బార్‌కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, టిమ్ హార్ఫోర్డ్
- హోదా, ప్రెజెంటర్ - ఆధునిక ఆర్థికవ్యవస్థకు 50 మూలస్తంభాలు
2019 డిసెంబర్ 5న ఒక విలక్షణ వ్యక్తి చనిపోయారు. మీరు ఆయన పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు. కానీ, మీరు ఎక్కడ ఏ దుకాణానికి వెళ్లి ఏ వస్తువు చూసినా దాని మీద ఆయన 'ముద్ర' కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు... బార్‌కోడ్ సహ ఆవిష్కర్త అమెరికన్ ఇంజినీర్ జార్జ్ లోరర్.
94 ఏళ్ల వయసులో నార్త్ కరోలినాలోని వెండెల్ పట్టణంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
1951లో జార్జ్ లోరర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ప్రహుక టెక్నాలజీ సంస్థ ఐబీఎంలో పనిచేస్తున్నప్పుడు, బార్‌కోడ్ సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1973లో బార్‌కోడ్‌ను కనిపెట్టారు.


ప్రపంచ వాణిజ్యం రూపు రేఖలనే సమూలంగా మార్చేసిన ఆ బార్‌కోడ్ ఆలోచనకు ఎప్పుడు బీజం పడింది? అది ఎలా కార్యరూపం దాల్చింది? తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, SUPPLIED
బార్ కోడ్ ఆలోచన మొదట ఎన్. జోసెఫ్ వుడ్‌లాండ్‌కు వచ్చింది.
1948లో ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్న ఎన్. జోసెఫ్ వుడ్‌లాండ్‌కు ఓ కిరాణా దుకాణం యజమాని నుంచి చిన్న సవాల్ ఎదురైంది. దుకాణంలో జరిగే లావాదేవీలను ఆటోమేషన్ ద్వారా వేగవంతం చేసే ఉపాయం ఏదైనా ఉందా? అని ఆ యజమాని అడిగారు.
జోసెఫ్ చాలా స్మార్ట్‌గా ఆలోచించే యువకుడు. యుద్ధం సమయంలో అణు బాంబును అభివృద్ధి చేసిన మన్‌హటన్ ప్రాజెక్టులో ఆయన పనిచేశారు.
ఆ కిరాణా దుకాణం యజమాని ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించేందుకు ఆలోచించడం ఆయన మొదలుపెట్టారు.
ఓ రోజు తన తాతయ్య బామ్మలతో కలిసి మియామి బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా ఆడుకుంటుండగా ఇసుక మీద చేతి వేళ్ల ముద్రలు పడ్డాయి. ఆ ముద్రలను చూడగానే అతని మెదడులో ఒక ఆలోచన తట్టింది.
అంతకు ముందు ఒక సందేశాన్ని పంపేందుకు 'మోర్స్ కోడ్'లో చుక్కలు, డ్యాష్‌లను ఉపయోగించారు. అలా కాకుండా, సమాచారాన్ని ఎన్‌కోడ్ చేసేందుకు సన్నని, మందమైన గీతలను ఉపయోగవచ్చు అని జోసెఫ్ ఆలోచించారు.

ఫొటో సోర్స్, IBM
వృత్తాకార (ఎద్దు కన్ను ఆకారం) గీతల కోడ్‌లో వస్తువుల వివరాలను నమోదు చేస్తారు. ఆ గీతలను ప్రత్యేక యంత్రంతో స్కాన్ చేసి ఆ వస్తువుల వివారాలను తెలుసుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన.
అది ఆచరణ సాధ్యమే. కానీ, అప్పటికి సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉంది. దాంతో, అలాంటి స్కానింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉండేది.
అయితే, ఆ తర్వాత రానురాను కంప్యూటర్లు మెరుగవ్వడంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు అవకాశాలు పెరిగాయి.

ఫొటో సోర్స్, Thinkstock
జార్జ్ లారర్ కొత్త ఆలోచన
ఆ వృత్తాకార చారల స్కానింగ్ చేసే సాంకేతికత ఏళ్లు గడిచే కొద్దీ మరింత మెరుగవుతూ వచ్చింది. 1950ల్లో ఇంజినీర్ డేవిడ్ కొలిన్స్ తొలిసారిగా రైలు బోగీలకు గీతలతో కోడ్ వేశారు.
జోసెఫ్ వుడ్‌లాండ్ సృష్టించిన ఆ వృత్తాకార చారల కోడ్ కంటే, దీర్ఘచతురస్రాకారంలో కోడ్ ఉంటే మరింత మెరుగ్గా ఉంటుందని 1970 ప్రారంభంలో ఐబీఎం ఇంజనీర్ జార్జ్ లారర్ ఒక ఆలోచన చేశారు. అదే బార్ కోడ్.
కంప్యూటర్ ప్రింటర్‌తో వృత్తాకార చారల కంటే నిలువు గీతలను సులువుగా ప్రింట్ చేసే వీలుంటుందన్నది ఆయన ఆలోచన.
లేజర్‌లు, కంప్యూటర్‌లతో పనిచేసే ఒక సాంకేతిక వ్యవస్థను ఆయన అభివృద్ధి చేశారు. అవి సంచుల మీద వేసిన కోడ్‌ను అది అత్యంత వేగంగా స్కాన్ చేసింది.
1974లో అమెరికాలోని ఒహయ్యోలో ఉన్న మార్ష్ సూపర్ మార్కెట్‌లో తొలిసారిగా చూవింగ్ గమ్‌ను బార్‌కోడ్‌తో అమ్మారు.

ఫొటో సోర్స్, Alamy
ఖర్చును, సమయాన్ని తగ్గించే సాంకేతికతగా ఆ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు వీధుల్లోని చిన్న కిరాణా కొట్టు మొదలుకొని ఎక్కడికెళ్లినా, ఏ వస్తువు చూసినా బార్ కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- తెలుగు టెకీ సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్‌ను నంబర్-1 కంపెనీగా ఎలా మార్చారు...
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ఈ బడిలోని ముస్లిం చిన్నారులు సంస్కృతం అలవోకగా మాట్లాడుతారు
- జేఎన్‌యూ: ఆగని విద్యార్థుల ఆందోళన... ఫీజుల పెంపుపై విద్యార్థులు ఏమంటున్నారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









