ఆస్ట్రేలియా కార్చిచ్చు: తండ్రి అంత్యక్రియల్లో 19 నెలల కుమారుడికి అవార్డు ప్రదానం

ఫొటో సోర్స్, AFP / NEW SOUTH WALES RURAL FIRE SERVICE
ఆస్ట్రేలియాలో కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో వాలంటీర్ జెఫ్రీ కీటన్ చనిపోయారు. మంటలను నియంత్రించేందుకు వాలంటీర్‌గా ముందుకొచ్చిన జెఫ్రీకి మరణానంతరం ఆస్ట్రేలియా ప్రభుత్వం ధైర్య సాహసాల (బ్రేవరీ) పురస్కారం ప్రకటించింది.
జెఫ్రీ అంత్యక్రియల సందర్భంగా ఈ అవార్డును ఆయన కుమారుడు 19 నెలల హార్వే కీటన్‌కు ప్రదానం చేశారు.
తండ్రి మరణానంతరం ఇచ్చిన ఈ అవార్డును హార్వే కీటన్ యూనిఫాం వేసుకుని స్వీకరించాడు.
గురువారం సిడ్నీకి సమీపంలో జెఫ్రీ కీటన్ అంత్యక్రియలు జరిగాయి.
పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది కీటన్ భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు.

ఫొటో సోర్స్, EPA
న్యూ సౌత్‌వేల్స్ అగ్నిమాపక కమిషనర్ షాన్ ఫిట్జ్‌సిమ్మన్స్ హార్వే కీటన్‌కు అవార్డు ప్రదానం చేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
జెఫ్రీ కీటన్ సేవలను గుర్తుచేసుకుని, ఆయనకు నివాళి అర్పించేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు.
పసివాడిని అతడి తల్లి ఎత్తుకుని, వాళ్లిద్దరూ శవపేటికను చూస్తున్నట్లు ఉన్న ఫొటోలను న్యూ సౌత్‌వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ విడుదల చేసింది. 'డాడీ ఐ లవ్ యూ. ఐ మిస్ యూ' అని ఆ శవపేటికపై రాసి ఉంది.
డిసెంబర్ 19న జెఫ్రీ కీటన్, ఆయన సహోద్యోగి ఆండ్రూ ఒడ్వయర్ మంటలు ఆర్పేందుకు వెళ్తుండగా కూలిపోయిన ఒక చెట్టును వారి అగ్నిమాపక వాహనం ఢీకొట్టింది. దీంతో వాళ్లిద్దరూ చనిపోయారు.
ఆండ్రూ కుమారుడు కూడా చాలా చిన్నవాడు. వచ్చే వారంలో ఆండ్రూ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, EPA
కీటన్, ఆండ్రూ కాకుండా సోమవారం మరొక ఫైర్ ఫైటర్ కూడా చనిపోయారు. పెనుగాలుల దాటికి ఆయన ప్రయాణిస్తున్న ట్రక్కు తలకిందులైంది. ఈ ప్రమాదంలో ఆయన మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
కార్చిచ్చు వల్ల సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 18 మంది చనిపోయారు. ఈ ఒక్క వారంలోనే న్యూ సౌత్‌వేల్స్‌లో ఏడుగురు చనిపోయారు. మిగతా వాళ్ల ఆచూకీ తెలియడం లేదు.
కొన్ని నెలలుగా ప్రతిరోజు వేలాది మంది ఫైర్ ఫైటర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా సాయం చేస్తున్న వారిలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్న వాలంటీర్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': వైద్య రంగంలో అద్భుత విజయాలు
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








