సెక్స్ వర్కర్లకు విముక్తి: బలవంతంగా 'చాకిరీ' చేయించే విధానాన్ని రద్దు చేసిన చైనా

ఫొటో సోర్స్, AFP
సెక్స్ వర్కర్లతో బలవంతంగా చాకిరీ చేయించే విధానానికి చైనా ముగింపు పలికింది.
ఇప్పటివరకూ చైనాలో సెక్స్ వర్కర్లను, వాళ్ల క్లయింట్స్‌ను.. 'ఎడ్యుకేషన్ సెంటర్స్' అనే నిర్బంధ కేంద్రాల్లో రెండేళ్ల వరకూ ఉంచేవారు.
అక్కడ వారితో చైనా బలవంతంగా ఆట బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ పనులు చేయించేదని ఆరోపణలున్నాయి.
ఈ విధానానికి డిసెంబర్ 29 ఆఖరి తేది. ఇకపైనా చైనాలో వ్యభిచారం నేరమే. అయితే, పట్టుబడిన సెక్స్ వర్కర్లకు, వాళ్ల క్లయింట్స్‌కు 15 రోజుల వరకు నిర్బంధం, రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటిదాకా ఉన్న 'కస్టడీ అండ్ ఎడ్యుకేషన్' విధానం 20 ఏళ్లకుపైనే కొనసాగింది. ఈ విధానం 'మంచి సామాజిక వాతావరణం, ప్రజా భద్రత'ను కొనసాగించడంలో ఎంతగానో ఉపయోగపడిందని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షిన్‌హువా ఓ కథనంలో పేర్కొంది. అయితే, కాల గమనంలో ఈ విధానం అనుచితమైందిగా మారుతూ వచ్చిందని రాసింది.
చైనా 'కస్టడీ అండ్ ఎడ్యుకేషన్' విధానం ప్రభావశీలతను ప్రశ్నిస్తూ 2013లో ఆసియా కేటలిస్ట్ అనే ఎన్జీవో ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది.
అందులో రెండు నగరాలకు చెందిన దాదాపు 30 మంది సెక్క్ వర్కర్ల ఇంటర్వ్యూలు ఉన్నాయి.
నిర్బంధంలో ఉన్న వాళ్లు 'ఎడ్యుకేషన్ కేంద్రాల్లో' చాకిరీనే చేయాల్సి వచ్చిందని, విడుదలయ్యాక ఉపయోగపడే నైపుణ్యాలేవీ వాటిలో వాళ్లు నేర్చుకోలేకపోయారని ఆ నివేదిక పేర్కొంది.
విడుదలైన వెంటనే వాళ్లందరూ తిరిగి వ్యభిచారంలోకే దిగారని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
2013లో హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ సెక్స్ వర్కర్లు, వాళ్ల క్లయింట్స్, పోలీసులు, నిపుణులను ఇంటర్వ్యూ చేసి ఓ నివేదిక ఇచ్చింది. నేరాలను బలవంతంగా అంగీకరింపజేసేందుకు సెక్స్ వర్కర్లను పోలీసులు కొట్టినట్లు అందులో పేర్కొంది.
బలవంతంగా నిర్బంధ కేంద్రాల్లో పనిచేయించే విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని, సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడే దిశగా పడిన చిన్న అడుగని ఆసియా కేటలిస్ట్ డైరెక్టర్ షెన్ టింగ్‌టింగ్ అన్నారు.
చిన్న చిన్న నేరాలకు 'లేబర్ క్యాంపుల ద్వారా పునర్విద్య అందించే' విధానాన్ని 2013లో చైనా రద్దు చేసింది. అయితే, వ్యభిచారంలో పట్టుబడ్డ వారి కోసం ఏర్పాటు చేసిన 'కస్టడీ అండ్ ఎడ్యుకేషన్' విధానాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చింది.
అయితే, ఇప్పటికీ 'పునర్విద్య' విధానాన్ని చైనా పూర్తిగా వదులుకోవడం లేదు.
తీవ్రవాదాన్ని అరికట్టేందుకు షింజియాంగ్ ప్రాంతంలో స్వచ్ఛంద ఎడ్యుకేషన్ క్యాంపులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ముస్లిం వీగర్లను ఈ కేంద్రాల్లో బంధించి, మతం వదలాలని చైనా బలవంతం చేస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- చైనా కొత్త విధానం: మొబైల్ ఫోన్ కొని, వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సిందే
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- చైనాలోని ముస్లిం శిబిరాలపై ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్
- జపాన్‌లో డబ్బులిచ్చి ఉద్యోగాలు మానేస్తున్నారు.. ఎందుకు
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- ముగ్గులతో నిరసన, ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- లక్షలాది మంది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








