వ్యాక్సీన్: పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది

- రచయిత, రిచర్డ్ హోలింఘమ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్ కోసం
మశూచి ఒక భయంకరమైన మహమ్మారి.
''శరీరమంతా దురద పుడుతుంది. తీవ్రమైన జ్వరం వస్తుంది. గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇలా సమస్యలు చుట్టుముడతాయి''అని హిస్టరీ ఆఫ్ వ్యాక్సీన్ వెబ్‌సైట్ ఎడిటర్, మహమ్మారుల నిపుణుడు రెనె నజేరా వివరించారు.
అయితే, ఇక్కడితో మశూచి లక్షణాలు ఆగిపోవు.
''అన్నింటి కంటే ముఖ్యంగా ఒళ్లంతా పుండ్లు వస్తాయి. చీముతో నిండిన ఈ కురుపులు ముఖం, కాళ్లు, చేతులు, గొంతుతోపాటు ఊపిరితిత్తులపై కూడా వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఇవి ఎండిపోయి పొక్కుల్లా పొరలుపొరలుగా ఊడిపోతుంటాయి''అని నజేరా వివరించారు.
ప్రపంచ వాణిజ్యం విస్తరించే సమయంలో మశూచి కూడా చెలరేగేది. వర్తకులతోపాటుగా ఇది ప్రపంచ నలుమూలలకూ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన 33 శాతం మంది పెద్దలు, ప్రతి పది మందిలో ఎనిమిది మంది చిన్నారులు చనిపోతారని అంచనా వేశారు. 18వ శతాబ్దంలో ఒక్క ఐరోపాలోనే మశూచితో ఏటా 4,00,000 మంది మరణించారు.
నౌకాశ్రయ ప్రాంతాల్లో మశూచి చెలరేగేది. అమెరికాలోని బోస్టన్ నగరంలో 1721లో 8 శాతం జనాభాను ఇది తుడిచిపెట్టేసింది. ఒకవేళ బ్రతికి బట్టకట్టినా.. ఆ మశూచి మచ్చలు జీవితాంతం వెంటాడేవి. కొందరైతే చూపును కూడా కోల్పోయేవారు.

ఫొటో సోర్స్, Getty Images
''పోక్కులు రాలి కింద పడినప్పుడు.. మచ్చలు ఉండిపోతాయి. మన రూపమూ మారిపోతుంది. కొందరైతే ఆ మచ్చలతో బతకలేక ఆత్మహత్యలూ చేసుకున్నారు''అని నజేరా చెప్పారు.
అప్పట్లో మశూచికి అందుబాటులో ఉండే చికిత్సలు కొరగానివి.. కొన్నైతే మరీ అనాగరికంగా ఉండేవి. కొన్నిసార్లు వ్యాధి సోకినవారిని వేడి గదుల్లో పెట్టేవారు. కొంత మందిని చల్లని గదుల్లో పెట్టేవారు. ఖర్బూజ లాంటి పండ్లు తిననిచ్చేవారు కాదు. మరికొందరినైతే 12 సీసాల బీరు ఇచ్చి 24 గంటలపాటు ఎర్రని వస్త్రంలో చుట్టేసేవారు. దీని వల్ల వచ్చే మైకంతో కొంతవరకూ నొప్పి తగ్గినట్లు అనిపించేది.
అయితే, ఒక చికిత్స మాత్రం అప్పట్లో కొంతవరకు పనిచేసేది. దాన్నే ఇనోక్యులేషన్ లేదా వేరియోలేషన్‌గా పిలిచేవారు. దీనిలో భాగంగా మశూచి సోకిన వ్యక్తి పుండ్ల నుంచి చీమును సేకరించి ఆరోగ్యవంతులకు పూసేవారు. కొన్నిసార్లు పొక్కులను పొడిచేసి బూడిదను ఆరోగ్యవంతుల ముక్కు దగ్గర ఊదేవారు.
ఈ చికిత్స మొదట ఆఫ్రికా, ఆసియాల్లో అందుబాటులో ఉండేది. 18వ శతాబ్దంలో ఇది యూరప్‌కూ విస్తరించింది. తర్వాత బానిసల్లో ఒకరైన ఒనేసిమస్ అనే వ్యక్తి దీన్ని ఉత్తర అమెరికాకు తీసుకువచ్చారు. ఇనాక్యులేషన్‌తో స్వల్ప తీవ్రతగల ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయితే, అన్నిసార్లూ ఇలా జరగదు. కొందరికి మాత్రం పూర్తి ఇన్ఫెక్షన్ వచ్చేది. మరోవైపు ఇలా ఇనాక్యులేషన్ చికిత్స తీసుకున్నవారితో వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ ఉండేది. అందుకే ఈ వ్యాధికి ఒక చికిత్స అవసరమైంది.
1700ల్లో ఇంగ్లండ్‌లో కొంత మంది మశూచిని జయించినట్లు వార్తలు వచ్చాయి. పాల వ్యాపారం చేసే వీరికి కౌపాక్స్‌గా పిలిచే స్వల్ప లక్షాలుండే వైరస్ సోకింది.

ఫొటో సోర్స్, Getty Images
1774లో పశ్చిమ ఇంగ్లండ్‌లో మశూచి విజృంభించేటప్పుడు రైతు బెంజిమిన్ జెస్టీ ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నారు. కౌపాక్స్ పొక్కుల నుంచి సేకరించి చీమును.. తన భార్య, కొడుకులకు ఆయన రాశారు. దీంతో వీరెవరికీ మశూచి సోకలేదు.
అయితే, కొన్నేళ్ల వరకూ జెస్టీ చేసిన పని గురించి ఎవరికీ తెలియలేదు. తొలి వ్యాక్సీన్‌ను కనిపెట్టి, అందరికీ దాన్ని అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి కూడా ఇలానే ఆలోచించారు.
గ్లౌసెస్టెర్‌షైర్‌లోని చిన్న పట్టణం బర్కెలీలో వైద్యుడిగా ఎడ్వర్డ్ జెన్నర్ పనిచేసేవారు. ఆయన లండన్‌లో శిక్షణ పొందారు. అప్పట్లో ప్రముఖ సర్జన్లలో ఆయన కూడా ఒకరు. మశూచి ఇనోక్యులేషన్‌తో తన చిన్ననాటి అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది ఆయన మశూచి టీకాను అభివృద్ధి చేయాలని భావించారు.
తన చిన్ననాటి అనుభవాలు జెన్నర్‌పై మానసికంగా ప్రభావం చూపించాయని డాక్టర్ జెన్నర్ హౌస్ మ్యూజియం మేనేజర్ ఓవెన్ గోవెర్ వివరించారు. ''ఆయన ఎలాగైనా సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని భావించారు''

ఫొటో సోర్స్, Getty Images
1796లో రైతులు, పాల డెయిరీ పరిశ్రమ కార్మికుల నుంచి కొంత సమాచారం సేకరించి ఆయన ఒక ప్రయోగం చేయాలని భావించారు. అది చాలా ప్రమాదకరమైనది. పైగా ఒక చిన్నారిపై..
పాల వ్యాపారి సారా నెల్మ్స్ చేతుల పైనుండే కౌపాక్స్ పొక్కుల నుంచి సేకరించిన చీమును ఎనిమిదేళ్ల జేమ్స్ ఫిప్స్ చర్మంపై జెన్నర్ పూశారు. కొన్ని రోజులకు జేమ్స్ కోలుకున్నాడు. అయితే, ఆ తర్వాత మశూచి పుండ్ల నుంచి సేకరించిన చీమును జేమ్స్‌కు పూశారు. ప్రయోగం విజయవంతమైంది. జేమ్స్‌కు మశూచి సోకలేదు. అంతేకాదు అతడిని కలిసినవారికీ ఆ ఇన్ఫెక్షన్ సోకలేదు.
ఆ ప్రయోగం సఫలీకృతం అయినప్పటికీ.. నేడైతే ఎన్నో నైతికపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది.
''అదేమీ క్లినికల్ ట్రయల్ కాదు. మొదట టీకా ఎక్కించేందుకు ఎంచుకున్న వ్యక్తిని చూసి మీరు కొంత అసౌకర్యానికి గురికావొచ్చు''అని మాంచెస్టర్ యూనివర్సిటీలోని ఇమ్యునాలజీ ప్రొఫెసర్ షీలా క్రూయిక్‌షాంక్ చెప్పారు.
మరోవైపు తను కనిపెట్టిన దాని వెనకున్న సైన్స్ గురించి జెన్సర్ కూడా తెలియదు. అంతేకాదు మశూచి వేరియోల వైరస్ వల్ల వ్యాపిస్తుందని కూడా తెలియదు. శరీరక వ్యాధి నిరోధక వ్యవస్థ గురించి అంతంత మాత్రమే తెలుసు.
''వారు చేసే పనులు చాలావరకూ వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం లాంటి చర్యలకు దోహదపడేవే. అవి అద్భుతమైన పరిష్కార మార్గాలు. అయితే, అంతే భయంకరమైనవి కూడా''అని షీలా వ్యాఖ్యానించారు.
తన మశూచి వ్యాక్సీన్ భవిష్యత్‌లో లక్షల మందిని కాపాడగలదని జెన్నర్‌కు ముందే తెలుసు. తను ఆ వ్యాధికి అడ్డుకట్ట వేయగలనని ఆయన బలంగా నమ్మారు. వ్యాక్సీన్ అనే పేరు లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్‌లో కౌపాక్స్‌ను వ్యాక్సీనియా అని పిలిచేవారు.
''వ్యాక్సీన్ నుంచి డబ్బులు భారీగా సంపాదించాలని జెన్నర్ అనుకోలేదు. దానిపై పెటెంట్ హక్కులపై ఆయనకు ఆస్తకి కూడా లేదు. ప్రజలకు ఈ వ్యాక్సీన్ గురించి తెలియాలని, దాన్ని అందరూ వేసుకోవాలని ఆయన అనుకున్నారు.. అంతే''అని గోవెర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
తన గార్డెన్‌లోని ఒక పురాతన సమ్మర్‌హౌస్‌ను ''టెంపుల్ ఆఫ్ వ్యాక్సీనియా''గా ఆయన మార్చారు. ఆదివారం చర్చి నుంచి బయటకు వచ్చే స్థానికులకు అక్కడ ఆయన వ్యాక్సీన్ ఇచ్చేవారు.
''తన వ్యాక్సీన్ గురించి ఇతర వైద్యులకూ ఆయన లేఖలు రాసేవారు. అందరూ వ్యాక్సీన్ వేసుకొనేలా ప్రోత్సహించాలని ఆయన చెప్పేవారు. దీని కోసం మీరే వ్యాక్సీన్ వేయాలని చెప్పేవారు. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అనేవారు''అని గోవెర్ చెప్పారు.
తన ప్రయోగ ఫలితాల గురించి పత్రికలు, పుస్తకాల్లో ప్రచురితం కావడంతో దీనికి గురించి ప్రపంచమంతా తెలిసింది. స్పెయిన్ రాజుతోపాటు చాలా మంది ఈ వ్యాక్సీన్‌కు మద్దతు తెలిపారు.
కింగ్ చార్లెస్-4 తన కుటుంబంలో చాలా మందిని మశూచి వల్ల పోగొట్టుకున్నారు. ఆయన కుమార్తె మరియా లూసియాకు మశూచి తగ్గినప్పటికీ.. ఆమెపై మచ్చలు ఎప్పటికీ అలానే ఉండిపోయాయి. జెన్నర్ వ్యాక్సీన్ గురించి తెలిసిన వెంటనే.. స్పెయిన్‌లో అందరూ ఈ వ్యాక్సీన్ వేసుకునేలా చూసేందుకు ఓ వైద్యుడిని ఆయన నియమించారు. ఆ తర్వాత ఐరోపా దేశాలు వలస రాజ్యాలు స్థాపించిన చోట మొదటగా ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది.
1803లో ఒక నౌక దక్షిణ అమెరికాకు వెళ్లింది. దానిలో 22 మంది అనాథల సాయంతో వ్యాక్సీన్‌ను అక్కడికి తీసుకెళ్లారు.
''వ్యాక్సీన్‌ను భారీగా ఉత్పత్తి చేసే విధానాలు అప్పట్లో అందుబాటులో లేవు. అందుకే ఒక చిన్నారి సాయంతో దాన్ని ముందుకు తీసుకెళ్లేవారు''అని నజేరా చెప్పారు.
''మొదట ఒక చిన్నారికి వ్యాక్సీన్ ఇస్తారు. అతడికి పొక్కులు వస్తాయి. ఆ పొక్కుల నుంచి వచ్చిన చీమును వేరొక చిన్నారికి ఇస్తారు. ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఇస్తూ.. ఈ వ్యాక్సీన్‌ను ముందుకు తీసుకెళ్తారు''
ఈ టీకాను తీసుకెళ్లేందుకు అవసరమైన అనాథలను అనాథాశ్రమ డైరెక్టర్ ఇసాబెల్ డే జెండేలా వై గోమెజ్ తీసుకొచ్చారు. ఆమె తన కొడుకునూ ఈ కృతువులో భాగస్వామ్యం చేశారు.
ఇలానే కరీబియన్, దక్షిణ, సెంట్రల్ అమెరికాలకు ఈ వ్యాక్సీన్‌ను తీసుకొచ్చారు. పసిఫిక్ మీదుగా ఈ వ్యాక్సీన్ ఫిలిప్పీన్స్‌కు కూడా చేరుకుంది. జెన్నర్ వ్యాక్సీన్ కనిపెట్టిన 20ఏళ్లకే లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగారు. 1979నాటికి మశూచి అంతరించిపోయింది.
''కోవిడ్-19 టీకా ప్రయత్నాల్లో ఇది స్ఫూర్తి నింపుతోంది. ఇప్పుడు వైరస్‌ల గురించి మనకు 200ఏళ్లనాటి చరిత్ర తెలుసు. వ్యాధి నిరోధక వ్యవస్థ గురించి కూడా తెలుసు. కానీ ఇవేమీ తెలియకుండానే జెన్నర్ వ్యాక్సీన్‌ను కనిపెట్టగలిగారు''అని నజేరా వ్యాఖ్యానించారు.
''సైంటిఫిక్ హీరోల వరుసలో జెన్నర్ మొదటి స్థానంలో ఉంటారు. ఆయన నిబద్ధత, ఆవిష్కరణలు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగాయి''
ఇవికూడా చదవండి:
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- మొదటి ప్రపంచ యుద్ధం: శత్రు సేనలను హడలెత్తించిన బుల్లి యుద్ధ ట్యాంక్
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా బతుకుతున్నారు’
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- వెయ్యేళ్ల పాత్ర.. వెల రూ.248 కోట్లు
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- నిజాం నవాబూ కాదు, బిల్ గేట్సూ కాదు.. చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








