తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు.. రూ. 12.33 లక్షలు జరిమానా విధించిన కోర్టు

విమానం

ఫొటో సోర్స్, Getty Images

తొలిసారి విమానమెక్కిన ఓ చైనా ప్రయాణికుడు చేసిన పని ఆయన్ను భారీ జరిమానా చెల్లించేలా చేసింది.

జీవితంలో మొదటిసారి విమానమెక్కేందుకు వెళ్లిన ఆయన తన ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ 'అదృష్ట నాణేల'(గుడ్‌లక్ కాయిన్స్)ను విమానం ఇంజిన్‌లోకి విసిరారు. 2019 ప్రారంభంలో జరిగిన ఈ ఘటనపై విచారణ అనంతరం ఇటీవల ఆయనకు 17,200 డాలర్ల (సుమారు రూ.12.33 లక్షలు) జరిమానా విధించారు.

2019 ఫిబ్రవరిలో తూర్పు చైనాలోని తియాంజుషాన్ విమానాశ్రయంలో లూ చావో అనే 28 ఏళ్ల వ్యక్తి 'లక్కీ ఎయిర్‌' ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కేందుకు వెళ్లారు.

అక్కడ ఆయన తన అదృష్ణ నాణేలను విమానం ఇంజిన్‌ వైపు విసిరారు. ఇంజిన్ సమీపంలో 'ఒక యువాన్' నాణేలు రెండు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే భద్రతా తనిఖీలు చేశారు.. విమానం రద్దయింది. అందులోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

లూ చావో‌ను పోలీసులు 10 రోజుల పాటు అదుపులోకి తీసుకుని విచారించారు. జులైలో దీనిపై కోర్టులో విచారణ జరగ్గా లూ చావో తానే నాణేలు విసిరినట్లు అంగీకరించారు.

చావో చేసిన పనివల్ల తమకు 17,600 డాలర్ల నష్టం కలిగిందని లక్కీ ఎయిర్ సంస్థ కోర్టుకు తెలిపింది.

ప్రయాణికులు నాణేలు విసరకూడదని విమానయాన సంస్థ ముందే చెప్పి ఉండాల్సిందని చావో కోర్టులో వాదించారు.

మొత్తానికి ఇద్దరి వాదనలు విన్న కోర్టు చావోకు 17,200 డాలర్ల జరిమానా విధించింది.

ఇదే తొలిసారి కాదు..

చైనాలో విమాన ప్రయాణికులు ఇలా నాణేలు విసరడం ఇదే తొలిసారి కాదు. వివిధ విశ్వాసాలు పాటించే కొందరు ప్రయాణికులు విమానాల ఇంజిన్లపైకి నాణేలు విసిరి పట్టుబడిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.

ఇటీవల కాలంలో ఇలాంటివి మరింతగా పెరిగాయి.

2017లో ఓ వయోధిక ప్రయాణికుడు ఇలాగే నాణెం విసరడంతో విమాన ప్రయాణం ఆలస్యమైంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)