చైనాలో 'జన్యు-సవరణ శిశువులు' సృష్టించిన శాస్త్రవేత్తకు జైలు శిక్ష

ఫొటో సోర్స్, AFP
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా జన్యు-సవరణ శిశువులను సృష్టించానని చెప్పిన ఒక శాస్త్రవేత్తకు చైనాలో మూడేళ్ల జైలు శిక్ష విధించారు.
ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘించి.. హెచ్‌ఐవీ నుంచి రక్షణ కల్పించటం కోసం మానవ పిండాల మీద సొంత ప్రయోగాలు చేసినందుకుగాను హి జియాన్‌కుయి అనే శాస్త్రవేత్తను దోషిగా నిర్ధారించారు.
ఆయన తన ప్రయోగాల గురించి, కవల శిశువుల జననం గురించి 2018 నవంబరులో ప్రకటించినపుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఖండనలు వచ్చాయి.
అదే సమయంలో మూడో శిశువు కూడా జన్మించినట్లు షిన్‌హువా వార్తా సంస్థ పేర్కొంది.
ఆ శిశువులను వైద్య పరిశీలనలో ఉంచినట్లు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్థానిక ప్రభుత్వం చెప్పింది.
ఈ శాస్త్రవేత్తకు జైలు శిక్షతో పాటు.. ముప్పై లక్షల యువాన్ల (రూ. 3 కోట్లకు పైగా) జరిమానా కూడా విధించారు.
ఈ ప్రయోగాలు చేయటానికి ఆయనతో కలిసి కుట్ర పన్నినందుకు మరో ఇద్దరు వ్యక్తులు జాంగ్ రెనిల్, క్విన్ జిన్‌ఝోలకు కూడా షెన్‌జెన్‌లోని ఒక కోర్టు జైలు శిక్ష విధించింది.
ఈ వ్యక్తులు ''వ్యక్తిగత కీర్తి, లాభాల కోసం'' ఈ పనిచేశారని, ''వైద్య క్రమశిక్షణకు తీవ్ర విఘాతం'' కలిగించారని కోర్టు తప్పుపట్టినట్లు షిన్‌హువా వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.
''శాస్త్రీయ పరిశోధన, వైద్యపరమైన నైతిక విలువల అట్టడుగు రేఖను వీరు ఉల్లంఘించారు'' అని కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది ఏం జరిగింది?
ఈ శాస్త్రవేత్త జన్యు-సవరణతో లులా, నానా అనే కవలలు జన్మించినట్లు 2018 నవంబరులో ఒక వీడియోలో ప్రకటించారు. ఆ వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ చిత్రీకరించింది.
ఆయన తన ప్రయోగాల గురించి చెప్తూ.. ''నేను చేసిన ఈ పని వివాదాస్పదమైనదని నాకు తెలుసు. కానీ కుటుంబాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అవసరమని నేను నమ్ముతున్నా. వారి కోసం విమర్శలు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నా'' అని పేర్కొన్నారు.
ఆ వీడియో విడుదలైన అనంతరం.. చైనా సహా ప్రపంచం నలుమూలల నుంచీ శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఆ శాస్త్రవేత్త మీద పోలీసు దర్యాప్తుకు ఆదేశించిన చైనా ప్రభుత్వం.. ఆయన పరిశోధనను నిలిపివేయాలని ఆదేశించింది.
షెన్‌జెన్‌లోని సదరన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయనను అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది.
మనుషుల జన్యు సవరణను తాము నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామంటూ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
''ప్రస్తుత పరిస్థితుల్లో మానవ పిండాల్లో జన్యు సవరణ విషయంలో ఇంకా అనేక అపరిష్కృత సాంకేతిక సమస్యలు ఉన్నాయి. అవి అనూహ్యమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. అంతర్జాతీయ శాస్త్రీయ సమాజపు ఏకాభిప్రాయాన్ని ఇది ఉల్లంఘిస్తుంది'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ శాస్త్రవేత్త జన్యు సవరణ శిశువుల్లో చేసిన జన్యు పరివర్తన వల్ల.. ఆ శిశువుల జీవిత కాలం గణనీయంగా తగ్గిపోతుందని.. అనంతర పరిశోధనల్లో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ప్రయోగం ఎలా పనిచేసింది?
ఆయన సీసీఆర్5 అనే జన్యువు లక్ష్యంగా ఈ ప్రయోగం చేశారు.
మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనిచేయటానికి ఈ జన్యువుల జత పాత్ర ముఖ్యమైనది. అయితే.. హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) మానవ శరీర కణాల్లోకి సోకటానికి ఇవే జన్యువులు ప్రవేశద్వారంగా ఉన్నాయి.
సీసీఆర్5ను పరివర్తింపచేయటం అంటే.. ఆ ద్వారాన్ని మూసివేయటం అనొచ్చు. తద్వారా హెచ్‌ఐవీని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆయన ఈ అధ్యయనంలో పాల్గొనటానికి సంసిద్ధత వ్యక్తంచేసిన ఏడుగురు జంటలను ఎంపిక చేసుకున్నారు. వారిలో పురుషులందరికీ హెచ్‌ఐవీ ఉండగా.. మహిళలెవరికీ ఆ వైరస్ లేదు.
ఈ ప్రొఫెసర్ ఒక ఐవీఎఫ్ క్లినిక్‌లో పిండాలను రూపొందించారు. ఆ పిండాలలో సీసీఆర్5 జన్యువును సవరించటానికి క్రిస్పర్-కాస్9 (CRISPR-Cas9) అనే జన్యు సవరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
తప్పనిసరిగా ఆమోదం పొందాల్సిన నైతికత సమీక్ష కోసం నకిలీ పత్రాలను సృష్టించారు. తను జన్యు సవరణ చేసిన విషయం బయటపడకుండా ఆ పిండాలను ఇద్దరు మహిళల గర్భంలోకి వైద్యులు ప్రవేశపెట్టటానికి సంబంధిత సమాచారాన్ని వక్రీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిణామాలేమిటి?
జన్యు సవరణ శిశువుల పూర్తి పర్యవసానాలు అస్పష్టంగానే ఉన్నాయి. కానీ ఆ ప్రభావాలు శాశ్వతమైనవి.
జన్యుపరంగా ఎటువంటి మార్పులు చేసినా అవి తర్వాతి తరాలకు వారసత్వంగా సంక్రమిస్తాయి. మానవ జాతిలో శాశ్వత మార్పును ప్రవేశపెడతాయి.
జియాన్‌కుయి ప్రయోగంలో ఇది మరింత సంక్లిష్టమైన అంశం.
ఆయన వాస్తవ పరిశోధనను తొలిసారిగా ఈ నెల ఆరంభంలో ప్రచురించినపుడు.. జన్యుసవరణ వల్ల వచ్చిన ఫలితాలు ఆయన చెప్పిన విధంగా జరిగినట్లు చూపటం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఆయన సరైన జన్యువునే లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఆ శిశువులకు హెచ్‌ఐవీ నుంచి రక్షణ కల్పించటానికి అవసరమైన కచ్చితమైన పరివర్తనను ఆయన సృష్టించలేదని వారు వివరించారు.
దానికి బదులుగా.. గతంలో చూడని జన్యు సవరణలు సృష్టించారని.. దాని ప్రభావం ఏమిటనేది ప్రస్తుతం తెలియదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- గుండెపోటు మనుషులకే ఎందుకొస్తుంది
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- ఆంధ్ర, రాయలసీమ: 60 ఏళ్లలో నాలుగు రాజధానులు.. ఇప్పుడు మరో రెండు కలుస్తాయా?
- ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రభావం డిసెంబర్ 31 అమ్మకాలపై ఉంటుందా?
- సొంత ఇంటర్నెట్ను సృష్టించుకుంటున్న రష్యా.. దేశీయ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- సెక్స్ వర్కర్లకు విముక్తి: బలవంతంగా ‘చాకిరీ’ చేయించే విధానం రద్దు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








