బీజేపీ పాలిత రాష్ట్రాలు సరే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరగలేదు: అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేక ప్రదర్శనలు జరిగిన సమయంలో పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర్థించారు.
"ఇలా ప్రశ్నిస్తున్న వారంతా ఒక రోజు పోలీస్ యూనిఫాం వేసుకుని నిలబడి చూడాలి. బస్సులెందుకు కాల్చారు, వాహనాలు ఎందుకు తగలబెట్టారు అని ఎవరూ అడగరు. జనాలను ఉసిగొల్పి బస్సులను తగలబెట్టారు. జనం హింసకు పాల్పడితే, పోలీసులు కాల్పులు జరుపుతారుగా" అని ఏబీపీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా అన్నారు.
"పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకుంటూనే, ప్రజలను కూడా కాపాడాల్సి ఉంటుంది. బస్సులకు ఎందుకు నిప్పుపెట్టారని ఎవరూ అడగడం లేదు, బస్సులు తగలబెట్టకపోయుంటే లాఠీలు లేచుండవు" అని అమిత్ షా అన్నారు.
చాలా రాష్ట్రాల్లో జరిగిన హింసలో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై వచ్చిన ఆరోపణల గురించి ఆయన "అలా ఏ రాజకీయ నేతా అనడం లేదు, అది రాష్ట్ర పోలీసుల రిపోర్టు" అని చెప్పారు.
పీఎఫ్ఐపై నిషేధం విధించడం గురించి మాట్లాడిన అమిత్ షా.. "దేశ హోంమంత్రిగా దేనిపైనైనా నిషేధం విధించడానికి ముందు దానిపై ఏం మాట్లాడను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే హింస ఎందుకు?
బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువ హింస ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా... "నాకు ఇది చెప్పండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అల్లర్లు ఎందుకు జరగడం లేదు? ఈ ప్రశ్న కూడా అడగాల్సింది. హింసకు పాల్పడేది ఎవరనేది ప్రజలకు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో, అక్కడ హింస ఎందుకు జరగలేదు? సీఏఏతో మైనారిటీల పౌరసత్వం పోతుందని అపోహలు వ్యాప్తి చేశారు. కానీ విపక్షాలు పౌరసత్వ సవరణ చట్టం చదివి, అందులో ఎక్కడైనా ఎవరి పౌరసత్వమైనా తొలగించే నిబంధనలు ఉన్నాయేమో చెప్పాలి" అన్నారు.
NRC, CAA, NPRను సమర్థించిన ఆయన, "ఎవరికైతే వీటి గురించి భ్రమలు ఉన్నాయో, వీటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారికి నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. జనం కావాలంటే అర్థరాత్రి మూడు గంటలకైనా వచ్చి నన్ను కలవచ్చు" అన్నారు.
వీటి వల్ల పేదలు, ముస్లింల పౌరసత్వం పోతుందని ఒకసారి నిరూపించాలని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు అమిత్ షా సవాలు విసిరారు.
"నేను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు చెబుతున్నా. మీరు చట్టం చదవడం లేదు. పౌరసత్వం పోతుందని ప్రజలను భయపెడుతున్నారు. విపక్షాలు దేశాన్ని ఇంత తప్పుదోవ పట్టిస్తాయని మేం అసలు అనుకోలేదు" అన్నారు.
పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశంలో చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అవి చాలా చోట్ల హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో హింస జరిగింది. ఒక్క యూపీలోనే 19 మంది మృతిచెందారు. నిరసనల సమయంలో పోలీసులు చర్యలు తీసుకోవడంపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, Reuters
కానీ హోంమంత్రి ఈ వ్యతిరేక ప్రదర్శనలపై ప్రశ్నలు లేవనెత్తారు. "నిరసనలు చేస్తున్నవారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అది ఎక్కువగా రాజకీయ వ్యతిరేకతే" అన్నారు.
ఎన్ఆర్సీపై వివరంగా ఏదీ చెప్పని అమిత్ షా "నేను ఒకటి మాత్రమే చెబుతున్నా, ఇప్పుడు ఎన్ఆర్సీ రావడం లేదు. ప్రస్తుతం సీఏఏపై మాట్లాడండి. ఏ భారతీయుడి పౌరసత్వం పోవడం లేదు" అన్నారు.
"పౌరసత్వ సవరణ అనేది సరైన నిర్ణయం అని దేశ ప్రజలకు తెలుసు" అని అమిత్ షా అన్నారు.
ఎన్‌పీఆర్‌పై వైఖరి స్పష్టం చేసిన హోంమంత్రి జనాభాగణన, ఎన్‌పీఆర్‌లో ఎవరినీ ఎలాంటి పత్రాలూ అడగడం ఉండదని చెప్పారు.
అయితే, పార్లమెంటు నుంచి మీడియా సమావేశాల వరకూ హోంమంత్రి అమిత్ షా "మొదట పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జరుగుతుంది, ఆ తర్వాత ఎన్ఆర్సీ తీసుకొస్తాం. ఇది సీఏఏ తర్వాత ప్రారంభమయ్యే ఒక ప్రక్రియ" అని చెబుతూవచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగిన తర్వాత దిల్లీ రాంలీలా మైదాన్‌లో డిసెంబర్ 22న జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ప్రభుత్వం ఎన్ఆర్సీ గురించి ఏం మాట్లాడ్డం లేదని చెప్పారు.
ప్రధానమంత్రి మోదీ ఈ ప్రకటన తర్వాత హోంమంత్రి అమిత్ షా కూడా స్వరం మార్చారు. "ఎన్ఆర్సీ గురించి ప్రస్తుతం ఎలాంటి చర్చా జరగడం లేదు" అని చెప్పారు.
అమిత్ షా ఇంకా ఏమన్నారు
- కాంగ్రెస్ ముస్లింలకు అల్లర్లు, హామీలు ఇచ్చింది.
- ఆర్థిక మాంద్యం దేశంలో మాత్రమే లేదు ప్రపంచం అంతా ఉంది. దీన్నుంచి బయటపడ్డానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.
- జమ్ము కశ్మీర్ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను విడుదల చేయాల్సింది నేను కాదు, అక్కడి పాలనా యంత్రాంగం వదలాలి. వాళ్లకు అది అనిపించినపుడు, వాళ్లే నిర్ణయం తీసుకుంటారు.
- కశ్మీర్‌లో పరిస్థితి అదుపులో ఉంది. కశ్మీర్‌లో ఒక్క అంగుళం భూమిలో కూడా కర్ఫ్యూ లేదు.
- బిహార్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమారే ఉంటారు. మేం ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.
- ఝార్ఖండ్‌లో ఓటమికి నాదే బాధ్యత. బీజేపీ అధ్యక్షుడిగా విజయం బాధ్యత నాది అయినప్పుడు, ఓటమి బాధ్యత కూడా నాదే అవుతుంది.
- కాంగ్రెస్ మహారాష్ట్రలో నాలుగో స్థానంలో ఉన్న పార్టీ. అది ప్రభుత్వంలోకి ఎలా వచ్చింది?
- మహారాష్ట్రలో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఝార్ఖండ్ ఫలితాలు ఆత్మ పరిశీలన అంశం. దేశానికి 2019 చాలా మంచి ఏడాది.
- రామమందిరం కోసం ఫిబ్రవరి 9కి ముందే ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం.
- పశ్చిమ బెంగాల్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలుస్తాం.
- 2024లో మోదీనే ప్రధాని అవుతారు.
ఇవి కూడా చదవండి:
- 2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపిన ప్రధాన ఘటనలు
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








