అమెరికా నిరసనలు: జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
నల్ల జాతి వారిపై పోలీసుల అరాచకత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలతో అమెరికా అట్టుడుకుతోంది.
మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేశాక చనిపోయారు. మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోతున్నాయి.
న్యూయార్క్, చికాగో, అట్లాంటా, లాస్ ఏంజెలెస్ వంటి చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించినా నిరసనకారులు వీధుల్లో వెల్లువెత్తుతున్నారు.
చాలా ప్రాంతాల్లో కార్లు, దుకాణాలు భవనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టటానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బరు బులెట్లు ప్రయోగించారు.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో పలు ప్రముఖ దుకాణాలు లూటీ అయ్యాయి. నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
న్యూయార్క్ నగరంలో ఆందోళనకారులు దాదాపు 20 కార్లను దగ్ధం చేశారు. చికాగోలో హింసాత్మక నిరసనలను నియంత్రించటానికి రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.
అట్లాంటాలో కర్ఫ్యూ విధించినా కూడా ఆందోళనకారులు వీధుల్లోనే కొనసాగుతూ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు.
నిరసన మొదటిగా రాజుకున్న మినియాపోలిస్ నగరంలో పరిస్థితి కొంత సద్దుమణిగింది. దేశ వ్యాప్తంగా చాలా మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నకిలీ నోటుపై ఫిర్యాదుతో...
అయితే.. అమెరికాను అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ ఆగ్రహజ్వాలకు దారితీసిన జార్జ్ ఫ్లాయిడ్ మరణం ఎలా సంభవించింది? అతడి ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
ఫ్లాయిడ్ అరెస్టు వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. ఫ్లాయిడ్‌ను అరెస్టు చేసే క్రమంలో తెల్ల జాతికి చెందిన పోలీసు అధికారి డెరెక్ షావిన్... ఆయన్ను నెలకు అదిమిపట్టి, మెడను మోకాలితో నొక్కిపట్టి కూర్చోవడం ఆ వీడియోలో కనిపించింది. షావిన్‌పై హత్య కేసు నమోదైంది.
జార్జ్ ఫ్లాయెడ్ మరణానికి దారితీసిన ప్రధాన ఘటనలన్నీ ఒక 30 నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, వీడియో ఫుటేజీ, అధికారిక ప్రకటనల ఆధారంగా ఇంతవరకూ తెలిసింది ఇదే...
నకిలీ నోటుపై ఫిర్యాదుతో ఈ ఉదంతం మొదలైంది.
మే 25న సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఓ షాపులో జార్జ్ ఫ్లాయిడ్ ఓ సిగరెట్ ప్యాకెట్ కొన్నారు. అందుకు ఆయన 20 డాలర్ల నోటు ఇచ్చారు.
షాపులో పని చేసే ఉద్యోగి ఆ నోటును నకిలీదిగా భావించి, పోలీసులకు ఫోన్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER/RUTH RICHARDSON
ఫ్లాయిడ్ మినియాపోలిస్‌లో కొన్నేళ్లుగా ఉంటున్నారు. అంతకుముందు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఉండేవారు.
మినియాపోలీస్‌లో ఫ్లాయిడ్ బౌన్సర్‌గా పనిచేస్తుండేవారు. కానీ, కరోనావైరస్ సంక్షోభం కారణంగా లక్షల మంది అమెరికన్లలాగే ఆయన ఉద్యోగం కూడా పోయింది.
కప్ ఫుడ్స్‌కు ఫ్లాయిడ్ నిత్యం వస్తుండేవారు.
‘‘ఆయన స్నేహశీలి. మంచి కస్టమర్. ఆయనతో మాకు ఎప్పుడూ ఇబ్బంది వచ్చింది లేదు’’ అని షాపు యజమాని మైక్ అబుమయెల్లా ఎన్‌బీసీ వార్తా చానల్‌తో చెప్పారు.
కానీ, ఘటన జరిగిన రోజు షాపులో అబుమయెల్లా లేరు. జార్జ్ ఫ్లాయిడ్ ఇచ్చింది నకిలీ నోటు అని అనుమానం వచ్చిన షాపు ఉద్యోగి నిబంధనల ప్రకారం చేయాల్సిందే చేశారు.
రాత్రి 8.01కి 911 నెంబర్‌కు ఆ ఉద్యోగి ఫోన్ చేశారు.
‘‘నేను సిగరెట్లు వెనక్కి ఇవ్వమని అడిగా. కానీ, ఆయన (జార్జ్ ఫ్లాయిడ్) ఒప్పుకోవడం లేదు. తాగి ఉన్నట్లుగా, తనపై తనకు నియంత్రణ లేనట్లుగా ఆయన కనిపిస్తున్నారు’’ అని ఆ కాల్‌లో చెప్పారు.
ఆ కాల్ తర్వాత కొద్దిసేపటికే, అంటే 8.08కి ఇద్దరు పోలీసు అధికారులు కప్ ఫుడ్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఓ మూలన నిలిపి ఉంచిన కారులో ఫ్లాయిడ్ మరో ఇద్దరితో కలిసి కూర్చొని ఉన్నారు.
ఆ ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరైన థామస్ లేన్ ఆ కారు దగ్గరికి వెళ్లాక, తన తుపాకీ బయటకు తీశారు. ఫ్లాయెడ్‌ను చేతులు బయటకు చూపించాలని ఆదేశించారు.

ఫొటో సోర్స్, DARNELLA FRAZIER
థామస్ లేన్ తుపాకీ బయటకు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది కేసు విచారణకర్తలు వెల్లడించలేదు.
ఫ్లాయిడ్‌పై లేన్ చేతులు వేశారని, ఆయన్ను కారు నుంచి బయటకు లాగారని, ఫ్లాయిడ్ సంకెళ్లు వేస్తుంటే అడ్డుపడ్డారని వారు తెలిపారు.
సంకెళ్లు వేసిన తర్వాత ఫ్లాయిడ్ పోలీసుల సూచనలను పాటించారు. ‘నకిలీ నోటును చలామణీ చేసినందుకు’ ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ఆయనకు చెప్పారు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను స్క్వాడ్ కారులోకి ఎక్కించేందుకు వాళ్లు ప్రయత్నించారు. దీంతో పెనుగులాట మొదలైంది.
అధికారిక నివేదిక ప్రకారం 8.14కు ఫ్లాయిడ్ నేలపై పడిపోయారు. తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని అధికారులకు చెప్పారు.
షావిన్ అప్పుడు ఇతర అధికారులు ఫ్లాయిడ్‌ను కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.
8.19కి ఫ్లాయిడ్‌ను ప్యాసింజర్ సీటు వైపు నుంచి షావిన్ లాగేందుకు ప్రయత్నించారు. దీంతో ఫ్లాయిడ్ కింద పడిపోయారు. ఆయన ముఖం నేల వైపు ఉంది. చేతులకు సంకెళ్లతో, అలాగే పడిపోయి ఉన్నారు.
అప్పుడే అక్కడున్నవాళ్లు ఫ్లాయిడ్‌ను వీడియో తీయడం మొదలుపెట్టారు. ఫ్లాయిడ్ నిస్సహాయ స్థితిలో కనిపించారు. చాలా ఫోన్లలో ఆ క్షణాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవే ఆయనకు ఆఖరి క్షణాలు అయ్యాయి.
ఫ్లాయిడ్ తలపై, మెడపై షావిన్ తన ఎడమ మోకాలిని మోపారు.
‘‘ఊపిరి అందటం లేదు’’ అని ఫ్లాయిడ్ పదేపదే పోలీసులకు మొరపెట్టుకున్నారు. ‘‘ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్’’ అంటూ ప్రాధేయపడ్డారు.
ఎనిమిది నిమిషాల 46 సెకన్ల పాటు షావిన్ తన మోకాలితో ఫ్లాయిడ్ మెడను నొక్కిపట్టి ఉంచారని విచారణకర్తల నివేదికలో ఉంది.
అయితే, అది మొదలైన ఆరు నిమిషాల్లో ఫ్లాయిడ్‌లో కదలికలు ఆగిపోయాయి. వీడియోల్లో అక్కడున్నవాళ్లు పోలీసులను ఫ్లాయిడ్ నాడీ స్పందన చూడాలని అడగడం కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లాయిడ్ కుడి చేతి మణికట్టును నాడీ స్పందనల కోసం ఓ అధికారి చూశారు. నాడీ స్పందన తెలియలేదు. అయినా, పోలీసులు కదల్లేదు.
8.27కు ఫ్లాయిడ్ మెడపై నుంచి షావిన్ తన మోకాలిని పక్కకు జరిపారు. ఏ కదలికలూ లేకుండా ఉన్న ఫ్లాయిడ్‌ను అప్పుడు హెనేపిన్ కౌంటీ మెడికల్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తరలించారు.
ఫ్లాయిడ్ మృతి చెందినట్లు ఆ తర్వాత ఓ గంటకు వైద్యులు ప్రకటించారు.
మరణించడానికి ముందు రోజు ఫ్లాయిడ్ తన స్నేహితుడు క్రిస్టోఫర్ హారిస్‌తో మాట్లాడారు. తాత్కాలిక ఉద్యోగాలు చూపించే సంస్థను సంప్రదించాలని ఫ్లాయిడ్‌కు అప్పుడు హారిస్ సూచించారు.
ఫ్లాయిడ్ నకిలీ నోట్లు చెలామణీ చేసే రకం కాదని హారిస్ అన్నారు.
‘‘తమ కోసం తీర్చిదిద్దిన వ్యవస్థ కాదని తెలిసి కూడా, దానిపై విశ్వాసం పెట్టుకుని, న్యాయం దొరుకుతుందని పదే పదే ప్రయత్నం చేసి విఫలమైనవారికి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మాత్రం మరో మార్గం ఉండదు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్‌లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








