CAA - NRC: ఆందోళనకారుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయొచ్చా

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సల్మాన్ రవీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. విధ్వంసమూ జరిగింది. డిసెంబర్ 20 నుంచి అక్కడ నిరసనల్లో 19 మంది చనిపోయారు.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై 'ప్రతీకారం' ఉంటుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆందోళనకారులు కలిగించిన నష్టానికి పరిహారంగా వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
అయితే, ఇలా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడినవారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయొచ్చా? ఆ అధికారం ప్రభుత్వాలకు ఉంటుందా?

హరియాణాలో 2016లో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారి మొత్తం 30 మంది చనిపోయారు. విధ్వంసం కారణంగా ప్రభుత్వానికి రూ.1000 కోట్లకుపైగా నష్టం కలిగింది. ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వం మొత్తంగా రూ.60 కోట్ల వరకూ పరిహారం చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు.
నిరసనకారులపై ప్రభుత్వం పెట్టిన కేసులు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
విధ్వంసానికి పరిహారంగా ఆందోళనకారులు నుంచి జరిమానాలేవీ వసూలు చేయలేదని హరియాణా ప్రభుత్వం తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో 2017లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఘర్షణల్లో 20కిపైగా వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. రైలు పట్టాలను తొలగించారు.
ఈ ఘటనలకు సంబంధించి కూడా ఆందోళనకారులెవరి నుంచీ విధ్వంసానికి పరిహారం వసూలు చేయలేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

హరియాణాలో జప్తు
హరియాణాలోని పంచకులలో ఓ కోర్టు 2017 ఆగస్టులో డేరా సచ్చా సౌధా బాబా రామ్ రహీంను అత్యాచార కేసులో దోషిగా తేల్చింది. ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించింది.
పోలీసులు రామ్ రహీంను అరెస్టు చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మద్దతుదారులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు.
ఈ ఘర్షణల్లో జరిగిన ఆస్తి నష్టానికి ఆందోళనకారుల నుంచే పరిహారం వసూలు చేయాలని పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వం నష్టపరిహారం కింద డేరా ఆస్తులను జప్తు చేసింది. అయితే, ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తుల్లో ఎవరి నుంచీ పరిహారం వసూలు చేయలేదు. వారికి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు.
గత 13 ఏళ్లలో రిజర్వేషన్ల కోసం గుజ్జర్ వర్గం చాలా బంద్‌లు, రాస్తారోకోలు చేసిందని, వీటి వల్ల రైల్వేకు రూ.కోట్లలో నష్టం కలిగిందని జైపూర్‌కు చెందిన సీనియర్ పాత్రికేయుడు నారాయణ్ బారెట్ అన్నారు.
వీటికి సంబంధించి కూడా పరిహారం వసూలు చేసినట్లుగా తమ వద్ద సమాచారం ఏదీ లేదని రాజస్థాన్ పోలీసులు అంటున్నారు.
నిరసనల విషయంలో ఎలా వ్యవహరించాలన్నది, అప్పటి ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని ఓ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.

''మొదట్లో ప్రభుత్వం దీన్ని శాంతి భద్రతల సమస్యగా భావించి పరిష్కరించాలనుకునేది. కానీ, ఇది పేదరికం, నిరుద్యోగం, అసమానతల నుంచి పుట్టిన సమస్య'' అని గుజ్జర్ ఉద్యమ తొలి దశలో ఉద్యమకారులకు ప్రతినిధిగా వ్యవహరించిన రూప్ సింగ్ అన్నారు.
ఈ ఉద్యమానికి సంబంధించి మొత్తం 781 కేసులు నమోదైనట్లు రాష్ట్రంలోని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) చెప్పారు. వాటిలో సుమారు 300 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని అన్నారు. తీవ్రమైన నేరాలున్న కేసులు కొనసాగుతున్నాయని వివరించారు.
అయితే, వారి నుంచి నష్టపరిహారం ఏదీ వసూలు చేయలేదని చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఏఏ నిరసనల సమయంలో జరిగిన విధ్వంసానికి నష్ట పరిహారం వసూలు చేయాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.
ఆందోళనకారుల ఆస్తుల జప్తు విషయంలో సుప్రీం కోర్టు, వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల సూచనలు భిన్నంగా ఉన్నాయి. ఈ అంశంపై ఓ చట్టం చేయాలని కేంద్రానికి కూడా కోర్టులు సూచించాయి.

హింసాత్మక ఆందోళనల్లో జరిగే ఆస్తుల నష్టాన్ని ఎలా పూడ్చవచ్చనే అంశంపై సలహాల కోసం సుప్రీం కోర్టు 2007లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, సీనియర్ న్యాయవాది ఫలీ నారీమన్‌లతో వేర్వేరుగా కమిటీలు వేసింది.
ఆందోళనకారుల ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రభుత్వం చేపడితే, అది కోర్టు పర్యవేక్షణలోనే జరగాలని కొందరు నిపుణులు అంటున్నారు. అంటే, విశ్రాంత న్యాయమూర్తిని 'క్లెయిమ్ కమిషనర్'గా నియమించి, వారి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టాలి.
సీనియర్ న్యాయవాది విరాగ్ గుప్తా మాత్రం అలాంటిదేమీ అవసరం లేదని అంటున్నారు.
‘‘కోర్టుల సూచనలను ప్రభుత్వాలు తమ తమ పద్ధతుల్లో పాటిస్తాయి. దాని అర్థం ఆస్తుల జప్తు ప్రక్రియ తప్పని కాదు’’ అని ఆయన అన్నారు.
''మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరిహారం వసూలు చేయకుంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అలాగే ఊరుకోవాలని లేదు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు చట్టాలు వివిధ అధికారాలు కల్పించాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులు విధ్వంసం మాటేంటి?
ఆందోళనకారుల నుంచి నష్ట పరిహారం వసూలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అందరికీ ఒక పాఠమని ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఆస్తుల జప్తు ఏకపక్షంగా జరుగుతోందని, నిందితులకు న్యాయవ్యవస్థ ముందు నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉండాలని మాజీ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మాందర్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ చర్యల్లో సమానత్వం లోపించిందని అభిప్రాయపడ్డారు.
''ప్రభుత్వ చర్యలు పారదర్శకంగా, సమానత్వంతో ఉండాలి. కశ్మీర్‌లో జరిగే ఆందోళనలు ఒకలా.. ఇతర ప్రాంతాల్లో జరిగేవాటిని మరోలా చూడకూడదు. వర్గాలను బట్టి తేడాలు చూపడం సరికాదు'' అని అన్నారు.
ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల విధ్వంసం వల్ల నష్టపోయినవారికి పరిహారం ఎవరి నుంచి వసూలు చేసి చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': వైద్య రంగంలో అద్భుత విజయాలు
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- డ్రగ్స్ కేసు: తెలంగాణ పోలీసుల విచారణ ఎంత వరకు వచ్చింది?
- ''ఆ రాళ్ల దాడిని తప్పించుకుని ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు''
- టెక్నాలజీ 2010-19: ఈ పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








