డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీసుల విచారణ ఎంత వరకు వచ్చింది?

డ్రగ్స్ వాడకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాదక ద్రవ్యాలు బడి పిల్లలకు కూడా సరఫరా అవుతున్నాయంటూ 2017లో తెలంగాణ పోలీసులు ఆందోళనకర అంశాలు వెల్లడించారు. డ్రగ్స్ కేసుపై విచారణలో భాగంగా కొంత మంది సినీ ప్రముఖులను పిలిపించారు. అప్పట్లో హడావిడి జరిగింది. తర్వాత కేసు ఏమైందన్నది తెలియలేదు.

హైదరాబాద్‌లో ఇప్పటికీ వరుసగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు, హైదరాబాద్‌లో గంజాయి, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ లాంటి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు.

డిసెంబర్ 20న సికింద్రాబాద్‌లో ఆదిలాబాద్ నుంచి తరలించిన గంజాయి, గోవా నుంచి తరలించిన హెరాయిన్, ఎక్స్‌టసీ మాత్రలు స్వాధీనం చేసుకొని హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

డిసెంబర్ 26న అంతర్రాష్ట్ర ముఠా గంజాయి,హెరాయిన్, బ్రౌన్ షుగర్ తరలిస్తుండగా ముగ్గురిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొని వాటిని స్వాధీనపరచుకున్నారు.

నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఈ కేసులు పెరగటానికి కారణం- కొత్త సంవత్సర వేడుకలకు సరఫరా చేసే ప్రయత్నాలే.

గంజాయి తాగడం

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ పోలీస్ పరిధిలోనే 2018లో మాదక ద్రవ్యాలకు సంబంధించి 55 కేసులు నమోదయ్యాయి. 2019లో 88 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో నమోదైన కేసులు వీటికి అదనం.

2017లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించి నాలుగు అభియోగపత్రాలు దాఖలు చేసి మాదక ద్రవ్యాల కేసును విచారించారు. విచారణలో ఏం తేలిందనేది పోలీసులు ఇప్పటివరకు బయటపెట్టలేదు.

"ఇంత హడావిడి చేసి, 62 మందిని ప్రశ్నించి, అన్ని రకాల నమూనాలు సేకరించి కూడా పోలీసులు ఎలాంటి ముగింపూ ఇవ్వలేకపోయారు" అని 'ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్' కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ పోలీసులు

ఫొటో సోర్స్, FB/@dgptelangana

2020 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ రవాణా పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.

మాదక ద్రవ్యాలు దొరికాక వాటి గురించి తెలియడమే తప్ప, వాటిని మూలాల నుంచి నియంత్రించే విధానం దేశవ్యాప్తంగా ఎక్కడా సమగ్రంగా లేదు.

సమాచారం అందినప్పుడు కొన్నిసార్లు ముందుగానే పట్టుకుంటున్నప్పటికీ, అసలు వాటి తరలింపునే నివారించడం ఎందుకు సాధ్యం కావడం లేదనే ప్రశ్న ఉంది.

'ఔట్‌రీచ్' పేరుతో పోలీసులు విద్యార్థుల్లో అవగాహన పెంచే సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు.

డ్రగ్స్ వ్యాపారం

"గంజాయి వంటి మాదక ద్రవ్యాలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి సరఫరా చేసే క్రమంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కేవలం 'ట్రాన్సిట్' మాత్రమే. ఈ మాదక ద్రవ్యాలు మహారాష్ట్ర,ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా అవుతుంటాయి. సమాచారం అందినప్పుడు పట్టుకుంటున్నాం. కానీ మూలంలోనే అరికట్టడం ఎలా అన్న దానిపై కూడా సమాలోచన జరుగుతోంది" అని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ బీబీసీతో చెప్పారు.

నార్కోటిక్ మాదక ద్రవ్యాలు ఎక్కువగా డార్క్ నెట్ ద్వారా సరఫరా అవుతున్నాయని, గోవా, ముంబయి నుంచి కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు. "తరచూ తప్పుచేసేవాళ్లను గుర్తించి నిఘా పెట్టాం. డార్క్ నెట్‌లో డ్రగ్స్ మూలాలపై విచారణ జరుపుతున్నాం" అని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు-2018 నివేదిక ప్రకారం భారత్‌లో అత్యధికంగా దొరికే మాదక ద్రవ్యం గంజాయి. దేశంలో మాదక ద్రవ్యాల వాడకం పెరుగుతోందని నివేదిక చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)