జార్జ్ ఫ్లాయిడ్: అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమం నుంచి భారత దళిత ఉద్యమకారులు నేర్చుకోవాల్సింది ఏమిటి?

అమెరికాలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాహ్నవి మూలె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా గత రెండు వారాలుగా నల్లజాతి ప్రజల నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తి ఒకరు పోలీసు చేతిలో దారుణంగా హతమైన తరువాత సాధారణ ప్రజలు, యాక్టివిస్టులు అంతా తీవ్రంగా స్పందించారు. వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఒక దశలో ఈ నిరసనలు హింసారూపం దాల్చాయి. ఈ ఉద్యమ ప్రకంపనలు ప్రపంచమంతా పాకిన నేపథ్యంలో కొందరు దీన్ని భారత్‌లోని దళిత ఉద్యమంతో పోల్చుతున్నారు.

ఈ నేపథ్యంలో అటు దళిత ఉద్యమం, ఇటు ప్రస్తుత నల్లజాతి ఉద్యమం రెండింటినీ దగ్గరగా అధ్యయనం చేసిన రచయిత, అధ్యయనకర్త సూరజ్ యెంగ్డెతో మాట్లాడాం. సూరజ్ ఇటీవల ప్రచురించిన ‘కేస్ట్ మేటర్స్’ పుస్తకం చర్చనీయాంశంగా మారింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉన్న విట్‌వాటర్‌స్రాండ్ యూనివర్సిటీలో సూరజ్ చదువుకున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన రీసెర్చ్ చేస్తున్నారు.

‘‘సాధారణంగా అంతా అమెరికా సమాజం, అక్కడి సుసంపన్నత గురించి అందమైన ఒక పార్శ్వాన్నే చూస్తారు. కానీ, తాజాగా జరుగుతున్నదంతా అమెరికాలోని రెండో పార్శ్వాన్ని చూపిస్తోంది. తాజా పరిణామాల్లో భారతీయుల పాత్ర మాత్రం పరిమితం’’ అంటారు సూరజ్.

‘‘జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ అమెరికన్లు సాగించిన పోరాటాల్లో పాలుపంచుకున్న చరిత్ర భారత్‌కు ఉంది. కానీ, ఇప్పుడు ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చిన భారతీయులు ఈ ఉద్యమంలో పెద్దగా భాగస్వాములు కావడం లేదు’’ అన్నారాయన.

‘‘అమెరికాలోని నల్లజాతీయులు అమానవీయ రీతిలో అత్యాచారాలను ఎదుర్కొన్నారు. బానిసత్వ నిర్మూలనకు 1865లో ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ, అమెరికా సామాజిక, ఆర్థిక వ్యవస్థలో మాత్రం బానిసత్వం ఇప్పటికీ పోలేదు. ఆ బానిసత్వ పరిణామాలను ప్రస్తుత ఉద్యమ ప్రదర్శనల్లో చూడొచ్చు’’ అని చెప్పిన ఆయన దీన్నుంచి కొత్త రాజకీయం ఉద్భవించొచ్చనీ అంచనా వేస్తున్నారు.

అమెరికాలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

నల్లజాతీయుల ఉద్యమాన్ని, దళితోద్యమంతో పోల్చడం సరైందేనా?

ఈ రెండింటిని నేరుగా పోల్చని సూరజ్ ‘‘అమెరికాలో ఒక మహిళ అణచివేత, అత్యాచారాలను ఎదుర్కొన్నప్పుడు ఆ ఘటనను చూసే అక్కడి భారతీయ స్త్రీ దాన్ని తనకూ ఎదురయ్యే అనుభవంగా భావిస్తుంది. మొత్తం మహిళాజాతి పైనే జరిగిన ఘటనగా భావిస్తుంది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా దోపిడీకి గురవుతున్న వర్గాలన్నీ అమెరికా నల్లజాతీయులపై సానుభూతితో ఉంటారు.. కానీ, భారత్‌‌లో మాత్రం అలాంటి ధోరణి కనిపించడం లేదు’’ అన్నారు.

‘‘అమెరికా ఘటనకు వ్యతిరేకంగా న్యూజీలాండ్, ఆస్ట్రేలియాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. ఆఫ్రికా దేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. కానీ, భారత్‌లో దీనిపై ప్రతిస్పందనేంటో నాకు తెలియదు. దళితులు, ఆదివాసీల హత్యలను సమర్థించే భారతీయ సమాజం నుంచి ఇంతకంటే ఆశించలేం కూడా’’ అన్నారాయన.

మరి, ఈ ఉద్యమాలను పోల్చడం సరైందేనా? కొన్ని సంస్థలు ఇలాంటి పోలికలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునే ప్రమాదం ఉందంటారు సూరజ్.

కానీ, సిద్ధాంతం, ఉద్యమాల విషయానికి వస్తే ఇలాంటి పోలికలు నిత్యం జరిగేవే. ‘‘దళిత పాంథర్స్‌కు ముందే ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో ఆఫ్రికన్ అమెరికన్ ప్రెస్ భారత దళితుల పరిస్థితులను నిశితంగా అధ్యయనం చేసింది. కానీ, భారతదేశంలోని దళిత ఉద్యమాలు అమెరికా కానీ, మరే ఇతర దేశంలో కానీ అలాంటి ఉద్యమాలతో సంప్రదించినట్లు ఎన్నడైనా చూశామా?’’ అని ప్రశ్నించారు సూరజ్.

అమెరికాలో నిరసనలు

‘దోపిడీకి గురైనవారు ప్రపంచంలో ఏమూలన ఉన్నా అంతా ఏకం కావాలి’

భారతీయ యువత ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలతో సంప్రదించడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోగలదు. కానీ, కొందరు మినహా ఇలా చేస్తున్నవారెవరూ కనిపించడం లేదు. అలాంటి సంబాషణలు, సంబంధాలు వ్యక్తిగత స్థాయికే పరిమితమవుతున్నాయి కానీ ఉద్యమ స్థాయిలో జరగడం లేదు.

అమెరికాలోని బ్లాక్ పాంథర్స్ ఉద్యమ స్ఫూర్తితో 1972లో దళిత పాంథర్స్ ఏర్పాటైంది. ముంబయిలోని శ్రామిక వర్గం ఇందులో పాలుపంచుకుంది.

‘‘ప్రజలు దళిత ఉద్యమాల గురించి మాట్లాడుతారు కానీ ఫూలె బహుజన ఉద్యమంలో, అంబేడ్కర్ ఉద్యమ కాలంలో కానీ అంతర్జాతీయ ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన దాఖలాలున్నాయి. అంబేడ్కర్ విదేశాల్లో చదువుకున్నారు. అక్కడ ఆయన ఇలాంటి అనుభవాలు చవిచూశారు.. ఉద్యమానికి ఆయన మార్గనిర్దేశం చేశారు’’ అన్నారు.

‘‘బాబా సాహెబ్ విదేశాలలో చదువుకున్నాడు. అతను ఈ విషయాలను అక్కడ అనుభవించాడు. అతని ఉద్యమానికి దిశానిర్దేశం చేశాడు. కానీ, ఇప్పుడిలాంటిది కనిపించడం లేదు. భారత్‌లో దళిత ఉద్యమాలు పూర్తిగా స్థానికమైపోయాయి’’ అన్నారు సూరజ్.

ఒకట్రెండు అధికార స్థానాల కోసం మొత్తం ఉద్యమాన్ని నీరుగార్చి దళిత నాయకులు మన దగ్గర కోకొల్లలుగా ఉన్నారంటూ.. అలాంటి వారికి ప్రాపంచిక దృక్పథం ఎలా ఉంటుందని ప్రశ్నించారు సూరజ్.

దళిత ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

నల్లజాతీయుల నుంచి దళితులు నేర్చుకోవాల్సిందేమిటి?

ప్రపంచవ్యాప్తంగా దోపిడీకి గురైన వర్గాలన్నీ ఏకం కావాలని, ఒకరితో ఒకరు సంభాషించుకోవాలని, ఒకరికొకరు అండగా నిలవాలన్నది సూరజ్ మాట. ఇప్పుడు అమెరికాలోని నల్లజాతీయుల గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ ఇతర దేశాల్లోనూ వివిధ జాతులు, మతాలకు చెందిన ప్రజలూ అణచివేత, అత్యాచారాలకు గురవుతున్నారు.

భారత్‌లో దళిత ఉద్యమం సమ్మిళితంగా ఉందా అనే ప్రశ్నకు సూరజ్ ఇచ్చిన సమాధానం భారతీయ మనస్తత్వానికి గురిపెట్టింది.

‘‘మనం ఒకరి పేరు విన్న తరువాత వారితో మాట్లాడడానికి ముందే వారి కులం గురించి ఊహించడం ప్రారంభిస్తాం. ఆలోచనలు కలవడానికి ముందు కులాలు కలవాల్సిన అవసరం ఉందని భారతీయ సమాజం నూరిపోసింది. ఇలాంటి అపనమ్మకం పోయి ఒకరినొకరు విశ్వసించాల్సిన పరిస్థితులు రావాల్సిన అవసరం ఉంది’’ అంటారాయన.

ఉమ్మడి వేదికలపై సమాన స్థాయిలో ప్రజలంతా కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి విశ్వాసం పాదుకుంటుందన్నది సూరజ్ అభిప్రాయం. ‘‘దళిత ఉద్యమం కేవలం ఒక కులానికి పరిమతమైనది కాదు. అనేక కులాలు కలసివచ్చి కుల నిర్మూలనకు చేసే ఉద్యమం ఇది. ఫూలే కాలం నుంచి అంబేడ్కర్ శకం వరకు అన్ని కులాలవారూ వారి ఉద్యమంలో పాలుపంచుకోవడం చూశాం. ఇదొక సమ్మిళిత ఉద్యమం’’ అంటారాయన.

‘‘దళిత ఉద్యమం అందరినీ కలుపుకొని వెళ్లడానికి ఏం చేయాలనే ప్రశ్నను దళిత ఉద్యమకారులను అడిగే కంటే ఆ ప్రశ్నను సవర్ణ వర్గాలు తమకు తాము వేసుకోవాలి. కానీ, ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి సున్నితత్వం, సహానుభూతి, స్పృహ లేదు. సవర్ణ వర్గాల్లో కొద్దిమందిని మాత్రమే ఇలా చూడగలం’’ అన్నారాయన.

దళిత ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

వర్గ వ్యత్యాసాలన ఎలా చూడాలి?

ఎల్‌జీబీటీక్యూ ఉద్యమాలలోనూ కుల తత్వం ఉన్నవారు కనిపిస్తారని సూరజ్ అన్నారు.

‘‘కాబట్టి ఆర్థికపరంగా వర్గ వ్యత్యాసాన్ని చూడాలి. దళితుల్లోనూ పట్టణ, ఉన్నస్థాయి వర్గం ఉంది. కానీ, నేటికీ 70 శాతం బహుజన్ సమాజం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తోంది. గ్రామీణ ప్రాంత దళితులు ఎదుర్కొనే వాస్తవికత ముంబయి, ఇతర నగరాల్లో నివసించే దళితులకు ఎదురయ్యే అనుభవాలకు భిన్నంగా ఉంటుంది. ఈ విషయం గ్రహించి ముందుకు సాగాలి’’ అంటారాయన.

వీడియో క్యాప్షన్, ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)