కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ ప్రియదర్శి
- హోదా, డిజిటల్ ఎడిటర్, బీబీసీ హిందీ
కాస్తో, కూస్తో సంపాదించుకున్నదంతా మూట కట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని వందల కి.మీ.లు కాలినడకన వెళ్లేందుకు సిద్ధమైన వాళ్లను చూస్తే... ప్రభుత్వం గానీ, ఈ సమాజం గానీ తమకు ఏదో చేస్తుందన్న ఆశలు వాళ్లకు లేవని కచ్చితంగా చెప్పవచ్చు. తమను తాము నమ్ముకునే వాళ్లు బతుకుతున్నారు. వాళ్లకు తెలిసింది అదొక్కటే.
కరోనావైరస్ గండం నుంచి బయటపడ్డాక ప్రపంచంలో మార్పు వస్తుందని కొందరు దార్శనికులు అంటున్నారు. 9/11 దాడుల తర్వాత ప్రపంచం ఎంతగా మారిందో, మనమంతా చూశాం. కరోనా ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ప్రపంచమంతటా మార్పులు కనబడతాయి. అవి చాలా రకాలుగా ఉంటాయి.
భారత్‌లో జరిగే మార్పుల విషయాన్ని అర్థం చేసుకోవడానికి రెండు చిత్రాలు మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది ఆనంద్ విహార్‌లోని బస్టాండ్‌లో జనం పోగైన చిత్రం. రెండోది ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో నిశ్చింతగా కూర్చొని దూరదర్శన్‌లో రామాయణం సీరియల్ చూస్తున్నవాళ్ల చిత్రం. ఇలాంటివారిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు.పేద భారతం చేపట్టిన ఈ ‘పాద యాత్ర’ ప్రభుత్వానికన్నా మన సమాజానికే పెద్ద ప్రశ్న విసిరింది. ప్రపంచమంతటా ఏం జరుగుతుంది? సైన్స్ హద్దులు ఏంటి? చైనా పాత్ర ఏంటి? అన్న ప్రశ్నలు కాసేపు పక్కన పెట్టండి.
విస్మరణ
మహారాష్ట్రలో రైతుల రక్తమోడిన పాదాలు మీకు గుర్తున్నాయా? గత రెండేళ్లలో డ్రైనేజీలు శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ల గురించి వచ్చిన వార్తలు గుర్తున్నాయా? సైకిల్‌పై భార్య శవాన్ని మోసుకువెళ్లిన వ్యక్తి గుర్తున్నాడా? ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఓ సమాజంగా బాధపడతాం. భావోద్వేగానికి గురవుతాం. ఎంతో కొంత విరాళాలు ఇస్తాం.
కానీ, మహారాష్ట్ర రైతులు, డ్రైనేజీ శుభ్రంచేసేవాళ్లు, సైకిల్ మీద భార్య శవాన్ని మోసుకువెళ్లిన వ్యక్తి... వీళ్లంతా మన మూకుమ్మడి భావనలో ‘వేరే వాళ్లు’. వాళ్లు మనలో భాగం కాదు. మనతో సమానమైన పౌరులు కాదు.
మనం అంటే... ఫ్లాట్లలో ఉండేవాళ్లం, పిల్లలకు ఇంగ్లీష్ చదుపులు చెప్పించేవాళ్లం, దేశాన్ని ప్రేమించడం గురించి మాట్లాడేవాళ్లం, పాకిస్తాన్ అంతు చూసేవాళ్లం, ప్రపంచ యుద్ధాలకు త్వరగా వెళ్లాలని కోరుకునేవాళ్లం, గతం గురించి గర్వించేవాళ్లం, భవిష్యత్తు గురించి భరోసా ఉన్నవాళ్లం. మనం చెప్పే ఈ దేశంలో జనాభాలో అధిక భాగం ఉన్నా, చిన్నచూపుకు గురవుతున్న ఆ ‘వేరే వాళ్ల’కు చోటు లేదు.

ఫొటో సోర్స్, Getty Images
వివక్ష
ఏ రోజుకు ఆరోజు రెక్కాడితే గానీ డొక్కాడనివాళ్లు, వంతెనల కింద, మురికివాడల్లో బతికేవాళ్లు, చదువులేని వాళ్లు. వీళ్లంతా ‘వేరే వాళ్లు’, మిగతా వాళ్లు ప్రత్యేకం. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’లో ఆ ‘వేరే వాళ్లు’ కూడా భాగమే. మన భారాన్ని మోస్తారు. మన కోసం పారిశుద్ధ్య పనులు చేస్తారు. మనకు కూరగాయలు మోసుకువస్తారు. కానీ వాళ్లు ‘మనం’ కాదు.
ఆనంద్ విహార్‌లో కనిపించిన దృశ్యం టీవీలో రామాయణం చూసేవాళ్ల జ్ఞాపకాల్లో నుంచి వెళ్లిపోతే ఆశ్చర్యం లేదు. మహారాష్ట్రలో రైతుల పాదాలు రక్తమోడిన రోజు... క్రికెటర్ మహమ్మద్ షమీకి, ఆయన భార్యకు మధ్య గొడవను చూపిస్తూ న్యూస్ చానెళ్లు బిజీగా ఉన్నాయి. న్యూస్ చానెళ్లను నడిపేవాళ్లకు బాగా తెలుసు... వాళ్లుంది ‘మన’ కోసమని, ‘వేరే వాళ్ల’ కోసం కాదని.
కాలినడకన వెళ్తున్నవాళ్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగడంతో, టీవీ చానెళ్లు ఈ అంశం గురించి వార్తలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ‘ఇలాంటివాళ్లతో లాక్‌డౌన్ విఫలమవుతుంది, వైరస్ వ్యాప్తి చెందుతుంది, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీళ్లు ఎవరు, ఎక్కడివాళ్లు అక్కడే ఉండలేరా...’ అంటూ ఆందోళన స్వరాలు వినిపించాయి. వాళ్ల ఇబ్బందుల గురించైతే ఏ చింతా లేదు.
మన భారతీయులం ఏం చెప్పినా, ఎంత చెప్పినా... లోలోపల అసమానత్వాన్ని లోతుగా, బలంగా నమ్మేవాళ్లం. పేదలు, దళితులు, అణగారినవర్గాలు విషయంలో మన వైఖరి ప్రతిబింబమే ప్రభుత్వ వైఖరిలో కనబడుతుంది. ప్రభుత్వాలకు వేటికి ఓట్లు రాలుతాయో, వేటికి రాలవో వారికి బాగా తెలుసు.
విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు వెళ్తాయి. కాలినడకన వెళ్తున్నవాళ్ల గురించి మూడు రోజులు సోషల్ మీడియాలో చర్చ జరిగాక, ఏదో పెద్ద మేలు చేస్తున్నట్లు కొన్ని బస్సులు నడుస్తాయి. ఇలా బస్సులు పంపడం కూడా తప్పేనని కొందరు గగ్గోలు పెడతారు.
దినసరి కూలీలకు మొదటగా ఆర్థిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రుల్లో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. కానీ, ఆదే రాష్ట్రంలో మోదీ చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం ఫిలిబిత్ ఎస్పీ, డీఎం గంటలు కొడుతూ పవిత్ర ర్యాలీ చేస్తూ రోడ్ల మీదకు వచ్చారు.
ర్యాలీగా వచ్చే కావడియాల (శివ భక్తుల) పాదాలను సీనియర్ పోలీసు అధికారులు గర్వంగా తాకే రాష్ట్రమూ ఇదే. ఆ కావడియాలపై హెలికాప్టర్‌లతో పూల వర్షం కురిపేంచేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం ఉన్నదీ ఈ రాష్ట్రంలోనే.

ఫొటో సోర్స్, Getty Images
ఆదర్శ భారతీయులు
పని ఆగిపోతే దినసరి కూలీలకు తమ ఊళ్లకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం ఉండదని ప్రభుత్వానికి తెలియదా? కష్టాలు పడుతూ ఆ జనాలు చేస్తున్న ప్రయాణాన్ని బాగా చదువుకున్న కొందరు ‘కరోనా పిక్నిక్’ అని పిలుస్తున్నారు. అందరూ తమ లాగే ఉండాలని వీళ్లు కోరుకుంటుంటారు. ‘ఆదర్శ భారతీయులు’ ఎలా ఉండాలన్న దానికి వీళ్లొక చిత్రీకరణ చేశారు. పట్టణాల్లో ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలి. మతవిశ్వాసం ఉండాలి. దేశభక్తి ఉండాలి. సంస్కృతులను పాటించాలి. అదే వాళ్ల ‘మనం’.
‘వేరే’ మనుషులతో వాళ్లకు ఇబ్బంది. వేరే మనుషులు నిరక్షరాస్యులు. వాళ్లకు ఏదీ ఉండకూడదు. తమ ఇష్టప్రకారమే అలా ఉన్నారు. ‘మన’, భారత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు.
మహమ్మారులు ప్రబలితే నిందను పేదల మీదకు జనం చాలా సులువుగా నెట్టేస్తారు. ‘మూర్ఖుల’ వల్లే వైరస్ వ్యాపించిందంటూ దోషులను తేల్చేస్తారు. లేకపోతే, మేం మా అపార్ట్‌మెంట్లలో కూర్చొని, రామాయణం చూసేవాళ్లం అని అనుకుంటారు. కానీ, ఈ ‘వైరస్ వ్యాప్తి చేసే జనం’ 21 రోజులు బతికుండటానికి ఏర్పాట్లు ఉన్నాయా అన్నది వారు ప్రశ్నించరు.
కరోనావైరస్‌పై పోరాటంలో కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనత కర్ఫ్యూ రోజు సాయంత్రం 5 గంటలకు మేడల మీదకు, బాల్కనీల్లోకి వచ్చి ప్రజలు చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన దృష్టిలో దేశవాసులంతా మేడలు, బాల్కనీలు ఉండే ఇళ్లలో నివసిస్తున్నారనుకుంటా.
అందరూ సమానమేనా?
అసమానత్వాన్ని మనం అతిగొప్ప విధానంగా భావిస్తాం. పేదవారికి సాయం చేస్తామేమో గానీ, అందరినీ సమానమని మనస్ఫూర్తిగానైతే భావించం. ఇదే మన సమాజం. ఇదే వాస్తవం.
వర్ణ వ్యవస్థలోనే దీనికి మూలాలు ఉన్నాయి. ఫ్యూడలిస్టిక్ ధోరణి కూడా ఇందుకు కారణం.కష్టం చేసుకు బతికేవాళ్లలో అన్ని కులాలవాళ్లు, జాతుల వాళ్లు ఉంటారు. ఇక్కడ కుల వివక్షేమీ లేదు. కానీ, ఎక్కువ మంది వెనుకబడిన తరగతుల వాళ్లే ఉంటారు. వివక్షను మన సమాజం అంగీకరిస్తుంది. చేతికున్న ఐదు వేళ్లే ఒకేలా ఉండవన్న సామెత మనందరికీ తెలుసు. ఇక్కడ వివక్ష చాలా సహజమైన అంశం. మార్పు గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఇక ఈ వ్యవస్థ ద్వారా లాభం పొందుతున్నవాళ్లు, మార్పు ఎందుకు రావాలని కోరుకుంటారు?

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

సామాజిక ప్రవర్తన
తిరుపతి నుంచి వైష్ణో దేవి వరకూ గుళ్లకు వేలు, లక్షల రూపాయలు విరాళాలు ఇస్తారు. పెద్ద పెద్ద విగ్రహాలు, గుళ్లు నిర్మించేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ, పేద వాడి విషయం వచ్చేసరికి మన పిడికిలి తెరుచుకోదు.
మనం చూస్తున్న భారత సాంస్కృతిక సౌందర్యం అంతటిలో హిందూ సంస్కృతి పాత్ర ఉన్నట్లే, మన సామాజిక అవలక్షణాల్లోనూ దానికి లోతైన పాత్ర ఉంది.
ఇది దూషించుకునే సమయం కాదు. ఆలోచించుకోవాల్సిన సమయం. ఘనకీర్తి గురించిన కథల్లోనే ఇరుక్కుపోకుండా, ప్రతి విమర్శపై విరుచుపడకుండా... అధిక సంఖ్యాక వర్గం తమ సామాజిక ప్రవర్తనను ఒకసారి దగ్గరగా పరిశీలించుకోవాలి.
సిక్కు సమాజంలో గురునానక్ సచ్ఛే సౌదాల కాలం నుంచే సేవా భావం మిగతావాళ్ల కన్నా ఎక్కువగా కనబడుతుంది. ముస్లింలు ఖైరాత్, జకాత్‌లు చేస్తారు. హిందువులు కూడా దానాలు చేస్తారు. కానీ, అందరికీ ఆ యోగ్యత ఉండదు. గుడి బయట కూర్చున్న యాచకులకు రెండు రూపాయలు వేసి మనం సంతోషిస్తాం.
ప్రభుత్వం-సమాజం నిర్ణయాలు, స్పందనలు వర్ణ వ్యవస్థ నీడల్లోనే ఉంటున్నాయని కరోనావైరస్ మరోసారి చూపించింది.

ఇవి గుర్తుకువస్తాయా?
సమాజంలో మార్పునకు మనం సిద్ధంగా ఉన్నామా? ప్రతి ఓటూ సమానమైనట్లే, ప్రతి పౌరుడూ సమానమవ్వగలడా? దీని గురించి చర్చించేందుకు మనం సంసిద్ధంగా ఉన్నామా? కరోనా తర్వాత రాజకీయ అంటరానితనాన్ని మనం రూపుమాపుతామా? దేశంలోని పౌరులందరి కోసం మెరుగైన స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా వ్యవస్థల కోసం డిమాండ్ చేస్తామా?
పెద్ద పెద్ద విగ్రహాల గురించి మాట్లాడేటప్పుడు, దేశంలో ప్రతి వెయ్యి మందికి ఎంత మంది వైద్యులు ఉన్నారు, ఎన్ని ఆసుపత్రి పడకలు ఉన్నాయన్న విషయం మీకు గుర్తుకువస్తుందా? పౌష్టికాహార లోపంతో ఎంత మంది బాధ పడుతున్నారు, తాగునీరు ఎందరికి ఉందనే విషయాలు గుర్తుకువస్తాయా? మన పరిశోధన సంస్థల్లో ఎలాంటి కృషి జరుగుతోంది? యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామా? రాబోయే తరాల చేతుల్లో ఎలాంటి దేశాన్ని పెడుతున్నాం? ఈ విషయాలన్నీ మీ మదిలో మెదులుతాయా?
కరోనావైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నప్పుడు, భారత్‌కు వ్యాపిస్తున్నప్పుడు మనం ఇక్కడ డోనల్డ్ ట్రంప్ స్వాగతం పలకడంలో మునిగిపోయాం. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటున్నాం.
పౌరులందరికీ నాణ్యమైన విద్య, వసతులు అందించేందుకు కాకుండా వేరే వాటి కోసం పెట్టే ఖర్చు వనరులను వృథా చేయడమేనన్న భావన దేశంలో వస్తే, కరోనావైరస్‌కు మనం చెల్లించుకునేది పెద్ద మూల్యమేమీ కాదు.
కానీ, మనం అలా చేస్తామా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck
- కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?
- కరోనావైరస్: ‘నాలాంటి నాలుగు వేల మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి
- కరోనావైరస్: ఆయన మరణించారు.. బంధువుల్లో 19 మందికి సోకింది.. ఇంకా 40 వేల మందికి సోకిందేమోనన్న టెన్షన్
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి? అవి ఎందుకు ముఖ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








