వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి: ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం - అభిప్రాయం

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
- రచయిత, దేవులపల్లి అమర్
- హోదా, జాతీయ, అంతర్ రాష్ట్ర మీడియా వ్యవహారాల సలహాదారు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవ్వాల్టికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఇందులో వింతేమీ లేదు.
ప్రజలు ఏదో ఒక రాజకీయ పార్టీని గెలిపిస్తారు, ఎవరో ఒకరు ముఖ్య మంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం చేసే పనుల ఆధారంగా మళ్ళీ గెలవటమో వోడటమో జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. జగన్‌మోహన్‌రెడ్డిని కూడా ప్రజలు ఇదే విధంగా ఎన్నుకున్నారు.
ప్రమాణ స్వీకారం నాడే చెప్పిన విధంగా ఏడాది కాలంలో ఆయన తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నవరత్నాలనే కాకుండా అదనంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసారు. అధికారం లోకి వొచ్చిన కొద్ది మాసాల్లోనే ప్రపంచాన్నే కలవరపరిచిన మహమ్మారి కరోనాను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొని దేశం అంతటికీ ఆదర్శంగా నిలిచారు.
కరోనా వైరస్ ఇప్పట్లో మనను వోదిలిపోయేది కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్ధిక స్థితి గందరగోళంలో పడకుండా తగిన చర్యలకు పూనుకోవాలని చెప్పిన మొదటి నాయకుడు జగన్‌మోమన్‌రెడ్డి. ఈ మాట అన్నందుకు మొదట్లో ఆయనను ఎద్దేవా చేశారు. అయితే ఆ తరువాత ప్రధాన మంత్రి సహా అందరూ అదే మాట చెప్పాల్సిన పరిస్థితి వొచ్చింది.
రోజూ వేల సంఖ్యలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో కానీ, కరోనా బాధితులకు అందించే సహాయం విషయంలో గాని, వలస వెళ్ళే వారికి అన్ని సౌకర్యాలు కల్పించి జాగ్రత్తగా వారి ప్రాంతాలకు చేర్చే ఏర్పాట్లలో గాని ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణ దేశమంతటా ప్రశంసలు పొందేట్టు చేసింది.

ఫొటో సోర్స్, @YSRCP
పేదలకు న్యాయం చేయటం కోసం...
ముఖ్యంగా ఆయన ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పరిపాలనను ఎట్లా మారు మూల పల్లెల్లోని ప్రతి గడపకూ తీసుకుపోయిందో చూశాము. దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాల కల్పనకు ఈ వ్యవస్థ ఏర్పాటు దోహదపడింది.
ముఖ్యంగా ఆయన రైతులూ, మహిళలూ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకునే ప్రతి కార్యక్రమాన్ని రూపొందించడం చూశాము ఈ ఏడాది కాలంలో. విద్యా వైద్యం రెండూ ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదుపులో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందన్న సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నాయకుడు.
ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చెయ్యడం, రాష్ట్రం మొత్తంలో 27 వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయ్యాలనుకోవడమూ ఇందులో భాగమే.
వ్యవసాయం పండగ చెయ్యడానికి, మద్యం మహమ్మారిని తరిమి కొట్టడానికీ మొదటి సంవత్సరంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయన్నది స్పష్టం.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
జగన్ నమూనా అభివృద్ధి...
రెండు వేల కోట్ల రూపాయలతో సున్నా వడ్డీ పథకం తీసుకురావడం కానీ, 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేయడమే కాక 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించడం, షాక్ కొట్టే విధంగా మద్యం ధరలను పెంచడం రానున్న రోజుల్లో సంపూర్ణ మద్య నిషేధం దిశగా శాస్త్రీయమయిన అడుగులు వెయ్యడమే అనడంలో సందేహం లేదు.
రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు రెండు వేల కోట్ల రూపాయలు ఆదా చెయ్యడం వంటివన్నీ జగన్ నమూనా అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నవే.
అధికారంలోకి వొచ్చిన ఏడాది కాలంలో మూడు మాసాలకు పైగా కరోనా మహమ్మారి మింగేసినా సరే జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటివరకు సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ది చేకూరే విధంగా పదిహేను సంక్షేమ పథకాల అమలులో భాగంగా 40,139 కోట్ల రూపాయలు విడుదల చేశారు.
జగన్ నమూనా అభివృద్ధిలో భాగంగా రైతులకు, విద్యార్ధులకు, వృద్ధులకు, వికలాంగులకు అన్ని వర్గాల వారికీ నగదు నేరుగా చేతికందే ఏర్పాటు చెయ్యడం విశేషం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చెయ్యడానికి ఈ నమూనా ఎంతో దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు. తాను వాగ్దానం చేసిన అంశాల్లో 90 శాతం పైగా పూర్తి చేసి ఇది జగన్ నమూనా అభివృద్ది అని ప్రపంచానికి తెలియచెప్పారు.

ఫొటో సోర్స్, @YSRCP
కొత్త రాజకీయాలకు ప్రతినిధి...
అంతకుముందెన్నడూ ఆయన పరిపాలనలో భాగస్వామి కాడు. తండ్రి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిదు సంవత్సరాల మూడు మాసాల్లో ఏనాడూ కనీసం సచివాలయం కాంపౌండ్‌లో అడుగు పెట్టిన వాడూ కాదు. దొడ్డి దారిన పదవి సంపాదించి అధికార పీఠం ఎక్కలేదు.
ప్రమాద వశాత్తు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణమే సంభవించక పోతే అసలు తనకు ఈ అవసరం వొస్తుందని కానీ, ఈ బాధ్యత తీసుకోవాల్సి వొస్తుందని కానీ ఊహించి కూడా ఉండరు జగన్‌మోహన్‌రెడ్డి.
2009లో ఆయన మొదటి సారి కడప నుండి లోకసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. తండ్రి జీవించి ఉంటే ఆయన తోనే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ మహా అయితే ఇప్పుడు మూడోసారి లోకసభకు పోటీ చేసి ఉండే వారు. ఇంకా మాట్లాడితే కేంద్రంలో మంత్రి అయి ఉండే వారు.
రాజకీయాలు కొత్తగా ఉండాలని, భిన్నంగా ఉండాలని, జవాబుదారీతనంతో కూడిన పారదర్శకత ఉండాలనీ నమ్ముతున్న కొత్త తరం నాయకులకు ప్రతినిధి జగన్‌మోహన్‌రెడ్డి. పట్టుదలతో ఏదయినా సాధించ వచ్చునని నమ్మే నాయకుడు. ఎవరినయినా సరే ఎదిరించి నిలబడే తత్వం కలిగిన వాడు.

ఫొటో సోర్స్, @YSRCP
కుట్రలు పన్నినవారు ఎక్కడున్నారో చూస్తున్నాం...
కష్టాన్ని నష్టాన్ని భరించి ముందుకు సాగే గుణం. రాజకీయాల్లోకి ప్రవేశించిన కొద్ది మాసాలకే తండ్రిని కోల్పోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజకీయాల నుండి తెరమరుగు చెయ్యడానికి కుట్ర పన్ని కేసులలో ఇరికించి 16 మాసాల పాటు జైలు పాలు చెయ్యడం ఇవేవీ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని బలహీన పరిచలేదు, పైగా మరింత పట్టుదలనిచ్చాయి.
జగన్‌మోహన్‌రెడ్డిని తెరమరుగు చెయ్యడం కోసం పన్నిన కుట్రకు కాంగ్రెస్ పార్టీ తానే బలి అయి రెండు తెలుగు రాష్ట్రాల్లో జాడలేకుండా పోయింది. ఆ కుట్రలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ దాని అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమయిందో చూస్తూనే ఉన్నాం.
తండ్రి మరణానంతరం ఆ దుఃఖంలో దిగ్భ్రాంతికి గురయి లేదా ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారిని ఓదార్చేందుకు ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కానీ, ప్రతిపక్ష నాయకుడిగా 3,648 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర కానీ ఆయన ప్రజాకర్షణకు నిదర్శనంగా నిలిచాయి.
ఇవ్వాళ ఆయన అందిస్తున్న నూతన నమూనా సుపరిపాలన ఈ అంశాల నుండి వొచ్చినవే. అధికారంలోకి వొచ్చే ముందు ఆయన ఏ మేధావులతోనో, ఆర్ధిక రంగ నిపుణులతోనో, రాజకీయ దురంధరులతోనో, మీడియా పెద్దలతోనో.. పాలన ఎలా ఉండాలి, ప్రజలకు ఏ హామీలు ఇవ్వాలి అని చర్చించలేదు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ యువ నాయకుడు ప్రత్యక్షంగా కలుసుకున్న లక్షలాది మంది ప్రజల సమస్యల నుండి ఉద్భవించిందే ఈ జగన్ నమూనా అభివృద్ధి.

ఫొటో సోర్స్, @YSRCP
అన్ని రాజకీయ పార్టీలకూ ఆదర్శం...
కాంగ్రెస్‌లోనే ఉండి కేంద్రమంత్రిగా, ఆ తరువాత కొద్ది కాలమయినా ముఖ్యమంత్రిగా కూడా పని చేసే అవకాశాన్ని కూడా కాదనుకుని మాట మీద నిలబడటం కోసం కేసులు ఎదుర్కోవడానికి కూడా వెనుకాడని తత్వం సమకాలీన రాజకీయ నాయకుల్లో చాలా తక్కువగా ఉంటుంది.
పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది కాలంలోనే ఎన్నికలు ఎదుర్కొని కేవలం ఒకటిన్నర శాతం వోట్ల తేడాతో అధికారానికి దూరంగా ఉండిపోవడం, పార్టీ తరఫున ఎన్నికయి అధికార పక్షానికి 23 మంది శాసనసభ్యులు , ముగ్గురు లోక్‌సభ సభ్యులు వలస పోయినా క్రింది స్థాయి నాయకత్వం, పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా ఉండే విధమయిన నాయకత్వాన్ని అందించగలగడం జగన్‌మోహన్‌రెడ్డి విశిష్టత.
దేశమంతటా ఇప్పుడు రాజకీయ పార్టీలను చికాకు పరుస్తున్న పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వైఖరి కచ్చితంగా ప్రశంసించ దగ్గది. ఇతర పార్టీల తరఫున గెలిచి తరువాత తన పార్టీలోకి మారదల్చుకున్న వారందరికీ జగన్‌మోహన్‌రెడ్డి ఒక షరతు విధించారు.
వేరే పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి, దాన్ని ఆమోదింప చేసుకున్న తరువాతే తన పార్టీలో చేరాలన్న ఆంక్ష అది. ఇప్పటి వరకూ ఆయన దాన్ని కచ్చితంగా పాటిస్తూ రావడం విశేషం. ఇది దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలకూ ఆదర్శంగా నిలిచే చర్య.
47 ఏళ్ళ వయసులో ఇన్ని ఆటుపోట్లను తట్టుకుని అత్యద్భుత మెజారిటీతో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్న యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రానున్న నాలుగేళ్ళలో మరిన్ని ఆదర్శవంతమయిన, దేశమంతా అనుసరణీయమయిన ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటారనడంలో సందేహం లేదు.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

సీనియర్ పాత్రికేయులు జింకా నాగరాలు వ్యాసం:వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి: ‘ఏడాది పాలనలో ఆయనే హీరో... ఆయనే విలన్’
ఇవి కూడా చదవండి:
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- ఆంధ్రప్రదేశ్ రాజధాని: 'దక్షిణాఫ్రికా మోడల్ ఏపీకి పనికిరాదు, మనమే కొత్త మోడల్ చూసుకోవాలి'- ఈఏఎస్ శర్మ
- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్, సీఎం, అన్ని హెచ్ఓడీల కార్యాలయాలు
- ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. హైకోర్టు తీర్పుతో బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ
- ‘నాడు సమైక్యాంధ్ర ఉద్యమం తప్పు.. నేడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అంతే!!’
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: ‘నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక ఆశ, అదేంటంటే..’
- ఎడిటర్స్ కామెంట్: చంద్రబాబు ‘వ్యూహ చతురత’ పై వైఎస్ ‘విశ్వసనీయత’ విజయం
- భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- వలస కార్మికుల ఆకలి, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఏం చర్యలు చేపట్టారు?: సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








