కరోనావైరస్: భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి.. ఈ మరణాలకు కారణాలేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో నిర్ధరిత కోవిడ్ మరణాల సంఖ్య ఒక లక్ష దాటింది. ఈ విషాదాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో నిలిచింది.
రికార్డుల ప్రకారం సెప్టెంబర్ నెల భారతదేశంలో అత్యంత దారుణంగా ఉంది: రోజుకు సగటున 1,100 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇందులో ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల కన్నా అధికంగా మరణాలు నమోదయ్యాయి.
ఈ మహమ్మారి ఇంకా దేశంలో విస్తరించటం కొనసాగుతోందనటానికి ఇది సంకేతమని నిపుణులు అంటున్నారు.
దేశంలో కోవిడ్-19 ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలేవి? ఎందుకు? అనే అంశాలపై కొన్ని విశ్లేషణలివీ...
అగ్రస్థానంలో మహారాష్ట్ర
భారతదేశంలో అతి పెద్ద, అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర.. కేసుల సంఖ్యలోనూ - 13 లక్షలు పైనే, మరణాల సంఖ్యలోనూ - 36,000 అగ్రస్థానంలో ఉంది.
మహారాష్ట్ర మీద మహమ్మారి చాలా ముందుగా పంజా విసిరింది. తెరిపినివ్వకుండా వేగంగా వ్యాపించింది. సెప్టెంబరులో రోజుకు 300 నుంచి 500 మంది చొప్పున మరణాలు నమోదయ్యాయి. తీవ్రంగా ప్రభావితమైన ఇతర రాష్ట్రాల్లో ఇదే నెలలో రోజుకు సుమారు 100 మరణాల చొప్పున నమోదయ్యాయి.
ఇప్పుడు కరోనా మహమ్మారి పరిశీలకులను ఆందోళనకు గురి చేస్తోంది జనసమ్మర్థం గల ఆర్థిక రాజధాని ముంబై నగరం కాదు. ఇప్పటికీ అత్యధిక మరణాలు నమోదైన జిల్లా ముంబై నగరమే అయినా.. పుణె నగరం 5,800 మరణాలతో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది.

ప్రస్తుతం కోవిడ్ మరణాలు అత్యధికంగా ఉన్న 10 జిల్లాల్లో ఐదు జిల్లాలు - ముంబై, పుణె సహా - మహారాష్ట్రలోనే ఉన్నాయి.
''మహారాష్ట్రలో ఈ మహమ్మారి ప్రవేశద్వారం ముంబై నగరం'' అంటారు డాక్టర్ అర్ణబ్ ఘోష్. పుణె నగర వాసుల్లో ర్యాండమ్ యాంటీబాడీ శాంపిల్ సర్వే నిర్వహించిన బృందంలో ఆయన ఒకరు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభాలో సగం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని ఆ ప్రభుత్వ సర్వే గుర్తించింది.
ముంబై ఎక్కువగా స్వీయ నియంత్రణ సాధించగా.. పుణె జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య; పుణె, పరిసర జిల్లాల మధ్య రాకపోకలు అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో వైరస్ మరింతగా విస్తరించిందని డాక్టర్ ఘోష్ చెప్పారు.
మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో వైద్య వ్యవస్థలు కూడా తట్టుకోలేకపోయాయి.. ఫలితంగా మరణాల సంఖ్య పెరిగింది. పుణెలోని 'జంబో' కోవిడ్ సెంటర్‌లో ఇటీవల నిర్లక్ష్యం వల్ల ఒకరు చనిపోయారన్న ఆరోపణలతో పతాక శీర్షికలకెక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
విషమిస్తున్న పంజాబ్ పరిస్థితి
పంజాబ్‌లో కరోనా కేసుల్లో మరణాల రేటు (కేస్ ఫాటాలిటీ రేట్) మూడు శాతంగా ఉంది. ఇది భారతదేశ జాతీయ సగటు కేస్ ఫాటాలిటీ రేటు కన్నా రెట్టింపు.
నంబర్ల రీత్యా చూస్తే మరణాల సంఖ్యలో దేశంలో పంజాబ్ తొమ్మిదో స్థానంలో ఉంది. కానీ.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కేస్ ఫాటాలిటీ రేటు 4 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది.
''పంజాబ్ పరిస్థితి ఆందోళనకలిగిస్తోంది. రాష్ట్రంలో కేస్ ఫాటాలిటీ రేటు దేశంలోనే అత్యధికంగా ఉండటమే కాదు.. ఇంకా పెరుగుతోంది కూడా'' అని డాక్టర్ షమికా రవి చెప్పారు. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న ఆమె కరోనా మహమ్మారి వ్యాప్తిని పరిశీలిస్తున్న వారిలో ఒకరు.
''ఇది ఆందోళకరం. ఎందుకంటే ప్రపంచమంతటా, భారతదేశ వ్యాప్తంగా కూడా విస్తృతంగా పరీక్షలు నిర్వహించటం, చికిత్స గురించిన అవగాహన పెరుగుతుండటం వల్ల కేస్ ఫాటాలిటీ రేటు తగ్గుతోంటే.. ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది'' అని ఆమె పేర్కొన్నారు.
మహారాష్ట్ర, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ.. టెస్టులు పరిమితంగా ఉండటం వల్ల కేసుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయని ఆమె భావిస్తున్నారు. పరీక్షలు తక్కువగా ఉండటం వల్ల మరణాల రేట్లు పెరగవచ్చునని.. ఎందుకంటే పరిస్థితి చేయిదాటి పోయిన తర్వాతే అధికారులకు ఈ ఇన్‌ఫెక్షన్ గురించి తెలుస్తుందని విశ్లేషించారు.

టెస్టులు తక్కువగా ఉండటమే సమస్యా?
పంజాబ్‌లో కరోనా పాజిటివ్ రేటు 6.2 శాతంగా ఉంది. అదే మహారాష్ట్రలో అయితే 24 శాతంగా ఉంది. అలా చూస్తే పంజాబ్ కేస్ పాజిటివ్ రేటు తక్కువే. కానీ.. పంజాబ్‌కు సమాన సంఖ్యలో టెస్టులు - పది లక్షల మందికి 60,000 - చేస్తున్న బిహార్ (2.5 శాతం), జార్ఖండ్ (3.7 శాతం)ల కన్నా ఎక్కువ. అయినా ఈ రెండు రాష్ట్రాల పాజిటివ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
''పరీక్షలు తక్కువగా ఉండి.. పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఇన్‌ఫెక్షన్ చాలా ముందుకు పాకిందని అర్థం. కేసులను చాలా లేటుగా పట్టుకుంటున్నారన్న మాట'' అని డాక్టర్ షమిక వివరించారు.
మహారాష్ట్ర పరిస్థితి తన వాదనను బలపరుస్తోందని ఆమె చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో పాజిటివిటీ రేట్లు, అధిక సంఖ్యలో మరణాలు నమోదవటం స్థిరంగా కొనసాగుతోంది. అయినా కానీ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచలేదు.
అయితే.. ఈ రెండిటి మధ్య సంబంధం ఉందనే వాదనతో అందరూ ఏకీభవించటం లేదు. ''నేరుగా ఏదైనా సంబంధం ఉందనేది నాకైతే తెలియదు. తగినన్ని పరీక్షలు నిర్వహించటం లేదంటే.. చాలా కేసులను పట్టుకోవటం లేదని అర్థం. కానీ అలా మిస్సయిన కేసుల్లో ఎంత భాగం మరణాలకు కారణమవుతోందనేది చెప్పటం కష్టం'' అంటారు అంటువ్యాధుల నమూనాల అంశంలో ప్రొఫెసర్, పరిశోధకుడు డాక్టర్ గౌతమ్ మీనన్.
ఈ సంబంధం మరో రకంగా ఉండి ఉండొచ్చునని డాక్టర్ ఘోష్ చెప్తున్నారు. టెస్ట్ చేయించుకోవటం గురించి అవగాహన తక్కువగా ఉండటం, టెస్టు చేయించుకోలేకపోవటం వల్ల టెస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉండవచ్చునని.. అది తర్వాతి దశల్లో ఆస్పత్రుల్లో చేరటానికి కారణం కావచ్చునని, దీనివల్ల మరణం అవకాశాలు పెరగవచ్చుననేది విశ్లేషణ.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో.. కోవిడ్-19 రోగులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణానికి మధ్య కాలం సగటున 13 రోజులుగా ఉందని గుర్తించారు. దానినిబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఆ రోగుల్లో అత్యధిక మందికి ఆలస్యంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసివుండవచ్చునని పరిశోధకులు సూత్రీకరణకు వచ్చారు.
అయినప్పటికీ.. కోవిడ్ పరీక్షల రేటు స్థిరంగా అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. అక్కడ కేస్ ఫాటాలిటీ రేటు కూడా తక్కువగా ఉంది. సంఖ్య రీత్యా చూసినపుడు ఇప్పటివరకూ ఈ రాష్ట్రంలో 9,000కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ విషయంలో దేశంలో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అయితే జూలై నుంచి రాష్ట్రంలో రోజు వారీ మరణాల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.
కానీ.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా గుర్తించటమనేది.. ఎల్లవేళలా రోగి చికిత్సా ప్రణాళిక మీద ప్రభావం చూపించబోదని అంటువ్యాధుల పరిశోధకుడు డాక్టర్ జాకబ్ జాన్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా కేసుల్లో డాక్టర్లు ఎటువంటి పరీక్షలూ నిర్వహించకుండానే ఆ చికిత్స ప్రణాళికను అమలు చేస్తారని ఆయన పేర్కొన్నారు.
''టెస్టులు తక్కువగా ఉండటం వల్ల ఫలితాలు తక్కువగా ఉంటాయని భావించేట్లయితే.. టెస్టులు చేయటం వల్ల ఒక రోగికి చికిత్స చేసే విధానం మారుతుందని భావించాల్సి ఉంటుంది'' అని డాక్టర్ జాన్ వ్యాఖ్యానించారు.
మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణం టెస్టులు తక్కువగా ఉండటం కాదని.. వైద్య చికిత్స వ్యవస్థ పనితీరు బలహీనంగా ఉండటం కారణమని ఆయన అభిప్రాయం. అదే బలహీన వ్యవస్థ టెస్టులు తక్కువగా చేయటంతో పాటు.. ఎవరైనా ఆస్పత్రిలో చేరినప్పుడు కూడా వారికి చికిత్సను కూడా బలహీనంగా అందిస్తుందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
పట్టణ ప్రాంతాల్లో అధిక మరణాలు
ఇప్పటివరకూ అత్యంత తీవ్రంగా ప్రభావితమైన 10 జిల్లాలు మొత్తం పట్టణ ప్రాంతాలే. కేస్ ఫాటాలిటీ రేటు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలు కూడా పట్టణ ప్రాంతాల్లోనివే.
దేశంలో కరోనావైరస్ వల్ల ఇప్పటివరకూ చనిపోయిన వారిలో దాదాపు 80 శాతం మంది పట్టణ జిల్లాలకు చెందిన వారే. ఈ జిల్లాల్లోని చాలా వాటిలో కేస్ ఫాటాలిటీ రేటు కన్నా సగటు కన్నా ఎక్కువగా ఉంది.
సామాజిక దూరం దాదాపుగా అసాధ్యంగా ఉండే అధిక జనసమ్మర్థ ప్రాంతాల్లో ఈ వైరస్ ఉధృతంగా ఉంటుందనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలు మహారాష్ట్ర, పంజాబ్ వంటి సంపన్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఎందుకు ఉన్నాయనేదీ ఇది విశదీకరిస్తుంది. పెద్ద నగరాల చుట్టుపక్కల ఉండే చాలా జిల్లాలు జనాభా ఎక్కువగా, అధిక సాంద్రతతో ఉండే ప్రాంతాలే.
పట్టణ జిల్లాల్లో కేస్ ఫాటాలిటీ రేటు ఎక్కువగా నమోదవటానికి కారణం.. చుట్టుపక్కల జిల్లాల నుంచి చికిత్స కోసం ఈ ప్రాంతాలకు వస్తుండటం కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
''పుణె జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి రోగుల రాక చాలా ఎక్కువగా ఉందనే వాస్తవం.. ఆ జిల్లా గణాంకాల మీద ప్రభావం చూపుతోంది'' అని అంటువ్యాధుల నమూనాల ప్రొఫెసర్, పరిశోధకుడు డాక్టర్ గౌతమ్ మీనన్ పేర్కొన్నారు.
అంతేకాదు.. ''గ్రామీణ జిల్లాల్లో ఇతరత్రా తీవ్ర వ్యాధులు (కో-మార్బిడిటీస్) తక్కువగా ఉంటాయి. దీనివల్ల వైరస్‌తో మరణించే ముప్పు తక్కువగా ఉంటుంది'' అని డాక్టర్ మీనన్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
పేద రాష్ట్రాల్లో తక్కువ మరణాలు
మరణాల సంఖ్య వాస్తవం కన్నా తక్కువగా నమోదవటమనేది కూడా ఒక కారణమనటంలో సందేహం లేదు. కానీ.. కరోనావైరస్ బలంగా కబళిస్తుందని అందరూ భయపడిన పేద రాష్ట్రాల్లో మరణాల రేటు తక్కువగా ఉంది.
అయినాకానీ.. దేశంలో ఈ మహమ్మారి ఇంకా చివరి దశకు రాలేదని డాక్టర్ ఘోష్ హెచ్చరిస్తున్నారు. ''మహారాష్ట్ర తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఆ రాష్ట్రం ఆ దశ దాటిపోయింది. దిల్లీలో కూడా అలాగే జరిగి ఉండొచ్చు. కానీ మిగతా ప్రాంతాలు ఇంకా ముందుకు సాగాల్సి ఉంది'' అంటారాయన.
''ఈ మహమ్మారి వ్యాప్తిలో ఒక్కో రాష్ట్రం ఒక్కో దశలో ఉంది. అదృష్టవశాత్తూ.. మహారాష్ట్ర వంటి ధనిక రాష్ట్రాల్లో ఇది మొదలైంది. ఒకవేళ బిహార్‌లో మొదలై ఉంటే.. అదో పెను విపత్తులా ఉండేది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








