కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు, మలేసియా పామాయిల్ పరిశ్రమ నష్టాలకు సంబంధమేంటి

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఉపాసన భట్, ప్రతీక్ జఖర్
- హోదా, బీబీసీ మానిటరింగ్
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ సవరించిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మలేసియా పామాయిల్ పరిశ్రమ తీవ్రంగా కుదేలైంది.
కశ్మీర్ అంశంపై మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ స్పందించిన తర్వాత భారత్‌కు పామాయిల్ దిగుమతులు భారీగా తగ్గిపోవడమే అందుకు కారణం.
కశ్మీర్‌ను భారత్ 'ఆక్రమించుకుంది' అంటూ 2019 సెప్టెంబర్‌లో మహతిర్ వ్యాఖ్యానించిన తర్వాత భారత్, మలేసియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
మలేసియా ప్రధాని మాటలకు భారత పామాయిల్ వర్తకుల సంఘం తీవ్రంగా స్పందించింది. మలేసియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవద్దంటూ భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఈఏఐ) నిర్ణయించింది. ఈ అసోసియేషన్‌లో 875 మంది వర్తకులు సభ్యులుగా ఉన్నారు.
మలేసియా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తి పామాయిల్. ఈ దేశం నుంచి పామాయిల్, పామాయిల్ ఆధారిత ఉత్పత్తులను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది.
భారత ట్రేడర్ల నిర్ణయంతో మలేసియా పామాయిల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పామాయిల్‌కు డిమాండ్
ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. ప్రధానంగా ఇండోనేసియా, మలేసియా దేశాల నుంచి ఏటా 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేస్తోంది.
2019లో జనవరి నుంచి అక్టోబర్ వరకు మలేసియా పామాయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశం భారత్. పది నెలల్లో 40 లక్షల టన్నులకు పైగా పామాయిల్‌ను భారత్ కొనుగోలు చేసిందని మలేసియా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, ఆ దేశ ప్రధాని మహతిర్ వ్యాఖ్యల అనంతరం, తమ ట్రేడర్లలో చాలామంది ఇండోనేసియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించారని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు.
"భారత్, మలేసియా మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సుంకాలు విధించవచ్చు లేదా మరేవిధంగానైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని మేం గ్రహించాం. రెండు దేశాల మధ్య పోరులో మేం చిక్కుకోదలచుకోలేదు" అని ఆయన బీబీసీ మానిటరింగ్‌తో చెప్పారు.
మలేసియా నుంచి భారత కొనుగోళ్లు తగ్గిపోయిన విషయం తాజా గణాంకాల్లో ప్రతిబింబిస్తోంది.
ఈ పతనానికి దిగుమతి పన్ను పెంపు వంటి ఇతర అంశాలు కూడా కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా... మలేసియా నుంచి భారత్ సెప్టెంబర్‌లో 3,10,648 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోగా, అక్టోబర్‌లో అది 2,19,956 టన్నులకు పడిపోయింది. ఆ తర్వాత నవంబర్‌లో 1,42,696 టన్నులకు క్షీణించింది.
మలేసియా పామాయిల్‌ను భారత్ బహిష్కరించలేదని మలేసియాలో భారత రాయబారి మృదుల్ కుమార్ అన్నారు. "అది పామాయిల్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం, భారత ప్రభుత్వం తీసుకున్నది కాదు" అని ఇటీవల చెప్పారు.
"భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ఏ దేశం నిర్ణయించుకున్నా ఇలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని భారత మాజీ రాయబారి విష్ణు ప్రకాష్ వ్యాఖ్యానించారు.
"భారీ మార్కెట్ ఉండటం భారత సహజ బలం. భారతదేశాన్ని వ్యూహాత్మకంగా దాటి వెళ్తున్న దేశాలను దారికి తెచ్చుకునేందుకు ఈ మార్కెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకుంటున్నారు" అని జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, NurPhoto
భారత్‌కు ఆగ్రహం తెప్పించేలా మలేసియా ప్రధాని ఏమన్నారు?
"జమ్మూకశ్మీర్‌ను భారత్ ఆక్రమించింది" అని సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మలేసియా ప్రధాని మహతిర్ అన్నారు.
"భారత్ చేపట్టిన చర్యకు కారణం ఏదైనా ఉండొచ్చు. అయినా అది పొరపాటే. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే బాగుండేది. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్‌తో భారత్ చర్చించాలి. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలకు విరుద్ధంగా భారత్ చర్యలు ఉన్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.
మహతిర్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. నిరాధారంగా వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతున్నారని భారత ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అయిదు మైళ్ల అవతల పొరుగు దేశంలో ఉన్న భార్యను కలవాలని పన్నెండేళ్లు తపించాడు
- ఇంటర్నెట్ నిలిపివేత: పాకిస్తాన్, ఇథియోపియా కన్నా భారత్‌లోనే ఎక్కువ
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- ప్రియాంకా గాంధీ: 'ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నా గొంతు పట్టుకున్నారు.. నాతో గొడవపడ్డారు'
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆ 19 లక్షల మందిని దేశం నుంచి ఎలా తరలిస్తారు.. రైళ్లలోనా, విమానాల్లోనా?: చిదంబరం - #బీబీసీ ఇంటర్వ్యూ
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








