ఘటనను పూర్తిగా మసి పూసి మాయ చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు తలెత్తాయి.

యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా ఒక ప్రైవేట్ పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ సహాయంతో అసలు ఈ ఘటన అత్యాచారమే కాదంటూ చెప్పే వాదనను బలపరిచే ప్రయత్నం చేసింది.

దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కొన్ని వేల మంది దళిత మహిళలు కొన్నేళ్లుగా లైంగిక హింసకు గురవుతూనే ఉన్నారు. చాలా ప్రాంతాలలో భూమి, వనరులు, సాంఘిక అధికారాలు అగ్ర వర్ణాల చేతుల్లోనే ఉంటాయి.

దళిత మహిళలు

ఫొటో సోర్స్, AFP

దళిత మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి 1989 లో చట్టాన్ని తెచ్చినప్పటికీ దళిత మహిళలపై చోటు చేసుకునే హింస మాత్రం తగ్గలేదు. వారు ఇప్పటికీ అనేక రకాల దాడులకు, నిందలకు, అత్యాచారాలకు, హత్యలకు, శిక్షలకు గురవుతూనే ఉన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో గత సంవత్సరం రోజుకు సగటున 10 మంది దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మహిళలపై జరిగే హింస, బాలికలపై జరిగే లైంగిక దాడుల కేసులు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా నమోదయ్యాయి. దళితులపై జరిగిన హింసకు సంబంధించి దేశంలో సగానికి పైగా కేసులు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలలోనే నమోదయ్యాయి.

2006లో భారతదేశంలో నాలుగు రాష్ట్రాలలో దళిత మహిళలు ఎదుర్కొనే హింస గురించి 500 మందితో చేసిన ఒక అధ్యయనంలో 54 శాతం శారీరక దాడులకు, 46 శాతం లైంగిక దాడులకు, 43 శాతం గృహ హింసకు, 23 శాతం అత్యాచారాలకు, 62 శాతం దూషణకు గురైనట్లు తెలిసింది.

వారి సొంత కులం వారితో సహా అన్ని కులాల వారు పాల్పడే హింసకు ఎక్కువగా దళిత మహిళలే బలవుతున్నారు. ది సెంటర్ ఫర్ దళిత్ రైట్స్ గ్రూప్ 2004-2013 మధ్యలో దేశంలో 16 జిల్లాలలో దళిత మహిళలు, బాలికలపై చోటు చేసుకున్న లైంగిక దాడులను పరిశీలించింది. అందులో 46 శాతం బాధితులు 18 ఏళ్ల లోపు, 85 శాతం 30 ఏళ్ల లోపు వారు ఉన్నారు. హింసకు పాల్పడిన వారిలో దళితులతో సహా 36 రకాల కులాలకు చెందిన వారున్నారు.

దళిత మహిళలు

ఫొటో సోర్స్, EPA

దళిత మహిళలే ఎందుకు హింసకు గురవుతున్నారు అనే విషయానికి వస్తే, వారు గొంతు విప్పడం మొదలు పెట్టారు అని చెప్పుకోవచ్చు.

2006లో మహారాష్ట్రలో ఖైర్లంజి గ్రామంలో భూవ్యవహారాలలో చెలరేగిన వివాదాలలో ఒక దళిత కుటుంబంలో 17 ఏళ్ల అమ్మాయి, ఇద్దరు కొడుకులతో సహా నలుగురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హతమార్చిన ఘటన దేశంలో దళిత మహిళలపై జరుగుతున్న హింసాత్మక చరిత్రను మలుపు తిప్పింది.

అగ్ర వర్ణాల వారిపై ఆ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో ఆ వివాదం ముదిరింది. "ఈ అమానుష ఘటన దళితులలో చైతన్యాన్ని తెచ్చి, వారనుభవిస్తున్న వివక్షను, సామాజిక అసమానతలను తెర పైకి తెచ్చింది" అని చరిత్రకారులు ఉమా చక్రవర్తి అన్నారు.

దళితుల్లో వచ్చిన చైతన్యం అగ్ర వర్ణాల వారిలో కలకలం రేపి, ఎదురు తిరగడం మొదలుపెట్టారు. గత వారం చోటు చేసుకున్న హాథ్‌రస్ ఘటనలో కూడా ఆ కుటుంబానికి అగ్ర వర్ణానికి చెందిన కుటుంబానికి గత రెండు దశాబ్దాలుగా గొడవలు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

దేశ వ్యాప్తంగా దళిత బాలికలు చదువుకునేందుకు వెళ్ళడానికి, దళిత మహిళల గొంతు వినిపించడానికి విరివిగా అనేక సామాజిక సంస్థలు పని చేస్తున్నాయి. "దేశ వ్యాప్తంగా దళిత మహిళా నాయకులు మునుపెన్నడూ లేనంతగా వారి కష్టాలను వినిపిస్తూ, ఎవరి సహాయం లేకుండానే వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు" అని డాక్టర్ ఎంగ్డే అన్నారు.

దళిత మహిళలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎదురు దాడికి దిగుతున్నారు. "గతంలో వారిపై జరిగే హింస కనిపించేది కాదు. దాంతో విషయం బయటకు వచ్చేది కాదు" అని దళిత హక్కుల ఉద్యమకారులు మంజుల ప్రదీప్ అన్నారు.

"ఇప్పుడు మా అస్థిత్వం కనిపిస్తోంది. మేమిప్పుడు గతంలో కంటే శక్తివంతంగా, ధైర్యంగా ఉన్నాం. మా హద్దులేమిటో గుర్తు చేయడమే ఇప్పుడు మా మీద జరుగుతున్న హింస" అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)