బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్‌, గవర్నర్‌, సీఎం, అన్ని హెచ్‌ఓడీల కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు

సీఎం జగన్‌కు నివేదిక సమర్పిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రతినిధులు
ఫొటో క్యాప్షన్, సీఎం జగన్‌కు నివేదిక సమర్పిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రతినిధులు

ఏపీ రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.

ఈ నివేదికలో రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించాలని సూచించిందని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. బీసీజీ నివేదిక వివరాలను విజయ్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిశీలించి బీసీజీ తన నివేదికను సమర్పించిందని విజయ్ తెలిపారు.

నివేదికలో ముఖ్యాంశాలు

  • రాష్ట్రానికి రూ.రెండు లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. ఇంత అప్పుల భారం ఉన్నప్పుడు లక్ష కోట్లు ఒక్క ప్రదేశాన్ని అభివృద్ధి చెయ్యడానికి వెచ్చించడం అవసరమా అనే సందేహం వ్యక్తం చేసింది.
  • తలసరి ఆదాయంలో ఏపీ వెనకబడి ఉంది.
  • పర్యటకరంగంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే వెనకబడి ఉంది.
  • విశాఖలో తప్ప పోర్టుల అభివృద్ధి జరగలేదు.
  • విదేశీ విమాన ప్రయాణికులు విశాఖలో తప్ప మిగిలిన చోట్ల లేరు.
  • ఉత్తరాంధ్రను మెడికల్ హబ్‌గా మార్చొచ్చు.
  • పారిశ్రామిక ఉత్పత్తి పరంగా ఎనిమిది జిల్లాలు వెనకబడి ఉన్నాయి.
  • లక్ష కోట్లు ఒక్కచోట పెట్టేబదులు వీటిని సాగునీటి ప్రాజెక్టుల వైపుకు మళ్లించడం మంచిది.
  • హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలు అభివృద్ధి చేయాలి.
  • బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపురం అభివృద్ధి జరగాలి.

ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలిచ్చారని. ప్రాంతీయంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారని విజయ్ వెల్లడించారు.

కర్ణాటకలో రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.

జనాభా, సిటీ వైశాల్యం, చారిత్రక ఒప్పందాలు, అందుబాటులో ఉన్న ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్... ఇలా కొన్ని అంశాల ఆధారంగా కొన్ని సూచనలు చేశారు.

రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా చేసి, ఒక్కో ప్రాంతం నుంచి మూడు నగరలా చొప్పున 9 నగరాలను తీసుకుని వాటి మంచిచెడులను విశ్లేషించారు.

విశాఖ, విజయవాడలు తప్ప మిగిలిన నగరాల్లో జనాభా తక్కువ.

ఈ 9 నగరాల్లో ఒక్కో ప్రాంతం నుంచి మళ్లీ ఒక్కో సిటీని ఎంపిక చేశారు. అలా ఎంపిక చేసిన మూడు నగరాలు... విశాఖ, విజయవాడ, కర్నూలు.

న్యాయవ్యవస్థ, లెజిస్లేచర్, మిగిలిన ప్రభుత్వ శాఖలు ఎక్కడ ఉండాలి?

  • లెజిస్లేచర్ కు అమరావతి ప్రథమ ప్రాధాన్యం
  • న్యాయవ్యవస్థకు కర్నూలు మొదటి ప్రాధాన్యం

ఆప్షన్ 1:

  • సెక్రటేరియట్, గవర్నర్, సీఎం, 7 వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాలు, కొన్ని ప్రజలతో సంబంధం లేని శాఖల కార్యాలయాలు, అసెంబ్లీ అత్యవసర సమావేశాలు, ఓ హైకోర్టు బెంచ్... ఇవి విశాఖలో పెట్టుకోవచ్చు.
  • విజయవాడ లేదా అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌, లోకల్ గవర్నమెంట్, పంచాయతీ రాజ్ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు.
  • హైకోర్టు, కమిషన్లు, అప్పీలేట్ బాడీస్ అన్నీ కర్నూలులో ఏర్పాటు చెయ్యవచ్చు.

ఆప్షన్ 2:

  • విశాఖలో సెక్రటేరియట్‌, గవర్నర్‌, సీఎం, అన్ని హెచ్‌ఓడీల కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.
  • అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.
  • కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్స్, క్వాసీ జుడీషియల్ బాడీస్ ఏర్పాటు.

ఆప్షన్‌ 1 కోసం రూ.4,645 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఆప్షన్‌ 2 కోసం రూ.2500-3000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అమరావతిలో 55లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసులు ప్రతిపాదించారు."2009లో కృష్ణానది వరద ముంపుకు గురైన ప్రాంతంలో ప్రస్తుత రాజధాని అమరావతి కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఈ ముంపు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు" అని విజయ్ తెలిపారు.

ఈ నివేదికను హైపవర్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని విజయ్ వెల్లడించారు.

జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూమి, ఇప్పటి వరకూ జరిగిన ఖర్చులూ ఈ గ్రూపు అధ్యయన పరిథిలో లేవని తెలిపారు.

జీఎన్ రావు కమిటీ నివేదికకు, దీనికి సంబంధం లేదని తెలిపారు.

ఇది ప్రజలతో మాట్లాడి, అభిప్రాయాలు సేకరించి ఇచ్చిన నివేదిక కాదు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి రూపొందించిన నివేదిక అని విజయ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)